రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు
శీతాకాలం ప్రారంభ వేళ విచిత్ర వాతావరణ పరిస్థితి
సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత
కాలుష్యం, తీవ్ర గాలులే కారణమంటున్న నిపుణులు
మరో నాలుగు రోజులపాటు ఇదే తరహా వాతావరణం
నెలాఖరు నుంచి క్రమంగా తగ్గనున్న గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శీతాకాలం ప్రారంభం వేళ విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొన్నది. చలి పెరగాల్సిన సమయంలో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. చలికాలంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టాల్సి ఉండగా.. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. దాదాపు వారం రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నది. ప్రస్తుత సీజన్‌లో నమోదు కావాల్సిన దాని కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ మేర అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం, వేగంగా వీస్తున్న గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.
గురువారం రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదయ్యాయి. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 4 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదైంది. మెదక్, నిజామాబాద్‌లో 3 డిగ్రీలు, హైదరాబాద్, అదిలాబాద్, భద్రాచలంలో 2 డిగ్రీలు, వరంగల్, హన్మకొండలో ఒక డిగ్రీ సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైంది. గురువారం గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 34.5 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 16 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. సాధారణంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు శీతాకాలం ఉంటుంది.
వాతావరణంలో మార్పులతో..
సాధారణంగా సీజన్ మారుతున్న సమయంలో వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రస్తుతం ఈశాన్య రుతుపవన కాలం మధ్యస్థానికి చేరుకుంది. రుతుపవనాల ప్రభావంతో ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం, దీనికి తోడు సీజనల్ యాక్టివిటీస్‌తో వాయు కాలుష్యం ఒక్కసారిగా పెరగడంతో ఆ ప్రభావం ఉష్ణోగ్రతలపై పడినట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అందువల్లనే గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలిపారు. కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణానికి కాస్త అటుఇటుగా నమోదవుతున్నాయి.
ఈ ప్రభావం మరో వారం రోజులపాటు ఉండొచ్చని అధికారులు అంటున్నారు. నవంబర్ నెలాఖరు నుంచి ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గుముఖం పడతాయి. దీంతో చలి తీవ్రత కూడా పెరుగుతుంది. ఈ ఏడాది చలికాలంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే ఉంటాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. డిసెంబర్ నెలాఖరు నాటికి ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గిపోతాయని, ఆ సమయంలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత అధికంగా ఉంటుందని ఐఎండీ వెల్లడించింది.
కాస్త ఎక్కువగానే గరిష్ట ఉష్ణోగ్రతలు
రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నాయి. దీనికి తోడు వాయుకాలుష్యం పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణం కంటే కాస్త ఎక్కువగానే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెలాఖరు నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయి. డిసెంబర్ నెలతో పాటు జనవరి నెలాఖరు వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటె తక్కువగా నమోదవుతాయని అంచనాలున్నాయి. – శ్రావణి, వాతావరణ శాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment