welfare pensions
-
పింఛన్ పరీక్ష
ఉదయగిరి: చంద్రబాబు ప్రభుత్వం అన్నిస్థాయి అన్నివర్గాల ప్రజలకు రకరకాల పరీక్షలు పెడుతూ లబ్ధిదారుల సహనంతో ఆట్లాడుకుంటోంది. రుణమాఫీతో రైతులు విసుగెత్తిపోగా, సామాజిక పింఛన్లలో వేలిముద్రల ప్రక్రియతో వృద్ధులకు బయోమెట్రిక్ పరీక్ష పెట్టింది. ఈ నూతన విధానంలో క్షేత్రస్థాయిలోవున్న ఇబ్బందులను గమనించకుండానే ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు లబ్ధిదారుల పాలిట శాపంగా మారాయి. సీఎస్పీల ద్వారా అందజేస్తున్న సామాజిక పింఛన్ల పంపిణీలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న కారణంతో టీడీపీ ప్రభుత్వం పోస్టాఫీసు ద్వారా పింఛన్ల ప్రక్రియను చేపట్టాలని సంకల్పించింది. ఈ నేపథ్యంలో డిసెంబరు, జనవరి మాసాలకు సంబంధించి కార్యదర్శుల ద్వారా పింఛన్లు లబ్ధిదారులకు అందజేశారు. ఫిబ్రవరి నుంచి పోస్టాఫీసుల ద్వారా అందించాలని నెల్లూరు జిల్లా అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నెలరోజులనుంచి సామాజిక పింఛన్‌దారుల వేలిముద్రలను సేకరించే ప్రయత్నంలో పోస్టల్ సిబ్బంది నిమగ్నమైంది. ఈ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో తలెత్తిన పింఛన్ పరీక్ష ఇబ్బందులతో ఇంతవరకు జిల్లావ్యాప్తంగా అరవైశాతం కూడా వేలిముద్రల సేకరణ పూర్తికాలేదు. ఫిబ్రవరిలో పింఛన్లు పంపి ణీ చేసేందుకు గడువు ఇంకా వారంరోజులు కూడా లేదు. ఈనేపథ్యంలో పూర్తిస్థాయిలో వేలిముద్రల సేకరణ జరిగే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో ఫిబ్రవరిలో లబ్ధిదారులకు పూర్తిగా సామాజిక పింఛన్లు అందే అవకాశాలు కనిపించడం లేదు. వేలిముద్రల సేకరణలో సిబ్బంది నెల్లూరు జిల్లావ్యాప్తంగా 2.50 లక్షలమందికి పింఛన్లు అందిస్తున్నారు. వీరిలో వితంతువు, వృద్ధులకు రూ.1000 చొప్పున, 80 శాతం అంగవైకల్యం పైబడిన వికలాంగులకు రూ.1500 చొప్పున అందిస్తున్నారు. అదేవిధంగా కల్లుగీత కార్మికులు, అభయహస్తం లబ్ధిదారులకు కూడా పింఛన్లు అందజేస్తున్నారు. వీరందరికీ ఫిబ్రవరి మాసంలో పోస్టాఫీసుల ద్వారా పింఛన్లు అందజేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ మేరకు పోస్టల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చి బయోమెట్రిక్ యంత్రాలలో లబ్ధిదారుల నుంచి వేలిముద్రల సేకరణ చేపట్టాలని ఆదేశించింది. పనిచేయని సిగ్నల్స్ 700 మందికి ఒక బయోమెట్రిక్ యంత్రం ఇచ్చి అందులో సామాజిక పింఛన్‌దారుల వేలిముద్రలను సేకరించే వెసులుబాటు కల్పించారు. దీనికి ఆధార్ అనుసంధానం చేస్తారు. దీనికోసం ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్లకు చెందిన సిమ్‌లు అందజేశారు. మారుమూల గ్రామాల్లో సిగ్నల్స్ సక్రమంగా లేనందున వేలిముద్రల సేకరణ పోస్టల్ సిబ్బందికి కత్తిమీద సాములా మారింది. సాధారణంగా రోజుకు యాభై మంది వేలిముద్రలు సేకరించే అవకాశం