హైదరాబాద్/అమరావతి: భగ్గుమంటోన్న భానుడి ప్రభావంతో.. అడుగు బయటపెట్టాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఇప్పటికే నిప్పుల కొలిమిని తలపిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఉష్ణోగ్రతలు.. మరో మూడు రోజులపాటు ఇదే తీవ్రతతో కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. పగటిపూటే కాదు.. రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని చెబుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో నమోదు అవుతుండడం.. ఒక పక్క ఉక్కపోత, మరోవైపు వడగాల్పులతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. వాయవ్య భారత్ నుంచి వీస్తున్న వేడిగాలుల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగినట్లు ఇదివరకే భారత వాతావరణ విభాగం వివరించింది. అయితే.. మరో మూడు రోజులు కూడా రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.
► గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైనే నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వేసిన అంచనా నిజమైంది. తెలంగాణలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 41 డిగ్రీల దాకా నమోదయ్యాయి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. దిగువ స్థాయిలోని గాలులు వాయవ్య దిశ నుంచి తెలంగాణ వైపుకు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. వరంగల్ 43, నల్లగొండ, ఖమ్మం 44, భూపాలపల్లిలో 45 డిగ్రీలు, నల్గొండ నిడమనూరులో 45 డిగ్రీలు, ములుగు తాడ్వాయి 44.5 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లు నమోదు అయ్యాయి.
► మరోవైపు ఏపీలో ఏకంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వడగాలుల తీవ్రత కూడా అధికమైంది. భానుడి ప్రతాపంతో ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. సాధారణం కంటే 4-6 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రత దాదాపుగా 46 డిగ్రీలు దాటిపోయింది. ప్రకాశం 46, ఏలూరు, విజయవాడలో 47, గుంటూరులలో 48 డిగ్రీలు, రాజమండ్రిలో అత్యధికంగా 49 డిగ్రీల టెంపరేచర్లు నమోదు అయినట్లు తెలుస్తోంది.
► ఇక వడదెబ్బతో తెలంగాణలో ముగ్గురు(తాజాగా.. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఓ మహిళ), ఏపీలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఏకంగా 20 మంది వడదెబ్బ బారినపడి ఆస్పత్రిపాలయ్యారు. పరిస్థితి మరో మూడురోజులు ఇలాగే ఉంటుందని.. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
► వాతావరణ మార్పులతో హెపటైటిస్-బీ ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్లేవాళ్లు తలకు రక్షణ ధరించాలని, మంచినీళ్లు, సహజ సిద్ధమైన పానీయాలు, ఓఆర్‌ఎస్ లాంటి ఎనర్జీ డ్రింక్స్ వెంటపెట్టుకుని వెళ్లడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. వడదెబ్బ నుంచి రక్షణ కోసం సన్ స్క్రీన్ లోషన్ వాడడం, కాటన్ దుస్తులు.. కళ్లజోడు ధరించడం లాంటి సూచనలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: డిశ్చార్జికి రీచార్జికి మధ్య..
Comments
Please login to add a commentAdd a comment