ఐకేపీ సార్లు.. ఎంచక్కా షికార్లు!
Published Sun, Feb 2 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
సీతంపేట, న్యూస్‌లైన్: పొరుగున ఉన్న విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏలో ఇందిరా క్రాంతి పథం(ఏకేపీ) ఏపీడీకి తప్ప ఆ విభాగంలో ఇతరులెవరికీ కారు సౌకర్యం కల్పించలేదు. అందూ ద్విచక్ర వాహనాలపైనే క్షేత్రస్థాయికి వెళ్లి కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు.కానీ మన సీతంపేట ఐటీడీఏలో అదే ఐకేపీ అధి‘కారు’ల దర్జాయే వేరు. ఎంచక్కా కార్లలో షికారు కెళ్లినట్లు ఏజెన్సీ అందాలను ఆస్వాదిస్తూ పనులను పర్యవేక్షించే సౌలభ్యాన్ని అధికారులు అత్యంత ఉదారంగా కల్పించారు. ఏడుగురు డీపీఎం, ఏపీఎం స్థాయి అధికారులకు ఒక్కొక్కరికీ ఒక్కో కారు కేటాయించేశారు.ఏడు కార్లను అద్దె ప్రాతిపదికన తీసుకొని గిరిజనుల నిధులను వాటికి ధారబోస్తున్నారు. ఈ విధంగా గత 20 నెలల్లో రూ.25.68 లక్షల ఖర్చు చూపించారు.
పోనీ ఇంత ‘కష్టపడి’ కార్లలో తిరుగుతున్న వీరు ఘనమైన ఫలితాలు సాధిస్తున్నారా? అంటే.. అదీ లేదు. సాధారణంగా ఐకేపీకి సంబంధించి పథకాల క్షేత్ర స్థాయి పర్యవేక్షణకు ఆ విభాగం అధిపతి అయిన ఏపీడీకి ఒక వాహనం కేటాయిస్తారు. అంతవరకు ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఎక్కడా లేని విధంగా సీతంపేటలో ఆ విభాగం లో పని చేస్తున్న ఇతర అధికారులకూ టాటా ఇండికా వంటి వాహనాలను అద్దె ప్రాతిపదికన సమకూర్చారు. డీపీఎం(ఐబీ), డీపీఎం(విద్య)లకు చెరో కారు, ఏపీఎం(బ్యాంకు లింకేజీ), ఏపీఎం(పూరెస్ట్ ఆఫ్ ది పూర్), ఏపీఎం(ఫైనాన్స్)లకు చెరో వాహనం, అలాగే ఐకేపీ లీగల్ కో-ఆర్డినేటర్‌కు ఒక వాహనం, న్యూట్రీషియన్ అండ్‌హెల్త్ ఏపీఎంకు కారు కేటాయించారు. ఈ వాహనాల్లో వారు ఎక్కడికి వెళుతున్నారో, ఏం పర్యవేక్షిస్తున్నారో తెలియని పరిస్థితి ఉండగా, కొందరు మాత్రం ఐటీడీఏలోని ఐకేపీ విభాగం వద్దే నిత్యం చక్కర్లు కొడుతుంటారు.
మరోవైపు ఏపీఎం స్థాయిలో నిర్వహించే కొన్ని పథకాలు ఇప్పుడు అమలు కావడం లేదు. అలాంటప్పుడు వారికెందుకు వాహనాలు కేటాయించారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
రూ.లక్షల్లోనే చమురు వదులుతోంది
వాహనాల అద్దె రూపంలో ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున చమురు వదులుతోంది. గత 20 నెలల్లో వీటి అద్దెలకే రూ.25.68 లక్షలు వ్యయం చేశారు.
గత ఏడాది ఒక్కో కారుకు రూ.17వేల అద్దె చెల్లించేవారు. అలా గత ఆర్థిక సంవత్సరంలో రూ.12.24 లక్షలు ఖర్చు చేశారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో అద్దెను ఏకంగా రూ.7 వేలు పెంచేసి రూ.24వేలు చేశారు. ఆ మేరకు ఇప్పటివరకు రూ.13.44లక్షలు చెలించినట్లు తెలిసింది.
పరిశీలిస్తాం:ఐకేపీ ఏపీడీ
వాహనాల విషయమై ‘న్యూస్‌లైన్’ ఐకేపీ ఏపీడీ కుమార్ వద్ద ప్రస్తావించగా వాహనాలు కేటాయించిన మాట వాస్తవేమనని అన్నారు. ఈ విషయం పరిశీలిస్తామని చెప్పారు. పైనాన్స్ ఏపీఎం రాము వద్ద ప్రస్తావించగా ఏడు వాహనాలు కేటాయించామన్నారు. ఇంకా రెండు నెలల కారు అద్దెలు చెల్లించాల్సి ఉందన్నారు.
Advertisement
Advertisement