ఇప్పటికే ప్రజలపై రూ. 6 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం
వచ్చే నెల నుంచి మరో రూ. 9 వేల కోట్లకు పైగా షాక్
మరోపక్క ఎడాపెడా విద్యుత్ కోతలు
రోజూ 2 నుంచి 3 గంటల పాటు సరఫరా నిలిపివేత
డిమాండ్ మేరకు సరఫరా చేయలేక అనధికారిక కోతలు
కరెంట్ లేక గాఢాంధకారంలో అల్లాడుతున్న గ్రామాలు
ఎస్సీ, ఎస్టీలకు గత ప్రభుత్వం అందించిన ఉచిత విద్యుత్‌కు ఎగనామం
ఉచిత విద్యుత్ లబ్ధిదారులకు రూ.వేలల్లో బిల్లులు జారీ చేస్తున్న కూటమి సర్కారు
తమ కష్టాలు చెప్పుకుంటే పింఛన్లు, రేషన్ కార్డులు తొలగిస్తారని ప్రజల్లో ఆందోళన
మా ఇంటికి రూ.10 వేలు విద్యుత్ బిల్లు వచ్చింది. మాకేమీ ఏసీలు లేవు. లైన్‌మెన్‌ని అడిగితే ఫ్రిజ్ ఉన్నందున ఎక్కువ వాడి ఉంటారంటున్నారు. చివరకు అప్పు చేసి బిల్లు కట్టేశాం.
– చిన్నం వెంకటేష్, ఎం.ఎం.పురం, ఏలూరు జిల్లా
బోణం గణేష్, ఏలూరు జిల్లా
మల్కీమహ్మద్‌పురం నుంచి సాక్షి ప్రతినిధి
కరెంట్ బిల్లులు శీత కాలంలోనూ ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి! ఒకపక్క ప్రతి నెలా రూ.వందలు... వేలల్లో బిల్లులు రావడం.. మరోపక్క చలి కాలంలోనూ కోతలు విధించడంతో దోమల బాధతో నిద్రలేని కాళరాత్రులు గడుపుతున్నారు. ఇప్పటికే రూ.6,072.86 కోట్ల మేర విద్యుత్తు చార్జీల భారాన్ని మోపి హై వోల్టేజీ షాకులిచ్చిన కూటమి సర్కారు జనవరి నుంచి మరో రూ.9,412.50 కోట్ల చార్జీల భారాన్ని అదనంగా వేయనుండటం వినియోగదారులను గజగజ వణికిస్తోంది. ఆర్నెలల్లోనే రూ.9,412.50 కోట్ల విద్యుత్తు చార్జీల భారాన్ని మోపడం.. మరోపక్క సంక్షేమ పథకాలు నిలిచిపోవడం.. నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశన్నంటడంతో ప్రజలు అల్లాడుతున్నారు.
‘ఓట్లేయ్యండి తమ్ముళ్లూ..! అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచం.. పైగా తగ్గిస్తాం.. నేను గ్యారెంటీ..!’ అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం మాట తప్పి రాష్ట్ర ప్రజలకు వరుసగా విద్యుత్ షాక్‌లు ఇస్తోంది. వాడకం తక్కువగా ఉండే శీతకాలంలోనే బిల్లులు ఇలా పేలిపోతుంటే వేసవిలో ఏ స్థాయిలో షాక్‌లు ఉంటాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ గత ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్యుత్‌ను దూరం చేసి బిల్లులతో బాదేస్తున్న కూటమి ప్రభుత్వం ఇతర వర్గాలపైనా పెనుభారం మోపింది.
వినియోగం తక్కువే.. అయినా కోతలు
రాష్ట్రంలో ప్రస్తుతం 194.098 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. డిమాండ్ అనుగుణంగా సరఫరా చేయలేక రాష్ట్రవ్యాప్తంగా సగటున 2 నుంచి 3 గంటల పాటు కోతలు విధిస్తున్నారు. వాడకం ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు అనధికారికంగా కోతలు అమలు చేస్తున్నారు. అధికారిక నివేదికల్లో విద్యుత్ లోటు, కోతలు లేవంటూ బుకాయిస్తున్నారు. నిజానికి గతేడాది కంటే 1.17 శాతం తక్కువగా విద్యుత్ డిమాండ్ ఉన్నా కూడా అందించేందుకు ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. గత సర్కారు మండు వేసవిలోనూ, తీవ్ర బొగ్గు సంక్షోభంలోనూ విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేసింది.
కరెంట్ కష్టాలు చెప్పుకోలేక..
