eleru
-
మేటల తొలగింపు మాటల వరకే
వరద బారినపడి పొట్టదశకు వచ్చిన వరి పంట నాశనమైపోయింది. పొలాల్లో వేసిన ఇసుకమేటలు నెలలు గడుస్తున్నా అలాగే ఉన్నాయి. ఇంతవరకూ అధికారులుగానీ, నాయకులుగానీ పట్టించుకోలేదు. కనీసం అంచనాలు కూడా వేయలేదు. ఒకపక్క పంట పోయింది. వేరేపంట వేద్దామంటే పొలం నిండా ఇసుక, మట్టి మేటలు వేసి ఉంది. దాన్ని తొలగించాలంటే ఎకరానికి రూ.30 వేల నుంచి రూ. 40 వేలు ఖర్చవుతుంది. కాలువలకు పడిన గండ్లు కూడా ఇంకా పూడ్చలేదు. పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడంలేదు. ఏంచేయాలో దిక్కుతోచడంలేదు. – ముప్పిడి శ్రీనివాసరెడ్డి, కౌలురైతు, రాపర్తి, పిఠాపురం మండలంపిఠాపురం: ఏటా మూడు పంటలు పండే మాగాణి ఇసుక దిబ్బలా కనిపిస్తోంది. వరద సమయంలో వచ్చి మేమున్నామని హామీ ఇచ్చిన నాయకులు, అధికారులు పత్తాలేకుండా పోయారు. నెలలు గడిచిపోతున్నాయి. పొలానికి వెళ్తే కాలువకు పడిన గండ్లు వెక్కిరిస్తున్నాయి. పంట పోయి, పొలం నాశనమై ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తుంటే.. సర్కారు నాలుక మడతెట్టింది. ఇసుకమేటలు తొలగించేందుకు పరిహారం ఇచ్చేది లేదని, ఉపాధి హామీ ద్వారా పనులు చేయిస్తామంటూ చేతులెత్తేయడంతో రైతులు నిరాశలో కూరుకుపోయారు.సెప్టెంబర్ నెలలో కురిసిన భారీవర్షాల కారణంగా ఏలేరు కాలువ ముంచెత్తడంతో కాకినాడ జిల్లాలో పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి, పెద్దాపురం, కిర్లంపూడి తదితర మండలాల్లో సుమారు 80 వేల ఎకరాల్లో వరి, వాణిజ్య పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏలేరు కాలువకు గండ్లుపడి సుమారు 500 ఎకరాల్లో ఇసుక, మట్టి భారీఎత్తున మేటలు వేశాయి. పిఠాపురం మండలం రాపర్తి ఏరియాలోని వరి పొలాల్లో సుమారు 2 అడుగుల మేర ఇసుక మేటలు వేసింది. దీంతో ఇసుక తొలగిస్తే తప్ప తరువాతి పంట వేయలేమని రైతులు వాపోతున్నారు. హెక్టారుకు రూ. 17 వేలు ఇస్తామన్నారు.. వరద ప్రభావం వల్ల పంటలు నాశనమైన పొలాలకు ఎకరానికి రూ.10వేలు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని, ఇసుక మేటలు వేసిన పొలాలకు హెక్టారుకు రూ.17 వేలు ఇస్తామని అప్పట్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రకటించారు. 3 అంగుళాల మేర ఇసుక మేట ఉంటే పరిహారానికి అర్హులుగా పరిగణిస్తామన్నారు. అయితే పొలాల్లో 8 నుంచి 10 అంగుళాల మేర ఇసుక మేటలు ఉన్నట్లు గుర్తించామన్నారు. జిల్లాలో 75 వేల ఎకరాల్లో వరి, ఇతర పంటలు నీట మునిగాయని, 33 శాతం కంటే ఎక్కువ పంట నష్టం జరిగితేనే ఇన్పుట్ సబ్సిడీ వస్తుందని తెలిపారు. ప్రత్యేక బృందాలతో పంటనష్టం అంచనాలు తయారు చేసేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు. రైతులు ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుందని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇసుకమేటలకు పరిహారం రాదనడంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.పొట్టదశలో పంట తుడిచిపెట్టుకుపోయింది సకాలంలో వర్షాలు కురవడంతో ఈ ఏడాది పంటలు బాగా పండుతాయన్న ఆశతో అప్పులు చేసి పెట్టుబడి పెట్టి సాగు చేశాను. అంతా బాగుంది, పంట పొట్టదశకు చేరుకుంటుందన్న సమయంలో వరద ఒక్కసారిగా పంటను తుడిచిపెట్టేసింది. పెట్టుబడి అంతా నీటి పాలయ్యి అప్పులు మిగిలాయి. ప్రభుత్వం చూస్తే ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇస్తారో ఇవ్వరోకూడా తెలియదు. పంట పోతే పోయింది. పొలాల్లో వేసిన ఇసుక మేటలు మాపై మరింత భారాన్ని వేశాయి. నిబంధనల పేరుతో ఇసుకమేటలు తొలగింపుకు పరిహారం ఇవ్వమని అధికారులు చెబుతున్నారు. గతంలో హెక్టారుకు రూ. 17 వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు లేదంటున్నారు. పొలాల్లో వేసిన ఇసుకమేటలు తొలగించాలంటే ఎకరాకి రూ. 40 వేలకు పైనే ఖర్చవుతుంది. – చింతపల్లి నీలారెడ్డి, రైతు, రాపర్తి, పిఠాపురం మండలం మట్టి, ఇసుక మేటలకు పరిహారం రాదు వరద వల్ల పంట పొలాల్లో ఇసుక మేటలు వేసిన రైతులకు పరిహారం వచ్చే అవకాశం లేదు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పంట పొలాల్లో ఇసుక, మట్టి మేటలు తొలగించడానికి చర్యలు తీసుకుంటారు. అది ఎప్పుడనేది ఇంకా నిర్ణయించలేదు. – ఎ.అచ్యుతరావు, వ్యవసాయశాఖ అధికారి, పిఠాపురం మండలం -
నిర్లక్ష్యమే ముంచేసింది
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వరదల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని.. వరద హెచ్చరికలను పెడచెవిన పెట్టి విజయవాడను ముంచేసిన మాదిరిగానే ఏలేరు వరద విషయంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతుల నోట్లో మట్టి కొట్టిందని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఒక బాధ్యత లేని ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఏలేరు రిజర్వాయర్‌కు వరద వస్తుందని, అది ప్రమాదకర స్థాయిలో ఉంటుందని ప్రభుత్వానికి ముందే సమాచారం అందినా కాలువ ద్వారా నీటిని వదలకుండా తాత్సారం చేసి చివరకు సామర్థ్యానికి మించి వదిలి ముంచేశారని ధ్వజమెత్తారు. ఇరిగేషన్, రెవెన్యూ, హోంశాఖలతో కనీసం సమీక్షించకుండా సీఎం చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని మండిపడ్డారు. విజయవాడ ఎలా అతలాకుతలమైందో అలాంటి నిర్లక్ష్యమే ఏలేరు విషయంలోనూ కనిపిస్తోందన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ శుక్రవారం పర్యటించారు. మాధవాపురం, పాత ఇసుకపల్లి, నాగులాపల్లి, రమణక్కపేట తదితర గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులను ఓదార్చారు. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. అనంతరం రమణక్కపేటలో మీడియాతో మాట్లాడారు. ప్రీమియం చెల్లించకుండా ఉచిత పంటల బీమాను గాలికొదిలేసి రైతులను ప్రభుత్వం నట్టేట ముంచేసిందని దుయ్యబట్టారు. ఈ క్రాప్ నమోదు చేయడం లేదని, ఆర్బీకేలను అడ్రస్ లేకుండా చేశారని, సచివాలయాలను నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రన్న వస్తాడు.. రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తాడన్న హామీ ఏమైందని నిలదీశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. మనుషుల విలువ తెలిసి ఉంటే.. ఏలేరు రిజర్వాయర్ దగ్గర పరిస్థితిని చూస్తే విజయవాడ గుర్తుకొస్తోంది. అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆగస్టు 31నే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐఎండీ (భారత వాతావరణ విభాగం) అప్రమత్తం చేసింది. అలాంటి హెచ్చరిక అందగానే ప్రభుత్వం సమీక్ష నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. రెవెన్యూ, హోం, ఇరిగేషన్ కార్యదర్శులతో సమీక్ష చేయాలి. కానీ ముందే సమాచారం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. కలెక్టర్లతో మాట్లాడలేదు. సీఎస్ కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. సీఎం చంద్రబాబుకు మానవత్వం ఉంటే, మనుషుల విలువ తెలిసి ఉంటే స్పెషల్ ఆఫీసర్‌ను నియమించి ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుని ముందు జాగ్రత్తలు చేపట్టే వారు. కానీ అవేమీ చేయలేదు. అన్నీ గాలి కొదిలేశారు. ఏలేరు ఆధునీకరణపై అబద్ధాలు.. అబద్ధాలు చెప్పడంలో సీఎం చంద్రబాబు గోబెల్స్‌కు తమ్ముడే. పచ్చి అబద్ధాలాడతారు. అబద్ధాలను సృష్టించడం, వాటిని అమ్మగలగడంలో చంద్రబాబును మించిన వారు ప్రపంచంలోనే లేరు. ఆయనకు వంత పాడే మీడియా నిత్యం అవే అబద్ధాలను ప్రచారం చేస్తోంది. ఏలేరు ఆ«ధునికీకరణపైనా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. తొలుత ఏలేరు కాలువ ఆధునికీకరణను 2008లో దివంగత వైఎస్సార్ రూ.138 కోట్లతో చేపట్టారు. ఆ తర్వాత ఎవరూ ఆ పనులను పట్టించుకోలేదు. వర్షాలు, నీళ్లు లేనప్పుడు మాత్రమే కెనాల్ ఆధునికీకరణ చేయగలం. లేదంటే క్రాప్ హాలిడే ప్రకటిస్తే కానీ సాధ్యం కాదు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక అంచనాలు రూ.295 కోట్లకు పెంచడం మినహా పనులు చేయలేదు. నిజానికి అప్పుడు రిజర్వాయర్‌లో నీళ్లు కూడా పెద్దగా లేవు. నాడు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏటా కరువే. చంద్రబాబు – కరువు ఇద్దరూ కవలలే. అప్పుడు వర్షాలు కూడా లేవు. అయినా పనులు ఎందుకు చేయలేదు? 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక వరుసగా వర్షాలు కురవడంతో క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కాలువ ఆధునికీకరణ పనులు వేగంగా చేయలేకపోయాం. ఏం జరిగినా జగనే కారణం అంటాడుఏలేరు వరదలపై ప్రభుత్వానికి ముందే ఇంత సమాచారం ఉన్నా తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్లో చంద్రబాబు విఫలమై రైతులందర్నీ ఇబ్బంది పెట్టారు. వరదలు వస్తే రిజర్వాయర్లను ఎలా నిర్వహించాలో ఈ ప్రభుత్వానికి తెలియడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి దాదాపు నాలుగు నెలలు అయింది. ఎక్కడ ఏం జరిగినా దానికి కారణం జగనే కారణం అంటాడు. విజయవాడలో వరదలు వచ్చినా జగనే కారణం.. ! ఏలేరు రిజర్వాయర్ కింద వరదలు వచ్చినా జగ¯నే కారణం..! కోవిడ్ వచ్చినా జగనే కారణం.. అంటాడు! చంద్రబాబు చేయాల్సింది జగన్నామస్మరణ కాదు. ప్రతి దానికి జగన్‌పై అరవకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఇప్పటికైనా మమ్మల్ని నిందించడం మానుకుని ప్రజలకు క్షమాపణ చెప్పి నిజాయితీగా పాలన అందించాలి. సామర్థ్యానికి మించి ఒకేసారి నీటి విడుదలతో.. ఏలేరు రిజర్వాయర్ సామర్థ్యం దాదాపు 24 టీఎంసీలు కాగా 31వతేదీ నాటికే సుమారు 18 టీఎంసీలు ఉన్నాయి. సెపె్టంబర్ 1న ఏలేరు రిజర్వాయర్‌కు 9,950 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. ప్రభుత్వం జాగ్రత్త పడి ఉంటే, ఫ్లడ్ కుషన్ నిబంధన పాటించి ఉంటే ఆ మొత్తం వెంటనే కిందకు వదలాలి. ఎందుకంటే దిగువన కాలువ సామర్థ్యం 14 వేల క్యూసెక్కులు మాత్రమే. అలా అప్పుడే నీళ్లు దిగువకు వదిలి ఉంటే ఆ కాలువ పొంగకుండా ఉండేది. కానీ ప్రభుత్వం కేవలం 300 క్యూసెక్కులు మాత్రమే వదిలిపెట్టింది. సెప్టెంబరు 4న 5,400 క్యూసెక్కులు వస్తే బయటకు పంపింది కేవలం 300 క్యూసెక్కులు మాత్రమే. ఏమాత్రం ఫ్లడ్ మేనేజ్మెంట్ చేపట్టలేదు. ఫ్లడ్ ఫ్లో కుషన్ ఏర్పాటు చేయలేదు. పైనుంచి నీళ్లొస్తున్నా తీవ్ర నిర్లక్ష్యం వహించారు. కేవలం 300 క్యూసెక్కులు మాత్రమే వదులుతూ వచ్చారు. దీంతో 9వతేదీ నాటికి ఏలేరు రిజర్వాయర్ పూర్తిగా నిండింది. దీంతో గత్యంతరం లేక కిందకు 21,500 క్యూసెక్స్ వదిలారు. 10వ తేదీన 26,134 క్యుసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే ఏకంగా 27,275 క్యూసెక్స్ విడిచిపెట్టారు. అంటే కాలువ సామర్థ్యాన్ని మించి నీళ్లు వదలడంతో లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. మరి ఇది కచ్చితంగా ‘‘మేన్ మేడ్ ఫ్లడ్’’ కాకపోతే మరేమిటయ్యా! అని అడుగుతున్నా. ప్రజలు పట్ల మానవత్వం చూపని, ఏమాత్రం బాధ్యత లేని ప్రభుత్వం ఇది. వరదలు వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో కనీసం ఇంగితం లేని ప్రభుత్వం ఇది! -
మాట తప్పని ఆ మహానుభావుడికి సెల్యూట్: ఆర్ నారాయణ మూర్తి
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో రూ.470 కోట్ల వ్యయంతో నిర్మించే తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. అదే విధంగా గిరిజన, గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ వెళ్లే నర్సీపట్నం ప్రధాన రహదారి విస్తరణ పనులకు కూడా సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జోగునాథునిపాలెంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. 'స్వాతంత్యం సిద్ధించి 75 ఏళ్లు దాటినా.. మన కాళ్ల కిందే ఏలేరు నీళ్లు పారుతున్నా తాగడానికి గుక్కెడు నీళ్లు లేని పరిస్థితి మనది. ఇలాంటి పరిస్థితుల్లో నేను(ఆర్ నారాయణమూర్తి), దాడిశెట్టి రాజా, ఉమా శంకర్ గణేష్, మరికొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి గతంలో సీఎం జగన్ గారిని తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకం గురించి విజ్ఞప్తి చేశాం. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఆ మహానుభావుడు ఆ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తాండవ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌కు సెల్యూట్' అంటూ ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు. చదవండి: (చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం: సీఎం జగన్) -
పవన్ కల్యాణ్ ఆ ముగ్గురెవరో చెప్పండి: ఎస్పీ
సాక్షి, పశ్చిమ గోదావరి : తనను హత్య చేసేందుకు కొంతమంది కుట్ర పన్నుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ స్పందించారు. ఆ ముగ్గురెవరో చెప్పాలని, ఆధారాలు ఏమైనా ఉంటే పోలీసులకు తెలియజేయాలన్నారు. తగు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపినట్లు జిల్లా పోలీస్ కార్యాలయం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన భద్రతను కూడా పెంచుతున్నామన్నారు. జిల్లాలో ఆయన పర్యటన జరిగినన్ని రోజులు వ్యక్తిగత భద్రతతో పాటు, ఆయన పాల్గొనే కార్యక్రమాలకు అదనపు భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. ఇక 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా తనను హత్య చేసేందుకు ఓ ముగ్గరు కుట్ర పన్నుతున్నారని, ‘పవన్ కల్యాణ్‌ను చంపితే ఏమవుతుంది. మహా అయితే ఓ నెల రోజులు గొడవలు అవుతాయని ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. వాళ్లు ఏ పార్టీ వారో, ఆ వ్యక్తుల పేర్లు తెలుసు, వారి ముఖాలు కూడా నాకు తెలుసు’ అని గురువారం ఏలూరు బహిరంగ సభలో ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చదవండి: నా హత్యకు కొందరి కుట్ర -
నా హత్యకు కొందరి కుట్ర
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తనను హత్య చేసేందుకు కొంతమంది కుట్ర పన్నుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారని చెప్పారు. ‘పవన్ కల్యాణ్‌ను చంపితే ఏమవుతుంది. మహా అయితే ఓ నెల రోజులు గొడవలు అవుతాయని ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. వాళ్లు ఏ పార్టీ వారో, ఆ వ్యక్తుల పేర్లు తెలుసు, వారి ముఖాలు కూడా నాకు తెలుసు’ అని అన్నారు. గురువారం రాత్రి ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీలోని క్రిమినల్ ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని బీహార్, యూపీలా మార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చింతమనేనికి పదవిచ్చి ఏ సంకేతాలు ఇస్తున్నారు? చంద్రబాబు పాలనలో ఆఫ్టరాల్ ఒక ఆకురౌడీ, వీధిరౌడీ, పనికిమాలిన రౌడీ పోలీసులను, హమాలీలను కొడుతున్నాడని, ఎస్ఐ చొక్కా పట్టుకుంటున్నాడని పవన్ చెప్పారు. ‘ముఖ్యమంత్రిగారు చేతులు కట్టుకుని కూర్చోవడానికి మేం సిద్ధంగా లేము. 36 కేసులు పెండింగ్‌లో ఉన్న ఒక వ్యక్తిని ప్రభుత్వ విప్‌గా నియమించి ప్రజలకు ఏ సంకేతాలు ఇస్తున్నారు..?’ అని ప్రశ్నించారు. చింతమనేని ప్రభాకర్ ఏలూరు పరిసరాల్లోకి వచ్చి రౌడీయిజం చేస్తే కాళ్లు విరగ్గొట్టి కూర్చోపెడతామని హెచ్చరించారు. క్రిమినల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోతే జాతీయ మానవహక్కుల సంఘానికి, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు, అలాగే గవర్నర్‌కు, డీజీపీ, చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 2014లో నా వల్లే గెలిచారు 2014లో కంభంపాటి రామ్మోహన్ కుమారుడు తన వద్దకు వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వకపోతే వైఎస్సార్ సీపీ గెలుస్తుందని, తాము వ్యాపారాలు చేసుకోలేమని చెబితే మద్దతు ఇచ్చానని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. తాను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వబట్టి జగన్ కేవలం రెండుశాతం ఓట్ల తేడాతో ఓడిపోయారని, లేకపోతే మంచి మెజారిటీతో సీఎం అయ్యేవారని చెప్పారు. ఏజెన్సీలో మైనింగ్ ఆపాలి ఏజెన్సీలో బాక్సైట్ మైనింగ్ ఆపాలని పవన్ డిమాండ్ చేశారు. అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలను పరిశీలిస్తే అక్కడ ఒక క్వారీ వల్ల గిరిజనులు దెబ్బతిన్నారని, గతంలో తన పర్యటనలో గిరిజనులు ఈ మేరకు తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. మావోయిస్టులను