ఉన్నప్పటికీ, సిగ్నల్స్ లేనందున పట్టుమని పదిమందికి కూడా ఈప్రక్రియ పూర్తిచేయలేకపోతున్నారు. దీంతో లబ్ధిదారులు విసిగివేసారిపోతున్నారు. వృద్ధులకు నమోదుకాని ముద్రలు నెల్లూరు జిల్లాలో 66 ఏళ్లు పైబడిన 1.25 లక్షల మందికి సామాజిక పింఛన్లు అందజేస్తున్నారు. వయస్సు పైబడటంతో వేళ్లు అరిగిపోయి బయోమెట్రిక్ యంత్రాలలో ఫింగర్ ప్రింట్స్ పడటం లేదు. దీంతో ఆ యంత్రంలో వీరిని రిజెక్ట్ చేస్తున్నట్లుగా స్లిప్ వస్తోంది. మరి వీరికి ఫిబ్రవరిలో పింఛన్లు వస్తాయో రావోనన్న భయాందోళన వెంటాడుతోంది. 60 శాతం కూడా పూర్తికాని నమోదు వేలిముద్రలు ఇచ్చేందుకు వచ్చిన వారిలో వందకు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు ఫింగర్ ప్రింట్స్ పడటం లేదు. దీంతో లబ్ధిదారులందరికీ పింఛను అందే అవకాశం లేదు. ప్రభుత్వం రోజుకో విధంగా తీసుకున్న అనాలోచిత నిర్ణయా లు సామాజిక పింఛన్ల లబ్ధిదారులపాలిట శాపంగా మారింది. అయినా ఇంతవరకు పింఛన్‌దారులకు సరళమైన విధానంలో పింఛన్లు అందించే విధానంపై మాత్రం దృష్టిపెట్టడం లేదు. లోపాలను అధిగమిస్తాం: డీఆర్డీఏ పీడీ చంద్రమౌళి ఫిబ్రవరి నుంచి పింఛన్లను పోస్టాఫీసుల ద్వారా అందజేస్తాం. ఇప్పటికే పోస్టల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. లబ్ధిదారుల వేలిముద్రలను సేకరిస్తున్నారు. 31 తారీఖులోగా పూర్తిచేస్తాం. ఎక్కడైన వేలిముద్రలు పడనివారు ఉంటే, వారి సంబంధించి న డేటా సేకరించి ప్రభుత్వానికి అందజేస్తాం. సర్కారు నిర్ణయం ప్రకారం నడుచుకుంటాం. -
'సదరం' వద్ద తోపులాట, స్పృహ తప్పిన మహిళలు
నిజామాబాద్ : సామాజిక పింఛన్ల కోసం ప్రభుత్వం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ సామాన్యులకు ప్రాణాంతకంగా మారింది. వికలాంగ పింఛన్లు కోరుకునే వారికి సదరం సర్టిఫికెట్లు తప్పని సరిగా ఉండాలనే నిబంధనతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి వద్ద శుక్రవారం సదరం శిబిరం వద్ద తోపులాట జరిగింది. ధ్రువ పత్రాల కోసం వేలాదిమంది వికలాంగులు, వృద్ధులు సదరం కేంద్రాల వద్దకు తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మహిళలు స్పృహ తప్పిపడిపోయారు. దాంతో వారికి చికిత్స అందిస్తున్నారు. వృద్ధులు, వితంతువులకు ప్రతినెలా వేయిరూపాయలు, వికలాంగులకు రూ.1500 చొప్పున పింఛన్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. నిబంధనల మేరకు 40శాతం వైకల్యమున్న వారికే వికలాంగ పింఛన్ మంజూరవుతుంది. దాంతో గతంలో సదరం పరీక్షలో 40 శాతం పొందలేక పోయిన వారు మరోమారు ధ్రువీకరణ పత్రాల కోసం వస్తుండటంతో గందరగోళం నెలకొంటోంది. -
‘అరిగి’పోయిన రికార్డు
ఈమె పేరు సవర చంద్రమ్మ. 70 ఏళ్ల పండుటాకు. నా అన్న వారెవరూ లేరు. సర్కారు వారు ఇచ్చే రూ.200తోనే బతుకు బండిని ఈడ్చుకొస్తోంది. జగతపల్లి స్వగ్రామం. సీతంపేటకు ఐదు కి.మీ. దూరంలో కొండలపై ఉన్న గ్రామం నుంచి పింఛను కోసం కాళ్లీడ్చుకుంటూ వచ్చింది. సంబంధిత సిబ్బంది మొండి చె య్యి చూపడంతో ఉసూరుమంటూ వెనుదిరిగింది. సీతంపేట, న్యూస్‌లైన్: నెలనెలా అందాల్సిన సంక్షేమ పింఛన్లు అందక వాటిపైనే ఆధారపడిన వేలాది మంది లబ్ధిదారులు రోడ్డున పడ్డారు. గత నెలలో నిలిచిపోయిన వీరి పింఛన్లు ఈ నెల కూడా పునరుద్ధరణకు నోచుకోలేదు. దీనివల్ల సుమారు 2,232 మంది ఇబ్బంది పడుతున్నట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఈ సంఖ్య ఇంకా ఎక్కువేనని బాధితులు చెబుతున్నారు. వీరిలో వృద్ధులు, వికలాంగులూ ఉన్నా అధికారులు ఏమాత్రం కనికరం చూపడంలేదు. సమస్య సత్వర పరిష్కారానికి చొరవ చూపడం లేదు. పోనీ వారు చెబుతున్న సమస్య ఏమైనా నెలల తరబడి పరిష్కరించలేనిదా.. అంటే అదీ కాదు. ఇంతకీ ఆ సమస్య ఏమిటయ్యా.. అంటే..సీతంపేట ఏజెన్సీలో వితంతు, వికలాంగ, వృద్దాప్య పించన్ల మొత్తం లబ్దిదారులు 5,248 మంది ఉన్నారు. వీరిలో 2,232 మందికి గత నెలరోజులుగా పించన్లు అందడం లేదని అధికారులు అంచనా అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది. వేలి ముద్రల్లో వ్యత్యాసం ఉందట! సీతంపేట ఏజెన్సీలో 5,248 మంది వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్లు పొందుతున్నారు. వీరంతా నిరక్షర్యాస్యులు కావడంతో వేలిముద్రలు వేసి ప్రతి నెలా పింఛను సొమ్ము తీసుకుంటున్నారు. అదేవిధంగా గత నెలలోనూ వచ్చి వేలిముద్రలు వేశారు. అయితే పంఛను మంజూరు చేసినప్పుడు తీసుకున్న వేలి ముద్రలకు, ఇప్పటి వేలి ముద్రలకు తేడా ఉందంటూ పింఛను డబ్బులు ఇచ్చేందుకు స్మార్ట్ కార్డుల కోఆర్డినేటర్లు తిరస్కరించారు. అప్పటి నుంచి లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి. వేలు అరిగిపోయి ముద్ర సరిగ్గా పడకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని సిబ్బంది చెబుతున్నారు. సాంకేతిక సమస్య తలెత్తినందున తామేమీ చేయలేమని సంబంధిత అధికారులు చేతులెత్తేస్తున్నారు. నెలరోజులకుపైగా గడిచిపోయినా అరిగిపోయిన రికార్డులా అదే కారణం చెబుతున్నారు తప్ప.. దాని ప్రత్యామ్నాయం ఏమిటన్నది ఆలోచించడం లేదు. మరోవైపు తాము ప్రతి రోజు పింఛను కోసం వచ్చి ఉత్తి చేతులతో వెళుతున్నామని సుంబురునాయుడుగూడ, జగతపల్లి, మొగదారగూడ, జమ్మడుగూడలకు చెందిన గిరిజనులు ఆవేదనతో చెప్పారు. బుధవారం కూడా అదే ఆశతో మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన వీరికి నిరాశే ఎదురైంది. పింఛను రాళ్లతోనే బతుకులీడుస్తున్న తమ గతేంటని పెద్దూరుకు చెందిన గలయ్య, జజ్జు, జగ్గమ్మ, మొగదారగూడకు చెందిన లక్కమ్మ, సోమమ్మ దీనంగా ప్రశ్నించారు. వీరి పరిస్థితిని గమనించిన ‘న్యూస్‌లైన్’ ఎంపీడీవో గార రవణమ్మ వివరణ కోరగా సంబంధిత జిల్లాస్థాయి సిబ్బందిని రప్పించామని, పింఛన్లు ఇప్పించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.