వేర్వేరు ప్రమాదాల్లో 35 మందికి గాయాలు
వేర్వేరు ప్రమాదాల్లో 35 మందికి గాయాలు
Published Mon, Mar 17 2014 2:40 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
సీతంపేట, న్యూస్‌లైన్: సీతంపేట ఏజెన్సీలో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 35 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మిగతా వారంతా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వలసగూడ వద్ద ఆటోబోల్తా పడడంతో 20 మంది, ఎగువదరబ వద్ద పికప్ వ్యాన్ బోల్తా పడడంతో 15 మందికి గాయాలయ్యాయి. వీటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఆటో బోల్తా పడి..
కొత్తూరు మండలం అడ్డంగి గ్రామానికి చెందిన సుమారు 30 మందితో ప్రయాణిస్తున్న ఆటో బ్రేకులు ఫెయిలవడంతో అదుపు తప్పి వలసగూడ గ్రామం వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో 20మందికి గాయాలయ్యాయి. అందులో ప్రయాణిస్తున్న సవర బాలరాజు, రెల్లయ్య, బాలరాజు, రాజేంద్రప్రసాద్, కూర్మారావులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రసాద్, కూర్మారావు, లక్ష్మణరావు, వెంకటరావు, బాలరాజు, మంగయ్య, నీలమ్మ, బూదమ్మ, ప్రసాదరావు, చిన్నయ్య, మల్లి తదితరులకు స్వల్పగాయాలయ్యాయి. వారిని సీతంపేట 30 పడకల ఆసుపత్రికి తరలించారు. వీరిలో తీవ్రగాయాలైన వారికి పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
శ్రీకూర్మం నుంచి వస్తుండగా...
ఎగువదరబ గ్రామం నుంచి శ్రీకూర్మం యాత్రకు శనివారం యాత్రకు వెళ్లిన గిరిజనులు ఆదివారం తిరిగి వస్తుండగా ఎగువదరబ వద్ద వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 20 మందిలో 15 మంది గిరిజనులకు గాయాలయ్యాయి. ఎస్.చెంచు, చిన్నమ్మి, సవరబోడమ్మ, సరస్వతి, డొంబురు, సింహాచలం, అప్పలమ్మ, బూదమ్మ, అప్పలమ్మ, మీనా, నీలయ్య తదితరులకు గాయాలయ్యాయి. తీవ్రగాయలపాలైన సవర సునీతను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుప్రమాదంలో గాయపడిన ఎగువదరబ బాధితులకు గొయిది సర్పంచ్ సవర చెంచయ్య రొట్టెలు పంపిణీ చేశారు. అడ్డంగి బాధితులను ఎమ్మెల్యే సుగ్రీవులు, సీతంపేట సర్పంచ్ ఆరిక భారతి పరామర్శించారు.
నెలలో మూడో ప్రమాదం
ఈ నెలలో ఇది మూడో ప్రమాదం. రెండు రోజుల కిందట కిట్టాల పాడు జంక్షన్ వద్ద ఆటో బోల్తాపడడంతో ఒక మహిళ మృతి చెందిన విషయం విదితమే. గత ఏడాది కూడా శ్రీకూర్మం యాత్రకు వెళ్లి సముద్రంలో ఇద్దరు మృత్యువాత పడ్డారని గిరిజనులు తెలిపారు. మళ్లీ ఈ ఏడాది ఇదే నెలలో ప్రమాదం జరిగిందని చెప్పారు.
రోదనలతో దద్ధరిల్లిన ఆస్పత్రి
పాలకొండ రూరల్ :ఆటో బోల్తా పడడంతో గాయపడనివారు, వారి బంధువులతో ఆస్పత్రికి కిక్కిరిసిపోయింది. ఆస్పత్రిలో సరైన వైద్యసదుపాయాలు లేక, ఆర్థోపెడిక్ అందుబాటులో లేకపోవడంతో వైద్యసేవలందక బాధితులు గంటల తరబడి బాధలు పడ్డారు. వారి రోదనలతో ఆస్పత్రి దద్ధరిల్లింది.
వారిని పరామర్శించిన వ్యవసాయ కార్మిక సంఘ ప్రతినిధులు గంగరాజు ఈశ్వరరావు, జి.ఈశ్వరమ్మ మాట్లాడుతూ, ప్రమాదాలో గాయపడిన వారికి ఏరియా ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైద్య సేవలందడం లేదని, దీంతో రక్తస్రావంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఆస్పత్రిలో అన్ని సేవలూ అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
Advertisement