మంచం పట్టిన మన్యం
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. దానికితోడు అకాల వర్షాలతో కూడిన ప్రతికూల వాతావరణం వ్యాధుల విజృంభణకు దోహదపడుతోంది. ఫలితంగా మన్య ప్రాంతంలో మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో గిరిపుత్రులు గజగజలాడుతున్నారు. ఎపిడిమిక్ సీజన్ ప్రారంభమైనా.. ఏజెన్సీలో జ్వరాల కేసులు రోజురోజుకూ పెరుగుతున్నా అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంలేదు. చాలా పీహెచ్‌సీల్లో మలేరియా నివారణ మందులే అందుబాటులో లేవు. హైరిస్క్ గ్రామాల్లో దోమల నివారణ మందులు స్ప్రేయింగ్ కూడా ఇంకా ప్రారంభం కాలేదు.
సీతంపేట, న్యూస్‌లైన్: జిల్లా ఏజెన్సీ ప్రాంతా న్ని మలేరియా దోమ కాటేస్తోంది. పీహెచ్‌సీలకు జ్వరపీడితుల తాకిడి రానురాను పెరుగుతోంది. వీరిలో ఎక్కువమంది మలేరియా పీడితులు కాగా.. టైఫాయిడ్ వంటి జ్వరాల తీవ్రత కూడా అధికంగానే ఉంది. ఎపిడిమిక్ సీజన్ ప్రారంభమై వ్యాధులు పంజా విసురుతుండటంతో గిరిజనులు వణికిపోతున్నారు. ప్రతి కూల వాతావరణ పరిస్థితుల వల్ల జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చాలామంది గిరిజను లు ఆస్పత్రుల వరకు రాలేక గ్రామాల్లో సంచి ైవె ద్యులను ఆశ్రయిస్తున్నారు. సీతంపేట మండలంలోని జగతపల్లి, పెదరామ, మొగదార, జొనగ, కోసంగి, కురసింగి, అంటికొండ, పెద్దగూడ తదితర గ్రామాల్లో జ్వరాలు ఎక్కువగా ఉన్నా యి. పీహెచ్ సీకి వస్తున్న కేసుల్లో ఈ గ్రామాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు.
200కుపైగా మలేరియా కేసులు
ఐటీడీఏ పరిధిలో 27 పీహెచ్‌సీలున్నాయి. వీటి పరిధిలో ఈ ఏడాది ఇప్పటివరకు 202 మలేరియా పాజిటివ్ కేసులు వచ్చాయని అధికారిక గణాంకాలు చెబుతుండగా, అనధికారిక లెక్కల ప్రకారం వాటి సంఖ్య 300కు పైగానే ఉంటుంది. దీనికితోడు టైఫాయిడ్ కేసులు కూడా ఇదే స్థాయిలో నమోదవుతున్నాయి. గిరిజన గ్రామాల్లో ఈ సీజన్లోనే ఎక్కువగా జ్వరాలు వ్యాపిస్తాయి. సీతంపేట మండలంలో ఈ నెలలోనే 20 వరకు కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ సీజనులో 200 మంది వివిధ రకాల జ్వరాలతో బాధపడితే వారిలో వంద వరకు టైఫాయిడ్ బాధితులు కావడం విశేషం. వేసవిలో అత్యధిక గ్రామాలకు మంచినీటి సౌకర్యం లేకపోవడం, కలుషిత జలాలనే తాగుతుండటంతో రోగాలు విజృంభిస్తున్నాయి. ఒక్కసారి జ్వరం వచ్చిందంటే.. ఇక ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండటం లేదని, వారాల తరబడి జ్వరాలు తగ్గుముఖం పట్టడం లేదని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల కు మలేరియా, టైఫాయిడ్ ఎక్కువగా సోకుతుండటంతో నానా అవస్థలు పడుతున్నారు.
ఈమాల్ ఇంజక్షన్లు నిల్...
మలేరియా సోకిన రోగులకు ఈమాల్ ఇంజక్షన్ డోస్ ఇస్తారు. అయితే పీహెచ్‌సీల్లో ప్రస్తుతం ఆ ఇంజక్షన్లు అందుబాటులో లేవు. దీంతో అత్యవసర సమయాల్లో రోగులే కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరో వైపు చిన్నారులకు మలేరియా సోకితే ఏసీటీ కిట్ అనే మందు బిళ్లలు ఇస్తారు. అవి కూడా స్టాక్ లేవు. దీంతో పెద్దవారికి వాడిన ఏసీటీ కిట్లే చిన్నారులకు కూడా వాడాల్సివస్తోంది. ఎపిడమిక్ సీజన్ ప్రారంభ మై మలేరియా విజృంభిస్తున్నా మందుల సరఫరా లేకపోవడం గమనార్హం.
713 హైరిస్క్ గ్రామాల్లో స్ప్రేయింగ్...
మలేరియా నివారణకు ఐటీడీఏ పరిధిలో 713 మలేరియా హైరిస్క్ గ్రామాల్లో సింథటిక్ ఫైరిత్రిన్ ద్రావణాన్ని పిచికారి చేయనున్నామని మలేరియా నివారణ కన్సల్టెంట్ శ్రీకాంత్ తెలిపారు. ఈ ప్రక్రియ రెండో తేదీ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఈమాల్, ఏసీటీ కిట్ల కోసంఐటీడీఏ పీవోకు ప్రతిపాదనలు సమర్పించామన్నారు.