సాక్షి ప్రతినిధి, ఏలూరు: తనను హత్య చేసేందుకు కొంతమంది కుట్ర పన్నుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారని చెప్పారు. ‘పవన్ కల్యాణ్‌ను చంపితే ఏమవుతుంది. మహా అయితే ఓ నెల రోజులు గొడవలు అవుతాయని ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. వాళ్లు ఏ పార్టీ వారో, ఆ వ్యక్తుల పేర్లు తెలుసు, వారి ముఖాలు కూడా నాకు తెలుసు’ అని అన్నారు. గురువారం రాత్రి ఏలూరు పాత బస్టాండ్ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీలోని క్రిమినల్ ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని బీహార్, యూపీలా మార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
చింతమనేనికి పదవిచ్చి ఏ సంకేతాలు ఇస్తున్నారు?
చంద్రబాబు పాలనలో ఆఫ్టరాల్ ఒక ఆకురౌడీ, వీధిరౌడీ, పనికిమాలిన రౌడీ పోలీసులను, హమాలీలను కొడుతున్నాడని, ఎస్‌ఐ చొక్కా పట్టుకుంటున్నాడని పవన్ చెప్పారు. ‘ముఖ్యమంత్రిగారు చేతులు కట్టుకుని కూర్చోవడానికి మేం సిద్ధంగా లేము.
36 కేసులు పెండింగ్‌లో ఉన్న ఒక వ్యక్తిని ప్రభుత్వ విప్‌గా నియమించి ప్రజలకు ఏ సంకేతాలు ఇస్తున్నారు..?’ అని ప్రశ్నించారు. చింతమనేని ప్రభాకర్ ఏలూరు పరిసరాల్లోకి వచ్చి రౌడీయిజం చేస్తే కాళ్లు విరగ్గొట్టి కూర్చోపెడతామని హెచ్చరించారు. క్రిమినల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోతే జాతీయ మానవహక్కుల సంఘానికి, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు, అలాగే గవర్నర్‌కు, డీజీపీ, చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
2014లో నా వల్లే గెలిచారు
2014లో కంభంపాటి రామ్మోహన్ కుమారుడు తన వద్దకు వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వకపోతే వైఎస్సార్ సీపీ గెలుస్తుందని, తాము వ్యాపారాలు చేసుకోలేమని చెబితే మద్దతు ఇచ్చానని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. తాను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వబట్టి జగన్ కేవలం రెండుశాతం ఓట్ల తేడాతో ఓడిపోయారని, లేకపోతే మంచి మెజారిటీతో సీఎం అయ్యేవారని చెప్పారు.
ఏజెన్సీలో మైనింగ్ ఆపాలి
ఏజెన్సీలో బాక్సైట్ మైనింగ్ ఆపాలని పవన్ డిమాండ్ చేశారు. అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలను పరిశీలిస్తే అక్కడ ఒక క్వారీ వల్ల గిరిజనులు దెబ్బతిన్నారని, గతంలో తన పర్యటనలో గిరిజనులు ఈ మేరకు తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. మావోయిస్టులను చంపేస్తే సమపస్యలు పరిష్కారం కావని, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యం సిద్ధిస్తుందన్న భావన ప్రజల్లో కలిగితే అది రాష్ట్రానికి మంచిది కాదని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కారం కానప్పుడు యువత ప్రత్యామ్నాయం వైపు మళ్లుతారని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల లబ్ధి కేవలం తెలుగుదేశం వ్యక్తులకు తప్ప మరెవరికీ చేరడం లేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment