అధిక ఉష్ణోగ్రతలతో డయాబెటిస్ బాధితులకు ఇబ్బందులు
శరీరంలో నీటి నిల్వలు తగ్గి గుండె, కిడ్నీల పనితీరుపై తీవ్ర ప్రభావం
జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణుల సూచనలు
సాక్షి, హైదరాబాద్: ఎండలు మండిపోతున్నాయి. 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం ఇంట్లోంచి బయటికి రావడానికి జంకుతున్నారు. ఇళ్లలో ఉన్నా వేడి తీవ్రతను తట్టుకోలేక అల్లాడుతున్నారు. సాధారణ వ్యక్తులకే ఇంత ఇబ్బంది ఉంటే.. మధుమేహ బాధితులకు మరిన్ని సమస్యలకు కారణమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వారికి సాధారణ ఆరోగ్య సమస్యలతోపాటు కిడ్నీ, గుండె సంబంధ వ్యాధుల ఇబ్బంది పెరుగుతుందని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సాధారణంగానే మధుమేహం ఉన్నవారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని.. వారికి వైరల్, ఇతర ఉష్ణమండల వ్యాధులు త్వరగా సంక్రమించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే మధుమేహులు డీహైడ్రేషన్‌కు ఎక్కువగా గురవుతారని అంటున్నారు.
ఎన్నో సమస్యలకు చాన్స్..
∗ వైద్య నిపుణులు చెప్తున్న మేరకు.. సాధారణ వ్యక్తులతో పోలిస్తే మధుమేహ బాధితులకు అధిక ఉష్ణోగ్రతల వల్ల అలసట ఎక్కువగా ఉంటుంది. శరీరంలో నీటి శాతం తగ్గి, మూత్ర విసర్జన తగ్గుతుంది. తల తిరగడం, తలనొప్పి, నోరు, కళ్లు పొడిబారడం వంటివి ఉంటాయి. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఇవన్నీ కిడ్నీలు, గుండె సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది.
∗డయాబెటిస్ బాధితులు కాస్త ఎక్కువగా, కనీసం రోజుకు 4 నుంచి ఐదు లీటర్ల నీటిని తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్, రోడ్లపై దొరికే చల్లటి పానీయాలకు దూరంగా ఉండటం మంచిది.
∗రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండేలా తృణధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. సాధారణ అన్నం, టిఫిన్లు, మైదాతో కూడిన తినుబండారాలను బాగా తగ్గించాలి. ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి.
∗వదులుగా ఉన్న దుస్తులు ధరించాలి. ఎండ వేళల్లో బయటికి వెళ్లొద్దు.
∗ఆల్కాహాలిక్ పానీయాలకు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ వల్ల మూత్ర విసర్జన ఎక్కువవుతుంది. శరీరంలోని నీటి శాతం వేగంగా తగ్గి, డీహైడ్రేషన్‌కు, కిడ్నీల సమస్యకు దారితీస్తుంది.
∗అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో.. చురుకుగా ఉండటానికి తేలికపాటి వ్యాయామాలు తప్పనిసరి. చల్లని ప్రదేశాలలో, ఇంటి లోపల ఈ వ్యాయామాలు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment