మేటల తొలగింపు మాటల వరకే | Eleru flood affected farmers fire on AP Govt | Sakshi
Sakshi News home page

మేటల తొలగింపు మాటల వరకే

Published Thu, Oct 31 2024 5:42 AM | Last Updated on Thu, Oct 31 2024 5:42 AM

Eleru flood affected farmers fire on AP Govt

మట్టి, ఇసుక మేటల తొలగింపుపై మాట మార్చేసిన సర్కారు

పరిహారం ఇచ్చేది లేదంటూ చేతులెత్తేసిన వైనం

దిక్కుతోచని స్థితిలో ఏలేరు వరద బాధిత రైతులు

ఇక మా భూములు ఎందుకు పనికొస్తాయంటూ ఆవేదన

వరద బారినపడి పొట్టదశకు వచ్చిన వరి పంట నాశనమైపోయింది. పొలాల్లో వేసిన ఇసుకమేటలు నెలలు గడుస్తున్నా అలాగే ఉన్నాయి. ఇంతవరకూ అధికారులుగానీ, నాయకులుగానీ పట్టించుకోలేదు. కనీసం అంచనాలు కూడా వేయలేదు. ఒకపక్క పంట పోయింది. వేరేపంట వేద్దామంటే పొలం నిండా ఇసుక, మట్టి మేటలు వేసి ఉంది. దాన్ని తొలగించాలంటే ఎకరానికి రూ.30 వేల నుంచి రూ. 40 వేలు ఖర్చవుతుంది. కాలువలకు పడిన గండ్లు కూడా ఇంకా పూడ్చలేదు. పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడంలేదు. ఏంచేయాలో దిక్కుతోచడంలేదు. – ముప్పిడి శ్రీనివాసరెడ్డి, కౌలురైతు, రాపర్తి, పిఠాపురం మండలం

పిఠాపురం: ఏటా మూడు పంటలు పండే మాగాణి ఇసుక దిబ్బలా కనిపిస్తోంది. వరద సమయంలో వచ్చి మేమున్నామని హామీ ఇచ్చిన నాయకులు, అధికారులు పత్తాలేకుండా పోయారు. నెలలు గడిచిపోతున్నాయి. పొలానికి వెళ్తే కాలువకు పడిన గండ్లు వెక్కిరిస్తున్నాయి. పంట పోయి, పొలం నాశనమై ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తుంటే.. సర్కారు నాలుక మడతెట్టింది. ఇసుకమేటలు తొలగించేందుకు పరిహారం ఇచ్చేది లేదని, ఉపాధి హామీ ద్వారా పనులు చేయిస్తామంటూ చేతులెత్తేయడంతో రైతులు నిరాశలో కూరుకుపోయారు.

సెప్టెంబర్ నెలలో కురిసిన భారీవర్షాల కారణంగా ఏలేరు కాలువ ముంచెత్తడంతో కాకినాడ జిల్లాలో పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి, పెద్దాపురం, కిర్లంపూడి తదితర మండలాల్లో సుమారు 80 వేల ఎకరాల్లో వరి, వాణిజ్య పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏలేరు కాలువకు గండ్లుపడి సుమారు 500 ఎకరాల్లో ఇసుక, మట్టి భారీఎత్తున మేటలు వేశాయి. పిఠాపురం మండలం రాపర్తి ఏరియాలోని వరి పొలాల్లో సుమారు 2 అడుగుల మేర ఇసుక మేటలు వేసింది. దీంతో ఇసుక తొలగిస్తే తప్ప తరువాతి పంట వేయలేమని రైతులు వాపోతున్నారు.  

హెక్టారుకు రూ. 17 వేలు ఇస్తామన్నారు.. 
వరద ప్రభావం వల్ల పంటలు నాశనమైన పొలాలకు ఎకరానికి రూ.10వేలు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తామని, ఇసుక మేటలు వేసిన పొలాలకు హెక్టారుకు రూ.17 వేలు ఇస్తామని అప్పట్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రకటించారు. 3 అంగుళాల మేర ఇసుక మేట ఉంటే పరిహారానికి అర్హులుగా పరిగణిస్తామన్నారు. అయితే పొలాల్లో 8 నుంచి 10 అంగుళాల మేర ఇసుక మేటలు ఉన్నట్లు గుర్తించామన్నారు. జిల్లాలో 75 వేల ఎకరాల్లో వరి, ఇతర పంటలు నీట మునిగాయని, 33 శాతం కంటే ఎక్కువ పంట నష్టం జరిగితేనే ఇన్‌పుట్‌ సబ్సిడీ వస్తుందని తెలిపారు. ప్రత్యేక బృందాలతో పంటనష్టం అంచనాలు తయారు చేసేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు. రైతులు ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుందని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇసుకమేటలకు పరిహారం రాదనడంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

పొట్టదశలో పంట తుడిచిపెట్టుకుపోయింది 
సకాలంలో వర్షాలు కురవడంతో ఈ ఏడాది పంటలు బాగా పండుతాయన్న ఆశతో అప్పులు చేసి పెట్టుబడి పెట్టి సాగు చేశాను. అంతా బాగుంది, పంట పొట్టదశకు చేరుకుంటుందన్న సమయంలో వరద ఒక్కసారిగా పంటను తుడిచిపెట్టేసింది. పెట్టుబడి అంతా నీటి పాలయ్యి అప్పులు మిగిలాయి. ప్రభుత్వం చూస్తే ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇస్తారో ఇవ్వరోకూడా తెలియదు. పంట పోతే పోయింది. పొలాల్లో వేసిన ఇసుక మేటలు మాపై మరింత భారాన్ని వేశాయి. నిబంధనల పేరుతో ఇసుకమేటలు తొలగింపుకు పరిహారం ఇవ్వమని అధికారులు చెబుతున్నారు. గతంలో హెక్టారుకు రూ. 17 వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు లేదంటున్నారు. పొలాల్లో వేసిన ఇసుకమేటలు తొలగించాలంటే ఎకరాకి రూ. 40 వేలకు పైనే ఖర్చవుతుంది. – చింతపల్లి నీలారెడ్డి, రైతు, రాపర్తి, పిఠాపురం మండలం 

మట్టి, ఇసుక మేటలకు పరిహారం రాదు 
వరద వల్ల పంట పొలాల్లో ఇసుక మేటలు వేసిన రైతులకు పరిహారం వచ్చే అవకాశం లేదు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పంట పొలాల్లో ఇసుక, మట్టి మేటలు తొలగించడానికి చర్యలు తీసుకుంటారు. అది ఎప్పుడనేది ఇంకా నిర్ణయించలేదు.  – ఎ.అచ్యుతరావు, వ్యవసాయశాఖ అధికారి, పిఠాపురం మండలం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement