భూసేకరణ పూర్తిచేయాలి
ఏలేరు ఆధునికీకరణపై జేసీ ఆదేశం
కాకినాడ సిటీ : ఏలేరు ఆధునికీకరణకు భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆర్‌డీవోలు, తహసీల్దార్లు, ఆర్‌అండ్‌బీ ఇంజనీర్లతో ఏలేరు ఆధునికీకరణ, ఏడీబీ రోడ్డు విస్తరణ తదితర భూసేకరణ పనులపై ఆయన సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఏలేరు పరిధిలో మిగిలిన ఐదు గ్రామాలలో భూసేకరణ పనులు సత్వరం పూర్తిచేయాలన్నారు. ఏడీబీ రోడ్డు విస్తరణ, ఎన్‌హెచ్–16కు దివాన్‌చెరువు లాలా చెరువు, మోరంపూడి, వేమగిరి, జొన్నాడ జంక‌్షన్లలో ఫ్లైఓవర్ల నిర్మాణానికి భూసేకరణ చేపట్టాలన్నారు. సామర్లకోట–రాజానగరం ఏడీబీ రోడ్డు, కాకినాడ– రాజమహేంద్రవరం కెనాల్ రోడ్‌కు సంబంధించి సోషల్ ఇంపాక్ట్ ఎసెస్‌మెంట్ టీమ్ ఇచ్చిన నివేదికను ఎక్స్‌పర్ట్ టీమ్‌కు రిఫర్ చేశామని నివేదిక వచ్చాక భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఆర్‌డీవోలు, తహసీల్దార్లు భూసేకరణకు చర్యలు చేపట్టాలని సూచించారు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయమీనన్, కాకినాడ, పెద్దాపురం ఆర్‌డీఓలు బీఆర్ అంబేడ్కర్, విశ్వేశ్వరరావు, ఆర్‌అండ్‌బీ ఇంజనీర్ల, తహసీల్దార్లు పాల్గొన్నారు.
నగదు రహిత బదిలీకి పోస్ మిషన్లు ఏర్పాటుకు చర్యలు
నగదు రహిత బదిలీకి పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లు వ్యాపార, వాణిజ్య సంస్థల్లో ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని జేసీ బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం ఈ–పోస్ ఏర్పాటుకు వ్యవసాయ, కార్మిక, వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, మందులు, తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. వ్యవసాయ శాఖ డీడీ సీహెచ్ లక్ష్మణరావు, కార్మికశాఖ డీసీ కృష్ణారెడ్డి, డ్రగ్స్ కంట్రోల్ ఏడీ, డీఎస్‌ఓ ఉమామహేశ్వరరావు, డీఎం కృష్ణారావు, ఎల్‌డీఎం సుబ్రహ్మణ్యం, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌ఎం సాయిబాబు పాల్గొన్నారు.