పుట్టుకతో తోడై..జీవితం సూదిపోటై! | Type 1 Diabetes In Children Symptoms And Causes | Sakshi
Sakshi News home page

పుట్టుకతో తోడై..జీవితం సూదిపోటై!

Published Sun, Mar 16 2025 11:09 AM | Last Updated on Sun, Mar 16 2025 11:41 AM

Type 1 Diabetes In Children Symptoms And Causes

షుగర్‌ వ్యాధి బారిన పడకుండా ఒక్కొక్కరు ఒక్కో ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తుంటారు. ఒకరు రైస్‌ తినకూడదంటారు.. ఇంకొకరు నడక మంచిదంటారు.. ఒక వయస్సుకు వచ్చిన తర్వాత వ్యాధి బారిన పడటం ఒక ఎత్తయితే, రాకుండా జాగ్రత్త పడటం ఇంకొక ఎత్తు. మరి పుట్టుకతోనే ఈ వ్యాధి తోడుగా వస్తే.. ఆ పిల్లల జీవితం నరకప్రాయం. ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ తీసుకుంటే తప్ప బతకలేని పరిస్థితి. తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి? వీళ్లు చేసిన పాపం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం..

ర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీకి చెందిన యువకునికి పుట్టుకతోనే షుగర్‌ వ్యాధి వచ్చింది. వైద్యులు పరిశీలించి టైప్‌–1 డయాబెటిస్‌గా నిర్ధారించారు. అప్పటి నుంచి ఇన్సులిన్‌ను ఇంజెక్షన్‌ రూపంలో అందిస్తున్నారు. ప్రస్తుతం ఇతని వయస్సు 30 ఏళ్లు. రోజూ ఇంజెక్షన్‌ వేయించుకోవాలంటే బాధగా ఉంటోందని, కానీ బతకాలంటే తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. స్వీట్లు అంటే ఇష్టమని, కానీ తింటే పరిస్థితి దారుణంగా ఉంటుందని వాపోతున్నాడు. 

పగిడ్యాల మండలంలోని పాత ముచ్చుమర్రి గ్రామానికి చెందిన మల్లయ్య, మానస దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు వెంకట ఉమామహేష్‌ రెండవ కుమారుడు లిఖిత్‌. 9 నెలల వయస్సు కలిగిన లిఖిత్‌కు పుట్టుకతోనే చక్కెర వ్యాధి తోడుగా వచ్చింది. తరచూ అపస్మారక స్థితికి చేరుకోవడం గమనించి కర్నూలు ప్రైవేట్‌ ఆసుపత్రిలో సుమారు రూ.3లక్షలకు పైగా ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. షుగర్‌ లెవెల్స్‌ గుర్తించేందుకు మిషన్‌ తెచ్చుకుని వారానికోసారి ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ వేయించాల్సిన పరిస్థితి. నెలకు సుమారు రూ.5వేల దాకా ఖర్చవుతోందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. 

పేరులో తియ్యదనం దాచుకున్న మహమ్మారి మధుమేహం. ఇది పెద్దలనే కాదు.. చిన్నారులనూ వదలని పరిస్థితి. పుట్టుకతోనే తోడుగా వచ్చి జీవించినంత కాలం వేధిస్తోంది. అందరిలా జీవించాలంటే రోజూ సూదిపోటుతో ఇన్సులిన్‌ మందు వేసుకోవడం తప్పనిసరి. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డలను తల్లిదండ్రులే స్వయంగా ఇంజెక్షన్‌ ద్వారా ఇన్సులిన్‌ ఇవ్వడం వారికీ నరకంతో సమానం. 

ఇలాంటి బాధితుల సంఖ్య సమాజంలో రోజురోజుకూ పెరుగుతోంది. శరీరంలోని క్లోమగ్రంధిలో ఇన్సులిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ గ్రంధిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను(బీటా కణాలు) వ్యక్తుల రోగనిరోధక వ్యవస్థ నాశనం చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీన్ని టైప్‌–1 మధుమేహం(డయాబెటిస్‌) అంటారు. 

సాధారణంగా పిల్లలు, యువకుల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు బీటా కణాలను రోగినిరోధక వ్యవస్థ నిరీ్వర్యం చేయడం కాకుండా క్లోమగ్రంధికి ఏదైనా వ్యాధి సోకినప్పుడు లేదా గాయం అయినప్పుడు బీటా కణాలు నిర్వీర్యం అవుతాయి. దీనిబారిన పడిన వారికి క్రమం తప్పకుండా ఇన్సులిన్‌ను ఇంజెక్షన్‌ చేయాల్సి ఉంటుంది. ఇది కొంత మందికి జన్యుపరంగా కూడా రావచ్చు. మరికొంత మందికి పలు రకాల వైరల్‌ వ్యాధులు, ఇతర ప్రమాదకర అనారోగ్యాల కారణంగా కూడా ఈ పరిస్థితి ఎదురవ్వొచ్చు. అంతేకానీ ఆహారం, జీవనశైలి అలవాట్లు టైప్‌–1 డయాబెటిస్‌కు కారణం కావు. 

ప్రభుత్వాసుపత్రుల్లో అరకొర ఇన్సులిన్‌ 
ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సతో పాటు ఇన్సులిన్‌ను ఉచితంగా అందించాల్సి ఉంది. అయితే గత 10 నెలలుగా వీరికి అరకొరగా ఇన్సులిన్‌ ఇస్తున్నారు. కేవలం కర్నూలు, నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలల్లో మాత్రమే అధికారులు స్థానికంగా కొనుగోలు చేసి ఇన్సులిన్‌ను కొద్దిమొత్తంలో అందజేస్తున్నారు. 

ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో ఇన్సులిన్‌ అందుబాటులో ఉండటం లేదు. దీంతో చాలా మంది మెడికల్‌ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో చిన్నారికి వ్యాధి తీవ్రతను బట్టి నెలకు రెండు నుంచి నాలుగు ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు అవసరం.  

పెరుగుతున్న చికిత్స వ్యయం 
మెడికల్‌షాపుల్లో ఒక్కో ఇన్సులిన్‌ ఖరీదు రూ.180 వరకు ఉంటోంది. ఈ మేరకు ప్రతి చిన్నారికి నెలకు రూ.600 నుంచి రూ.800 వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రైవేటు క్లినిక్‌లు, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యుల వద్ద చికిత్స తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఆధునిక వైద్యవిధానాల మేరకు వారికి నొప్పి తక్కువగా ఉండే ఇన్సులిన్‌ పెన్నుల ద్వారా ఇంజెక్షన్‌ చేస్తున్నారు. వీటి ఖరీదు సాధారణ ఇన్సులిన్‌తో పోలిస్తే రెట్టింపుగా ఉంటుంది. 

లక్షణాలు

  • టైప్‌–1 డయాబెటిస్‌ లక్షణాలు బయటపడటానికి 

  • కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు.  

  • విపరీతమైన దాహం, తిన్న తర్వాత కూడా బాగా ఆకలివేయడం, నోరు తడి ఆరిపోవడం. 

  • కడుపునొప్పి, వాంతులు, ఎక్కువసార్లు

  • మూత్రవిసర్జనకు వెళ్లడం. 

  • ఊహించని విధంగా బరువు తగ్గిపోవడం, అలసట, 

  • కంటిచూపు తగ్గిపోవడం. 

  • శ్వాస తీసుకోవడానికి ఎక్కువ కష్టపడటం, తరచుగా చర్మ, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు. 

  • మూడ్‌ మారిపోవడం, నిద్రలో మూత్రవిసర్జన చేయడం. 

  • ఉమ్మడి కర్నూలు జిల్లాలో 50లక్షల వరకు జనాభా ఉంటుంది. ఇందులో 15 నుంచి 20 శాతం వరకు మధుమేహ బాధితులు. వీరిలో టైప్‌–2 మధుమేహ బాధితులు 90 శాతం కాగా.. టైప్‌–1 బాధితులు 10 శాతం పైనే. ఈ లెక్కన 7.50లక్షల నుంచి 10లక్షల వరకు మధుమేహ బాధితులు ఉండగా.. 75వేల నుంచి లక్ష దాకా చిన్నారులు ఉంటున్నారు.

కోవిడ్‌ తర్వాత పెరిగిన కేసులు 
కోవిడ్‌–19 అనంతరం టైప్‌–1 డయాబెటిస్‌ రోగుల సంఖ్య పెరిగింది. గతంలో డయాబెటిస్‌ రోగులు 5 శాతం ఉండగా ఇప్పుడు 10శాతానికి చేరుకుంది. కోవిడ్‌ వైరస్‌ నేరుగా బీటా కణాలపై దాడి చేయడమే ఇందుకు కారణం. ఈ కారణంగా కోవిడ్‌కు గురైన వారికి జని్మంచే పిల్లల్లో టైప్‌–1 డయాబెటీస్‌ ఎక్కువగా కనిపిస్తోంది. 
– డాక్టర్‌ పి.శ్రీనివాసులు, ఎండోక్రైనాలజీ హెచ్‌వోడి, జీజీహెచ్, కర్నూలు 

ఇన్సులిన్‌తో మాత్రమే చికిత్స 
చిన్నపిల్లల్లో వచ్చే టైప్‌–1 డయాబెటిస్‌కు ఇన్సులిన్‌తో మాత్రమే చికిత్స అందుబాటులో ఉంది. ఆయాసం, కడుపునొప్పి, వాంతులు లక్షణాలతో చిన్నపిల్లలను ఆసుపత్రికి తీసుకొస్తారు. అన్నిరకాల పరీక్షలు నిర్వహించి డయాబెటిస్‌ నిర్ధారణ అయ్యాక చికిత్స ప్రారంభిస్తాం. ఈ పిల్లలకు ఇన్సులిన్‌తో పాటు ఆహార నియమావళి తప్పనిసరి. 
– డాక్టర్‌ ఎం.మల్లికార్జున, అసోసియేట్‌ ప్రొఫెసర్, పీడియాట్రిక్స్, జీజీహెచ్, కర్నూలు 

(చదవండి: మొటిమలను నివారిద్దాం..పెదవులను మృదువుగా చేసేద్దాం ఇలా..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement