‘అరిగి’పోయిన రికార్డు
Published Thu, Feb 6 2014 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM
ఈమె పేరు సవర చంద్రమ్మ. 70 ఏళ్ల పండుటాకు. నా అన్న వారెవరూ లేరు. సర్కారు వారు ఇచ్చే రూ.200తోనే బతుకు బండిని ఈడ్చుకొస్తోంది. జగతపల్లి స్వగ్రామం. సీతంపేటకు ఐదు కి.మీ. దూరంలో కొండలపై ఉన్న గ్రామం నుంచి పింఛను కోసం కాళ్లీడ్చుకుంటూ వచ్చింది. సంబంధిత సిబ్బంది మొండి చె య్యి చూపడంతో ఉసూరుమంటూ వెనుదిరిగింది.
సీతంపేట, న్యూస్‌లైన్: నెలనెలా అందాల్సిన సంక్షేమ పింఛన్లు అందక వాటిపైనే ఆధారపడిన వేలాది మంది లబ్ధిదారులు రోడ్డున పడ్డారు. గత నెలలో నిలిచిపోయిన వీరి పింఛన్లు ఈ నెల కూడా పునరుద్ధరణకు నోచుకోలేదు. దీనివల్ల సుమారు 2,232 మంది ఇబ్బంది పడుతున్నట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఈ సంఖ్య ఇంకా ఎక్కువేనని బాధితులు చెబుతున్నారు. వీరిలో వృద్ధులు, వికలాంగులూ ఉన్నా అధికారులు ఏమాత్రం కనికరం చూపడంలేదు. సమస్య సత్వర పరిష్కారానికి చొరవ చూపడం లేదు. పోనీ వారు చెబుతున్న సమస్య ఏమైనా నెలల తరబడి పరిష్కరించలేనిదా.. అంటే అదీ కాదు. ఇంతకీ ఆ సమస్య ఏమిటయ్యా.. అంటే..సీతంపేట ఏజెన్సీలో వితంతు, వికలాంగ, వృద్దాప్య పించన్‌ల మొత్తం లబ్దిదారులు 5,248 మంది ఉన్నారు. వీరిలో 2,232 మందికి గత నెలరోజులుగా పించన్‌లు అందడం లేదని అధికారులు అంచనా అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది.
వేలి ముద్రల్లో వ్యత్యాసం ఉందట!
సీతంపేట ఏజెన్సీలో 5,248 మంది వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్లు పొందుతున్నారు. వీరంతా నిరక్షర్యాస్యులు కావడంతో వేలిముద్రలు వేసి ప్రతి నెలా పింఛను సొమ్ము తీసుకుంటున్నారు. అదేవిధంగా గత నెలలోనూ వచ్చి వేలిముద్రలు వేశారు. అయితే పంఛను మంజూరు చేసినప్పుడు తీసుకున్న వేలి ముద్రలకు, ఇప్పటి వేలి ముద్రలకు తేడా ఉందంటూ పింఛను డబ్బులు ఇచ్చేందుకు స్మార్ట్ కార్డుల కోఆర్డినేటర్లు తిరస్కరించారు. అప్పటి నుంచి లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి. వేలు అరిగిపోయి ముద్ర సరిగ్గా పడకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని సిబ్బంది చెబుతున్నారు. సాంకేతిక సమస్య తలెత్తినందున తామేమీ చేయలేమని సంబంధిత అధికారులు చేతులెత్తేస్తున్నారు. నెలరోజులకుపైగా గడిచిపోయినా అరిగిపోయిన రికార్డులా అదే కారణం చెబుతున్నారు తప్ప.. దాని ప్రత్యామ్నాయం ఏమిటన్నది ఆలోచించడం లేదు.
మరోవైపు తాము ప్రతి రోజు పింఛను కోసం వచ్చి ఉత్తి చేతులతో వెళుతున్నామని సుంబురునాయుడుగూడ, జగతపల్లి, మొగదారగూడ, జమ్మడుగూడలకు చెందిన గిరిజనులు ఆవేదనతో చెప్పారు. బుధవారం కూడా అదే ఆశతో మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన వీరికి నిరాశే ఎదురైంది. పింఛను రాళ్లతోనే బతుకులీడుస్తున్న తమ గతేంటని పెద్దూరుకు చెందిన గలయ్య, జజ్జు, జగ్గమ్మ, మొగదారగూడకు చెందిన లక్కమ్మ, సోమమ్మ దీనంగా ప్రశ్నించారు. వీరి పరిస్థితిని గమనించిన ‘న్యూస్‌లైన్’ ఎంపీడీవో గార రవణమ్మ వివరణ కోరగా సంబంధిత జిల్లాస్థాయి సిబ్బందిని రప్పించామని, పింఛన్లు ఇప్పించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
Advertisement