sitampet
-
నిలదీతలు... నీళ్లు నమలడాలు!
ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో అధికారులను నిలదీసిన ఎమ్మెల్యేలు ఉపకార వేతనాల దుర్వినియోగంపై ప్రశ్నించిన కళావతి ఇంజినీర్లే కాంట్రాక్టర్లుగా మారుతున్నారని ఆరోపణ ఐసీడీఎస్ పనితీరుపై ఆగ్రహం సీతంపేట: సీతంపేట పీఎంఆర్సీలో గురువారం జరిగిన సీతంపేట ఐటీడీఏ 71వ పాలకవర్గ సమావేశం రసవత్తరంగా సా గింది. కార్యక్రమం ఆద్యంతం ఎమ్మెల్యేలు అధికారులను పలు సమస్యలపై నిలదీస్తూనే ఉన్నారు. పలు ప్రశ్నలకు అధికారులు సమాధానాలిచ్చినా మరికొన్నింటిని దాట వేసే ప్రయత్నం చేశారు. గిరిజన పోస్ట్‌మెట్రిక్ వసతిగృహాల్లో లేని విద్యార్థులను ఉన్నట్టు చూపి బీసీ సంక్షేమ నిధులను కాజేసిన ఏటీడబ్ల్యూవో, వార్డెన్లపై చర్యలెందుకు తీసుకోలేదని స్థానిక ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ప్రశ్నించారు. దీనికి కలెక్టర్ లక్ష్మీనృసింహం బదులిస్తూ రూ.కోటి 44 లక్షలు అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఏసీబీ, గిరిజన సంక్షేమ ఉన్నతాధికారుల విచారణ పూర్తయిందని తెలిపా రు. బాధ్యులను ఇప్పటికే సస్పెండ్ చేశామన్నారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన వెంటనే అరెస్టు చేస్తామని చెప్పారు. ఇంజినీరింగ్ ద్వారా జరిగిన 42 రహదారి పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని నివేదిక ఇచ్చానని వాటి విచారణ ఏం చేశారని ఎమ్మెల్యే వెంకటరమణ ప్రశ్నించగా 11 రహదారులపై రూ.71 లక్షలు దుర్వినియోగం జరిగినట్టు తనకు అధికారులు నివేదిక ఇచ్చారని కలెక్టర్ తెలిపారు. అడ్డంగి, అబలాసింగి రహదారి అవినీతిపై ఆర్ఆర్ యాక్టు పెట్టి రికవరీ చేయిస్తామని, సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను సస్పెండ్ చేయిస్తానని ఆయన చెప్పారు. విచారణ ఆదరాబాదరాగా కాకుండా పద్ధతి ప్రకారం చేయాలని మం త్రి అచ్చెన్నాయుడు సూచించారు. రహదారుల వెరిఫికేషన్ కమిటీలో తమకు ఎందుకు అవకాశం కల్పించలేదని పాల కొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, జెడ్పీటీసీ సభ్యుడు సామంతుల దామోదర్ ప్రశ్నించగా సమాధానం రాలేదు. పీఆర్ జేఈ సరెండర్ సీతంపేటలో ఒక పీఆర్ జేఈ బి.నాగేశ్వరరావు కాంట్రాక్టర్ అవతారెమెత్తి పనులు చేయిస్తున్నాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పాలకొండ ఎమ్మెల్యే కళావతి, జెడ్పీటీసీ దా మోదర్లు పట్టుబట్టారు. దీంతో ఆయన్ను సరెండర్ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఐటీడీఏలో సమావేశం గదిని ఇంతవరకు ఎందుకు నిర్మించలేకపోయారని ఈఈ శ్రీనివాస్‌ను అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మరో నాలుగు నెలల్లో పూర్తి చేస్తానని ఈఈ తెలిపారు. భామిని వెలుగు కార్యాలయంలో రూ.18 లక్షలు అక్రమాలు జరిగాయని, దీనిపై ఆడిట్ ఎందుకు చేయించలేదని ఎమ్మెల్యే కళావతి సంబంధిత అధికారులను నిలదీశారు. మందుల మాటేంటి..? వైద్యం కోసం సీతంపేట పీహెచ్‌సీకి వెళితే మందులు బయట కొనుగోలు చేయమంటున్నారని ఎంపీపీ ఎస్.లక్ష్మి తెలిపారు. నాయకులకే ఈ పరిస్థితి ఎదురైందంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఎమ్మెల్యే కళావతి ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వైద్యాధికారి, ఏఎన్ఎంకు చార్జ్‌మెమో ఇవ్వాలని డీఎంఅండ్‌హెచ్‌వో శ్యామలకు ఆదేశించారు. సెలైన్ బాటిళ్లు, ఇతర మందులు కొనుగోలు చేయడానికి ఐటీడీఏ నుంచి నిధులు సమకూర్చానని ఐటీడీఏ పీవో జె.వెంకటరావు సమాధాన మిచ్చారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న ఎల్టీపై ఆరోపణలు వస్తున్నాయని ఎమ్మెల్యే కళావతి ఫిర్యాదు చేశారు. దోనుబాయిలో వైద్యుడ్ని నియమించాలని కోరగా వైద్యున్ని నియమించినట్టు పీఓ తెలి పారు. దోమతెరలు ఎప్పుడు పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే ప్రశ్నించగా నాలుగు లక్షలు దోమతెరలు అన్ని జిల్లాలకు మంజూరయ్యాయని త్వరలో ఏజెన్సీలో పంపిణీ చేస్తామని డీఎంహెచ్‌వో శ్యామల తెలిపారు. జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలి ఏజెన్సీలో 1897 మంది పదో తరగతి ఉత్తీర్ణత చెందితే వారిలో 600ల మందికి ఇంటర్మీడియట్ సీట్లు ఇస్తే మిగ తా 1200ల మంది పరిస్థితి ఏమిటని ఎమ్మెల్యే కళావతి ప్రశ్నించారు. 90 సీట్లు పెంచినట్టు గురుకులం నుంచి ఆదేశాలు వచ్చాయని పీవో వెంకటరావు తెలిపారు. పాలకొండలో ఆశ్రమ పాఠశాలకు స్థల పరిశీలన చేయాలని ఆర్డీవో గున్నయ్యకు కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులున్నచోట ఉ పాధ్యాయులు లేరని చాలా పాఠశాలల్లో సమస్య ఉందని కళావతి తెలిపారు. సీతంపేట యూపీ పాఠశాలలో పిల్లలు 47 మంది ఉంటే ఉపాధ్యాయులు 13 మంది ఉన్నారని, ఇంతమంది ఎందుకని ప్రశ్నించారు. ఈ స్కూల్లో ఉన్న టీచర్లను వేరే పాఠశాలలకు పదిమందిని పంపించాలని కలెక్టర్ డీఈవో దేవానందంకు తెలిపారు. జూలై ఒకటి నుంచి ఏకలవ్య మోడల్ స్కూల్స్ పనిచేయించాలని పీవోకు కలెక్టర్ సూచించారు. ఆశ్రమ పాఠశాలల్లో కుక్, కమాటీ పోస్టులను నియమించాలని ఎమ్మెల్యే కళావతి కోరారు. దీనిపై కమిషనర్‌కు ప్రతిపాదించామని త్వరలో భర్తీ చేస్తామని పీవో తెలిపారు. కులాంతర వివాహాలు, గిరిపుత్రిక కల్యాణ పథకానికి నిధులు వెచ్చించాలని స్థానిక ఎమ్మెల్యే కళావతి తెలిపారు. గాఢ నిద్రలో ఐసీడీఎస్ ఐసీడీఎస్ శాఖ గాఢనిద్రలో ఉందని కలెక్టర్ లక్ష్మీనృసింహం ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులు ఎంతమంది ఉన్నారనేదానిపై కూడా పూర్తి సర్వే చేయలేకపోవడమేమిటని ఐసీడీఎస్ పీడీ తనూజా రాణి ని ప్రశ్నిం చారు. పలుచోట్ల పిల్లలు లేకుండా కేంద్రాలు నిర్వహిస్తున్నారని విప్ రవికుమార్ ఆరోపించారు. ట్రైబల్ ఏరి యాకి పీడీ ఎప్పుడు వచ్చారని ఎమ్మెల్యే కళావతి ఆగ్రహించారు. న్యూట్రీషియన్ కౌన్సిలర్ పోస్టుల పరిస్థితి ఏమిటని ఎమ్మెల్యే ప్రశ్నించగా వాటిని రద్దుచేస్తున్నట్టు పీవో ప్రకటించారు. గిరిగోరు ముద్దల పథకంలో పాలు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ఏనుగుల సమస్య పరిష్కరించండి ఏనుగుల సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేలు కళావతి, వెంకటరమణ, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు తోట ముఖలింగంలు కోరారు. పంట నష్టపరిహారం కూడా సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. ఇళ్లు కూల్చేసిన, పట్టా లు లేకపోయినా పరిహారం ఇవ్వడం లేదని తెలిపారు. పూర్తిస్థాయిలో పరిహారం అందేలా చూస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అటవీ హక్కుల పత్రాలు పంపిణీ చేయాలని ఎమ్మెల్యేలు కోరారు. ఏనుగులు నష్టపరిస్తే పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందించి వ్యవసాయశాఖ, హార్టీకల్చర్,రెవెన్యూ శాఖలు వెళ్లి పరిహారం అంచనా వేయాలని తెలిపారు. అలాగే దేవనాపురం, పెదరామ వంటి చోట్ల విద్యుత్ తీగల సమస్య ఉందని స్థానిక ఎమ్మెల్యే తెలిపారు. కడగండి ప్రాంతంలో నాలుగురోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయినా ఎవ్వరూ పట్టించుకోలేదని తెలిపారు. అధికారులు ఫోన్లకు స్పం దించాలని ఎమ్మెల్యే వెంకటరమణ కోరగా అదే పెద్ద సమస్యని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో ఎంపీ రా మ్మోహన్నాయుడు, జెడ్పీ చైర్పర్సన్ ధనలక్ష్మి, పీఆర్ ఎస్ఈ మోహన్‌మురళి, డుమా పీడీ కూర్మనాథ్, డీడీ ఎంపీవీనాయిక్, డిప్యూటీ డీఈవో వి.మల్లయ్య, సీఎం వో శ్రీనివాసరావు, ఏపీడీ సావిత్రి, అడిషనల్ డీఎంహెచ్‌వో మెండ ప్రవీణ్, డీసీహెచ్ఎస్ వీరాస్వామి, రేంజర్లు జగదీష్, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
మంచం పట్టిన మన్యం
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. దానికితోడు అకాల వర్షాలతో కూడిన ప్రతికూల వాతావరణం వ్యాధుల విజృంభణకు దోహదపడుతోంది. ఫలితంగా మన్య ప్రాంతంలో మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో గిరిపుత్రులు గజగజలాడుతున్నారు. ఎపిడిమిక్ సీజన్ ప్రారంభమైనా.. ఏజెన్సీలో జ్వరాల కేసులు రోజురోజుకూ పెరుగుతున్నా అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంలేదు. చాలా పీహెచ్‌సీల్లో మలేరియా నివారణ మందులే అందుబాటులో లేవు. హైరిస్క్ గ్రామాల్లో దోమల నివారణ మందులు స్ప్రేయింగ్ కూడా ఇంకా ప్రారంభం కాలేదు. సీతంపేట, న్యూస్‌లైన్: జిల్లా ఏజెన్సీ ప్రాంతా న్ని మలేరియా దోమ కాటేస్తోంది. పీహెచ్‌సీలకు జ్వరపీడితుల తాకిడి రానురాను పెరుగుతోంది. వీరిలో ఎక్కువమంది మలేరియా పీడితులు కాగా.. టైఫాయిడ్ వంటి జ్వరాల తీవ్రత కూడా అధికంగానే ఉంది. ఎపిడిమిక్ సీజన్ ప్రారంభమై వ్యాధులు పంజా విసురుతుండటంతో గిరిజనులు వణికిపోతున్నారు. ప్రతి కూల వాతావరణ పరిస్థితుల వల్ల జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చాలామంది గిరిజను లు ఆస్పత్రుల వరకు రాలేక గ్రామాల్లో సంచి ైవె ద్యులను ఆశ్రయిస్తున్నారు. సీతంపేట మండలంలోని జగతపల్లి, పెదరామ, మొగదార, జొనగ, కోసంగి, కురసింగి, అంటికొండ, పెద్దగూడ తదితర గ్రామాల్లో జ్వరాలు ఎక్కువగా ఉన్నా యి. పీహెచ్ సీకి వస్తున్న కేసుల్లో ఈ గ్రామాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. 200కుపైగా మలేరియా కేసులు ఐటీడీఏ పరిధిలో 27 పీహెచ్‌సీలున్నాయి. వీటి పరిధిలో ఈ ఏడాది ఇప్పటివరకు 202 మలేరియా పాజిటివ్ కేసులు వచ్చాయని అధికారిక గణాంకాలు చెబుతుండగా, అనధికారిక లెక్కల ప్రకారం వాటి సంఖ్య 300కు పైగానే ఉంటుంది. దీనికితోడు టైఫాయిడ్ కేసులు కూడా ఇదే స్థాయిలో నమోదవుతున్నాయి. గిరిజన గ్రామాల్లో ఈ సీజన్లోనే ఎక్కువగా జ్వరాలు వ్యాపిస్తాయి. సీతంపేట మండలంలో ఈ నెలలోనే 20 వరకు కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ సీజనులో 200 మంది వివిధ రకాల జ్వరాలతో బాధపడితే వారిలో వంద వరకు టైఫాయిడ్ బాధితులు కావడం విశేషం. వేసవిలో అత్యధిక గ్రామాలకు మంచినీటి సౌకర్యం లేకపోవడం, కలుషిత జలాలనే తాగుతుండటంతో రోగాలు విజృంభిస్తున్నాయి. ఒక్కసారి జ్వరం వచ్చిందంటే.. ఇక ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండటం లేదని, వారాల తరబడి జ్వరాలు తగ్గుముఖం పట్టడం లేదని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల కు మలేరియా, టైఫాయిడ్ ఎక్కువగా సోకుతుండటంతో నానా అవస్థలు పడుతున్నారు. ఈమాల్ ఇంజక్షన్లు నిల్... మలేరియా సోకిన రోగులకు ఈమాల్ ఇంజక్షన్ డోస్ ఇస్తారు. అయితే పీహెచ్‌సీల్లో ప్రస్తుతం ఆ ఇంజక్షన్లు అందుబాటులో లేవు. దీంతో అత్యవసర సమయాల్లో రోగులే కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరో వైపు చిన్నారులకు మలేరియా సోకితే ఏసీటీ కిట్ అనే మందు బిళ్లలు ఇస్తారు. అవి కూడా స్టాక్ లేవు. దీంతో పెద్దవారికి వాడిన ఏసీటీ కిట్లే చిన్నారులకు కూడా వాడాల్సివస్తోంది. ఎపిడమిక్ సీజన్ ప్రారంభ మై మలేరియా విజృంభిస్తున్నా మందుల సరఫరా లేకపోవడం గమనార్హం. 713 హైరిస్క్ గ్రామాల్లో స్ప్రేయింగ్... మలేరియా నివారణకు ఐటీడీఏ పరిధిలో 713 మలేరియా హైరిస్క్ గ్రామాల్లో సింథటిక్ ఫైరిత్రిన్ ద్రావణాన్ని పిచికారి చేయనున్నామని మలేరియా నివారణ కన్సల్టెంట్ శ్రీకాంత్ తెలిపారు. ఈ ప్రక్రియ రెండో తేదీ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఈమాల్, ఏసీటీ కిట్ల కోసంఐటీడీఏ పీవోకు ప్రతిపాదనలు సమర్పించామన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో 35 మందికి గాయాలు
సీతంపేట, న్యూస్‌లైన్: సీతంపేట ఏజెన్సీలో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 35 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మిగతా వారంతా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వలసగూడ వద్ద ఆటోబోల్తా పడడంతో 20 మంది, ఎగువదరబ వద్ద పికప్ వ్యాన్ బోల్తా పడడంతో 15 మందికి గాయాలయ్యాయి. వీటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆటో బోల్తా పడి.. కొత్తూరు మండలం అడ్డంగి గ్రామానికి చెందిన సుమారు 30 మందితో ప్రయాణిస్తున్న ఆటో బ్రేకులు ఫెయిలవడంతో అదుపు తప్పి వలసగూడ గ్రామం వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో 20మందికి గాయాలయ్యాయి. అందులో ప్రయాణిస్తున్న సవర బాలరాజు, రెల్లయ్య, బాలరాజు, రాజేంద్రప్రసాద్, కూర్మారావులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రసాద్, కూర్మారావు, లక్ష్మణరావు, వెంకటరావు, బాలరాజు, మంగయ్య, నీలమ్మ, బూదమ్మ, ప్రసాదరావు, చిన్నయ్య, మల్లి తదితరులకు స్వల్పగాయాలయ్యాయి. వారిని సీతంపేట 30 పడకల ఆసుపత్రికి తరలించారు. వీరిలో తీవ్రగాయాలైన వారికి పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. శ్రీకూర్మం నుంచి వస్తుండగా... ఎగువదరబ గ్రామం నుంచి శ్రీకూర్మం యాత్రకు శనివారం యాత్రకు వెళ్లిన గిరిజనులు ఆదివారం తిరిగి వస్తుండగా ఎగువదరబ వద్ద వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 20 మందిలో 15 మంది గిరిజనులకు గాయాలయ్యాయి. ఎస్.చెంచు, చిన్నమ్మి, సవరబోడమ్మ, సరస్వతి, డొంబురు, సింహాచలం, అప్పలమ్మ, బూదమ్మ, అప్పలమ్మ, మీనా, నీలయ్య తదితరులకు గాయాలయ్యాయి. తీవ్రగాయలపాలైన సవర సునీతను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుప్రమాదంలో గాయపడిన ఎగువదరబ బాధితులకు గొయిది సర్పంచ్ సవర చెంచయ్య రొట్టెలు పంపిణీ చేశారు. అడ్డంగి బాధితులను ఎమ్మెల్యే సుగ్రీవులు, సీతంపేట సర్పంచ్ ఆరిక భారతి పరామర్శించారు. నెలలో మూడో ప్రమాదం ఈ నెలలో ఇది మూడో ప్రమాదం. రెండు రోజుల కిందట కిట్టాల పాడు జంక్షన్ వద్ద ఆటో బోల్తాపడడంతో ఒక మహిళ మృతి చెందిన విషయం విదితమే. గత ఏడాది కూడా శ్రీకూర్మం యాత్రకు వెళ్లి సముద్రంలో ఇద్దరు మృత్యువాత పడ్డారని గిరిజనులు తెలిపారు. మళ్లీ ఈ ఏడాది ఇదే నెలలో ప్రమాదం జరిగిందని చెప్పారు. రోదనలతో దద్ధరిల్లిన ఆస్పత్రి పాలకొండ రూరల్ :ఆటో బోల్తా పడడంతో గాయపడనివారు, వారి బంధువులతో ఆస్పత్రికి కిక్కిరిసిపోయింది. ఆస్పత్రిలో సరైన వైద్యసదుపాయాలు లేక, ఆర్థోపెడిక్ అందుబాటులో లేకపోవడంతో వైద్యసేవలందక బాధితులు గంటల తరబడి బాధలు పడ్డారు. వారి రోదనలతో ఆస్పత్రి దద్ధరిల్లింది. వారిని పరామర్శించిన వ్యవసాయ కార్మిక సంఘ ప్రతినిధులు గంగరాజు ఈశ్వరరావు, జి.ఈశ్వరమ్మ మాట్లాడుతూ, ప్రమాదాలో గాయపడిన వారికి ఏరియా ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైద్య సేవలందడం లేదని, దీంతో రక్తస్రావంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఆస్పత్రిలో అన్ని సేవలూ అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. -
‘అరిగి’పోయిన రికార్డు
ఈమె పేరు సవర చంద్రమ్మ. 70 ఏళ్ల పండుటాకు. నా అన్న వారెవరూ లేరు. సర్కారు వారు ఇచ్చే రూ.200తోనే బతుకు బండిని ఈడ్చుకొస్తోంది. జగతపల్లి స్వగ్రామం. సీతంపేటకు ఐదు కి.మీ. దూరంలో కొండలపై ఉన్న గ్రామం నుంచి పింఛను కోసం కాళ్లీడ్చుకుంటూ వచ్చింది. సంబంధిత సిబ్బంది మొండి చె య్యి చూపడంతో ఉసూరుమంటూ వెనుదిరిగింది. సీతంపేట, న్యూస్‌లైన్: నెలనెలా అందాల్సిన సంక్షేమ పింఛన్లు అందక వాటిపైనే ఆధారపడిన వేలాది మంది లబ్ధిదారులు రోడ్డున పడ్డారు. గత నెలలో నిలిచిపోయిన వీరి పింఛన్లు ఈ నెల కూడా పునరుద్ధరణకు నోచుకోలేదు. దీనివల్ల సుమారు 2,232 మంది ఇబ్బంది పడుతున్నట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఈ సంఖ్య ఇంకా ఎక్కువేనని బాధితులు చెబుతున్నారు. వీరిలో వృద్ధులు, వికలాంగులూ ఉన్నా అధికారులు ఏమాత్రం కనికరం చూపడంలేదు. సమస్య సత్వర పరిష్కారానికి చొరవ చూపడం లేదు. పోనీ వారు చెబుతున్న సమస్య ఏమైనా నెలల తరబడి పరిష్కరించలేనిదా.. అంటే అదీ కాదు. ఇంతకీ ఆ సమస్య ఏమిటయ్యా.. అంటే..సీతంపేట ఏజెన్సీలో వితంతు, వికలాంగ, వృద్దాప్య పించన్ల మొత్తం లబ్దిదారులు 5,248 మంది ఉన్నారు. వీరిలో 2,232 మందికి గత నెలరోజులుగా పించన్లు అందడం లేదని అధికారులు అంచనా అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది. వేలి ముద్రల్లో వ్యత్యాసం ఉందట! సీతంపేట ఏజెన్సీలో 5,248 మంది వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్లు పొందుతున్నారు. వీరంతా నిరక్షర్యాస్యులు కావడంతో వేలిముద్రలు వేసి ప్రతి నెలా పింఛను సొమ్ము తీసుకుంటున్నారు. అదేవిధంగా గత నెలలోనూ వచ్చి వేలిముద్రలు వేశారు. అయితే పంఛను మంజూరు చేసినప్పుడు తీసుకున్న వేలి ముద్రలకు, ఇప్పటి వేలి ముద్రలకు తేడా ఉందంటూ పింఛను డబ్బులు ఇచ్చేందుకు స్మార్ట్ కార్డుల కోఆర్డినేటర్లు తిరస్కరించారు. అప్పటి నుంచి లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి. వేలు అరిగిపోయి ముద్ర సరిగ్గా పడకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని సిబ్బంది చెబుతున్నారు. సాంకేతిక సమస్య తలెత్తినందున తామేమీ చేయలేమని సంబంధిత అధికారులు చేతులెత్తేస్తున్నారు. నెలరోజులకుపైగా గడిచిపోయినా అరిగిపోయిన రికార్డులా అదే కారణం చెబుతున్నారు తప్ప.. దాని ప్రత్యామ్నాయం ఏమిటన్నది ఆలోచించడం లేదు. మరోవైపు తాము ప్రతి రోజు పింఛను కోసం వచ్చి ఉత్తి చేతులతో వెళుతున్నామని సుంబురునాయుడుగూడ, జగతపల్లి, మొగదారగూడ, జమ్మడుగూడలకు చెందిన గిరిజనులు ఆవేదనతో చెప్పారు. బుధవారం కూడా అదే ఆశతో మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన వీరికి నిరాశే ఎదురైంది. పింఛను రాళ్లతోనే బతుకులీడుస్తున్న తమ గతేంటని పెద్దూరుకు చెందిన గలయ్య, జజ్జు, జగ్గమ్మ, మొగదారగూడకు చెందిన లక్కమ్మ, సోమమ్మ దీనంగా ప్రశ్నించారు. వీరి పరిస్థితిని గమనించిన ‘న్యూస్‌లైన్’ ఎంపీడీవో గార రవణమ్మ వివరణ కోరగా సంబంధిత జిల్లాస్థాయి సిబ్బందిని రప్పించామని, పింఛన్లు ఇప్పించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. -
విద్యుత్ సేవలకు రజత హారం.
సీతంపేట, న్యూస్‌లైన్: విద్యుత్ ఫ్రాంైచె జీల నిర్వహణలో ఉత్తమ సేవలందించిన సీతంపేట మహిళా సమాఖ్య జాతీయ స్థాయిలో రజత పతకం అందుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేతుల మీదుగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె.సునీల్‌రాజ్‌కుమార్, మండల మహిళా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు జి.సరోజిని, కె.వరలక్ష్మి సిల్వర్ మెడల్‌ను అందుకున్నారు. కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి సిన్హా, జాయింట్ సెక్రటరీ జ్యోతి ఆరోరాలు మహిళా సంఘాలను ప్రశంసించారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఏఈ పిచ్చయ్య కూడా పాల్గొన్నారు. -
ఐకేపీ సార్లు.. ఎంచక్కా షికార్లు!
సీతంపేట, న్యూస్‌లైన్: పొరుగున ఉన్న విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏలో ఇందిరా క్రాంతి పథం(ఏకేపీ) ఏపీడీకి తప్ప ఆ విభాగంలో ఇతరులెవరికీ కారు సౌకర్యం కల్పించలేదు. అందూ ద్విచక్ర వాహనాలపైనే క్షేత్రస్థాయికి వెళ్లి కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు.కానీ మన సీతంపేట ఐటీడీఏలో అదే ఐకేపీ అధి‘కారు’ల దర్జాయే వేరు. ఎంచక్కా కార్లలో షికారు కెళ్లినట్లు ఏజెన్సీ అందాలను ఆస్వాదిస్తూ పనులను పర్యవేక్షించే సౌలభ్యాన్ని అధికారులు అత్యంత ఉదారంగా కల్పించారు. ఏడుగురు డీపీఎం, ఏపీఎం స్థాయి అధికారులకు ఒక్కొక్కరికీ ఒక్కో కారు కేటాయించేశారు.ఏడు కార్లను అద్దె ప్రాతిపదికన తీసుకొని గిరిజనుల నిధులను వాటికి ధారబోస్తున్నారు. ఈ విధంగా గత 20 నెలల్లో రూ.25.68 లక్షల ఖర్చు చూపించారు. పోనీ ఇంత ‘కష్టపడి’ కార్లలో తిరుగుతున్న వీరు ఘనమైన ఫలితాలు సాధిస్తున్నారా? అంటే.. అదీ లేదు. సాధారణంగా ఐకేపీకి సంబంధించి పథకాల క్షేత్ర స్థాయి పర్యవేక్షణకు ఆ విభాగం అధిపతి అయిన ఏపీడీకి ఒక వాహనం కేటాయిస్తారు. అంతవరకు ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఎక్కడా లేని విధంగా సీతంపేటలో ఆ విభాగం లో పని చేస్తున్న ఇతర అధికారులకూ టాటా ఇండికా వంటి వాహనాలను అద్దె ప్రాతిపదికన సమకూర్చారు. డీపీఎం(ఐబీ), డీపీఎం(విద్య)లకు చెరో కారు, ఏపీఎం(బ్యాంకు లింకేజీ), ఏపీఎం(పూరెస్ట్ ఆఫ్ ది పూర్), ఏపీఎం(ఫైనాన్స్)లకు చెరో వాహనం, అలాగే ఐకేపీ లీగల్ కో-ఆర్డినేటర్‌కు ఒక వాహనం, న్యూట్రీషియన్ అండ్హెల్త్ ఏపీఎంకు కారు కేటాయించారు. ఈ వాహనాల్లో వారు ఎక్కడికి వెళుతున్నారో, ఏం పర్యవేక్షిస్తున్నారో తెలియని పరిస్థితి ఉండగా, కొందరు మాత్రం ఐటీడీఏలోని ఐకేపీ విభాగం వద్దే నిత్యం చక్కర్లు కొడుతుంటారు. మరోవైపు ఏపీఎం స్థాయిలో నిర్వహించే కొన్ని పథకాలు ఇప్పుడు అమలు కావడం లేదు. అలాంటప్పుడు వారికెందుకు వాహనాలు కేటాయించారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రూ.లక్షల్లోనే చమురు వదులుతోంది వాహనాల అద్దె రూపంలో ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున చమురు వదులుతోంది. గత 20 నెలల్లో వీటి అద్దెలకే రూ.25.68 లక్షలు వ్యయం చేశారు. గత ఏడాది ఒక్కో కారుకు రూ.17వేల అద్దె చెల్లించేవారు. అలా గత ఆర్థిక సంవత్సరంలో రూ.12.24 లక్షలు ఖర్చు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అద్దెను ఏకంగా రూ.7 వేలు పెంచేసి రూ.24వేలు చేశారు. ఆ మేరకు ఇప్పటివరకు రూ.13.44లక్షలు చెలించినట్లు తెలిసింది. పరిశీలిస్తాం:ఐకేపీ ఏపీడీ వాహనాల విషయమై ‘న్యూస్‌లైన్’ ఐకేపీ ఏపీడీ కుమార్ వద్ద ప్రస్తావించగా వాహనాలు కేటాయించిన మాట వాస్తవేమనని అన్నారు. ఈ విషయం పరిశీలిస్తామని చెప్పారు. పైనాన్స్ ఏపీఎం రాము వద్ద ప్రస్తావించగా ఏడు వాహనాలు కేటాయించామన్నారు. ఇంకా రెండు నెలల కారు అద్దెలు చెల్లించాల్సి ఉందన్నారు. -
రాష్ట్రం వల్లే ‘షెడ్యూల్డ్’ గుర్తింపులో జాప్యం
సీతంపేట/భామిని, న్యూస్‌లైన్: సీతంపేట ఏజెన్సీలో నాన్‌షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న 8 గిరిజన పంచామతీలను షెడ్యూల్డ్ ఏరియా లో కలపడానికి సంబంధించిన ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉండడం వల్లే షెడ్యూ ల్డ్ గ్రామాల గుర్తింపులో జాప్యం జరుగుతోందని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వైరిచర్ల కిశోర్‌చంద్రదేవ్ చెప్పారు. శనివారం ఆయన సీతంపేట మండలం కంబ గూడ సమీపంలో రూ.3 కోట్లతో నిర్మించిన యూత్ ట్రైనింగ్ సెంటర్‌ను, అంతకుముందు భామినిలో అభివృద్ధి పనులు ప్రారంభించి మాట్లాడారు. షెడ్యూల్డ్ ఫైల్ రెండేళ్లుగా ఎందుకు పెండింగ్‌లో ఉందో తెలియదన్నారు. జంపరకోట జలాశయం పూర్తిచేయడానికి అవసరమైన రూ.12 కోట్లు మంజూరు చేయించడానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. గిరిజనులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పిస్తామన్నారు. చింతపండు కిలో మద్దతు ధర రూ.20 ఉండేలా చేస్తామని హామీ ఇచ్చారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందజేశారు. ఐఏపీ నిధులతో తివ్వకొండల్లోని గిరిజన ప్రాంతాల్లో లింక్ రోడ్లు పూర్తిచేయాలన్నారు. భామినిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుగ్రీవులు మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి మూడేళ్లలో రూ.30 కోట్ల చొప్పున కేటాయించడానికి కేంద్ర మంత్రి కిశోరే కారణమన్నారు. ఐటీడీఏ పీవో కె.సునీల్‌రాజ్‌కుమార్ మాట్లాడుతూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మూడేళ్లలో చేపట్టిన పనులను వివరించారు. ఈ కార్యక్రమాల్లో పాలకొండ ఆర్డీవో తేజ్‌భరత్, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ నాయుడు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.