అకాల వర్షం తీరని నష్టాన్ని మిగల్చడమే కాకుండా.. నిండు ప్రాణాలనూ బలితీసుకుంది. ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షం కొందరి జీవితాలకు కాళరాత్రిగా మారింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో నలుగురు మరణించారు.
కట్టమూరు (పెద్దాపురం), న్యూస్‌లైన్ : ఏలేరు కాలువలో పెద్దాపురం మండలంలోని కట్టమూరు వద్ద ఓ యువకుడు శుక్రవారం గల్లంతయ్యాడు. చేతికందొచ్చిన కొడుకు ఏలేరు కాలువలో కొట్టుకుపోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కట్టమూరు ఎస్సీ పేటకు చెందిన ఎల్ల సంతోష్ (19) జగ్గంపేటలో ఐటీఐ చదువుతున్నాడు. ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో అతడు కాలేజీకి వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్నాడు. శుక్రవారం ఉదయం స్నేహితులతో కలిసి బహిర్భూమి కోసం గ్రామంలోని ఏలేరు కాలువ గట్టుకు వెళ్లాడు. ఏలేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో, అదుపుతప్పి కాలువలో పడి కొట్టుకుపోయాడు. అతడిని గమనించిన స్నేహితులు రక్షించేందుకు విఫలయత్నం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు హుటాహటిన సంఘటన స్థలానికి వెళ్లి, గాలింపు చర్యలు చేపట్టారు. కట్టమూరు నుంచి సామర్లకోట వరకు వెతికినా అతడి ఆచూకీ దొరకలేదు. అయితే సామర్లకోట ఐదు తూముల వంతెన వద్ద ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా, నీటి ప్రవాహానికి మరలా కొట్టుకుపోవడంతో గాలింపు ముమ్మరం చేశారు. సమాచారం అందుకున్న పెద్దాపురం ఎస్సై బి.ఆంజనేయులు సిబ్బందిని అప్రమత్తం చేశారు. తహశీల్దార్ ఎల్.శివమ్మ, ఆర్‌ఐ భానుకుమార్, వీఆర్‌ఓ ఎన్.శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
పాక కూలి సజీవ సమాధి
కాట్రేనికోన, న్యూస్‌లైన్ : భారీ వర్షాలకు మండలంలోని గెద్దనాపల్లి శివారు పోరపేటకు చెందిన నెల్లి నీలయ్య(67) అనే వృద్ధుడు శుక్రవారం పాక కూలిన సంఘటనలో మరణించాడు. డిప్యూటీ తహశీల్దార్ ఝాన్సీ వివరాల ప్రకారం.. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాక నానిపోవడంతో కూలిపోయింది. అందులో ఉన్న నీలయ్య అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికుల సమాచారంతో వీఆర్‌ఓ సమక్షంలో పోలీసులు శవ పంచనామా నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పి.వెంకటత్రినాథ్ తెలిపారు.
పిడుగుపాటుకు బలి
మాధవరాయుడుపాలెం (కడియం), న్యూస్‌లైన్ : అర్ధరాత్రి పిడుగుపాటుకు స్థానిక చైతన్యనగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి మరణించాడు. అతడి కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. యలమశెట్టి పెద్దినాయుడు (55) గురువారం రాత్రి ఇంటి అరుగుపై పడుకున్నాడు. తెల్లవారుజామున కాలకృత్యం కోసం బయటకు వచ్చాడు. అదే సమయంలో పెద్ద శబ్ధంతో సమీపంలో పిడుగు పడింది. దీంతో ఇంట్లో పడుకున్న అతడి కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూశారు. ఇంటి ఆవరణలో పెద్దినాయుడు అచేతనంగా పడి ఉన్నాడు. పిడుగుపాటు ధాటికి అతడు చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మేకలను మేపుతూ కుటుంబాన్ని పోషించే అతడికి భార్య నూకాలమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
ఉసురు తీసిన ముసురు
Published Sat, Oct 26 2013 3:49 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
Advertisement