ఉదయగిరి: చంద్రబాబు ప్రభుత్వం అన్నిస్థాయి అన్నివర్గాల ప్రజలకు రకరకాల పరీక్షలు పెడుతూ లబ్ధిదారుల సహనంతో ఆట్లాడుకుంటోంది. రుణమాఫీతో రైతులు విసుగెత్తిపోగా, సామాజిక పింఛన్లలో వేలిముద్రల ప్రక్రియతో వృద్ధులకు బయోమెట్రిక్ పరీక్ష పెట్టింది. ఈ నూతన విధానంలో క్షేత్రస్థాయిలోవున్న ఇబ్బందులను గమనించకుండానే ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు లబ్ధిదారుల పాలిట శాపంగా మారాయి. సీఎస్పీల ద్వారా అందజేస్తున్న సామాజిక పింఛన్ల పంపిణీలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న కారణంతో టీడీపీ ప్రభుత్వం పోస్టాఫీసు ద్వారా పింఛన్ల ప్రక్రియను చేపట్టాలని సంకల్పించింది. ఈ నేపథ్యంలో డిసెంబరు, జనవరి మాసాలకు సంబంధించి కార్యదర్శుల ద్వారా పింఛన్లు లబ్ధిదారులకు అందజేశారు. ఫిబ్రవరి నుంచి పోస్టాఫీసుల ద్వారా అందించాలని నెల్లూరు జిల్లా అధికారులు నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో నెలరోజులనుంచి సామాజిక పింఛన్‌దారుల వేలిముద్రలను సేకరించే ప్రయత్నంలో పోస్టల్ సిబ్బంది నిమగ్నమైంది. ఈ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో తలెత్తిన పింఛన్ పరీక్ష ఇబ్బందులతో ఇంతవరకు జిల్లావ్యాప్తంగా అరవైశాతం కూడా వేలిముద్రల సేకరణ పూర్తికాలేదు. ఫిబ్రవరిలో పింఛన్లు పంపి ణీ చేసేందుకు గడువు ఇంకా వారంరోజులు కూడా లేదు. ఈనేపథ్యంలో పూర్తిస్థాయిలో వేలిముద్రల సేకరణ జరిగే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో ఫిబ్రవరిలో లబ్ధిదారులకు పూర్తిగా సామాజిక పింఛన్లు అందే అవకాశాలు కనిపించడం లేదు.
వేలిముద్రల సేకరణలో సిబ్బంది
నెల్లూరు జిల్లావ్యాప్తంగా 2.50 లక్షలమందికి పింఛన్లు అందిస్తున్నారు. వీరిలో వితంతువు, వృద్ధులకు రూ.1000 చొప్పున, 80 శాతం అంగవైకల్యం పైబడిన వికలాంగులకు రూ.1500 చొప్పున అందిస్తున్నారు. అదేవిధంగా కల్లుగీత కార్మికులు, అభయహస్తం లబ్ధిదారులకు కూడా పింఛన్లు అందజేస్తున్నారు. వీరందరికీ ఫిబ్రవరి మాసంలో పోస్టాఫీసుల ద్వారా పింఛన్లు అందజేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ మేరకు పోస్టల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చి బయోమెట్రిక్ యంత్రాలలో లబ్ధిదారుల నుంచి వేలిముద్రల సేకరణ చేపట్టాలని ఆదేశించింది.
పనిచేయని సిగ్నల్స్
700 మందికి ఒక బయోమెట్రిక్ యంత్రం ఇచ్చి అందులో సామాజిక పింఛన్‌దారుల వేలిముద్రలను సేకరించే వెసులుబాటు కల్పించారు. దీనికి ఆధార్ అనుసంధానం చేస్తారు. దీనికోసం ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్‌లకు చెందిన సిమ్‌లు అందజేశారు. మారుమూల గ్రామాల్లో సిగ్నల్స్ సక్రమంగా లేనందున వేలిముద్రల సేకరణ పోస్టల్ సిబ్బందికి కత్తిమీద సాములా మారింది. సాధారణంగా రోజుకు యాభై మంది వేలిముద్రలు సేకరించే అవకాశం ఉన్నప్పటికీ, సిగ్నల్స్ లేనందున పట్టుమని పదిమందికి కూడా ఈప్రక్రియ పూర్తిచేయలేకపోతున్నారు. దీంతో లబ్ధిదారులు విసిగివేసారిపోతున్నారు.
వృద్ధులకు నమోదుకాని ముద్రలు
నెల్లూరు జిల్లాలో 66 ఏళ్లు పైబడిన 1.25 లక్షల మందికి సామాజిక పింఛన్లు అందజేస్తున్నారు. వయస్సు పైబడటంతో వేళ్లు అరిగిపోయి బయోమెట్రిక్ యంత్రాలలో ఫింగర్ ప్రింట్స్ పడటం లేదు. దీంతో ఆ యంత్రంలో వీరిని రిజెక్ట్ చేస్తున్నట్లుగా స్లిప్ వస్తోంది. మరి వీరికి ఫిబ్రవరిలో పింఛన్లు వస్తాయో రావోనన్న భయాందోళన వెంటాడుతోంది.
60 శాతం కూడా పూర్తికాని నమోదు
వేలిముద్రలు ఇచ్చేందుకు వచ్చిన వారిలో వందకు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు ఫింగర్ ప్రింట్స్ పడటం లేదు. దీంతో లబ్ధిదారులందరికీ పింఛను అందే అవకాశం లేదు. ప్రభుత్వం రోజుకో విధంగా తీసుకున్న అనాలోచిత నిర్ణయా లు సామాజిక పింఛన్ల లబ్ధిదారులపాలిట శాపంగా మారింది. అయినా ఇంతవరకు పింఛన్‌దారులకు సరళమైన విధానంలో పింఛన్లు అందించే విధానంపై మాత్రం దృష్టిపెట్టడం లేదు.
లోపాలను అధిగమిస్తాం: డీఆర్‌డీఏ పీడీ చంద్రమౌళి
ఫిబ్రవరి నుంచి పింఛన్లను పోస్టాఫీసుల ద్వారా అందజేస్తాం. ఇప్పటికే పోస్టల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. లబ్ధిదారుల వేలిముద్రలను సేకరిస్తున్నారు. 31 తారీఖులోగా పూర్తిచేస్తాం. ఎక్కడైన వేలిముద్రలు పడనివారు ఉంటే, వారి సంబంధించి న డేటా సేకరించి ప్రభుత్వానికి అందజేస్తాం. సర్కారు నిర్ణయం ప్రకారం నడుచుకుంటాం.
పింఛన్ పరీక్ష
Published Fri, Jan 30 2015 9:42 AM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM
Advertisement