IKP Officers
-
పొదుపు భేష్.. ఆరోగ్యమూ జాగ్రత్త
సాక్షి, ఇందూరు (నిజామాబాద్ అర్బన్): ఇప్పటి వరకు డ్వాక్రా మహిళలకు పొదుపు చేయడమే నేర్పించిన ఐకేపీ అధికారులు ఇకపై వారికి ఆరోగ్య సూత్రాలను నేర్పించనున్నారు. తీసుకునే ఆహారంతో పాటు ఎలాంటి జాగ్రత్తలు, పరిశుభ్రత పాటిస్తే మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడో వారికి అవగాహన కల్పించనున్నారు. మనిషి పుట్టిన నాటి నుంచి మరణించేంత వరకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే అసలైన ఆనందం, సంతోషం ఉంటుందని చెప్పడానికి, సామాజిక పరివర్తనలో మా ర్పు తేవడానికి ఆరోగ్యం–పోషణ అనే కార్యక్రమాన్ని ఐకేపీ శాఖ తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా ఒక గర్భిణీ తాను బిడ్డను ప్రసవించే వరకు, పుట్టిన బిడ్డ రెండు సంవత్సరాల వరకు పెరిగే వరకు మొత్తం వెయ్యి రోజుల ప్రాముఖ్యతను తెలియజెప్పనున్నారు. మొత్తం ఐదు అంశాలపై డ్వాక్రా మహిళలకు ప్రతీ నెలా వారి రెండవ సమావేశంలో ఐకేపీ సిబ్బంది అవగాహన కల్పిస్తారు. అయితే ఈ నెల నుంచే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఐకేపీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 11 మండలాలు ప్రాజెక్ట్‌గా.. జిల్లాలో 11 మండలాలను ప్రాజెక్టుగా తీసుకుని ఆ మండలాల్లోని మహిళా సంఘాల సభ్యులకు ఆరోగ్య సూత్రాలను తెలుపనున్నారు. ఆ మండలాల్లో ఆర్మూర్, బోధన్, డిచ్పల్లి, జక్రాన్‌పల్లి, కమ్మర్పల్లి, మాక్లూర్, మెండోరా, నవీపేట్, నిజామాబాద్ రూరల్, వేల్పూర్, ఎడపల్లి ఉన్నా యి. అయితే 11 మండలాలు కలిపి 787 వీవోలుండగా, 11,074 డ్వాక్రా గ్రూపులున్నాయి. ఈ మొత్తం గ్రూపుల్లో 1,13,216 మంది మహిళా సభ్యులున్నారు. అయితే ఐకేపీ అధికారులు ముందుగా జిల్లా స్థాయిలో ఏపీఎంలు, సీసీలకు శిక్షణ ఇస్తారు. జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన వారు మండల స్థాయిలో వీవోఏలకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరు ప్రతీ నెలా డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పిస్తారు. వెయ్యి రోజుల ప్రాముఖ్యత మహిళ గర్భం దాల్చిన రోజు నుంచి బిడ్డకు రెండె సంవత్సరాలు నిండే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పిస్తారు. పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు తాగించాలి. ఆరు నెలల వరకు తల్లిపాలే పట్టాలి. ఆరు నెలలు నిండగానే తల్లిపాలతో పాటు తగినంత అనుబంధ పోషకాహారం అందించాలి. ఇను ము ఎక్కువగా ఉన్న ఆహారం, అయోడీన్ ఉప్పు, టీకాలు, శిశు సంరక్షణలో పరిశుభ్రతను వివరిస్తారు. పిల్లల పోషణకు పాటించే పద్ధతులు పిల్లల పోషణకై వారికి అందించే ఆహారం, టీకాలు, వయసుకు తగ్గ అందించే పోషకాల గురించి అవగాహన కల్పిస్తారు. ఎలాంటి ఆహారం పెట్టాలి, ఆహారం ఎలా ఇవ్వాలి, పరిశుభ్రతను వివరిస్తారు. శిశువుకు సరైన పద్దతిలో ఆహారం ఇస్తున్న తల్లులకు ‘స్టార్’ అమ్మ పేరుతో కండువా కప్పి సత్కరిస్తారు. చేతుల పరిశుభ్రత అనేక రుగ్మతలకు అపరిశుభ్రమైన వాతావరణం, చేతు లు సరిగ్గా కడగకపోవడం కారణాలవుతున్నాయి. చేతు లు సరిగ్గా కడుక్కోకున్నా క్రీములు మానవ శరీరంలోకి వెళ్లి వ్యాదుల సంక్రమణకు దారి తీస్తాయి. ఇందుకు ప్రతీ రోజు అన్నం తినే ముందు, మలమూత్ర విసర్జన, ఆటలాడిన తరువాత సబ్బుతో లేదా బూడిదతో చే తులు కడుక్కోవాలని సూచనలు చేస్తారు. చేతులు కడగడం వల్ల అంటు రోగాల సంక్రమణ, అతిసారం, ఊపిరితిత్తుల వ్యాధులను తగ్గిస్తుంది. శుభ్రమైన సమతుల్యమైన ఆహారం.. రోజు వారీగా తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు, న్యూట్రిన్లు, శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకునే విధానంపై మహిళా సభ్యులకు అవగాహన కల్పిస్తారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, కల్తీకి గురయ్యే ఆహారాలేంటీ ఇతర వివరాలను తెలియజేస్తారు. గుడ్లు, కోళ్లు, పప్పులు, పండ్లు, వెన్న, కూరగాయలు తీసుకోవడం వల కలిగే లాభాలను వివరిస్తారు. చెత్త నివారణ, పర్యావరణ పారిశుధ్యం అనేక సమస్యలకు మూల కారణం చెత్తే. ఈ చెత్తను నిర్మూలించడానికి, పర్యావరణ పారిశుధ్యం కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సభ్యులకు వివరిస్తారు. ఇళ్లను, పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవడం, తడి, పొడి చెత్తను వేరు వేరుగా వేయడంపై అవగాహన కల్పిస్తారు. -
తప్పించుకునేందుకే..!
బొమ్మల బాగోతం ఇప్పుడు సంబంధిత శాఖ అధికారులను కుదిపేస్తోంది. ఒకవైపు ఈ వ్యవహారం నిగ్గుతేల్చేందుకు ఉన్నతాధికారులు యత్నిస్తుండగా, మరోవైపు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ఐకేపీ అధికారులు యత్నాలు ముమ్మరం చేశారు. ఇంతవరకూ స్పందించని బొమ్మల ఏజెన్సీ ఇప్పుడు ఐటీడీఏ పీఓకు లే ఖ రాసింది. అధికారులే సంబంధిత కంపెనీతో లేఖ రాయించారని ఆరోపణలు వస్తున్నాయి. పూర్తిస్థాయిలో విచారణ జరిపితేనే లక్షలాది రూపాయల అవకతవకల వెనుక ఉన్నది ఎవరన్నది తేలుతుందని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్వతీపురం : పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆరోగ్య పౌష్టికాహార కేంద్రాల్లో పిల్లలకు అందజేసేందుకు బొమ్మల కొనుగోలులో జరిగిన అవకతవకలను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చాక...దీంట్లో ప్రమేయమున్న అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. పాత అధికారులను కాపాడే పనిలో కొత్త అధికారులున్నట్టు తెలిసింది. డొంక కదిలిన తరువాత మిగతా బొమ్మలను వెంటనే సరఫరా చేస్తామని పశ్చిమ గోదావరి భీమవరానికి చెందిన రామకృష్ణ ఏజెన్సీ ఐటీడీఏ పీఓకు ఓ లేఖ రాసింది. అయితే ఐకేపీ అధికారులే వెనుక ఉండి ఆ ఏజె న్సీ యాజమాన్యంతో ఈ లేఖ రాయించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. 213 కేంద్రాలకు గాను అప్పట్లో 17 కేంద్రాలకే బొమ్మలు సరఫరా చేశామని, మిగతా కేంద్రాలకు ఇప్పుడు బొమ్మలు సరఫరా చేస్తామని పేర్కొంటూ ఏజెన్సీ తనకు లేఖ పంపినట్లు ఐటీ డీఏ ప్రాజెక్టు అధికారి శ్రీకేశ్ బుధవారం ప్రకటించారు. మిగతా బొమ్మలను సరఫరా చేసేందుకు ఆ ఏజెన్సీకి ఈ నెలాఖరు వరకు సమయమిచ్చినట్టు తెలిపారు. లేకపోతే ఆ కంపెనీతో పాటు సంబంధిత అధికారుల నుంచి సొమ్ము రికవరీ చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రశ్నలకు బదులేది ? అప్పట్లో పూర్తిస్థాయిలో బొమ్మలు ఇవ్వకుండానే సంబంధిత అధికారులు పూర్తి మొత్తాన్ని ఆ కంపెనీకి ఎలా చెల్లించారు ? చెల్లించిన మొత్తంలో ఎంతవరకు అవకతవకలు జరిగాయి ? ఇన్నాళ్లు ఆ కంపెనీ పూర్తిస్థాయిలో బొమ్మలు సరఫరా చేయకపోతే సంబంధిత అధికారులు ఎందుకు మిన్నకున్నారు ? అప్పట్లో సరఫరా అయిన బొమ్మలను ఆయా కేంద్రాలకు ఎందుకు పంపిణీ చేయలేదు ? బొమ్మలు వచ్చాక, వాటి నాణ్యతను పరిశీలించాక ఏజెన్సీకి సొమ్ము చెల్లించాల్సి ఉండగా, ముందుగానే ఎందుకు చెల్లించినట్టు ? అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పే వారే కరవయ్యారు. బొమ్మల కొనుగోలులో అవకతవకలు జరిగినట్టు తెలుస్తున్నా దీనికి బాధ్యులైన వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవ డం లేదని గిరిజనులు, గిరిజన సంఘాలు ప్రశ్నస్తున్నాయి. రికవరీ అయ్యాక చర్యలు : ఐటీడీఏ పీఓ పథకానికి అందజేస్తున్న ఆర్థిక సాయాన్ని మాత్రమే నిలిపివేశారని, పథకం కొనసాగుతుందని ఐటీడీఏ పీఓ తెలిపారు. సంబంధిత కంపెనీ నుంచి బొమ్మలను రికవరీ చేసుకున్న తరువాత వాటిని ఏం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
ఐకేపీ సార్లు.. ఎంచక్కా షికార్లు!
సీతంపేట, న్యూస్‌లైన్: పొరుగున ఉన్న విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏలో ఇందిరా క్రాంతి పథం(ఏకేపీ) ఏపీడీకి తప్ప ఆ విభాగంలో ఇతరులెవరికీ కారు సౌకర్యం కల్పించలేదు. అందూ ద్విచక్ర వాహనాలపైనే క్షేత్రస్థాయికి వెళ్లి కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు.కానీ మన సీతంపేట ఐటీడీఏలో అదే ఐకేపీ అధి‘కారు’ల దర్జాయే వేరు. ఎంచక్కా కార్లలో షికారు కెళ్లినట్లు ఏజెన్సీ అందాలను ఆస్వాదిస్తూ పనులను పర్యవేక్షించే సౌలభ్యాన్ని అధికారులు అత్యంత ఉదారంగా కల్పించారు. ఏడుగురు డీపీఎం, ఏపీఎం స్థాయి అధికారులకు ఒక్కొక్కరికీ ఒక్కో కారు కేటాయించేశారు.ఏడు కార్లను అద్దె ప్రాతిపదికన తీసుకొని గిరిజనుల నిధులను వాటికి ధారబోస్తున్నారు. ఈ విధంగా గత 20 నెలల్లో రూ.25.68 లక్షల ఖర్చు చూపించారు. పోనీ ఇంత ‘కష్టపడి’ కార్లలో తిరుగుతున్న వీరు ఘనమైన ఫలితాలు సాధిస్తున్నారా? అంటే.. అదీ లేదు. సాధారణంగా ఐకేపీకి సంబంధించి పథకాల క్షేత్ర స్థాయి పర్యవేక్షణకు ఆ విభాగం అధిపతి అయిన ఏపీడీకి ఒక వాహనం కేటాయిస్తారు. అంతవరకు ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఎక్కడా లేని విధంగా సీతంపేటలో ఆ విభాగం లో పని చేస్తున్న ఇతర అధికారులకూ టాటా ఇండికా వంటి వాహనాలను అద్దె ప్రాతిపదికన సమకూర్చారు. డీపీఎం(ఐబీ), డీపీఎం(విద్య)లకు చెరో కారు, ఏపీఎం(బ్యాంకు లింకేజీ), ఏపీఎం(పూరెస్ట్ ఆఫ్ ది పూర్), ఏపీఎం(ఫైనాన్స్)లకు చెరో వాహనం, అలాగే ఐకేపీ లీగల్ కో-ఆర్డినేటర్‌కు ఒక వాహనం, న్యూట్రీషియన్ అండ్హెల్త్ ఏపీఎంకు కారు కేటాయించారు. ఈ వాహనాల్లో వారు ఎక్కడికి వెళుతున్నారో, ఏం పర్యవేక్షిస్తున్నారో తెలియని పరిస్థితి ఉండగా, కొందరు మాత్రం ఐటీడీఏలోని ఐకేపీ విభాగం వద్దే నిత్యం చక్కర్లు కొడుతుంటారు. మరోవైపు ఏపీఎం స్థాయిలో నిర్వహించే కొన్ని పథకాలు ఇప్పుడు అమలు కావడం లేదు. అలాంటప్పుడు వారికెందుకు వాహనాలు కేటాయించారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రూ.లక్షల్లోనే చమురు వదులుతోంది వాహనాల అద్దె రూపంలో ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున చమురు వదులుతోంది. గత 20 నెలల్లో వీటి అద్దెలకే రూ.25.68 లక్షలు వ్యయం చేశారు. గత ఏడాది ఒక్కో కారుకు రూ.17వేల అద్దె చెల్లించేవారు. అలా గత ఆర్థిక సంవత్సరంలో రూ.12.24 లక్షలు ఖర్చు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అద్దెను ఏకంగా రూ.7 వేలు పెంచేసి రూ.24వేలు చేశారు. ఆ మేరకు ఇప్పటివరకు రూ.13.44లక్షలు చెలించినట్లు తెలిసింది. పరిశీలిస్తాం:ఐకేపీ ఏపీడీ వాహనాల విషయమై ‘న్యూస్‌లైన్’ ఐకేపీ ఏపీడీ కుమార్ వద్ద ప్రస్తావించగా వాహనాలు కేటాయించిన మాట వాస్తవేమనని అన్నారు. ఈ విషయం పరిశీలిస్తామని చెప్పారు. పైనాన్స్ ఏపీఎం రాము వద్ద ప్రస్తావించగా ఏడు వాహనాలు కేటాయించామన్నారు. ఇంకా రెండు నెలల కారు అద్దెలు చెల్లించాల్సి ఉందన్నారు.