సాక్షి, అమరావతి/ హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల గుండాలను తలపిస్తున్నాయి. భానుడి ప్రతాపంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. రోహిణీ కార్తె ప్రవేశించిన ఒక రోజులోనే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సాధారణం కంటే మూడు, ఆరు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయి. జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. గుంటూరు, కృష్ణా, చిత్తూరు, వైఎస్‌ఆర్, నెల్లూరు జిల్లాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. గుంటూరు జిల్లా రెంటచింతల మండలంలోని జంగమహేశ్వరంలో 46డిగ్రీలు, తిరుపతి, విజయవాడ, రాజధాని అమరావతిలో 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది.
రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు మూడు, నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. మరో వారంపాటు ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. ఏపీలో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. రాత్రి వేళ పలుచోట్ల 28 నుంచి 33 డిగ్రీలు నమోదవుతున్నాయి. అంటే ఇవి సాధారణం కంటే నాలుగు, ఆరు డిగ్రీలు అధికం. ఫలితంగా రాత్రి వేళ కూడా ఉష్ణతీవ్రతతో కూడిన గాలులు వీస్తున్నాయి. మరోవైపు వడగాల్పులకు విజయనగరం జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు మృతిచెందినట్టు సమాచారం.
బెదిరిపోతున్న బెజవాడ వాసులు
భానుడు ప్రతాపానికి బెజవాడ వాసులు బెదిరిపోతున్నారు. రోళ్లు పగిలే రోహిణీ కార్తె ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రోహిణీ కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటం, గాలిలో తేమ శాతం పెద్దఎత్తున పడిపోతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో 47 డిగ్రీలు కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం, నిజామాబాద్‌లో 17, హైదరాబాద్‌లో 20 శాతానికి గాలిలో తేమ శాతం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలోని 20 గ్రామాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో... వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. మంచిర్యాల జిల్లా వేమన్‌పల్లి మండలం నీల్వాయి గ్రామంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని ప్లానింగ్ డెవలప్‌మెంట్ సొసైటీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment