కోస్తాంధ్ర, రాయలసీమలో సాధారణం కంటే అధిక వర్షాలు
భారత వాతావరణ విభాగం అంచనా
న్యూఢిల్లీ: సాధారణంగా నవంబర్ మాసం వచి్చందంటే చలికాలం మొదలైనట్లే. చలి గాలులు గిలిగింతలు పెడుతుంటాయి. కానీ, ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర శుక్రవారం చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్‌లో సాధారణం కంటే 1.23 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది.
అక్టోబర్‌లో సాధారణంగా 25.69 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా, ఈసారి 26.92 డిగ్రీలు నమోదైంది. 1901 తర్వాత అత్యంత వేడి కలిగిన అక్టోబర్‌గా రికార్డుకెక్కింది. నవంబర్‌లోనూ ఉష్ణోగ్రతలు తగ్గిపోయే సూచనలు కనిపించడం లేదని మృత్యంజయ్ వివరించారు. చలి పెరగడానికి వీలుగా వాతావరణ పరిస్థితులు లేవని అన్నారు. నవంబర్‌లో చలికి వాయువ్య భారతదేశం నుంచి వీలే గాలులే కీలకమని వివరించారు.
అక్కడ రుతుపవనాల ప్రభావం ఇంకా ఉండడంతో గాలులు వీచడం లేదని తెలియజేశారు. వాయువ్య భాగంలో మరో రెండు వారాలపాటు ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని చెప్పారు. రెండు వారాల తర్వాత మాత్రమే ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి రావడానికి అవకాశం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. నవంబర్‌లో కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, కర్ణాటక, తమిళనాడులో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని తెలిపారు. వాస్తవానికి వాతావరణ విభాగం దృష్టిలో నవంబర్ నెల చలి మాసం కాదు. జనవరి, ఫిబ్రవరి మాత్రమే చలి మాసాలు.
Comments
Please login to add a commentAdd a comment