చంపేస్తే సమపస్యలు పరిష్కారం కావని, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యం సిద్ధిస్తుందన్న భావన ప్రజల్లో కలిగితే అది రాష్ట్రానికి మంచిది కాదని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కారం కానప్పుడు యువత ప్రత్యామ్నాయం వైపు మళ్లుతారని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల లబ్ధి కేవలం తెలుగుదేశం వ్యక్తులకు తప్ప మరెవరికీ చేరడం లేదని విమర్శించారు. -
భూసేకరణ పూర్తిచేయాలి
ఏలేరు ఆధునికీకరణపై జేసీ ఆదేశం కాకినాడ సిటీ : ఏలేరు ఆధునికీకరణకు భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఆర్అండ్బీ ఇంజనీర్లతో ఏలేరు ఆధునికీకరణ, ఏడీబీ రోడ్డు విస్తరణ తదితర భూసేకరణ పనులపై ఆయన సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఏలేరు పరిధిలో మిగిలిన ఐదు గ్రామాలలో భూసేకరణ పనులు సత్వరం పూర్తిచేయాలన్నారు. ఏడీబీ రోడ్డు విస్తరణ, ఎన్‌హెచ్–16కు దివాన్‌చెరువు లాలా చెరువు, మోరంపూడి, వేమగిరి, జొన్నాడ జంక్షన్లలో ఫ్లైఓవర్ల నిర్మాణానికి భూసేకరణ చేపట్టాలన్నారు. సామర్లకోట–రాజానగరం ఏడీబీ రోడ్డు, కాకినాడ– రాజమహేంద్రవరం కెనాల్ రోడ్‌కు సంబంధించి సోషల్ ఇంపాక్ట్ ఎసెస్మెంట్ టీమ్ ఇచ్చిన నివేదికను ఎక్స్పర్ట్ టీమ్‌కు రిఫర్ చేశామని నివేదిక వచ్చాక భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు భూసేకరణకు చర్యలు చేపట్టాలని సూచించారు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయమీనన్, కాకినాడ, పెద్దాపురం ఆర్డీఓలు బీఆర్ అంబేడ్కర్, విశ్వేశ్వరరావు, ఆర్అండ్బీ ఇంజనీర్ల, తహసీల్దార్లు పాల్గొన్నారు. నగదు రహిత బదిలీకి పోస్ మిషన్లు ఏర్పాటుకు చర్యలు నగదు రహిత బదిలీకి పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లు వ్యాపార, వాణిజ్య సంస్థల్లో ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని జేసీ బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం ఈ–పోస్ ఏర్పాటుకు వ్యవసాయ, కార్మిక, వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, మందులు, తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. వ్యవసాయ శాఖ డీడీ సీహెచ్ లక్ష్మణరావు, కార్మికశాఖ డీసీ కృష్ణారెడ్డి, డ్రగ్స్ కంట్రోల్ ఏడీ, డీఎస్ఓ ఉమామహేశ్వరరావు, డీఎం కృష్ణారావు, ఎల్డీఎం సుబ్రహ్మణ్యం, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఎం సాయిబాబు పాల్గొన్నారు. -
ఏలేరు ఆధునికీకరణ సకాలంలో పూర్తిచేయాలి
ఉభయ గోదావరి జిల్లాల చీఫ్ ఇంజనీర్ ఎస్.హరిబాబు కిర్లంపూడి : ఏలేరు కాలువ ఆధునికీకరణకు అన్ని చర్యలు చేపడుతున్నట్టు ఉభయ గోదావరి జిల్లాల చీఫ్ ఇంజనీర్ ఎస్.హరిబాబు అన్నారు. గురువారం సాయంత్రం మండలంలోని ముక్కొల్లు, భూపాలపట్నం, రాజుపాలెం గ్రామాల్లో ఏలేరు కాలువను ఆయన పరిశీలించారు. ఏలేరు ఆధునికీకరణలో భాగంగా కాలువను ఆనుకుని ఉన్న గ్రామాలకు నష్టం వాటిల్లకుండా డిజైన్ మార్పు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. ముక్కొల్లు గ్రామంలో కాలువకు ఇరు పక్కలా సిమెంటు గోడలు నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. ఆయన వెంట ఎస్ఈ రాంబాబు, ఈఈ జగదీశ్వరరావు, డీఈ కృష్ణారావు, ఇతర ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. -
మత్య్సకారులు వేటకు వెళ్లొద్దు: సిద్దార్థ్ జైన్
ఏలూరు: విశాఖ వాతావరణ అధికారుల సమాచారంతో పశ్చిమ గోదావరి జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో రాగల 48 గంటలపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ సిద్దార్థ్ జైన్ అప్రమత్తం చేశారు. మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని జిల్లా కలెక్టర్ సూచనలు చేశారు. ఏలూరు కలెక్టరేట్లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జార్ఖండ్, ఛత్తీస్గడ్, తెలంగాణ వరకూ అల్పపీడన ద్రోణి వ్యాపించిందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ-కర్ణాటక మద్య కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాయలసీమ, తెలంగాణ, ఉత్తరకోస్తాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. -
ఐదేళ్ల తరువాత..
సాక్షి, కాకినాడ :ఏలేరు ఆధునికీకరణ కోసం మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.138 కోట్లు మంజూరు చేశారు. పనులకు పరిపాలనామోదం కూడా ఇచ్చారు. ఆయన హఠాన్మరణం తరువాత ఆ పనులను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ఫలితంగా వరుస తుపానులు, వరదలతో ఏలేరు రైతులు నాలుగేళ్లుగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఏలేరు ఆధునికీకరణ పనులపై ప్రభుత్వం కంటితుడుపు ప్రకటనలు చేసిందే తప్ప చిత్తశుద్ధితో ఎటువంటి కృషీ చేయలేదు. మెట్ట ప్రాంతం నుంచి తోట నరసింహం మంత్రిగా రాష్ర్ట క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నా ఇదే దుస్థితి. ఇటువంటి తరుణంలో మరోసారి ఏలేరు రైతాంగాన్ని మోసగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరో ఆర్నెల్లలో ప్రస్తుత ప్రభుత్వ కాలం ముగియనుంది. ఈ తరుణంలో మహానేత మంజూరు చేసిన రూ.138 కోట్ల నిధుల్లో రూ.127.60 కోట్ల విడుదలకు అనుమతులు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఏలేరు ఆధునికీకరణ పనులపై మంగళవారం హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో కాకినాడ ఎంపీ, కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ఎంఎం పళ్లంరాజు, రాష్ర్ట నీటిపారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. ఏలేరు రిజర్వాయర్ కాలువలు, డ్రైన్ల ఆధునికీకరణ పనుల నిమిత్తం రూ.127.60 కోట్లకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ ఒక్క రూపాయి పనులు కూడా జరగనప్పటికీ రూ.10 కోట్ల పనులు పూర్తయినట్టు ఈ సమావేశంలో ఇంజనీర్లు ప్రకటించడం గమనార్హం. ఈ ప్రాజెక్టు ఆధునికీకరణ పూర్తయితే 64 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. ఈ పనులు పూర్తయ్యేలోపు భవిష్యత్తులో చేపట్టబోయే పనుల నిమిత్తం అవసరమయ్యే మరో రూ.155 కోట్ల విలువైన పనులకు అంచనాలు తయారు చేయాల్సిందిగా మంత్రులు ఇరిగేషన్ అధికారులను ఆదేశించడం చూస్తుంటే ఈ పనులపై రాష్ర్ట ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. ఈ సమావేశ విషయాలను కేంద్ర మంత్రి పళ్లంరాజు కాకినాడలో విలేకర్లకు విడుదల చేశారు. -
ఉసురు తీసిన ముసురు
అకాల వర్షం తీరని నష్టాన్ని మిగల్చడమే కాకుండా.. నిండు ప్రాణాలనూ బలితీసుకుంది. ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షం కొందరి జీవితాలకు కాళరాత్రిగా మారింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో నలుగురు మరణించారు. కట్టమూరు (పెద్దాపురం), న్యూస్‌లైన్ : ఏలేరు కాలువలో పెద్దాపురం మండలంలోని కట్టమూరు వద్ద ఓ యువకుడు శుక్రవారం గల్లంతయ్యాడు. చేతికందొచ్చిన కొడుకు ఏలేరు కాలువలో కొట్టుకుపోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కట్టమూరు ఎస్సీ పేటకు చెందిన ఎల్ల సంతోష్ (19) జగ్గంపేటలో ఐటీఐ చదువుతున్నాడు. ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో అతడు కాలేజీకి వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్నాడు. శుక్రవారం ఉదయం స్నేహితులతో కలిసి బహిర్భూమి కోసం గ్రామంలోని ఏలేరు కాలువ గట్టుకు వెళ్లాడు. ఏలేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో, అదుపుతప్పి కాలువలో పడి కొట్టుకుపోయాడు. అతడిని గమనించిన స్నేహితులు రక్షించేందుకు విఫలయత్నం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు హుటాహటిన సంఘటన స్థలానికి వెళ్లి, గాలింపు చర్యలు చేపట్టారు. కట్టమూరు నుంచి సామర్లకోట వరకు వెతికినా అతడి ఆచూకీ దొరకలేదు. అయితే సామర్లకోట ఐదు తూముల వంతెన వద్ద ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా, నీటి ప్రవాహానికి మరలా కొట్టుకుపోవడంతో గాలింపు ముమ్మరం చేశారు. సమాచారం అందుకున్న పెద్దాపురం ఎస్సై బి.ఆంజనేయులు సిబ్బందిని అప్రమత్తం చేశారు. తహశీల్దార్ ఎల్.శివమ్మ, ఆర్ఐ భానుకుమార్, వీఆర్ఓ ఎన్.శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పాక కూలి సజీవ సమాధి కాట్రేనికోన, న్యూస్‌లైన్ : భారీ వర్షాలకు మండలంలోని గెద్దనాపల్లి శివారు పోరపేటకు చెందిన నెల్లి నీలయ్య(67) అనే వృద్ధుడు శుక్రవారం పాక కూలిన సంఘటనలో మరణించాడు. డిప్యూటీ తహశీల్దార్ ఝాన్సీ వివరాల ప్రకారం.. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాక నానిపోవడంతో కూలిపోయింది. అందులో ఉన్న నీలయ్య అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికుల సమాచారంతో వీఆర్ఓ సమక్షంలో పోలీసులు శవ పంచనామా నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పి.వెంకటత్రినాథ్ తెలిపారు. పిడుగుపాటుకు బలి మాధవరాయుడుపాలెం (కడియం), న్యూస్‌లైన్ : అర్ధరాత్రి పిడుగుపాటుకు స్థానిక చైతన్యనగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి మరణించాడు. అతడి కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. యలమశెట్టి పెద్దినాయుడు (55) గురువారం రాత్రి ఇంటి అరుగుపై పడుకున్నాడు. తెల్లవారుజామున కాలకృత్యం కోసం బయటకు వచ్చాడు. అదే సమయంలో పెద్ద శబ్ధంతో సమీపంలో పిడుగు పడింది. దీంతో ఇంట్లో పడుకున్న అతడి కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూశారు. ఇంటి ఆవరణలో పెద్దినాయుడు అచేతనంగా పడి ఉన్నాడు. పిడుగుపాటు ధాటికి అతడు చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మేకలను మేపుతూ కుటుంబాన్ని పోషించే అతడికి భార్య నూకాలమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.