ఏలూరు జిల్లా మల్కీమహ్మద్‌పురం (ఎం.ఎం.పురం) గ్రామంలో నెలకొన్న పరిస్థితులు రాష్ట్రంలో ప్రజల కరెంట్ కష్టాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పల్లపూరుగా పిలుచుకునే ఏలూరు జిల్లా ఎం.ఎం పురంలో ప్రజలంతా పేద, మధ్యతరగతి వారే. తెల్లవారుజామునే నిద్రలేచి, కూలి పనులకు వెళుతుంటారు. చుట్టు పక్కల వ్యవసాయ పనులు దొరక్కపోవడంతో దాదాపు 40 కి.మీ. దూరంలో ఉన్న హనుమాన్ జంక్షన్ వరకూ వెళ్లి రాత్రికి ఇంటికి చేరుతుంటారు. ఇంటికి వచ్చాక సేదదీరుదామంటే విద్యుత్ లేక ఫ్యాన్లు పనిచేయడం లేదు. దోమలతో తెల్లవార్లూ జాగారం చేయాల్సిన పరిస్థితి! అది చాలదన్నట్టు కరెంటు బిల్లులు షాక్ ఇస్తున్నాయి. వారి కష్టాల గురించి చెబితే పింఛన్లు తీసేస్తారని, రేషన్ కార్డు పోతుందని అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారు.
నిబంధనల ప్రకారమే..
రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్ సరఫరా నిలిచిందంటే అది స్థానిక పరిస్థితుల కారణంగా జరిగి ఉంటుంది. అధికారికంగా ఎలాంటి విద్యుత్ కోతలు అమలు చేయడం లేదు. విద్యుత్ బిల్లులు కూడా నిబంధనల ప్రకారమే వేస్తున్నాం. ఎవరికైనా ఎక్కువ వేశారనిపిస్తే అధికారుల దృష్టికి తేవచ్చు.
–కె.విజయానంద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ
‘ఈ చిత్రంలో కనిపిస్తున్న అవ్వ పేరు సింగారపు పాపమ్మ. ఏలూరు జిల్లా మల్కీ మహ్మద్‌పురం (ఎంఎం పురం)లో నివసిస్తోంది. భర్త చుక్కయ్య, ఇద్దరు కుమారులు చనిపోవడంతో పిడికెడు మెతుకుల కోసం ఏడు పదుల వయసులోనూ పని మనిషిగా చేస్తూ ఒంటరిగా బతుకుతోంది.
పగలంతా పనిచేసి రాత్రి ఎప్పటికో ఇంటికి చేరుతుంది. ఒక ఫ్యాను, సెకండ్ హ్యాండ్‌లో కొన్న చిన్న టీవీ, ఓ లైటు మినహా ఆమె ఇంట్లో మరో విద్యుత్ ఉపకరణం లేదు. అలాంటప్పుడు ఆమె ఇంటికి విద్యుత్ బిల్లు ఎంత రావాలి? మహా అయితే వందో.. రెండొందలో కదా! కానీ నవంబర్‌లో వినియోగానికి సంబంధించి ఈ నెల పాపమ్మకు వచ్చిన బిల్లు ఎంతో తెలుసా? ఏకంగా రూ.1,345.39. అది తెలిసి గుండె ఆగినంత పనైందని ఆ వృద్ధురాలు ‘సాక్షి’తో తన గోడు చెప్పుకుంది. ఇంత బిల్లు వేస్తున్నా కరెంట్ సవ్యంగా సరఫరా కావడం లేదు. చీకట్లో చేతులు కాల్చుకోవాల్సి వస్తోంది. ఇంకా దారుణమేమిటంటే ఎస్సీ సామాజికవర్గానికి చెందిన పాపమ్మకు గత ప్రభుత్వంలో ఉచితంగా విద్యుత్ అందగా ఇప్పుడు రూ.వేలల్లో బిల్లులు రావడం!!
శుక్రవారం, మంగళవారం అసలు కరెంటు ఉండదు
మా ఊరిలో శుక్రవారం, మంగళవారం కరెంటు ఉండదు. మిగతా రోజుల్లోనూ గంటల తరబడి తీసేస్తున్నారు. చార్జీలు మాత్రం భారీగా పెంచేశారు. పాచి పని చేసుకునేవాళ్లకు కూడా రూ.వేలల్లో బిల్లులు వేస్తున్నారు. ఇదేం ప్రభుత్వమో ఏంటో?.
– ఓగిరాల లక్ష్మీ, ఎంఎం పురం, ఏలూరు జిల్లా
రోజూ కరెంటు పోతోంది
రాత్రిళ్లు 11 గంటలకు తీసేసి తెల్లవారుజాము రెండుకో, మూడుకో ఇస్తున్నారు. దోమలు కుట్టి రోగాల బారిన పడుతున్నాం. రోజూ కరెంటు పోతోంది. చిన్న పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కాలంలో కరెంటు కోతలు మేమెప్పుడూ చూడలేదు.
– అంజమ్మ, ఎంఎం పురం, ఏలూరు జిల్లా
జగనన్న అధికారంలో ఉండగా మేం బిల్లు కట్టాల్సి రాలేదు
జగనన్న అధికారంలో ఉండగా మేం కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు బిల్లులు కట్టమని ఇంటికి వస్తున్నారు. కరెంటు మాత్రం రాత్రి, పగలూ అనే తేడా లేకుండా తీసేస్తున్నారు.
– సరోజిని, ఎంఎం పురం, ఏలూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment