నిన్న బుడమేరు.. నేడు ఏలేరు
ఇది ఏమాత్రం బాధ్యత లేని ప్రభుత్వం
ఏలేరు వరద ప్రాంతాల పర్యటనలో వైఎస్ జగన్ ధ్వజం
రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖలతో కనీసం సమీక్షించని సీఎం చంద్రబాబు
రిజర్వాయర్ నిండాక ఒకేసారి సామర్థ్యానికి మించి నీటి విడుదలతో అనర్థం
మరి ఇది కచ్చితంగా ‘‘మేన్ మేడ్ ఫ్లడ్’’ కాకపోతే మరేమిటయ్యా?
ఐఎండీ హెచ్చరికలు బేఖాతర్.. ‘ఫ్లడ్ కుషన్’ నిబంధన గాలికి
వరద నియంత్రణలో ప్రభుత్వం దారుణ వైఫల్యం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వరదల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని.. వరద హెచ్చరికలను పెడచెవిన పెట్టి విజయవాడను ముంచేసిన మాదిరిగానే ఏలేరు వరద విషయంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతుల నోట్లో మట్టి కొట్టిందని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఒక బాధ్యత లేని ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఏలేరు రిజర్వాయర్‌కు వరద వస్తుందని, అది ప్రమాదకర స్థాయిలో ఉంటుందని ప్రభుత్వానికి ముందే సమాచారం అందినా కాలువ ద్వారా నీటిని వదలకుండా తాత్సారం చేసి చివరకు సామర్థ్యానికి మించి వదిలి ముంచేశారని ధ్వజమెత్తారు.
ఇరిగేషన్, రెవెన్యూ, హోంశాఖలతో కనీసం సమీక్షించకుండా సీఎం చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని మండిపడ్డారు. విజయవాడ ఎలా అతలాకుతలమైందో అలాంటి నిర్లక్ష్యమే ఏలేరు విషయంలోనూ కనిపిస్తోందన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ శుక్రవారం పర్యటించారు. మాధవాపురం, పాత ఇసుకపల్లి, నాగులాపల్లి, రమణక్కపేట తదితర గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులను ఓదార్చారు. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.
అనంతరం రమణక్కపేటలో మీడియాతో మాట్లాడారు. ప్రీమియం చెల్లించకుండా ఉచిత పంటల బీమాను గాలికొదిలేసి రైతులను ప్రభుత్వం నట్టేట ముంచేసిందని దుయ్యబట్టారు. ఈ క్రాప్ నమోదు చేయడం లేదని, ఆర్బీకేలను అడ్రస్ లేకుండా చేశారని, సచివాలయాలను నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రన్న వస్తాడు.. రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తాడన్న హామీ ఏమైందని నిలదీశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
మనుషుల విలువ తెలిసి ఉంటే..
ఏలేరు రిజర్వాయర్ దగ్గర పరిస్థితిని చూస్తే విజయవాడ గుర్తుకొస్తోంది. అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆగస్టు 31నే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐఎండీ (భారత వాతావరణ విభాగం) అప్రమత్తం చేసింది. అలాంటి హెచ్చరిక అందగానే ప్రభుత్వం సమీక్ష నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. రెవెన్యూ, హోం, ఇరిగేషన్ కార్యదర్శులతో సమీక్ష చేయాలి.
కానీ ముందే సమాచారం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. కలెక్టర్లతో మాట్లాడలేదు. సీఎస్ కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. సీఎం చంద్రబాబుకు మానవత్వం ఉంటే, మనుషుల విలువ తెలిసి ఉంటే స్పెషల్ ఆఫీసర్‌ను నియమించి ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుని ముందు జాగ్రత్తలు చేపట్టే వారు. కానీ అవేమీ చేయలేదు. అన్నీ గాలి కొదిలేశారు.
ఏలేరు ఆధునీకరణపై అబద్ధాలు..
అబద్ధాలు చెప్పడంలో సీఎం చంద్రబాబు గోబెల్స్‌కు తమ్ముడే. పచ్చి అబద్ధాలాడతారు. అబద్ధాలను సృష్టించడం, వాటిని అమ్మగలగడంలో చంద్రబాబును మించిన వారు ప్రపంచంలోనే లేరు. ఆయనకు వంత పాడే మీడియా నిత్యం అవే అబద్ధాలను ప్రచారం చేస్తోంది. ఏలేరు ఆ«ధునికీకరణపైనా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. తొలుత ఏలేరు కాలువ ఆధునికీకరణను 2008లో దివంగత వైఎస్సార్ రూ.138 కోట్లతో చేపట్టారు.
ఆ తర్వాత ఎవరూ ఆ పనులను పట్టించుకోలేదు. వర్షాలు, నీళ్లు లేనప్పుడు మాత్రమే కెనాల్ ఆధునికీకరణ చేయగలం. లేదంటే క్రాప్ హాలిడే ప్రకటిస్తే కానీ సాధ్యం కాదు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక అంచనాలు రూ.295 కోట్లకు పెంచడం మినహా పనులు చేయలేదు. నిజానికి అప్పుడు రిజర్వాయర్‌లో నీళ్లు కూడా పెద్దగా లేవు. నాడు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏటా కరువే.
చంద్రబాబు – కరువు ఇద్దరూ కవలలే. అప్పుడు వర్షాలు కూడా లేవు. అయినా పనులు ఎందుకు చేయలేదు? 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక వరుసగా వర్షాలు కురవడంతో క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కాలువ ఆధునికీకరణ పనులు వేగంగా చేయలేకపోయాం.
ఏం జరిగినా జగనే కారణం అంటాడు
ఏలేరు వరదలపై ప్రభుత్వానికి ముందే ఇంత సమాచారం ఉన్నా తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఫ్లడ్ కుషన్ మేనేజ్‌మెంట్‌లో చంద్రబాబు విఫలమై రైతులందర్నీ ఇబ్బంది పెట్టారు. వరదలు వస్తే రిజర్వాయర్లను ఎలా నిర్వహించాలో ఈ ప్రభుత్వానికి తెలియడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి దాదాపు నాలుగు నెలలు అయింది. ఎక్కడ ఏం జరిగినా దానికి కారణం జగనే కారణం అంటాడు. విజయవాడలో వరదలు వచ్చినా జగనే కారణం.. ! ఏలేరు రిజర్వాయర్ కింద వరదలు వచ్చినా జగ¯నే కారణం..! కోవిడ్ వచ్చినా జగనే కారణం.. అంటాడు! చంద్రబాబు చేయాల్సింది జగన్నామస్మరణ కాదు. ప్రతి దానికి జగన్‌పై అరవకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఇప్పటికైనా మమ్మల్ని నిందించడం మానుకుని ప్రజలకు క్షమాపణ చెప్పి నిజాయితీగా పాలన అందించాలి.
సామర్థ్యానికి మించి ఒకేసారి నీటి విడుదలతో..
ఏలేరు రిజర్వాయర్ సామర్థ్యం దాదాపు 24 టీఎంసీలు కాగా 31వతేదీ నాటికే సుమారు 18 టీఎంసీలు ఉన్నాయి. సెపె్టంబర్ 1న ఏలేరు రిజర్వాయర్‌కు 9,950 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. ప్రభుత్వం జాగ్రత్త పడి ఉంటే, ఫ్లడ్ కుషన్ నిబంధన పాటించి ఉంటే ఆ మొత్తం వెంటనే కిందకు వదలాలి. ఎందుకంటే దిగువన కాలువ సామర్థ్యం 14 వేల క్యూసెక్కులు మాత్రమే. అలా అప్పుడే నీళ్లు దిగువకు వదిలి ఉంటే ఆ కాలువ పొంగకుండా ఉండేది. కానీ ప్రభుత్వం కేవలం 300 క్యూసెక్కులు మాత్రమే వదిలిపెట్టింది.
సెప్టెంబరు 4న 5,400 క్యూసెక్కులు వస్తే బయటకు పంపింది కేవలం 300 క్యూసెక్కులు మాత్రమే. ఏమాత్రం ఫ్లడ్ మేనేజ్‌మెంట్ చేపట్టలేదు. ఫ్లడ్ ఫ్లో కుషన్ ఏర్పాటు చేయలేదు. పైనుంచి నీళ్లొస్తున్నా తీవ్ర నిర్లక్ష్యం వహించారు. కేవలం 300 క్యూసెక్కులు మాత్రమే వదులుతూ వచ్చారు. దీంతో 9వతేదీ నాటికి ఏలేరు రిజర్వాయర్ పూర్తిగా నిండింది. దీంతో గత్యంతరం లేక కిందకు 21,500 క్యూసెక్స్ వదిలారు.
10వ తేదీన 26,134 క్యుసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే ఏకంగా 27,275 క్యూసెక్స్ విడిచిపెట్టారు. అంటే కాలువ సామర్థ్యాన్ని మించి నీళ్లు వదలడంతో లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. మరి ఇది కచ్చితంగా ‘‘మేన్ మేడ్ ఫ్లడ్’’ కాకపోతే మరేమిటయ్యా! అని అడుగుతున్నా. ప్రజలు పట్ల మానవత్వం చూపని, ఏమాత్రం బాధ్యత లేని ప్రభుత్వం ఇది. వరదలు వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో కనీసం ఇంగితం లేని ప్రభుత్వం ఇది!
Comments
Please login to add a commentAdd a comment