
సాక్షి, సిటీబ్యూరో: ఎండలు భగ్గుమంటున్నాయి. గ్రేటర్‌లో పగటి ఉష్ణోగ్రతలు సగటున40 డిగ్రీలు దాటుతున్నాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం నగరవాసులు ఏసీలు, కూలర్లు వినియోగిస్తున్నారు. ఫలితంగా ఇంట్లో కరెంట్ మోత మోగుతోంది. సాధారణంగా ఫిబ్రవరి వరకు నెలకు 150 యూనిట్లలోపు వాడే వినియోగదారులు ప్రస్తుతం 250– 300 యూనిట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా మీటరు గిర్రున తిరిగి.. స్లాబ్‌రేట్ మారి నెలసరి విద్యుత్ బిల్లులు అమాంతం పెరిగిపోయాయి. ఇటీవల వినియోగదారుల చేతికందిన మార్చి నెల బిల్లులే ఇందుకు నిదర్శనం. భారీగా పెరిగిన బిల్లులతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. అసలే కరోనా కాలం.. ఆపై ఉపాధి అవకాశాలు కోల్పోయి రోడ్డున పడ్డ సగటు జీవులకు ఇవి మరింత భారంగా మారుతున్నాయి.
రాత్రి వేళల్లోనూ రికార్డు స్థాయిలో..
►నగరంలో 50 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లున్నాయి. గత మార్చి వరకు రోజూ పగటిపూట పీక్ అవర్‌లో కరెంట్ డిమాండ్ 2500 నుంచి 2700 మెగావాట్లకు మించలేదు. తాజాగా ఇది 2900 నుంచి 3000 మెగావాట్లు నమోదవుతోంది. రాత్రి వేళల్లోనూ రికార్డు స్థాయిలో డిమాండ్ నమోదవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలితంగా విద్యుత్ సబ్‌స్టేషన్లు, ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లపై ఒత్తిడి పెరుగుతోంది.
►సామర్థ్యానికి మించి డిమాండ్ నమోదవుతుండటంతో విద్యుత్ ఫీడర్లు తరచూ ట్రిప్పవుతున్నాయి. కరెంట్ సరఫరా నిలిచిపోతోంది. ఎప్పకప్పుడు డీటీఆర్‌లను పెంచకపోవడం, లూజ్‌లైన్లను సరిచేయక పోవడమే ఇందుకు కారణం. వేసవిలో తలెత్తే సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు పీక్ అవర్‌లోనూ ఇంజినీర్లు వినియోగదారులకు అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment