difficulties
-
యాదాద్రి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు
-
మండే ఎండలు X మధుమేహం!
సాక్షి, హైదరాబాద్: ఎండలు మండిపోతున్నాయి. 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం ఇంట్లోంచి బయటికి రావడానికి జంకుతున్నారు. ఇళ్లలో ఉన్నా వేడి తీవ్రతను తట్టుకోలేక అల్లాడుతున్నారు. సాధారణ వ్యక్తులకే ఇంత ఇబ్బంది ఉంటే.. మధుమేహ బాధితులకు మరిన్ని సమస్యలకు కారణమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.వారికి సాధారణ ఆరోగ్య సమస్యలతోపాటు కిడ్నీ, గుండె సంబంధ వ్యాధుల ఇబ్బంది పెరుగుతుందని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సాధారణంగానే మధుమేహం ఉన్నవారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని.. వారికి వైరల్, ఇతర ఉష్ణమండల వ్యాధులు త్వరగా సంక్రమించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే మధుమేహులు డీహైడ్రేషన్‌కు ఎక్కువగా గురవుతారని అంటున్నారు. ఎన్నో సమస్యలకు చాన్స్.. ∗ వైద్య నిపుణులు చెప్తున్న మేరకు.. సాధారణ వ్యక్తులతో పోలిస్తే మధుమేహ బాధితులకు అధిక ఉష్ణోగ్రతల వల్ల అలసట ఎక్కువగా ఉంటుంది. శరీరంలో నీటి శాతం తగ్గి, మూత్ర విసర్జన తగ్గుతుంది. తల తిరగడం, తలనొప్పి, నోరు, కళ్లు పొడిబారడం వంటివి ఉంటాయి. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఇవన్నీ కిడ్నీలు, గుండె సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. ∗డయాబెటిస్ బాధితులు కాస్త ఎక్కువగా, కనీసం రోజుకు 4 నుంచి ఐదు లీటర్ల నీటిని తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్, రోడ్లపై దొరికే చల్లటి పానీయాలకు దూరంగా ఉండటం మంచిది. ∗రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండేలా తృణధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. సాధారణ అన్నం, టిఫిన్లు, మైదాతో కూడిన తినుబండారాలను బాగా తగ్గించాలి. ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి. ∗వదులుగా ఉన్న దుస్తులు ధరించాలి. ఎండ వేళల్లో బయటికి వెళ్లొద్దు. ∗ఆల్కాహాలిక్ పానీయాలకు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ వల్ల మూత్ర విసర్జన ఎక్కువవుతుంది. శరీరంలోని నీటి శాతం వేగంగా తగ్గి, డీహైడ్రేషన్‌కు, కిడ్నీల సమస్యకు దారితీస్తుంది. ∗అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో.. చురుకుగా ఉండటానికి తేలికపాటి వ్యాయామాలు తప్పనిసరి. చల్లని ప్రదేశాలలో, ఇంటి లోపల ఈ వ్యాయామాలు చేయాలి. -
జనగామ ఎవరికీ?.. పొన్నాలను వెంటాడుతున్నదేంటి?
ఆయన ఒకప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో చక్రం తిప్పారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. పీసీసీ చీఫ్‌గానూ పనిచేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆ నేతకు వచ్చే ఎన్నికల్లో సీటు బాధ మొదలైంది. తన ప్రత్యర్థి సీటు తన్నుకుపోతాడనే భయం మొదలైంది. తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ కష్టాలు మొదలయ్యాయి. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని ఏఐసిసి ఇటీవలే నియమించింది. దాంతో జనగామ అసెంబ్లీ టికెట్ కూడా ఆయనే ఎగరేసుకుపోతారేమోననే అనుమానం పొన్నాలను వెంటాడుతోంది. గత ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో రాహుల్ గాంధీ అండతో టిక్కెట్ దక్కించుకున్న పొన్నాల లక్ష్మయ్య ఈసారి మాత్రం ముందుగానే అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో ఏఐసిసి పెద్దలను కలుసుకుంటూ తన గోడు వెళ్లబోసుకుంటున్నారు. మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన తనకే తెలియకుండా తన జిల్లా అయిన జనగామ డీసీసీ అధ్యక్షుడిగా తన వ్యతిరేకవర్గ నాయకుడిని నియమించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా కొమ్మూరి నియామకాన్ని రద్దు చేయించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి రికమండేషన్‌తో జనగామ డీసీసీ అధ్యక్ష పదవిని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి దక్కించుకున్నారు. తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతాప్‌రెడ్డికి ఏకంగా పీసీసీ చీఫ్‌తో పాటు కోమటిరెడ్డి మద్దతు ఇస్తుండడంతో పొన్నాల ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. 2014, 2018 ఎన్నికలలో పొన్నాల ఓటమి పాలు కావడం, వయసు 79 సంవత్సరాల వయస్సుతో వయో భారం పెరగడం ఆయనకు ప్రతికూల అంశాలుగా మారాయి. చదవండి: తెలంగాణలో కమ్మలకు, వెలమలకు చెడిందా? అయితే 2014 ఎన్నికల్లో 52వేల ఓట్లు, 2018 ఎన్నికల్లో 62 వేల ఓట్లు పొన్నాల తెచ్చుకోగలిగారు. అదే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి 2014లో బీజేపీ తరపున బరిలో దిగి దాదాపు 21 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఏజ్ ఫ్యాక్టర్‌తో పాటు పీసీసీ చీఫ్ ఆశీస్సులు కొమ్మూరికి కలిసి వస్తుండగా.. పొన్నాల మాత్రం అధిష్టానంపైనే భారం వేశారు. కొమ్మూరి ప్రతాపరెడ్డి నియామకం రద్దు చేయించడానినికి పట్టువదలని విక్రమార్కుడిలా పొన్నాల తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరి ఈ వృద్ధ నేత ప్రయత్నం ఫలిస్తుందా ? డీసీసీ పదవి రద్దు సంగతేమో గానీ, కనీసం జనగామ టికెట్ అయినా దక్కించుకుంటారా ? అంటూ జనగామ కాంగ్రెస్‌లో చర్చ నడుస్తోంది. -
తెలంగాణ మొత్తం తిరగాల్సిందే..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఏళ్ల తరబడి ఎదురు చూపుల తరువాత విడుదలైన నోటిఫికేషన్ల ప్రకా రం ఉద్యోగాలు సాధించేందుకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు ఆయా పోటీ పరీక్షలు రాసేందుకు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 1 నుంచి 23వ తేదీ వరకు ‘తెలంగాణ రెసి డెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు’ఆధ్వర్యంలో గురుకులాల్లో డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ, పీఎల్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్, ఫిజికల్ డైరెక్టర్.. తదితర 9 రకాల ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి హాల్‌టికెట్లను ఆన్లైన్లో పెట్టారు. అయితే ఇప్పటికీ పలువురు అభ్యర్థులకు కొన్ని పరీక్షల హాల్‌టికెట్లను వెబ్సైట్లో చూపించడం లేదు. కొన్ని డౌన్లోడ్ కావటం లేదు. కొందరికి మాత్రం కొన్ని పరీక్షల హాల్‌టికెట్లు డౌన్లోడ్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. హాల్‌టికెట్లు చూసి పలువురు అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. జేఎల్, డీఎల్, టీజీటీ, పీజీటీ, పీఎల్ పరీక్షలకు పేపర్–1 (జనరల్ స్టడీస్), పేపర్–2 (మెథడాలజీ), పేపర్–3 (సబ్జెక్టు) ఉన్నాయి. పరీక్షలు రాసే విషయంలో అభ్యర్థులకు కేటాయించిన కేంద్రాలు చూస్తే కళ్లు తిరిగే పరిస్థితి ఉందని అంటున్నారు. మూడు పేపర్లకు మూడు జిల్లాలు.. మంచిర్యాలకు చెందిన నికిత అనే అభ్యర్థి టీజీటీకి దరఖాస్తు చేయగా, ఆమెకు పేపర్–1 హైదరాబాద్‌లో, పేపర్–2 మంచిర్యాలలో, పేపర్–3కి వరంగల్‌లో సెంటర్లు ఇచ్చారు. అలాగే నిజామాబాద్‌కు చెందిన రమాదేవి నిజామాబాద్‌లో పరీక్ష కేంద్రం ఆప్షన్ ఇవ్వగా, ఆమెకు పేపర్–1 రంగారెడ్డి జిల్లా, పేపర్–2 మేడ్చల్, పేపర్–3కి కరీంనగర్ జిల్లాలో సెంటర్లు ఇచ్చారు. ఖమ్మంకు చెందిన బిందుకు పేపర్–1 ఖమ్మంలో, పేపర్–2 కొత్తగూడెంలో, పేపర్–3కి సత్తుపల్లిలో సెంటర్లు ఇచ్చారు. ఈ పరీక్షలను ఆగస్టు 4, 14, 22 తేదీల్లో రాయాల్సి ఉంది. ఇక్కడే మరో పెద్ద సమస్య వచ్చిపడింది. వీళ్లు టీజీటీతోపాటు పీజీటీ, డిగ్రీ లెక్చరర్, జేఎల్ పరీక్షలకు కూడా దరఖాస్తు చేశారు. ఈ పరీక్షల కేంద్రాలు ఏయే జిల్లాల్లో కేటాయిస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో సగం జిల్లాల్లో తిరగాల్సిన పరిస్థితి.. మొత్తం 9 విభాగాల పరీక్షల్లో కీలకమైన పీజీటీ, టీజీటీ, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పరీక్షలకు మూడు చొప్పున పేపర్లకు పరీక్ష రాయాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలు ఒక క్రమ పద్ధతి ప్రకారం నిర్వహించడం లేదని విమర్శలు వస్తున్నాయి. టీజీటీ పరీక్షలు ఆగస్టు 4, 14, 22 తేదీల్లో ఉన్నాయి. కాగా, ఈ పరీక్షలు రాసే అభ్యర్థులు.. ఆగస్టు 9, 10, 16, 19, 21 తేదీల్లో పీజీటీ, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పరీక్షలు రాయాల్సి ఉంది. వీరికి టీజీటీ తరహాలోనే వివిధ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయిస్తే ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు వందల కిలోమీటర్ల మేర ఆగస్టు నెలంతా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని అంటున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు ఉన్న మహిళా అభ్యర్థులు నరకయాతన పడాల్సిన పరిస్థితులు కల్పించారని మండిపడుతున్నారు. ఒక అభ్యర్థి ఇలా పోటీ పరీక్షలు రాసేందుకు వివిధ జిల్లాలు తిరగాలంటే రూ. వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్న ఎన్ఆర్ఐ
ఆ నియోజకవర్గంలో చంద్రబాబుకు ఇష్టుడైన లాబీయిస్ట్కే చుక్కలు చూపిస్తున్నాడట ఓ ఎన్ఆర్ఐ. చంద్రబాబు తరపున ఢిల్లీలో లాబీయింగ్ చేసే ఆ మాజీ ఎమ్మెల్యేకే ఇప్పుడు టిక్కెట్ కష్టాలు ఎదురవుతున్నాయట. కొత్త నేతల తాకిడితో ఉక్కిరి బిక్కిరవుతున్న ఆ నేత ఎవరో చూద్దాం. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. ఏమి జరుగుతుందో ఊహించడం కష్టమే. కొత్తగా వచ్చే జూనియర్ నేతల వ్యూహాలతో తలపండిపోయిన నాయకులు కూడా ఉక్కిరిబిక్కిరవుతుంటారు. బొల్లినేని రామారావు నెల్లూరు జిల్లా ఉదయగిరికి ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాని ఢిల్లీలో చంద్రబాబు తరపున లాబీయింగ్ చేసే వ్యక్తిగానే నియోజకవర్గంలో చెప్పుకుంటారు. చంద్రబాబు దగ్గర చాలా పలుకుబడి ఉందని చెప్పుకునే బొల్లినేని రామారావును కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఓ ఎన్ఆర్ఐ తన తెలివితేటలతో చిత్తు చేస్తున్నారట. దీంతో బొల్లినేని రామారావు వేసవి ఎండలకు మించి పొగలు..సెగలు కక్కుతున్నారట. ఆయన బాధ చూసి అనుచరులు కూడా ఆందోళన చెందుతున్నారట. ఎన్నికలకు ఏడాది గడువుండగానే ఉదయగిరి టిక్కెట్ కోసం తెలుగుదేశంలో సిగపట్లు మొదలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే బొల్లినేనికి సొంత గ్రామం నుంచే చిక్కులు ఎదురవుతున్నాయి. బాగా డబ్బు సంపాదించుకువచ్చిన ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ దెబ్బకు బొల్లినేని దిక్కుతోచని స్థితిలో పడ్డట్లు టాక్. బొల్లినేని రామారావుకి పార్టీ క్యాడర్లో పరపతి తగ్గిపోయింది. ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి జనాల్లో తిరగక పోవడంతో క్యాడర్‌కు దిక్కు లేకుండా పోయింది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కాకర్ల సురేష్ మూడు నెలలు నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చదవండి: అక్కడ చంద్రబాబే నిప్పు రాజేస్తున్నారా..? బొల్లినేని వర్గంతో సంబంధం లేకుండా ఆయన స్వంతంగా కార్యక్రమాలు చేస్తున్నారట. పార్టీలో సరైన నాయకుడు లేకపోవడంతో..బొల్లినేని యాంటీ వర్గం కాకర్లకు సహాయ సహకారాలు అందిస్తోందని.. ఇప్పటివరకు జనానికి దూరంగా ఉన్న బొల్లినేనికి కాకర్ల సురేష్ కార్యక్రమాలతో చెమటలు పడుతున్నాయనీ ఉదయగిరిలో టాక్ వినిపిస్తుంది.. ఎన్ఆర్ఐ కావడం.. కొద్దో గొప్పో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటంతో టీడీపీ నాయకత్వం కూడా సురేష్‌కే మొగ్గు చూపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ గమనించిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావ్.. పార్టీలో పూర్వ వైభవం కోసం అగచాట్లు పడుతున్నారట. మొన్నటికి మొన్న వింజమూరులో కాకర్ల సురేష్ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చెయ్యాలని ప్రయత్నాలు ప్రారంభించగా.. అతని కంటే ముందే బొల్లినేని ఆ ప్లాన్‌ను అమలు చేసి తన ఖాతాలో వేసుకున్నారు. మొత్తానికి లాబీయుస్టాగా ముద్రపడ్డ బొల్లినేనికి ఉదయగిరిలో ఓ జూనియర్ ఎన్ఆర్ఐ టిక్కెట్ విషయంలో గట్టి పోటీ ఇస్తున్నారు. చదవండి: పవన్ అంటే ఆటలో అరటి పండే..! -
‘బాధ్యత తెలియదని అలా మాట్లాడాను.. ఇలా చేస్తారని ఊహించలేదు’
తిరువళ్లూరు(తమిళనాడు): పనికి వెళ్లడం లేదని బంధువుల ముందు మామ మందలించడం.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో అవమాన భారంగా భావించిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. కాంచీపురం జిల్లా వాలాజాబాద్ సమీపంలోని అయ్యంపేటకు చెందిన కలైఅరసన్ (37) క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ తిరుమేణి పంచాయతీ వసినంపట్టు గ్రామానికి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి కుమార్తె నిత్య(30)తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు హేమనాథ్ (06) ఉన్నాడు. క్యాటరింగ్ పనుల ద్వారా కలైఅరసన్‌కు సరైన ఆదాయం రాకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో భార్య కుమారుడితో కలిసి మూడు నెలల క్రితం అత్తారింటికి వచ్చాడు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్నాడు. రెండు రోజుల క్రితం నిత్య తండ్రి లోకనాథన్ తన బంధువుల ముందు అల్లుడిని పనులకు వెళ్లాలని మందలించాడు. అప్పటి నుంచి కలైఅరసన్ మనస్తాపంతో ఉన్నాడు. దీనికి తోడు అప్పులు చెల్లించాలని ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పురుగుల మందును మొదట కుమారుడికి ఇచ్చారు. అనంతరం నిత్య, కలైఅరసన్ సైతం పురుగుల మందును తాగి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించి మప్పేడు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ శక్తివేల్ మృతదేహాలను తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఖాళీగా ఉంటే బాధ్యత తెలియదని అలా మాట్లాడానని.. ఇంత పనిచేస్తారని ఊహించలేదని మామ, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: ‘నా లక్ష్మిని లోకంలో లేకుండా చేశాను’.. వీడియో రికార్డు చేసి.. చివరికి బిగ్ ట్విస్ట్ -
మంచి మాట: ఉన్నంతవరకూ ఉన్నతంగానే...
కష్టానికి కష్టం వస్తేనూ, నష్టం నష్టపోతేనూ బావుణ్ణు; మనిషి కష్టం లేకుండానూ, నష్టపోకుండానూ బావుంటాడు’ ఇలా అనుకోవడం బావుంటుంది. కానీ వాస్తవంలో ప్రతిమనిషికీ జీవితంలో, జీవనంలో కష్టాలు, నష్టాలు కలుగుతూనే ఉన్నాయి, కలుగుతూనే ఉంటాయి. మనిషినే కాదు ప్రపంచాన్ని కూడా కష్టాలు, నష్టాలు కుదిపేస్తూనే ఉన్నాయి, కుదిపేస్తూనే ఉంటాయి. జీవనంలో కలుగుతూ ఉండే కష్టాలు, నష్టాలవల్ల నిస్తేజమూ, కలవరమూ, గందరగోళమూ ఎవరికైనా తప్పవు. జీవితం అన్నాక కష్టం, నష్టం ఒకటి తరువాత ఒకటిగా, ఒకదానిపై ఒకటిగా వస్తూనే ఉంటాయి. వచ్చిన కష్టం ఏదైనప్పటికీ, కలిగిన నష్టం ఎంతదైనప్పటికీ మనిషి వాటిని తట్టుకోగలగాలి. కష్టాలకు, నష్టాలకు లొంగిపోకూడదు, కుంగిపోకూడదు. మనిషి లొంగిపోయాడు, కుంగిపోయాడు కదా అని కష్టాలు,నష్టాలు మనిషిని వదిలెయ్యవు. లొంగిపోయిన, కుంగిపోయిన మనిషి కష్టాలు, నష్టాలు ఉద్ధృతం అవుతాయి. మనిషి తన మనసుతో, మెదడుతో కష్టాలను, నష్టాలను నిలువరించి అధిగమించాలి. చచ్చినట్టు బతకడం నుంచి నచ్చినట్టు బతకడంలోకి వెళ్లేందుకు మనిషి ప్రయత్నించాలి. అందువల్ల కష్టాలు, నష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మనిషి తనను తాను తయారుచేసుకోగలుగుతాడు. తాను చచ్చేలోపు ఉచ్ఛ స్థితికి చేరుకోవాలన్న ఆలోచన చెయ్యాలి. ఆ స్థితిని సుసాధ్యం చేసుకోవడం మనిషి నేర్చుకోవాలి. అందువల్ల కష్టాలు, నష్టాలు తనను నిస్తేజంలోకి నెట్టెయ్యకుండా మనిషి నిలదొక్కుకోగలడు. మనుషులమై పుట్టామని గుర్తుంచుకుందాం; ఏ కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా చేవను ఊతంగా చేసుకుందాం. జరిగిపోయిన వాటి గురించీ, కలిగిన కష్టాలు, నష్టాల గురించీ చింతిస్తూ ఉండిపోవడం పిరికితనం. మనం పిరికితనానికి బలి కాకూడదు. పిరికితనం నుంచి మనం ధైర్యంతో బయటపడాలి. కష్టం, నష్టం నుంచి విముక్తం అవడానికి మనకు ధైర్యం కావాలి. మనం ధైర్యంతో కదలాలి. ‘ఉన్నంతవరకూ ఉన్నతంగానే ఉందాం, అనే చింతన వస్తే ఏ కష్టం లోనైనా, ఎంత నష్టంలోనైనా మనకు చైతన్యం వస్తుంది. ఆ చైతన్యమే కష్టాలు, నష్టాల నుంచి మనల్ని ముందుకు నడిపిస్తుంది. కష్టం కలిగినప్పుడూ, నష్టం కలిగినప్పుడూ మనిషికి నిస్పృహ వచ్చేస్తుంది. ఇక్కడే మనిషి జాగ్రత్తగా ఉండాలి. నిస్పృహ అనే మత్తుకు మనిషి అలవాటు పడకూడదు. ఆవరించిన నిరాశను అంతం చేసుకోవాలి. అటుపైన మతిలో సదాశ పుట్టాలి. మనిషి ఆశపడాలి. కష్టాలు, నష్టాలు కలిగాక వాటికి అతీతం అవ్వాలనే ఆశ కావాలి. సుఖపడాలని మనిషి ఆశపడాలి. బాగా బతకడానికి అవకాశాలు ఎప్పటికీ బతికే ఉంటాయి. ఆ విషయాన్ని మనం సరిగ్గా పసికట్టాలి. దెబ్బతిన్న తరువాత బాగు పడాలనుకోవడం దోషం కాదు. దెబ్బతిన్న తరువాతైనా, దెబ్బ తిన్నందుకైనా మనిషి బాగుపడి తీరాలి. మళ్లీ పుడతామో లేదో మనకు తెలియదు; మరణించాక మనకు పని ఉండదు; బాగా బతకాలని గట్టిపట్టుపడదాం. కష్టం, నష్టంవల్ల మనల్ని మనం కోల్పోకూడదు. జీవనం జారిపోతే జీవితం పండదు. మనిషికి ఆశ కావాలి. మనిషి తన బతుకును తాను ఆస్వాదించడం నేర్చుకోవాలి. బతుకును ఆస్వాదించడం తెలిస్తే కష్టాలనూ, నష్టాలనూ ఓడించడం తెలుస్తుంది. కష్టనష్టాలపై గెలుపు మనిషికి పొలుపు. మనకు గతాన్నీ, వర్తమానాన్నీ ఇచ్చిన కాలం భవిష్యత్తునూ ఇస్తుంది. కష్టానికీ, నష్టానికీ మనం పతనం అయిపోవడం కాదు, కలిగిన కష్టాన్నీ, నష్టాన్నీ పతనం చెయ్యడానికి మనం ఉపక్రమించాలి. ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ ఊపిరిలోకి తీసుకుని ఉద్యుక్తులమై మనం ఉన్నతమైన ప్రగతిని సాధించాలి. ఏ చీకటైనా తొలగిపోవాల్సిందే. ఎంతటి తుఫానైనా ఆగిపోవాల్సిందే. చీకటి మూగినప్పుడు సంయమనంతో ఉంటే ఉదయాన్ని చూడగలం. తుఫాను ముంచుకొచ్చినప్పుడు అప్రమత్తంగా ఉంటే ప్రశాంత వాతావరణంలోకి వెళ్లగలం. భూకంపం వచ్చాక కూడా అభివృద్ధి జరుగుతుందని, జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. కష్టాలు, నష్టాలు దెబ్బలలా, దెబ్బలమీద దెబ్బలలా తగులుతున్నప్పుడు జీవితం పగిలిపోలేదని గ్రహించాలి. మనం ఉన్నందుకు, మనకు ఉనికి ఉన్నందుకు మనకు పటుత్వం ఉండాలి. కష్టాలు, నష్టాలు కలిగినా నేడు అనే వేదికపైన మనం నిలదొక్కుకుని ఉండగలిగితే రేపు వస్తుంది. ఆ రేపు మనల్ని కష్టాలు, నష్టాలు వీడిపోయిన ఎల్లుండిలోకి తీసుకెళుతుంది. – రోచిష్మాన్ -
Zerodha ceo Nithin Kamath: ముందు చూపుతోనే.. హాయిగా ‘విశ్రాంతి’!
‘‘వాతావరణంలో మార్పులు మానవాళిని అంతం చేయకపోతే.. ఇప్పటి నుంచి వచ్చే 25 ఏళ్లలో చాలా దేశాలకు రిటైర్మెంట్ సంక్షోభం పెద్ద సమస్యగా మారుతుంది. గత తరాలకు దీర్ఘకాలం పాటు రియల్ ఎస్టేట్, ఈక్విటీ బుల్ మార్కెట్లు రిటైర్మెంట్ నిధి సమకూర్చుకోవడానికి సాయపడ్డాయి. కానీ, భవిష్యత్తులో ఇలా ఉండకపోవచ్చు’’. ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జీరోధా వ్యవస్థాపకుల్లో ఒకరైన నితిన్ కామత్ నేటి యువతరాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇవి. సాంకేతిక పురోగతితో పదవీ విరమణ కాలం తగ్గిపోతుంటే, వైద్య రంగంలో పురోగతితో జీవించే కాలం పెరుగుతుందని అంచనా వేశారు. వచ్చే 20 ఏళ్లకు పదవీ విరమణ వయసు 50కు తగ్గి.. 80 ఏళ్ల వరకు జీవిస్తామని.. రిటైర్మెంట్ తర్వాత కూడా 30 ఏళ్ల పాటు జీవించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. జీవితంలో పదవీ విరమణ తర్వాత దశను సరైన ప్రణాళికతోనే సుఖవంతం చేసుకోగలరంటూ కామత్ ఇచ్చిన సూచనలు ప్రతి ఒక్కరికీ మేల్కొలుపు. వయసు సహకరించి పనిచేస్తున్న దశలోనే.. పనిచేయని దశ కోసం ప్రణాళిక వేసుకోకపోతే వృద్ధాప్యంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తమ పిల్లలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాము పిల్లలకు భారం కాకూడదనే ఎవరైనా కోరుకుంటారు. అలా కోరుకునే వారు ఆ దిశగా ముందు నుంచే అడుగులు వేసుకుంటూ వెళ్లాలి. మరి రిటైర్మెంట్ తర్వాత జీవితానికి ఎంత కావాలి? అందుకు ఎంత పెట్టుబడులు పెట్టాలి..? ఈ అంశాలపై అవగాహన కల్పించే కథనం ఇది. అవసరాల్లో రాజీ పడలేం మనలో ఒక్కొక్కరు ఒక్కో జీవిత దశలో ఉండొచ్చు. కొందరు ఇప్పుడే ఉద్యోగం ఆరంభిస్తే, మరికొందరు ఇప్పటికే కొన్నేళ్ల ఉద్యోగ కాలాన్ని పూర్తి చేసుకుని ఉండొచ్చు. సంపాదించే వయసులో మన అవసరాలు ఏదో రకంగా తీరిపోతుంటాయి. ఒక విధమైన జీవనశైలికి అలవాటు పడి ఉంటాం. కోరుకున్న మాదిరి జీవితాన్ని కొనసాగిస్తాం. రిటైర్మెంట్ తర్వాత కూడా ఇదే మాదిరి జీవితాన్ని సాఫీగా కొనసాగించడమే అసలైన సవాలు. ఇందుకోసం ఇప్పుడు నెలవారీ జీవనానికి ఎంత అయితే ఖర్చు చేస్తున్నామో.. పదవీ విరమరణ అనంతరం కూడా ప్రతి నెలా అంతే మొత్తం ఖర్చు చేసేందుకు సరిపడా పొదుపు చేసుకోవాలి. ముందుగా మొదలు పెడితే ఈజీ 25 ఏళ్లకు కెరీర్ మొదలు పెట్టారని అనుకుంటే, 55–60 ఏళ్లకు రిటైర్ అవుతారని అనుకుంటే ఇన్వెస్ట్ చేయడానికి 30–35 ఏళ్ల కాలం మిగిలి ఉంటుంది. కనుక నెలకు రూ.10వేల చొప్పున, ఏటేటా దీనిపై 10 శాతం చొప్పున పెట్టుబడిని పెంచుతూ వెళితే 30 ఏళ్లకే రూ.6.91 కోట్లు (ఏటా 11 శాతం కాంపౌండెడ్ వృద్ధి అంచనా ప్రకారం) సమకూరుతుంది. అందుకే విశ్రాంత జీవన నిధి కోసం పెట్టుబడికి కెరీర్ ఆరంభంలోనే శ్రీకారం చుట్టాలి. దానివల్ల ఓ పెద్ద లక్ష్యం తేలిక అవుతుంది. 25 ఏళ్లలో రూ.7 కోట్లు సమకూరేందుకు ప్రతి నెలా రూ.20వేల చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి (ఏటాటా 10 శాతం పెంచుతూ) ఉంటే, 30 ఏళ్ల సమయం ఉన్న వారు ఇందులో సగం రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఇంకా 35 ఏళ్ల వ్యవధి ఉంటే ఇంకా తక్కువే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అందుకే ఈ కాంపౌండింగ్ మహిమను ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిందే. నిపుణుల సాయం అవసరమే రిటైర్మెంట్ అవసరాలన్నవి ప్రత్యేకమైనవి. ఇక్కడి నుంచి మరో 25–35 ఏళ్ల తర్వాతి జీవనం కోసం నిధిని సమకూర్చుకోవాలి. అలా ఏర్పడే నిధి అక్కడి నుంచి మరో 20–30 ఏళ్ల పాటు మన జీవితానికి ఆధారంగా నిలబడాలి. కనుక ప్రతి నెలా ఆర్జన ఎంత? పదవీ విరమణకు ఉన్న కాలం ఎంత? ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? పెట్టుబడుల పరంగా రిస్క్ తీసుకోగలరా? ఆశిస్తున్న రాబడులు ఏ మేరకు? ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటి తర్వాత ప్రతి నెలా ఎంత చొప్పున ఇన్వెస్ట్ చేయాలో అంచనాకు రావాలి. ఆశిస్తున్న రాబడులకు తగిన సాధనాలను ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే, అందులోనూ ఎన్నో విభాగాలున్నాయి. వాటిల్లో రాబడులు, రిస్క్ వేర్వేరుగా ఉంటుంది. పైగా రిటైర్మెంట్ ఒక్కటే కాదు, జీవిత బీమా, ఆరోగ్య బీమా కూడా కీలకమే. అందుకే కెరీర్ ఆరంభించిన వారు పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు, లేదా ఫైనాన్షియల్ ప్లానర్ సాయంతో పటిష్ట ప్రణాళిక రూపొందించుకోవడం ఎంతైనా అవసరం ఎంత కావాలి? ఇప్పుడు ప్రతి నెలా కుటుంబ అవసరాల కోసం నికరంగా రూ.50,000 ఖర్చు అవుతుందని అనుకుందాం. ఇప్పటి నుంచి పదవీ విరమణకు మరో 25 ఏళ్ల కాలం మిగిలి ఉంది. రిటైర్మెంట్ తర్వాత కనీసం 20 ఏళ్ల పాటు జీవించి ఉంటామని అంచనా వేసుకునేట్టు అయితే.. ఆ 20 ఏళ్ల కాలానికి కూడా ప్రతి నెలా రూ.50,000 కావాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి రూ.6 లక్షలు అవసరపడతాయి. రిటైర్మెంట్ విషయంలో కొందరికి భిన్నమైన అంచనాలు ఉండొచ్చు. కొందరు ఇప్పటికంటే వృద్ధాప్యంలో ఇంకా మెరుగ్గా జీవించాలని కోరుకోవచ్చు. అటువంటి వారి విషయంలో ఈ అంచనాలు మారిపోతాయి. కనుక అందరికీ అర్థమయ్యేందుకే దీన్ని ఓ ప్రామాణిక ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. విశ్రాంత జీవితానికి సంబంధించి ప్రణాళికలో ముందు రెండు అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలి. 1. ఇప్పటి నెలవారీ అవపసరాల ఆధారంగా రిటైర్మెంట్ నాటికి ఎంత నిధి సమకూర్చుకోవాలి. ఇప్పుడు నెలకు రూ.50,000 ఖర్చు అవుతోంది. అంటే ఏడాదికి రూ.6 లక్షలు. పదవీ విరమణ తర్వాత కూడా ఏటా రూ.6 లక్షలు ఆదాయాన్ని ఇచ్చేంత నిధిని సమకూర్చుకోవాలి. 2. ఇంత మేర నిధి పోగు చేసుకునేందుకు ఇప్పటి నుంచి ప్రతి నెలా ఎంత మేర ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలన్నది మరో ముఖ్యమైన విషయం. ∙ రిటైర్మెంట్ తర్వాత 20 ఏళ్ల పాటు జీవించి ఉంటామనే అంచనా ప్రకారం.. ఏటా రూ.6 లక్షల చొప్పున 20 ఏళ్ల కోసం మొత్తం రూ.1.2 కోట్లు కావాల్సి ఉంటుంది. 2047 నాటికి ఈ మేరకు నిధి మనకు కావాలి. కానీ, రూ.50,000 అన్నది నేటి కరెన్సీ విలువ ప్రకారం జీవనానికి అవుతున్న వ్యయం. ద్రవ్యోల్బణం ప్రభావంతో ఏటేటా కరెన్సీ విలువ తగ్గుతూ, జీవన వ్యయం పెరుగుతూ ఉంటుంది. కనుక ఈ నిధికి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కూడా జోడించాలి. దీర్ఘకాలంలో సగటున 5 శాతం వార్షిక ద్రవ్యోల్బణం ఉంటుందని అంచనా వేసుకుంటే.. 20 ఏళ్ల తర్వాత రూ.6 లక్షలు ఏమూలకూ సరిపోవు. ఇప్పటి నుంచి 25 ఏళ్ల పాటు రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకుంటాం కనుక అన్నేళ్ల కాలానికి ఏటా 5 శాతం ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కలిపి చూస్తే.. ఇప్పుడు ఏడాది జీవనానికి రూ.6 లక్షలు అవుతుంటే, 2047లో ఇది రూ.2,031,813 అవుతుంది. అంటే అప్పుడు ఒక ఏడాది జీవనానికి రూ.20.31 లక్షలు కావాలి. అంతేకాదు, అప్పటి నుంచి ఏటేటా ఇది మరో 5 శాతం (ద్రవ్యోల్బణం మేర) పెరుగుతుందని భావించొచ్చు. ఈ ప్రకారం 2048లో రూ.21.33 లక్షలు కావాలి. 2067వ సంవత్సరంలో జీవన వ్యయం రూ.రూ.53.91 లక్షలుగా ఉంటుంది. ఇక 2047 నుంచి 2067 సంవత్సరం వరకు, 20 ఏళ్ల కాలానికి జీవన వ్యయం కోసం (5 శాతం ద్రవ్యోల్బణం కలిపి) మొత్తం రూ.7.25 కోట్లు కావాల్సి వస్తుంది. అంటే మన చేతిలో సంపాదన కోసం మిగిలిన ఈ 25 ఏళ్లలో.. విశ్రాంత జీవనం కోసం రూ7.25 కోట్ల నిధిని సమకూర్చుకోవాలన్నది అంచనా. నిధిని ఎలా సమకూర్చుకోవాలి? రిటైర్మెంట్ తర్వాత 20 ఏళ్ల జీవిత అవసరాలకు కావాల్సిన రూ.7.25 కోట్లు సమకూర్చుకోవడం ఎలా..? ఇందుకోసం ఈ రోజు నుంచే పెట్టుబడులు ఆరంభించాలి. ఒకటికి మించిన సాధనాలను ఇందుకోసం ఎంపిక చేసుకోవచ్చు. 50 శాతం రియల్ ఎస్టేట్‌పై, 10 శాతం ఫిక్స్డ్ డిపాజిట్లలో, బంగారంలో 10 శాతం, ఈక్విటీల్లో 15 శాతం చొప్పున పెట్టుబడులు పెడుతూ, 15 శాతం నగదుగా ఉంచుకునేట్టు (ఇది అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల పోర్ట్‌ఫోలియో విధానం) అయితే.. రాబడి ఏ మేరకు వస్తుందో చూద్దాం. రియల్ ఎస్టేట్‌పై దీర్ఘకాలంలో 8–10 శాతం, ఎఫ్డీలపై 6–7 శాతం, బంగారంపై 8–9 శాతం, ఈక్విటీల్లో 10–11 శాతం వస్తుందని అనుకుంటే.. అప్పుడు మొత్తం మీద అన్ని రకాల పెట్టుబడులపై సగటున 8.25 శాతం వార్షిక రాబడి వస్తుంది. ఇది కొంత రక్షణాత్మకంగా వేసిన అంచనాయే. ఈక్విటీల్లో 10 ఏళ్లకు మించిన కాలంలో రిస్క్ దాదాపు ఉండదు. సగటు రాబడి ఎంత లేదన్నా వార్షికంగా 11 శాతం చొప్పున వస్తుంది. కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మార్గంలో రిటైర్మెంట్ కార్పస్‌ను సమకూర్చుకోవడం రిటైల్ ఇన్వెస్టర్లకు అన్నింటిలోకి మెరుగైన మార్గం అవుతుంది. నెలవారీగా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏటేటా పెరిగే ఆదాయానికి అనుగుణంగా ఈ పెట్టుబడి మొత్తాన్ని 10 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. ఉదాహరణకు మొదటి నెల రూ.5,000 ఇన్వెస్ట్ చేసినట్టయితే.. ఏటా 11 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధి ప్రకారం 25 ఏళ్ల తర్వాత (300 నెలలకు) ఈ మొత్తం రూ.67,927 అవుతుంది. రెండో ఏడాది 10 శాతం అధికంగా రూ.5,500, మూడో ఏట రూ.6,050 చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. ఇలా అయితే 25 ఏళ్లకు సమకూరే నిధి రూ.1.7 కోట్లుగా ఉంటుంది. కానీ, మనం చెప్పుకున్న ఉదాహరణ ఆధారంగా రిటైర్మెంట్ కోసం రూ.7.25 కోట్లు కావాలి. అందుకుని ప్రతి నెలా రూ.5 వేలకు బదులు.. రూ.20 వేల చొప్పున ఆరంభించి, ఏటా 10 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. దీంతో 25 ఏళ్లకు రూ.7 కోట్ల నిధి ఏర్పడుతుంది. అంచనా మాత్రమే.. పదవీ విరమణ తర్వాత వృద్ధాప్యంలో మన జీవన అవసరాలు ఇప్పటి మాదిరిగా ఉండవు. కొంత మారొచ్చు. ఖరీదైన డెనిమ్ వస్త్రాలు అవసరపడకపోవచ్చు. వినోదం, విహారం కోసం ఖర్చు పెరగొచ్చు. ఎందుకంటే అప్పుడు చేతిలో తగినంత ఖాళీ సమయం ఉంటుంది. అందుకుని అప్పటి అవసరాలు ఎలా ఉంటాయని ఇప్పుడే అంచనాకు రాలేం. ఆరోగ్య సమస్యల కారణంగా తరచూ వైద్యం అవసరపడొచ్చు. అందుకే ఇప్పుడు నెలవారీ అవుతున్న వ్యయాన్ని ఓ ప్రామాణికంగా తీసుకున్నాం అంతే. రిటైర్మెంట్ తర్వాత ఫలానా విధంగా జీవితాన్ని కొనసాగించాలనే కచ్చితమైన స్పష్టత, ప్రణాళిక ఉన్న వారు ఆ మేరకు అంచనాకు వచ్చి నిధిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది.+ టిప్స్ ► చాలా ముందుగానే పెట్టుబడులు ఆరంభించాలి. ► పెట్టుబడి సాధనాల మధ్య వైవిధ్యం ఉండాలి. ► అన్నింటిలోకీ ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఇస్తాయి. ► అవసరం లేనివి, విలువ తరిగిపోయే వాటిని రుణాలపై కొనుగోలు చేయవద్దు. ► ఆర్జించే వ్యక్తి తనతోపాటు, కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ రక్షణనిచ్చే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి. లేకపోతే ఒక ఆరోగ్య సమస్య కారణంగా ఆర్థిక జీవితం తలకిందులు అయిపోవచ్చు. ► ఉద్యోగం శాశ్వతం కాదు. కనుక పనిచేసే చోట ఆరోగ్య బీమా రక్షణ ఉన్నా కానీ, విడిగా ఆరోగ్య బీమా ప్లాన్ కూడా ఉండాలి. ► టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం. అనుకోనిది జరిగితే వచ్చే బీమా పరిహారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే, నెలవారీ కుటుంబ అవసరాలను తీర్చేంత సరిపడా ఆదాయం ఆ నిధి నుంచి రావాలి. – నితిన్ కామత్, జీరోధా సీఈవో -
కుమ్మరి వృత్తి.. దక్కని తృప్తి.. సాంప్రదాయాన్ని వదులుకోలేక..
తాళ్లపూడి(తూర్పుగోదావరి): దీపావళి వస్తుందంటే చాలు కుమ్మర్లకు చేతి నిండా పని, వీధులన్నీ మట్టి ప్రమిదలతో కళకళలాడుతూ ఉంటాయి. ప్రమిదలు, చిచ్చు బుడ్లు తదితర తయారీలో వారంతా నిమగ్నమై ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ కుమ్మర్లకు ఆదరణ తగ్గింది. సీజన్లో తప్ప మిగతా రోజుల్లో పని లేక ఇబ్బంది పడుతున్నారు. సమాజంలో వస్తున్న మార్పులు, ప్రజల అభిరుచులు మారడంతో మట్టి పాత్రల వినియోగం తగ్గడంతో కుమ్మర్లకు పని లేకుండాపోతోంది. ఆర్థికంగా అవస్థలు తప్పడంలేదు. దీంతో వారు వలసపోతున్నారు. తాతల కాలం నుంచి వస్తున్న కులవృత్తిని, సాంప్రదాయాన్ని వదులుకోలేక పలువురు ఈ పనులే చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చదవండి: వినూత్నం: ఆ గుప్పెళ్లు.. దయగల గుండెల చప్పుళ్లు ఈ వృత్తినే నమ్ముకొని.. ఆధునిక కాలంలో మట్టి పాత్రలకు బదులు స్టీల్, రాగి, కంచు, సీవండి, ప్లాస్టిక్ తదితర వాటిని వినియోగిస్తున్నారు. దీంతో కుమ్మరులు ఉపాధిని కోల్పోతున్నారు. కొవ్వూరు నియోజక వర్గంలో సుమారు 4 వేల మంది వరకూ కుమ్మర్లు ఉండేవారు. ప్రస్తుతం 400 మంది ఉన్నారు. తాళ్లపూడి మండలంలో సుమారు 150 నుంచి 200 కుటుంబాలు వరకూ ఉండేవి. ప్రస్తుతం కేవలం 25 కుటంబాలు వారు మాత్రమే కుమ్మర వృత్తిని కొనసాగిస్తున్నారు. వేగేశ్వరపురంలో 13 కుంటుబాలు, తాళ్లపూడిలో నాలుగు కుటుంబాలు ఈ వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి తగిన ప్రొత్సాహం మాత్రం లభించడం లేదు. పెద్దేవం, అన్నదేవరపేట, తిరుగుడుమెట్ట, రాగోలపల్లి తదితర గ్రామాల్లో కుమ్మర్లు ఉన్నారు. వారు పురాతన శాలలపై ఆధారపడకుండా ఇటీవల కరెంట్ శాలలు రూ.20 వేలు పెట్టి సొంతంగా కొనుక్కున్నారు. వాటిపై కేవలం ప్రమిదలు, చిచ్చుబుడ్లు మాత్రమే తయారు చేయడం జరుగుతుంది. పెరిగిన ముడిసరుకుల ధరలు మట్టి వస్తువులు తయారీలో ఉపయోగించే ముడి సరుకుల ధరలు పెరిగాయి. ఆవ శాలలో కాల్చడానికి మట్టి, ఊక, వంట చెరకు ధరలు గతంలో కంటే రెట్టింపయ్యాయి. ఖర్చులు పోగా వచ్చే లాభం సరిపోవడంలేదని కుమ్మర్లు వాపోతున్నారు. వేసవిలో కుండలు చేయడం ద్వారా ఇతల మట్టి పాత్రలు కుడా తయారు చేస్తున్నారు. ఈ దీపావళికి వివిధ ఆకృత్తుల్లో ఆకర్షణీయంగా ప్రమిదలు తయారు చేస్తున్నారు. 1000 ప్రమితలు రూ.850 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. 100 చిచ్చుబుడ్లు రూ.500 నుంచి రూ.600 వరకూ కొనుగోలు చేస్తున్నారు. అది కూడా కొందరు వ్యక్తులు ముందుగా కాంట్రాక్ట్ కుదుర్చుకుని చేయించుకుంటున్నారు. ఏటా దీపావళి సీజన్ నుంచి కార్తిక మాసం సీజన్లో మాత్రమే కొంత ఉపాధి దొరుకుందని కుమ్మర్లు వాపోతున్నారు. కుమ్మరిని ప్రోత్సహించాలి ఇటీవల కురిసిన వర్షాలకు దీపావళి సీజన్లో పని చేయడానికి అవకాశం లేదు. కుమ్మరి వృత్తిని ప్రోత్సాహించాలి. నేను రూ.20 వేలు పెట్టి కరెంట్ శాల కొన్నాను. మార్కెట్లో ముడిసరుకుల ధరలు పెరిగిపోయాయి. దీనివల్ల లాభాలు రావడంలేదు. కుటుంబం అంతా దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం రుణాలు ఇవ్వలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాయం చేయండి. – శ్రీకాకోళపు పద్మ, వేగేశ్వరపురం దీపావళి సీజన్లోనే పని మారుతున్న రోజుల్లో కుమ్మరి వృత్తికి ఆదరణ కరువైంది. దీపావళి సీజన్లో మాత్రమే పని ఉంటోంది. మిగతా రోజుల్లో ఉండదు. ఆర్థికంగా నిలదొక్కుకోలేక కుమ్మర వృత్తిని చేయడానికి ముందుకు రావడంలేదు. దీంతో ఇతర పనులకు వెళ్లక తప్పడం లేదు. ప్రభుత్వం కరెంట్ శాలలు, ఇతర పనిముట్లపై సబ్సిడీ ఇవ్వాలి. మమ్మల్ని ఆదుకోవాలి. – శ్రీకాకొళపు వెంకటేశ్వరరావు, వేగేశ్వరపురం -
కష్టాలు చుట్టుముట్టినా.. చెదరని బాలుడి సంకల్పం.. చెల్లిని భుజాన ఎత్తుకొని!
సాక్షి, మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఏ పిల్లలైనా ఆడిపాడడం తప్పా మరో లోకం తెలీదు. కానీ, చిన్నతనంలోనే తన కుటుంబానికి వచ్చిన కష్టాన్ని తన కష్టంగా బావించి బాధ్యతలను తన భుజంపై మోస్తూ.. చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రోజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ.. చదువు కోసం పోరాటం చేస్తున్న 11ఏళ్ల బాలుడే వినయ్. ఏ చీకూచింతా లేని ఆ బాలుడి కుటుంబంలో భవన కూలీగా పనిచేసే తండ్రి ప్రమాదవశాత్తు పైఅంతస్తు నుంచి కింద పడి నడుము విరిగిపోవడంతో కష్టాలు చుట్టుముట్టాయి. తండ్రికి తల్లిలా మారి.. బాలుడి తండ్రి మల్లయ్య భవన నిర్మాణ కూలీగా పనిచేసేవాడు. అయితే, పని చేసే చోట ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడడంతో మల్లయ్య వెన్నుముక విరిగిపోయింది. నాటి నుంచి మంచంపై నుండి కదల్లేని పరిస్థితి. దీంతో ఇళ్లు గడిచేందుకు ఆదాయం లేకపోవడంతో తల్లి లక్ష్మీ చేసే కష్టం మాత్రమే వీరికి ప్రధాన ఆదాయమైంది. తల్లి ఉదయం కూలి పనికి వెళ్తే తండ్రిని, ఏడాదిన్నర వయస్సున చెల్లిని ఇంటి వద్దే ఉండి చూసుకునే బాధ్యత వినయ్ మీదనే పడింది. ఈ విషయాన్ని కొద్దిగా ఆలస్యంగా ఉపాధ్యాయులు గుర్తించారు. అనారోగ్యంతో ఉన్న తండ్రి అన్నం తినలేని పరిస్థితి, చిన్న వయస్సు ఉన్న చెల్లి అన్నం తినలేని పరిస్థితి. వారి ఇద్దరికి వినయ్ క్రమం తప్పకుండా అన్నం తినిపించి, సాయంత్రం తల్లివచ్చే వరకు వారి ఆలనా పాలన చూసుకునే వాడు. ఇన్ని ఇబ్బందులు ఉన్న కానీ చదువుకోవాలని ఉత్సాహం ఉన్న వినయ్ వీరిద్దరినీ చూసుకుటూ చదువుపై ఉన్న మక్కువతో బడికి వస్తున్నాడని గ్రహించారు. దీంతో తన చెల్లిని తనతో పాటు స్కూల్‌కు తీసుకువచ్చేందుకు ఉపాధ్యాయులు అనుమతించారు. అంతేగాక తండ్రి ఇబ్బందులు తీర్చేందుకు వినయ్ పాఠశాల మధ్యలో వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు. ఆదుకునేవారు లేక.. అప్పులు చేసి వైద్యం తండ్రి మలయ్యకు ప్రమాదం జరిగిన తర్వాత కార్మిక శాఖ నుంచి కానీ, ప్రభుత్వం నుండి సహాయం అందలేదు. ప్రమాదం జరిగిన ఇంటి యజమాని కొంత డబ్బుమాత్రమే ఇచ్చారు. దీంతో వైద్యానికి కొంత మేర డబ్బు సరిపోయిన మిగిలిన డబ్బును అప్పు రూపంలో సమకూర్చారు. దీంతో కుటుంబం అప్పుల పాలైంది. ఇప్పటికి గాయాలు మానకపోవడంతో వారానికి ఓ సారి రూ.2వేల వరకు ఖర్చు చేసి వైద్యం చేయించుకునే పరిస్థితి. ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వ పింఛన్ కోసం దరఖాస్తులు చేశారు. ఇప్పటికి పింఛన్ రాలేదు. ఇళ్లు గడవలేని పరిస్థితి ఇబ్బందులు, భార్యా పిల్లలను పోషించేందుకు మల్లయ్య దిక్కుతోచక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖాళీ జాగాను అమ్మేశారు. తన కన్న కొడుకును అందరికంటే బాగా ప్రైవేటు పాఠశాలల్లో చదివించాలన్న తన కోరిక నెరవేరకపోగా, పిల్లలు తనమూలంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయాడు. తల్లీ లక్ష్మీ, కొడుకు నవీన్ చెల్లిని భుజాన ఎత్తుకొని స్కూలుకి.. మహబూబ్‌నగర్ రూరల్ మండలం మణికొండ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు వినయ్. మల్లయ్య, లక్ష్మి దంపతులకు వినయ్‌తోపాటు ఏడాదిన్నర కూతురు ఉంది. అయితే, మొదటి నుంచి బాలుడికి చదువుకోవాలని ఉత్సాహం ఎక్కువ. పాఠశాలకు విద్యార్థులందరూ ఒక్కరే వెళ్తే వినయ్ మాత్రం తనతో పాటు తన ఒకటిన్నర సంవత్సరాల వయస్సు ఉన్న తన చెల్లి గౌతమిని కూడా తనతో పాటు తరగతి గదిలోకి తీసుకెళ్లే వారు. మధ్యాహ్న భోజనం తనకు పెట్టిన భోజనంలో చెల్లికి కూడా తినిపించే వాడు వినయ్. ఈ విషయంపై పాఠశాల ఉపాధ్యాయులు ఓ సారి మందలించారు. అంత చిన్న వయస్సు ఉన్న పాపను పాఠశాలకు తీసుకురావద్దని వాదించారు. కానీ వినయ్ నుంచి ఎటువంటి సమాధానం వచ్చేది కాదు. చివరకు విషయం ఏంటని తెలుసుకునే ఆరా తీసిన ఉపాధ్యాయులకు గుండె తరుక్కు పోయే విషయాన్ని తెలుసుకోవాల్సి వచ్చింది. బడి మానిపిస్తారేమోనని.. అమ్మ కూలి పనికి వెళ్లడంతో ఇంటి వద్ద నాన్నకు ఏవైనా ఇబ్బందులు వచ్చినా నేనే చూసుకోవాలి. చెల్లి చిన్నది కావడంతో ఆమెను పాఠశాలకు తీసుకెళ్లి అన్నం పెట్టాలి. ఏవైనా ఇబ్బందులు వస్తే చూసుకోవాలి. కొన్ని రోజులు ఇంటి వద్దే ఉన్నా. దీంతో బడి పూర్తిగా మానిపిస్తారేమో అనుకుని, బడికి వెళ్తూ చెల్లిని, నాన్నను చూసుకుంటున్నారు. – వినయ్, విద్యార్థి సహాయం చేసి ఆదుకోండి వెన్నెన్నుముక విరిగాక రెండు కాళ్లు పనిచేయడం లేదు. వైద్యం కోసం రూ.లక్షలు ఖర్చు చేశాం. అయినా ఇప్పటికి గాయాలు మానలేదు. సమస్య తీరలేదు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా. దీంతో కూలిపనికి వెళ్లి ఒక్కదాన్నే కుటుబాన్ని పోషిస్తున్నా. పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. పెద్దమనసుతో ప్రభుత్వం, సంస్థలు, వ్యక్తులు తమను ఆదుకోవాలని వేడుకుంటున్నాం. – లక్ష్మీ, వినయ్ తల్లి -
కుల ‘పెద్ద’ల కుటిలం.. అంత్యక్రియలకు కూడా ఆంక్షలు.. మాట వినలేదని
జగిత్యాల రూరల్: జగిత్యాల జిల్లాలో కులపెద్దల కట్టుబాటుతో ఓ కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పంచాయితీ పెద్దలను గౌరవించలేదని ఆ కుటుంబంపై కక్షగట్టారు. కులస్తులు దూరంగా ఉండాలని ఆంక్షలు విధించారు. దీంతో బాధిత కుటుంబంలో వ్యక్తి మృతిచెందినా అంత్యక్రియలకు ఎవరూ హాజరుకాలేదు. చివరకు అంత్యక్రియలకు సాయపడిన ఓ సామాజిక కార్యకర్తపై కూడా కన్నెర్ర చేశారు. అతడి కిరాణా షాపులో ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయొద్దని కట్టుబాటు విధించారు. జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మగ్గిడి ఎల్లయ్య (93)కు ముగ్గురు కుమార్తెలు. ఇందులో చిన్న కుమార్తెకు పెళ్లి చేసి వేరే ఇంటికి పంపగా, మిగతా ఇద్దరు కుమార్తెలు మగ్గిడి నర్సమ్మ, మగ్గిడి భూమవ్వలకు ఇల్లరికం పెళ్లి చేశాడు. తనకున్న భూమి నుంచి వచ్చే ఆదాయాన్ని తన పోషణ అనంతరం సమంగా తీసుకోవాలని సూచించాడు. ఈ క్రమంలో భూమవ్వ తనను పోషించడం లేదని కొద్దిరోజుల క్రితం తన పేరున ఉన్న భూమిని నర్సమ్మ పేరున రిజిస్ట్రేషన్ చేశాడు. దీంతో కొంతకాలంగా నర్సవ్వ, భూమవ్వల మధ్య భూవివాదం కొనసాగుతోంది. ఇదే అంశంపై భూమవ్వ కుల పెద్దలను ఆశ్రయించగా పంచాయితీ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 7న ఉదయం ఎల్లయ్య మృతిచెందాడు. దీంతో తాము చెప్పిన తీర్పునకు కట్టుబడి ఉంటేనే అంత్యక్రియలకు హాజరవుతామని కులపెద్దలు తేల్చిచెప్పారు. కులస్తులు ముందుకు రాకపోవడంతో నర్సమ్మ సాయంత్రం వరకూ ఎదురుచూసింది. దీంతో అంత్యక్రియలకు సహకరించాలని బాధితులు గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త కాసారపు రమేశ్‌తోపాటు మరికొందరిని సంప్రదించగా వారు ముందుకొచ్చి కార్యక్రమం పూర్తి చేశారు. దీంతో రమేశ్ కిరాణా దుకాణానికి ఎవరూ వెళ్లవద్దని కులపెద్దలు కట్టుబాటు పెట్టారు. దీంతో 17 రోజులుగా ఎవరూ రమేశ్ కిరాణా దుకాణానికి వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో మగ్గిడి నర్సవ్వతో పాటు, ఆమె మనుమడు, కాసారపు రమేశ్‌లు గురువారం జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్‌ను కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కులపెద్దల అరాచకంపై ఫిర్యాదు చేశారు. -
బకాయిల కుప్పలు .. విద్యార్థులకు తిప్పలు
►రెండు సంవత్సరాలుగా నిధులు అందకపోవడంతో రూ.5.5 లక్షల అప్పు చేసి ఫీజు చెల్లించిన చైతన్యపురికి చెందిన పీజీ వైద్య విద్యార్థిని తండ్రి రెండు నెలలుగా హైదరాబాద్ బీసీ సంక్షేమ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్, పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాల బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో, ప్రభుత్వ పథకంపైనే ఆధారపడిన విద్యార్థులు అప్పులు చేసి కాలేజీల యాజమాన్యాలకు ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. రెండేళ్లుగా నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. 2019–20 విద్యా సంవత్సరం బకాయిలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో విడుదల కాలేదు. ఇక 2020–21కి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధుల పంపిణీ ఇంకా మొదలే కాలేదు. రెండేళ్లకు కలిపి మొత్తం రూ.3017.41 కోట్ల బకాయిలున్నట్లు సంక్షేమ శాఖల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రభావం.. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన పథకాలనూ ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. క్రమం తప్పకుండా జరగాల్సిన నిధుల విడుదలలో జాప్యం కారణంగా కొన్నిచోట్ల కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేస్తున్నాయి. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు అందక పోవడంతో సిబ్బందికి జీతాలు చెల్లించడం కష్టతరంగా మారుతోందని యాజమాన్యాలు అంటున్నాయి. జాడలేని నెలవారీ నిధులు మూడేళ్ల క్రితం ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. మొదట్లో ప్రతి విద్యా సంవత్సరం చివర్లో నిధులను మంజూరు చేసేవారు. అయితే పెద్దమొత్తంలో నిధులు ఒకేసారి విడుదల చేయడం భారంగా మారుతుండటంతో నెలవారీగా నిధులు విడుదల చేయాలని భావించింది. సాధారణ, వృత్తి విద్యా కోర్సులకు వేరువేరుగా పద్దుల కింద నిధులు విడుదల చేయాలని నిర్ణయించి చర్యలు చేపట్టింది. తొలి రెండు మూడు నెలలు నిధుల విడుదల సాఫీగా జరిగినప్పటికీ.. ఆ తర్వాత క్రమం తప్పింది. దీంతో బకాయిలు పేరుకుపోతూ వచ్చాయి. దీంతో రెండేళ్లుగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు పలు కాలేజీల్లో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు యాజమాన్యాల ఒత్తిడితో తామే వ్యక్తిగతంగా ఫీజులు చెల్లించి ధ్రువపత్రాలు పొందాల్సి వస్తోంది. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత.. చెల్లించిన ఫీజులను తిరిగి ఇచ్చేస్తామని యాజమాన్యాలు చెబుతున్నాయి. జూనియర్ విద్యార్థుల విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరిస్తుండటంతో చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేసి ఫీజులు కడుతున్నారు. ఇలా ఫీజులు చెల్లించినవారు సంక్షేమ కార్యాలయాలకు వెళ్లి ఆరా తీస్తే ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదనే సమాధానం ఎదురవుతోంది తప్ప ఫలితం ఉండటం లేదు. వనపర్తి జిల్లా గోపాల్పేట హరిజనవాడకు చెందిన లావణ్య అనే బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థిని కాలేజీ ఫీజులు చెల్లించలేక గతనెల 19న బలవన్మరణానికి పాల్పడటం సంచలనం సృష్టించింది. దరఖాస్తులు పరిశీలనకే పరిమితం... 2020–21 విద్యా సంవత్సరంలో ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాలకు సంబంధించి 12.85 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు సమర్పించారు. గతేడాది ఆగస్టులో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, ఈ ఏడాది మే నెలాఖరు వరకు ఆన్లైన్ నమోదు ప్రక్రియ కొనసాగింది. దాదాపుగా నూరు శాతం విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు ప్రక్రియ మొదలైన నెల రోజుల తర్వాత నుంచి వాటి వెరిఫికేషన్ ప్రక్రియ మొదలు కావాలి. అయితే కోవిడ్–19 నేపథ్యంలో పరిశీలన ఆలస్యమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పరిశీలన ప్రారంభించిన సంక్షేమాధికారులు ఇప్పటివరకు 80 శాతం ప్రక్రియ పూర్తి చేశారు. 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన పథకాల కోసం రూ.2,250 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. అయినా ఇప్పటివరకు అటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు గానీ, ఉపకార వేతనాలకు కానీ నిధులు విడుదల కాకపోవడం గమనార్హం. ఇక 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా రూ.767.41 కోట్ల మేర బకాయి ఉంది. వీటికి సంబంధించి సంక్షేమ శాఖ అధికారులు బిల్లులు సిద్ధం చేసినప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. తక్షణమే నిధులు విడుదల చేయాలి ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విషయమై ఆర్థిక మంత్రితో సహా పలువురికి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదు. ఇతర పథకాలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. విద్యార్థులకు బకాయి పడ్డ నిధులను ఇవ్వకపోవడం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా యుద్ధప్రాతిపదికన నిధులు విడుదల చేయాలి. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది. – ఆర్.కృష్ణయ్య, అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం దిక్కుతోచని స్థితిలో కాలేజీలు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనే ఆధారపడి ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులు చదువుతున్న వాళ్లు 85 శాతం ఉన్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాయి. అప్పులు చేసి బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నాయి. కొన్ని యాజమాన్యాలు ఏకంగా కాలేజీలనే మూసేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోకుంటే రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది. – గౌరి సతీష్, కన్వీనర్, తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం -
మనోబలమే మహౌషధం
దేశ రక్షణకు ప్రాణాలను సైతం లెక్క చేయక పోరాడే వీర సైనికులలో వున్నది ఈ మనోబలమే! శత్రువులు మూకుమ్మడిగా చుట్టూముట్టినా, శరీరాన్ని ఛిద్రం చేస్తున్నా ప్రతిఘటించాలన్న కాంక్షవారికుండటానికి కారణం అబ్బురపరిచే వారి మానసిక స్థైర్యమే. కష్టాలు ఒక్కసారిగా చుట్టిముట్టినప్పుడు మనిషి నిబ్బరంగా ఉండగలగటమే ధీరత్వం అంటే! క్లిష్ట పరిస్థితులలో నిరాశ, నిస్పృహలు ఆవరిస్తాయి. ఆశ సన్నగిల్లుతుంది. మనసు నిలకడను కోల్పోతుంది. ఏదో తెలియని భీతి మనసులో తిష్ఠ వేస్తుంది. దాంతో కుంగిపోతాడు. మానసిక ప్రశాంతతకు దూరమవుతాడు. ఆశాæకిరణం కనుచూపు మేరలో లేదని, తను ఈ గడ్డుకాలం నుంచి బైట పడలేననే భయం ఏర్పడుతుంది. తన జీవితాన్ని అర్ధంతరం గా ముగించే ప్రయత్నం కూడా చేస్తాడు. ఈ కరోనా కష్ట కాలంలో మనలో చాలామంది ఈ స్థితిలోనే ఉన్నాం. శారీరక వ్యాయామం వల్ల శరీరం మాత్రమే దృఢమవుతుంది. కాని ప్రశాంతతకు దూరమైన మనసు బలహీనమవుతుంది. అది మన లోని శక్తిని నీరుకారుస్తుంది. అసహనంతో అకారణమైన, అసమంజసమైన కోపాన్ని కుటుంబ సభ్యుల మీద చూపి, వారి ప్రేమకు దూరమయేలా చేస్తుంది. వారిది కూడ తనలాంటి మానసిక స్థితేనా? అన్న ఆలోచన, విచక్షణ వివేచనలు కోల్పోయిన మనసుకు తోచదు. అది తన కుటుంబానికే కాక సమాజానికి, దేశానికి చేటు చేస్తుంది. మరెలా దీన్ని అధిగమించాలి? ఓర్పుతో మాత్రమే దీన్ని అలవరుచుకోవాలి. ఓర్పే నేటి గడ్డు కాలంలో గొప్ప రక్షణ కవచం. ‘దుర్దశే మనిషి వ్యక్తిత్వానికి గీటురాయి ‘ అన్నాడు ప్రపంచ విఖ్యాత నాటకకర్త షేక్సి్పయర్. అదే మనిషిలోని ధీ శక్తిని వెలికి తీసే అవసరాన్ని, అవకాశాన్ని కల్పిస్తుంది. మనిషి వ్యక్తిత్వానికి పరీక్ష పెట్టే కష్టాలు, అననుకూలతలు ఏర్పడినప్పుడు మనిషి కి మనోబలం అవసరం. మనోబలమున్న ధీరులలో స్వీయ క్రమశిక్షణ, స్వీయ ఆదేశాలు, ఆచరణ అంతర్వాహినిగా ఉంటాయి. మనోబలం వల్ల ఈ కష్టాల ఊబి నుండి బైట పడగలిగే శక్తి చేకూరుతుంది. సాధారణంగా మనోబలం కలవారు తక్కువ మాట్లాడతారు. ఎక్కువ పని చేస్తారు. కొందరయితే మౌనంగా, గంభీరంగా వుంటారు. నిరంతరం కార్యనిర్వహణలో నిమగ్నమై వుంటారు. ఎంత మనోబలం వున్నా బాగా శ్రమించి పనిచేస్తేనే ఆశించిన ఫలితం దక్కుతుంది. మనం కూడా మంచి ఆలోచనలతో, పట్టుదలతో కృషి చేయాలి. మానసికంగా బలంగా వున్నప్పుడు, శారీరకంగా శక్తిమంతుడు కాకపోయినా ఏమైనా చేయగలనన్న ధీమా ఉంటుంది. ఎవరినైనా, దేన్నైనా ఎదుర్కొనే సంసిద్ధత వస్తుంది. ఆ మానసిక సంసిద్ధతే నేడు కావలసింది. దానిని అందరూ అలవరచుకుంటూ, పెంచుకుంటూ మానసికంగా బలోపేతులు కావాలి. ఎవరు కాలం కంటే ముందు పరుగులు తీయగలరో, ఎవరు సంకల్పంతో కాల పరిధుల్ని, అవధుల్ని అధిగమించగలరో వారే విజేతలు. పరిమిత జీవిత కాలంలో అపరిమిత కృషితో అద్భుత ఫలితాలు సొంతం చేసుకున్నవారే కాలాతీతవ్యక్తులు. వారే శాస్త్రజ్ఞులు, సంస్కర్తలు, దేశభక్తులు, త్యాగమూర్తులు, దేశరక్షణలో ప్రాణత్యాగాలు చేసే పరమ యోధులు. మన కృషి తీవ్రతను బట్టి గమ్యం సమీపమో, సుదూరమో నిర్ణయమవుతుంది. సమీప గమ్యమే మన లక్ష్యమైనపుడు సంకల్పబలం దాన్ని తప్పకుండా సుసాధ్యం చేస్తుంది. మనోబలం అందుకు దన్నుగా నిలుస్తుంది. సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను రూపుమాపటానికి, అభ్యుదయ మార్గంలో సమాజాన్ని నడిపించటానికి రాజా రామమోహన రాయ్, కందుకూరి వీరేశలింగం, జ్యోతి రావు ఫూలే వంటి అనేక మంది సంస్కర్తలు తమ జీవితాన్ని సమాజం కోసం ధార పోశారు. సమాజం నుంచి ఎన్నో ప్రతికూలతలు, అవమానాలు, బెదిరింపులు ఎదుర్కొన్నారు. అయినా, మొక్కవోని మనోబలంతో అనుకున్న లక్ష్యాలను సాధించారు. ఈ తరం న్యూటన్‌గా ప్రపంచం కొనియాడిన స్టీఫెన్ విలియం హాకింగ్స్ నరాలకు సంబంధించిన వ్యాధి పీడితుడై, శరీరం చచ్చుబడినా, తన అమోఘమైన మేధస్సుతో అనేక పరిశోధనలు, ఆవిష్కరణలు చేసాడు. మనోబలానికి ఇంతకన్నా నిలువెత్తు నిదర్శనం ఏముంటుంది? దేశ రక్షణకు ప్రాణాలను సైతం లెక్క చేయక పోరాడే వీర సైనికులలో వున్నది ఈ మనోబలమే! శత్రువులు మూకుమ్మడిగా చుట్టూముట్టినా, శరీరాన్ని ఛిద్రం చేస్తున్నా ప్రతిఘటించాలన్న కాంక్ష వారికుండటానికి కారణం అబ్బురపరిచే వారి మానసిక స్థైర్యమే. అనేక ప్రకృతి వెపరీత్యాలకు, మానవ ప్రేరిత విధ్వంసాలకు, ప్రజ అతలాకుతలమైంది. కాని, గుండె దిటవు చేసుకుంటూ తునాతునకలైన ఆశను మనోబలంతో ప్రోది చేసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూనే ఉంది. ఇన్ని విపత్తులను దాటటానికి మనోబలమే కారణం. మనోబలమే మనిషికి నిజమైన శక్తి! ప్రస్తుత కాలంలో జనాన్ని వణికిస్తూ, భయభ్రాంతులను చేస్తున్న కరోనాను సులభంగా జయించటానికి అవసరమైనది ఈ మనోబలమే! కాబట్టి మనోబలాన్ని రక్షణ కవచంగా చేసుకుని ధైర్యంగా ముందుకు వెళదాం. కరోనా మహమ్మారి బారిన పడకుండా కాపాడుకుందాం. – బొడ్డపాటి చంద్రశేఖర్ -
కరోనా కర్మకాండ!
► చెన్నైలో ఈనెల 19న కరోనాతో డాక్టర్ మరణించాడు. అంత్యక్రియల కోసం కుటుంబసభ్యులు, స్నేహితులు శ్మశానవాటికకు మృతదేహాన్ని తీసుకెళ్లగా స్థానికులు అడ్డగించారు. అక్కడ ఖననం చేస్తే వైరస్ వ్యాపిస్తుందనే భయంతో దాడి చేశారు. అంబులెన్స్ డ్రైవర్ సహా పలువురు గాయపడ్డారు. దాడి నుంచి తప్పించుకోవడానికి ఆ డాక్టర్ కుటుంబం పరుగెత్తాల్సి వచ్చింది. చివరకు పోలీసు భద్రతతో అతని కుటుంబసభ్యులు లేకుండానే ఒక స్నేహితుడు, మరో ఇద్దరి సాయంతో డాక్టర్‌కు చివరి వీడ్కోలు పలికారు. ► అలాగే ఆదివారమే జార్ఖండ్‌లోని రాంచీలో ఒక వ్యక్తి కరోనాతో చనిపోయాడు. మృతదేహాన్ని శ్మశానవాటికలో పాతిపెట్టాలని రాంచీ జిల్లా యంత్రాంగం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సుమారు 200 మంది ప్రజలు శ్మశానవాటిక వెలుపల పెద్ద ఎత్తున నిరసన తెలిపి అడ్డుకున్నారు. శవాన్ని వేరే చోట పాతిపెట్టాలని డిమాండ్ చేశారు. మృతదేహాన్ని శ్మశానవాటికలో ఖననం చేస్తే అక్కడి ఎలుకలు వైరస్‌ను తమ ఇళ్లలోకి తీసుకొస్తాయని నినదించారు. సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కాలంలో చివరికి కర్మకాండలు చేయడం కూడా సమస్యగా మారింది. కరోనాపై పోరాడుతున్న ఒకరిద్దరు డాక్టర్లు మొదలు చనిపోయే సామాన్యుల వరకు వారికి అంతిమ సంస్కారాలు చేయడం కష్టంగా మారింది. అనేక రాష్ట్రాల్లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు కరోనా చావులు ఆయా కుటుంబాల్లో జీవిత వేదనగా చేదుజ్ఞాపకంగా మిగులుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే మృతదేహాలను ఖననం చేస్తామని చెప్పినా ప్రజలు అంగీకరించడంలేదు. చెన్నైలో డాక్టర్ మృతదేహం ఖనన ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ సంఘటన అనంతరం అక్కడి డీఎండీకే పార్టీ అధినేత విజయ్‌కాంత్ తన యాజమాన్యంలోని ఒక కాలేజీలో కొంత స్థలాన్ని కరోనాతో చనిపోయే రోగుల మృతదేహాల ఖననానికి కేటాయించారు. దేశంలో పలుచోట్ల, తెలంగాణలో అక్కడక్కడ ఇటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. సాధారణ పరిస్థితుల్లో చనిపోయిన మృతదేహాలను కూడా ఖననం చేసేందుకు సమీపంలో ఉండే స్థానికులు అడ్డుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కరోనాతో చనిపోయిన చెన్నై డాక్టర్‌కు నివాళి అర్పిస్తూ, అలాగే డాక్టర్లపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, వారిని అనేకచోట్ల ఇళ్లల్లోకి రానీయని పరిస్థితులపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) బుధవారం రాత్రి 9 గంటలకు ‘వైట్ అలెర్ట్’కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఆ రోజు రాత్రి 9 గంటలకు అన్ని ఆసుపత్రుల్లోని వైద్యులు కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలపాలని కోరింది. అలాగే వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలపై జరుగుతున్న హింసాకాండకు వ్యతిరేకంగా జరిగే వైట్ అలెర్ట్లోనూ పాల్గొనాలని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి రుడావత్ లక్ష్మణ్ ఓ ప్రకటనలో కోరారు. ఎలా చనిపోయినా ‘కరోనా’జాగ్రత్తలే... కరోనా అనుమానిత లక్షణాలతో చనిపోయినవారి శాంపిళ్లను సేకరించకూడదని, వారిని కరోనా పాజిటివ్ వ్యక్తులుగానే పరిగణించి ఖననం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. దాంతోపాటు తాజాగా చెన్నై, రాంచీ సహా దేశవ్యాప్తంగా కరోనాతో చనిపోయిన వారి మృతదేహాల ఖననాలకు ఎదురైన అడ్డంకులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా మళ్లీ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో కరోనాతోనే కాకుండా ఏ విధంగా చనిపోయినా, ఆయా మృతదేహాలను కరోనా పాజిటివ్‌తో చనిపోయిన వారికి తీసుకునే జాగ్రత్తల ప్రకారమే కర్మకాండలు చేయాలని ఆదేశించింది. ఆసుపత్రుల్లోనూ, ఇళ్లలోనూ ఎక్కడ చనిపోయినా ఈ పద్ధతి పాటించాలని కోరినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. కరోనా అనుమానిత, నిర్ధారిత మృతుల అంత్యక్రియలకు ముందు కేవలం ముగ్గురు లేదా ఐదు మంది కుటుంబ సభ్యులు, బంధువులకు మాత్రమే కడచూపు అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులను మార్చురీ లోపలికి అనుమతించడం కాని మృతదేహాన్ని ముట్టుకోవడానికి అనుమతి ఉండదు. ముఖం కనిపించే విధంగా మృతదేహాన్ని ప్లాస్టిక్ షీట్లో చుట్టి, లీక్ ప్రూఫ్ జిప్ బ్యాగులో ప్యాక్ చేస్తారు. మృతుడి ముఖం కనిపించేలా బ్యాగు ముందటి భాగం పారదర్శకంగా ఉంటుంది. ఇటువంటి వాటిని అన్ని ఆసుపత్రులు సమకూర్చుకోవాలి. ఈ పద్ధతి రాష్ట్రంలో ఏ విధంగా చనిపోయిన వ్యక్తుల మృతదేహాలకైనా వర్తిస్తుంది. ఎందుకంటే కరోనా అనుమానంతో చనిపోయిన వారి శాంపిళ్లను సేకరించి నిర్ధారణ పరీక్షలు చేయడాన్ని ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో తాజా నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా సహా ఇతరత్రా మృతదేహాల అంత్యక్రియలు సాఫీగా జరిగేందుకు ఇప్పటికే రాష్ట్రంలో ఒక కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ప్లాస్టిక్ షీట్లో మృతదేహాన్ని చుట్టడానికి ముందు రసాయన క్రిమిసంహారక మందులు కలిగిన నీటి మిశ్రమాన్ని శవంపై చల్లుతారు. అనంతరం శరీరాన్ని ప్లాస్టిక్ షీట్లో చుట్టి ఆపై తెల్లటి కాటన్ వస్త్రంతో చుడతారు. ఇకనుంచి అన్ని మృతదేహాలను ఇలాగే ఖననానికి ముందు ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. -
ధర్మానికి లోబడడమే ధైర్యం
ధైర్యవంతులే జీవితంలో ఏదో ఒకటి సాధిస్తారు. కాని ధైర్యంగా కార్యాలు తలపెట్టడమంటే ప్రమాదాలను ఆహ్వానించడమే! అయినప్పటికీ వెరపకుండా ధర్మానికి లోబడి ముందుకు వెళుతూ ఉంటే విజయం వెన్నంటి నడుస్తుంది. ఒక ఊరిలో ఓ నిరుపేద కూలీ ఉండేవాడు. జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. అనేక ఎదురుదెబ్బలు తిన్నాడు. ఎన్నోకష్టాలు భరించాడు. అయినా ఏనాడూ కుంగిపోలేదు. ఎప్పుడూ సంతోషంగా, హాయిగా, నవ్వుతూ ఉండేవాడు. చూసేవాళ్లకు చాలా ఆశ్చర్యం వేసేది. ఇన్నిన్ని బాధలు భరిస్తూ కూడా ఇంత హాయిగా ఎలా ఉండగలుగుతున్నావూ.. అని అతడిని అడిగేవారు. దానికతను ‘‘అల్లాహ్ ఏ ప్రాణి పైనా దాని శక్తికి మించిన బాధ్యత మోపడు. మనం వద్దని అనుకున్నంత మాత్రాన రానున్నవి రాకమానతాయా? ఇదొక్కటి తెలుసుకుంటే చాలు’’ అని చిరునవ్వుతో సమాధానం చెప్పేవాడు.అందుకే, కష్టాల కరవాలం దూసుకొస్తున్నప్పుడు ధైర్యంగా, ఒడుపుగా దాని పిడిని పట్టుకోవాలంటారు పెద్దలు. అలా కాకుండా భయపడుతూ, బెదురుతూ పట్టుకోబోతే పిడివైపుకు బదులు మరో భాగం చేతికి దొరికి గాయాలు కావచ్చు. ప్రమాదం ఏర్పడవచ్చు. ధైర్యసాహసాలు కూడా సరైన విధంగా, యుక్తిగా ప్రయోగిస్తేనే చక్కని సాధనంగా ఉపకరిస్తాయి. కష్టాలకు, కన్నీళ్లకు బెదిరిపోకుండా నిలకడను, శక్తిని ప్రసాదిస్తాయి. భయం, పిరికితనం అన్నవి మనిషిని జీవచ్ఛవంగా మారుస్తాయి. ఉత్సాహం నీరుగారి పోతుంది. ధైర్యసాహసాలంటే మరేమిటోకాదు. మనిషి ధర్మానికి కట్టుబడి జీవించడం. తన విధి, బాధ్యతలను విలువైనవిగా గుర్తించడం. ఏదీ సాధించలేకపోవడానికి, ఏదో ఒకటి సాధించడానికి మధ్యన ఉన్న బేధమే ధైర్యం. మనిషికి అటువంటి తర్ఫీదునిచ్చి ధర్మానికి బద్ధునిగా చేస్తుంది రమజాన్ – మదీహా -
బీఎల్వోల బాధలు పట్టవా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల్లో మహిళా బీఎల్వో (బూత్ లెవల్ ఆఫీసర్లు)లు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గురువారం లోక్‌సభ ఎన్నికల పోలింగ్ విధుల్లో బీఎల్వోలకు సరైన సౌకర్యాలు లేక, మండుటెండలో విలవిలలాడాల్సిన పరిస్థితి ఎదురైంది. పలు చోట్ల కూర్చోవడానికి సరిపడా కుర్చీలు, తాగడానికి నీరు కూడా లేక ఇబ్బందులు పడ్డారు. కొన్ని జిల్లాల్లో చెట్ల నీడలు, గోడల పక్కన కూర్చుని విధులు నిర్వర్తించుకోవాల్సిన దుస్థితి ఎదురైంది. వీరికి కనీస సదుపాయాలు కల్పించాల్సిన జిల్లా ఎన్నికల యంత్రాంగం అవేమీ పట్టనట్లు వ్యవహరించిందని పలువురు బీఎల్వోలు ఆవేదన చెందారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, భూపాలపల్లి, జనగాం జిల్లాల్లో సరైన వసతుల్లేక బీఎల్వోలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీటికి తోడు ఏజెంట్ల బెదిరింపులు, ఓటరు స్లిప్పుల పంపిణీలో తప్పిదాలతో నానా చీవాట్లు పడాల్సిన పరిస్థితి తలెత్తింది. హైదరాబాద్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో కమలమ్మ అనే అటెండర్ స్పృహ తప్పి పడిపోయింది. ఇలాంటి ఘటనలు పోలింగ్ సమయంలో తరచూ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. అంగన్వాడీలే అధికం.. బీఎల్వో డ్యూటీ చేసే వాళ్లలో 80 శాతం అంగన్వాడీ కార్యకర్తలే ఉండగా మిగిలిన 20 శాతం ఆశ కార్యకర్తలు, సాక్షరభారత్, రెవెన్యూ అధికారులు ఉన్నారు. చాలీ చాలని జీతాలతో పగలనక రాత్రనక కష్టపడి పనిచేసినా అధికారుల నుంచి, ఓటర్ల నుంచి చీవాట్లు తప్పడం లేదని వాపోతున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు డోర్ టు డోర్ సర్వే చేసే సమయంలో రాజకీయ నాయకులు పార్టీలకు ప్రచారం చేస్తున్నారా అంటూ వేధింపులకు పాల్పడుతున్నారని, అలాగే ప్రతి సంవత్సరం బీఎల్వోలకు రావాల్సిన రెమ్యునరేషన్ ఏడు వేల రూపాయలను కూడా ఆర్డీవో స్థాయి అధికారులు చెల్లించకుండా వేధిస్తున్నారని, ప్రశ్నించిన వారిని సస్పెండ్ చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని ఇలా పలు సమస్యలతో సతమతమవుతున్నట్లు పలువురు ఆవేదన చెందుతున్నారు. గతేడాది బీఎల్వో రెమ్యునరేషన్ విషయమై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లడంతో 2017 సంవత్సరం రెమ్యునరేషన్ మాత్రమే చెల్లించారని, అది కూడా పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల బీఎల్‌లోలకు అందడం లేదని వాపోతున్నారు. నో వాటర్, నో టిఫిన్.. మండుటెండలో విధులు నిర్వర్తిస్తున్న బీఎల్వోలలో కొంతమంది దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాగునీరు కూడా లేక ఉదయం 7 గంటల నుంచి విధుల్లో ఉన్న బీఎల్వోలకు కనీసం టిఫిన్ కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డట్లు పలువురు బీఎల్వోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎల్వోల విధులు.. ►ఓటరు స్లిప్పులు అందించడం ►కొత్త ఓటర్లను నమోదు చేయడం ►డోర్ టు డోర్ సర్వే చేయడం ►ఓటరు కార్డులో ఏవైనా తప్పులుంటే 8సీ ఫామ్ సంబంధిత తహసీల్దార్‌కి అందించడం పట్టించుకునేవారు లేరు.. బీఎల్వో డ్యూటీ చేసే అంగన్వాడీ కార్యకర్తల్లో వయసు పైబడిన వారు పోలింగ్ కేంద్రాల్లో వసతుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలనే కనీస గౌరవం కూడా లేకుండా ఏజెంట్ల బెదిరింపులు, రాజకీయనాయకులు ఒత్తిళ్లకు గురిచేస్తున్నారు. ఏటా ఇవ్వాల్సిన రూ.7 వేలు కూడా చెల్లించకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయంపై ఎన్నికల అధికారులు దృష్టి సారించి మా సమస్యలు పరిష్కరించాలి. భిక్షపమ్మ, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ స్టేట్ ప్రెసిడెంట్ -
వజ్రాల బేహారి
ఒక ముఖ్యమైన వ్యవహారం– ఆ రాత్రి నన్ను చాన్సరీ లేన్ వద్ద వుండేలా చేసింది. కొంచెం తలనొప్పిగా కూడా ఉండటం వల్ల ఇతరత్రా ఏ పనిమీదా మనసు పోలేదు. ఆ రోజు ఆకాశం నిర్మలంగా, మనోజ్ఞంగా ఉంది. నది గట్టు వైపు అడుగులేశాను. నల్లని నీళ్ళల్లో ప్రతిఫలిస్తున్న దీపాల తళుకులు– వాటర్లూ వంతెన ఆర్చి కన్నా ఎత్తులో కనిపిస్తూ– తీరం హద్దునుచూపిస్తున్నాయి. కనువిందు చేస్తున్న ఆ దృశ్యాన్ని తదేకంగా చూస్తూ, వేడెక్కిన మెదడును చల్లార్చుకో సాగాను. ‘ఈ రాత్రి వెచ్చగా వుంది కదూ?’ ఎవరిదో కంఠస్వరం వినబడితే అటు చూశాను ఒక బక్కపల్చటి వ్యక్తి పిట్టగోడ నానుకొని నిల్చున్నాడు. అతని ముఖం దీనాతిదీనంగా, కళావిహీనంగా వుంది. మాసిపోయిన అతని కోటు కాలరు పైకి లేచి వుండి, గొంతు చుట్టూ బిగించబడి వుంది. అతడు ధరించిన దుస్తులు పేదరికానికి ప్రతీకగా ఉన్నాయి. కుతూహలంగా చూశానతని వైపు. అతనికి నాతో ఏం పని? డబ్బు యాచించడానికా? లేక తన దీన చరిత్ర వినిపించడానికా? నుదురు, కళ్లు అతడు తెలివైన వాడని తెలియజేస్తున్నాయి. ‘అవును.’ అని సమాధానమిచ్చాను. ‘మానసిక విశ్రాంతి పొందాలంటే లండన్‌కు మించిన ప్రదేశం మరొకటి ఉండదు. రోజంతా వ్యాపార వ్యవహారాలతో అలసిన గుండెల్ని సేదతీర్చడానికి, బాధ్యతలను ఒకసారి సింహావలోకనం చేసుకోవడానికి ఇంతకంటే అనువైన చోటు మరెక్కడుంటుందో నాకు తెలియదు’ అన్నాడు. వాక్యానికీ వాక్యానికీ మధ్య దీర్ఘ విరామమిచ్చి మాట్లాడాడు. ‘మీరు, ఈ భూప్రపంచంలో తినడానికి కూడా తిండి దొరకని అభాగ్య వ్యధిత జీవితాల గురించి, ఒక్క పెన్నీ కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టడానికి వెనుదీయని మనుషుల గురించి కొంచెం తెలుసుకోవాల్సిన అవసరముంది. లేకుంటే మీరు ఈ లోకంలో అనామకునిగా మిగిలిపోతారు. నాలాగే తల చెడుపుకొని, మానసికంగా విసిగి వేసారి, ఎన్నో కష్టాలు పడిన వ్యక్తిగా నాకనిపించడం లేదు మీరు. ఈ మానవ సమాజం– డబ్బు, పేరు ప్రతిష్టలు, సంఘంలో పలుకుబడి, హోదాల మీద ఆధారపడి– మనుగడ సాగిస్తూ ఉన్నది. ఎవరికి తగిన వృత్తిలోకి వారు దిగిపోవడం మంచిదని చాలామంది అభిప్రాయం... కానీ నా అభిప్రాయాలూ, ఆశయాలు భిన్నమైనవి. నాకు నేను నిర్దేశించుకున్న జీవిత లక్ష్యాలు సంక్లిష్టతతో కూడుకున్నవి. ప్రపంచవ్యాప్తంగా గొప్ప కీర్తి గడించుకోవాలనే వాంఛ, ప్రగాఢంగా వుంది నాలో. కానీ నా జీవిత చరమాంకంలో మిగిలేది నిరాశా నిస్పృహలు, పశ్చాతాపంతో కరిగిపోయిన నా ఈ శరీరం, వ్యధిత హృదయం తప్ప మరేమీ మిగలదేమోననిపిస్తుంది.’’ అతని వైపు ఆశ్చర్యంగా చూశాను. నేనెప్పుడైనా నా జీవితంలో ఒక అత్యంత నికృష్ట నిరాశా జీవిని చూసి వుండటం గాని జరిగి వుంటే– ఇదుగో నా ముందు నిలుచున్నటువంటి దీన వదనుడే అయివుంటాడు. నేను బిగ్గరగా నవ్వేశాను.‘మీకు అన్ని విషయాలూ చెప్పడమే మంచిది. ఇటువంటివి ఇతరులకు చెప్పుకోవడంలో ఎంతో మానసిక సుఖముంది. అందునా మీ వంటి వారితో. నిజం చెప్పాలంటే నా వద్ద ఒక పెద్ద వ్యాపారానికి సంబంధించిన వ్యవహారమే ఉంది. మీరూహించనంత భారీ వ్యాపారం. కానీ అందులో లెక్కలేనన్ని చిక్కులు, ఇబ్బందులు ఉన్నాయి. ఇంతదాకా వచ్చి అసలు విషయం చెప్పకపోతే ఎలా? ఎన్నో కష్టాలు పడి, నా ఈ చేతులతో స్వయంగా తయారు చేసినట్టి ఖరీదైన వజ్రాలున్నాయి నా వద్ద.. ’ వజ్రాలు అనే మాటను నొక్కి పలుకుతూ. ‘ఓహో! నీకిప్పుడేమీ పనీ పాటా లేనట్లుంది. అందుకే అలా మాట్లాడుతున్నావు. అవునా?‘ అన్నాను. ‘మీ వెటకారపు మాటలు నా మనసును గాయపరుస్తున్నాయి’ అని అసహనం వ్యక్తపరుస్తూ అకస్మాత్తుగా, మురికితో అట్టలు కట్టివున్న అతని కోటు గుండీలు టకాటకా విప్పాడు. ఒక దారం ఆధారంగా అతని మెడలో వేలాడుతున్న కాన్వాసు సంచిని బయటికి తీశాడు. ఆ సంచిలోంచి ఒక గోధుమరంగులో వున్న గులకరాయిలాంటి వస్తువు నా చేతికిచ్చి... ‘నేను భౌతిక శాస్త్రం, ఖనిజ శాస్త్రాలలో కొంచెం ప్రావీణ్యం సంపాదించాను. మీ చేతిలో వున్న గులకరాయివంటి వస్తువు ఏమిటో గుర్తించారా?... శాస్త్రీయ పద్ధతిలో, ఒక నిర్దుష్ట క్రమాన్ననుసరించి తయారు చేసిన గోధుమరంగు షట్భుజ వజ్రం సార్! అతి ఖరీదైన వజ్రం!’ అని చెప్పాడు. అది రమారమి నా బొటనవేలి అగ్రభాగమంత వుంది. వెనక్కి వంపులు తిరిగిన ఉపరితల ముఖాలతో, సహజసిధ్ధమైన షడ్భుజవజ్రం లాగానే ఉంది. నా జేబులోనుండి చిన్న కత్తి తీసుకొని దానిమీద గట్టిగా గీరాను. ఒక్క గీతకూడా పడలేదు. నా చేతి గడియారం అద్దం మీద కూడా అలాంటి పరీక్ష చేశాను. ఆశ్చర్యంతో, నమ్మలేనట్లు అతని వంక చూశాను. అది వజ్రమే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ‘‘ఎక్కడి నుండి వచ్చింది నీకిది?‘ అడిగాన్నేను. ‘నేనే తయారుచేశాను. దయచేసి దాన్ని నాకు వాపసిచ్ఛేయండి’ అన్నాడు.అతను ఆత్రంగా అందుకొని దాన్ని యథాస్థానంలో ఉంచి, జాకెట్ గుండీలను బిగించాడు. ‘నేను మీకు ఈ వజ్రాన్ని వంద పౌండ్లకు అమ్ముతాను..’ అతను వెంటనే ఆశగా గొణిగాడు. ఆ మాటలతో నాలో మళ్ళీ అనుమానం తలెత్తింది... ఒకవేళ అది నిజంగా వజ్రమే అయివుంటే, కేవలం వంద పౌండ్లకెందుకమ్మజూపుతాడు? ఇద్దరం ఒకరి కళ్ళలోనికొకరు చూసుకొన్నాం. అతని ముఖంలో ఆత్రుత కనిపిస్తూ వుంది. ఆ ఆత్రుత వెనుకనున్న నిజాయితీని పసిగట్టగలిగాను. మొదట అనుమానపడినా, బాగా ఆలోచిస్తే అది అచ్చమైన వజ్రమే అని నమ్మకం కుదిరింది. పైగా ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త హెన్రీ మొయిసన్ తయారు చేసిన వజ్రాల గురించి నాకు కొంత తెలుసు. కానీ అవి పరిమాణంపరంగా మరీ చిన్నవి. నేను పెద్ద ధనికుణ్ణి కాను. వంద పౌండ్లు నా మొత్తం ఆదాయంలో పూడ్చలేని లోటు. పైగా వివేకవంతుడెవరూ ఆ గుడ్డివెలుతురులో, గబ్బువాసన గొట్టే బికారిని నమ్మి, అతని వద్ద నుంచి వజ్రాన్ని కొనుగోలుచేయడు. అది అత్యంత ఖరీదైన వజ్రం. నేను తల పంకించాను. ‘మీకు ఇలాంటి విషయాలలో ఏదో కొంత అవగాహన ఉన్నట్టుంది. అందుకే నన్ను గురించి ఇంకా కొంచెం చెప్పాలనుకుంటున్నాను. అందువలన మంచి బేరం కుదరడానికి అవకాశముంటుంది.’ అంటూ నది వైపుగా అతని వీపు తిప్పి, ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకొని ఒక దీర్ఘనిశ్వాసం వదిలాడు. ‘నా పట్ల వున్న అనుమానం తొలగి, మీకు నాపై విశ్వసనీయత పాదుకొల్పాలంటే, వజ్రాలను ఏ విధంగా తయారు చేశానో మీకు చెప్పడం మంచిది’అలా మాట్లాడుతున్నప్పుడు ఇదివరకటిలా కాకుండా, అతని కంఠస్వరములో– కొంచెం సున్నితత్వం, సరళత, చదువుకున్న వాడి తరహా సంతరించుకొన్నాయి. ‘మామూలు బొగ్గును తగినటువంటి రసాయన ద్రావణంలో ముంచి ఉద్గారాలను వేరుచేయాలి.అవసరమైనంత మేరకు వేడిచేసి, తగిన ఒత్తిడి కలిగించాలి. అప్పుడవి చిన్నచిన్న వజ్రాలుగా మారతాయి. ఎంతోమంది రసాయన శాస్త్రజ్ఞులు ఏళ్లపర్యంతం కృషి చేసి ఎన్నో ప్రయోగాలు చేశారు. కానీ ఏ ఒక్కరు కూడా కచ్చితమైన నిష్పత్తిలో, నిర్దిష్టమైన ద్రావణంతో కలిపి, కచ్చితమైన ఉష్ణ ఒత్తిడిని కలిగించి బొగ్గును కరిగించలేక పోయారు. ఫలితంగా అతి చిన్న వజ్రాలు మాత్రమే ఉత్పత్తయ్యాయి. అవి సాధారణ ఆభరణాలపాటి విలువకూడా చేయలేదు. నేను ఈ సమస్య పరిష్కారం కోసం అవిరామ కృషి చేశాను. ఆఖరి రక్తపు బొట్టును సైతం ధారపోశాను. కచ్చితమైన విధానాన్ని అనుసరించి వజ్రాలు తయారుచేసే స్థాయికి చేరుకునేటప్పటికి నా వయస్సు పదిహేడు. ప్రస్తుతం నాకు ముప్పై రెండు. దాదాపు రెండు దశాబ్దాల నిర్విరామ కృషి, శక్తి సామర్థ్యాలను నా ఈ ఆశయ సాధన కోసమే వినియోగించాను. ఈ తంత్రాన్ని సరియైన పద్ధతిలో ఉపయోగించగలిగితే కోటాను కోట్ల విలువైన వజ్రాలను ఉత్పత్తి చేయవచ్చు’ అతని కళ్ళు నా వంక ఆకలితో చూస్తున్నాయి. అతను తిరిగి చెప్పసాగాడు. ‘నేను ఇరవైఒకటో పడిలో ఉండగా నా వద్ద వెయ్యి పౌండ్లు వుండేవి. ఆ డబ్బుతో నా పరిశోధన సాగించాను. ముఖ్యంగా బెర్లిన్ లో ఒకటి రెండు సంవత్సరాలు విద్యాభ్యాసం చేశాను. ఆ తర్వాత సొంతగా చదువుకున్నాను. నా పరిశోధనల రహస్యాన్ని బయటికి పొక్కకుండా చూసుకోవడం నా శక్తికి మించిన పనైంది. ఈ విషయం మరెవరికైనా తెలిసిందంటే వారు కూడా కృత్రిమ పద్ధతుల ద్వారా వజ్రాలు చేయడం మొదలు పెడతారు. అప్పుడు వజ్రాలు విలువలేని బొగ్గు ముక్కల్లాగా పరిగణించబడతాయి. అందుకని ఒంటరిగానే నేనీ పని చేయడం తప్పనిసరైంది. మొదట్లో నాకొక చిన్న లాబరేటరీ ఉండేది. నా ప్రయోగాలన్నీ కేంటీస్ నగరంలో సర్వవిధాల అసౌకర్యంగా ఉన్న గదిలోనే నిర్వహించుకొన్నాను. నేనక్కడే ఎండుగడ్డి చాపపైన, నేలమీద, ప్రయోగశాల పరికరాల మధ్యనే నిద్రపోయేవాడిని. ఉన్న డబ్బంతా ఖర్చైపోయింది. నా దౌర్భాగ్యస్థితిని తలచుకొని నన్ను నేను అమితంగా అసహ్యించుకొనేవాడిని. సైన్సు సబ్జక్ట్ బోధించి అంతో ఇంతో డబ్బు ఇబ్బంది తొలగించుకుందామనుకొంటే నాకు యూనివర్సిటీ డిగ్రీలు లేవు. సైన్సు పాఠాలు బోధించే సమర్థత నాకు లేదు. కెమిస్ట్రీ చదువుకున్నాను తప్ప ఇతరత్రా విద్యార్హతలు లేవు. అన్నింటినీ మించి అతి తక్కువ డబ్బుకోసం విలువైన నా సమయాన్ని, శ్రమను వృథా పరుచుకోవడానికి నా మనసు అంగీకరించలేదు’‘మూడేండ్ల క్రితం, లోహాల్ని కరిగించి మిశ్రమాన్ని రూపొందించే ప్రక్రియకు సంబంధించిన ముఖ్య సమస్యను పరిష్కరించగలిగాను. తుపాకీ గొట్టంలోనికి లోహమిశ్రమాన్ని బొగ్గుతో సమ్మిళితంచేసి, దట్టించి కూరాను. తరువాత అందులో నీళ్లు పోసి, గట్టిగా మూత బిగించి, తగిన స్థాయిలో వేడిచేశాను. అది పేలిపోయింది. నా గది కిటికీలను, ప్రయోగ సంబంధిత పరికరాలను చాలామేరకు ధ్వంసం చేసేసిందా పేలుడు. ఏదేమైనా, కొంచెం వజ్రపుపొడి లభించింది. ఆ సమస్య ద్వారా గడించిన అనుభవాన్ని పురస్కరించుకొని, ప్యారీస్ ల్యాబరేటరీస్‌లో డ్యాబ్రిస్ అనే రసాయన శాస్త్రజ్ఞుడు తయారుచేసిన పొడుల గురించి చేసిన పరిశోధనలను అధ్యయనం చేశాను. డ్యాబ్రిస్– పకడ్బందీగా స్క్రూలతో బిగించబడి, అంత సులభంగా పేలని అత్యంత బలిష్టమైన స్టీల్ సిలిండర్ లోపల డైనమైట్ ను పెట్టి పేల్చాడు. రాళ్లను రేణువులుగా మార్చగలిగాడు. నేను అతని విధానాన్ని అనుసరించి మళ్ళీ ప్రయోగం మొదలు పెట్టాను. అధిక ఉష్ణోగ్రతకు కరిగి ద్రవస్థితికి మారిన లోహమిశ్రమం మీద అత్యధిక పీడన కలిగింపజేసే సమస్యను ఒక కొలిక్కి తెచ్చాను. ఒక స్టీలు సిలిండర్ సంపాదించి, నా దగ్గరున్న రసాయన సామగ్రినంతా అందులో వేసి కూరాను. దాన్నలాగే వదలిపెట్టి వాహ్యాళికెళ్ళాను.’‘అది ఇంటిని మొత్తం పేల్చేస్తుందని అనుకోలేదా? చుట్టుపక్కల జనం ఉంటారనే స్పృహ కూడా నీకు లేకపోయిందా?‘ అని అడిగాను. ‘సైన్సు పట్ల నాకున్న శ్రద్ధ అటువంటిది. నా గది కింది భాగంలో వీధిలో పళ్లు అమ్ముకొనే కుటుంబం, వెనుకభాగంలో డాక్యుమెంట్ రైటర్, పై అంతస్తులో ఇద్దరు పూలమ్మే ఆడవాళ్ళున్నారు. కొందరు బయటికెళ్ళి వుంటారనుకొంటాను.‘నేను వెళ్ళేటప్పుడు పరిస్థితి ఎలా వుందో, తిరిగి వచ్చేటప్పటికి కూడా అలాగే ఉంది. సిలిండర్ పేలలేదు. తరువాత కొన్ని సమస్యలనెదుర్కొన్నాను. స్థిరమైన, స్పష్టమైన రూపురేఖలేర్పడి స్ఫటికాలు రూపొందాలంటే, కాలవ్యవధి అనే అంశం అత్యంత ప్రధానమైనది. తొందర పడితే చిన్న చిన్న రేణువుల్లాంటివి మాత్రమే మిగులుతాయి. సుదీర్ఘకాలం సహనంతో వేచివుంటేనే పెద్ద పెద్ద వజ్రాల్ని పొందవచ్చు. అందుకని ఆ పరికరం క్రమంగా చల్లబడేందుకు రెండేండ్ల పాటు కదిలించకూడదని నిర్ణయించుకున్నాను.అప్పుడు నా వద్ద చిల్లి గవ్వ కూడా లేదు. ఆ యంత్రాన్ని పరిరక్షించుకోడానికీ, గది అద్దె చెల్లించడానికి, నా ఆకలి తీర్చుకోడానికి కూడా నా చేతిలో ఒక్కటంటే ఒక్క పెన్నీ కూడా లేదు. న్యూస్ పేపర్లమ్మాను. గుర్రాలను మేపాను. కార్లు తుడిచాను. తోపుడు బండి వాడికి సహాయకుడిగా పనిచేశాను. వారంలో ఒకసారి నాకు చేయడానికి పనేమీలేని ఒకరోజు నేనేమీ తినలేదు. ఒక యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ ఎదుట మెహర్బానీ ప్రదర్శించాలని, నాకు ఆరు పెన్నీలిచ్చాడు– అది నా అదృష్టం. ఆ డబ్బుకూడా ప్రయోగాల కోసమే ఖర్చుపెట్టాను. చివరకు, సిలిండరును పక్కకు తీసి స్క్రూలను ఊడదీశాను. నుసిగా మారిన పొడిని ఉలితో గోకి, ఒక ఇనుప పళ్లెంలోకి చేర్చి సుత్తితో బాగా కొట్టాను. ఇంకా నేను అనుసరించిన కొన్ని ప్రక్రియల తరువాత, చివరకు మూడు పెద్ద సైజు వజ్రాలు, అయిదు చిన్నపాటి వజ్రాలు తయారయ్యాయి.నేను నేలమీద కూర్చొని సుత్తితో బాదుతున్న సమయంలో, నా గది వాకిలి తెరుచుకొని నా పొరుగునున్న డాక్యుమెంట్ రైటర్ లోపలికొచ్చాడు. అతడు మామూలుగానే తాగిన మైకంలో ఉన్నాడు. తలుపుకానుకొని నిల్చుని ‘నువ్వు ఈ ఇంటిని బాంబులు పెట్టి పేల్చాలని చూస్తున్నావు. ఇప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసి వస్తున్నాను.’ అంటూ ఏదేదో వదరుతూనే ఉన్నాడు. నేనప్పటికే జాగ్రత్త పడివున్నాను. నా ఈ రహస్యం పోలీసులకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇన్నేళ్లు నేను పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరై పోతుందనుకొంటూ, ఆ డాక్యుమెంట్ రైటర్ గాడి కాలరు పట్టుకొని, కిందపడేసి తొక్కాను. తరువాత వజ్రాల్ని పోగుచేసుకొని బయటికొచ్చేశాను. పేరుపొందిన నగల వ్యాపారస్తుని వద్ద కెళ్ళాను. అతడు నన్ను కొంచెం సేపు వేచి ఉండమని చెప్పి, పోలీసులను పిలవమని గుమాస్తాతో గుసగుసలాడడం గమనించి, నేను అప్రమత్తమై ‘వేచివుండలేన’ని చెప్పి అక్కడి నుంచి బయట పడ్డాను. దొంగ నగలు కొనుక్కొనే ఒక దుర్మార్గుడు తారసపడ్డాడు. పరిశీలించడానికని అతని చేతికి ఒక వజ్రమిచ్చాను. వాపసిమ్మని అడిగితే, పోలీసులకు పట్టిస్తానని బెదిరించాడు.ప్రస్తుతం నా మెడలో వెలకట్టలేని వజ్రాల సంచి కట్టుకొని పిచ్చివాడిలా తిరుగుతున్నాను. అన్నమూ, ఆశ్రయంలేక అలమటిస్తున్నాను. నమ్మతగిన వ్యక్తిగా అనిపించింది మీరొక్కరే. మీ ముఖం నాకు నచ్చింది. ప్రస్తుతం నా పరిస్థితి చాలా దారుణంగా వుంది.’ అంటూ నా కళ్ళల్లోకి చూశాడు దీనంగా. ‘ఇటువంటి పరిస్థితులలో నేను వజ్రాన్ని కొంటానని ఎలా అనుకున్నావు? వందలకు వందలు నేను జేబులో పెట్టుకు రాను. ఇక అసలు విషయానికొస్తే, నువ్వు చెప్పిన కథ నేను పూర్తిగా నమ్మలేదు. అయినా నీకిష్టమైతే రేపు నా ఆఫీసుకొచ్చి కలుసుకో.’ అని చెప్పాను.‘మీరు నన్ను దొంగ అనుకుంటున్నారా? నన్ను పోలీసులకు పట్టించాలనే ఈ ఎత్తు వేశారు. నేను మీ ఉచ్చులో పడను’.‘నువ్వు దొంగవు కాదనే నమ్ముతున్నాను. ఇదిగో నా కార్డు. ముందుగా అపాయింట్మెంట్ తీసుకోనవసరం లేదు. ఎప్పుడైనా కలుసుకోవచ్చు’ అని చెప్పాను.అతను నామాటలు విశ్వసించి వెళ్లిపోయాడు. అదే అతణ్ని కడసారి చూడడం. నేను బయటికెళ్లినప్పుడొకసారి అతడొచ్చాడని,ఆ వ్యక్తి చాలా బలహీనంగా ఉన్నాడని, విపరీతంగా దగ్గుతున్నాడని, ఎటువంటి సమాచారం ఇచ్చివెళ్ళలేదనీ, నా ఆఫీసులో పనిజేసే ఉద్యోగి చెప్పాడు. తరువాత ఆ వజ్రాల బేహారి మళ్ళీ కనబడలేదు. ఒకసారి అతడు– తనకు బ్యాంక్ నోట్లు తప్ప చెక్కులు పంపకూడదని కొన్ని చిరునామాలు ఉటంకిస్తూ – రెండు ఉత్తరాలు రాశాడు. నేను బాగా ఆలోచించాను. అతడు నిజంగా పిచ్చివాడా? గులకరాళ్ళతో వ్యాపారం చేసే మోసగాడా? కృత్రిమ వజ్రాలు తయారు చేసేవాడా? చివరిది నమ్మతగినదిగా వుంది. నేను జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని జారవిడుచుకొన్నాననిపిస్తుంది. అతనేమై ఉంటాడా? అని ఆలోచించాను. బహుశా అతను మరణించి ఉంటాడు. అతడు మేధను మథించి, కడుపుకట్టుకొని సృష్టించిన అమూల్యమైన వజ్రాలు నేలపాలైవుంటాయి. వాటిలో నా బొటనవేలి ఊర్ధ్వ భాగమంత భారీ వజ్రం కూడా ఉంటుంది. లేకుంటే అతనింకా మెడలో హారంగా ధరించి, అతన్ని అనుమాన దృక్కులతో చూసే ప్రజలకు, వజ్రాలను అమ్మడానికి నిరర్థక ప్రయత్నం చేస్తూ వీధులవెంబడి తిరుగుతూవుంటాడు. నా తెగింపు లేని తనాన్ని తిట్టుకొంటూ వుంటాడు.ఏళ్లతరబడి దరిద్రమనుభవించి, అతడు ఎంతో విలువైన వజ్రాలు తయారు చేశాడు. కానీ వాటివల్ల కించిత్తు కూడా లబ్ధి పొందలేక పోయాడు. నేను ఒక్కొక్కసారి అనుకొంటుంటాను– అతనడిగిన వంద పౌండ్లు కాకపోయినా, కనీసం ఐదు పౌండ్లు చెల్లించే ధైర్యం చేసి వుండాల్సిందని. ఇంగ్లిష్ మూలం : హెచ్.జి. వెల్స్ అనువాదం: శొంఠి జయప్రకాష్ -
మానుకైనా వస్తుంది
కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయా.. అంటారు. మానులకు వచ్చే కష్టాల గురించి మనకు తెలియక అలా అనుకుంటామేమో మరి. మానులకు కష్టాలు వస్తాయా లేదా అనే మాట అంటుంచితే మానుల వల్ల మనుషులకు వచ్చే కష్టాలు తక్కువే. ఏవో విపత్తులు, విలయాలు సంభవించి మానులు విరిగిపడితే తప్ప మనుషులకు కష్టాలు రావు. అందుకే మనిషికి కష్టం వచ్చిందంటే అది మనిషి వల్లనే అయి ఉంటుంది. ఎంత మంది మనుషులున్నారో, మనుషుల వల్ల మనుషులకు అన్ని రకాల కష్టాలు వస్తుంటాయి. కష్టాల పాలయ్యే మనుషుల గురించి, కష్టాల పాల్జేసే మనుషుల గురించి కొత్తగా చెప్పుకోడానికి ఎప్పుడూ ఏమీ ఉండదు. ఫ్రెష్‌గా అప్పటికప్పుడు పడిపోయినప్పుడు తెలుసుకోవడమే. కష్టం అనేది చిన్న మాట. ఇందులో తీవ్రతలు ఉంటాయి. కష్టాన్ని తట్టుకునే మనిషిని బట్టి ఆ తీవ్రతలు కొద్దివో, పెద్దవో అవుతుంటాయి తప్ప, తీవ్రతకు కొలబద్ద అంటూ ఏమీ ఉండదు. బతకలేకపోవడం అన్నిట్లోకీ పెద్ద కష్టం. డబ్బు లేక బతకలేక పోవడం, ఆరోగ్యం లేక బతకలేకపోవడం, అవమానం తట్టుకోలేక బతకలేకపోవడం, ఆత్మగౌరవం దెబ్బతిని బతకలేకపోవడం.. ఇవన్నీ పెద్ద కష్టాలే. ముఖ్యంగా ఆడపిల్లలు. రక్షణ ఉండాలి వాళ్లకు. అది లేకపోవడం బతకలేకపోవడాన్ని మించిన కష్టం. కొద్దిరోజులుగా వింటున్నాం. జగత్తుకు ఏ చీడో పట్టినట్లు అన్నీ అత్యాచారాల ఘటనలే. అడవిలో మానుల్ని కూడా వదిలిపెట్టేలా లేదు ఈ చీడ. మామూలుగా.. కష్టపడిన వాళ్లపై సానుభూతి ఉంటుంది. కష్టపెట్టినవాళ్లపై కోపం ఉంటుంది. తప్పు ఎటుందీ అని కాకుండా, కష్టం ఎటుందీ అనే దాన్ని బట్టే లోకంలో తీర్పులు ఉంటాయి. తప్పులేదు. తాత్కాలికంగా అలాంటి తీర్పులు అవసరమే. ‘జాగ్రత్తగా లేకపోవడం నీ తప్పే’ అని.. కష్టంలో ఉన్నవాళ్లను ఇంకా కష్టపెట్టలేం కదా. అలాగని జాగ్రత్త చెప్పకుండా ఉండడం కూడా కష్టంలోకి నెట్టడమే అవుతుంది. ఒక అమ్మాయికి కష్టం వచ్చిందంటే అందులో ఆమె కొని తెచ్చుకున్న కష్టం కూడా కొంత ఉంటుందని మమతా మోహన్‌దాస్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఈ మాట ఎవరికీ రుచించలేదు. ‘అందమైన లోకమనీ, రంగురంగులుంటాయని’ నమ్మడం ఆడపిల్ల తప్పెలా అవుతుందని అన్నారు. నిజమే కానీ ఆ రంగుల మధ్య మగవాడి అసలు రంగును పోల్చుకోలేకపోవడం ఆడపిల్ల తప్పే అవుతుంది. – మాధవ్ శింగరాజు -
సినిమా కష్టాలు
-
పాల కోసం కష్టాలపాలు
తుని రూరల్: కాసిని పాల కోసం ఆశపడ్డ ఆ పిల్లి.. ‘తన శత్రువులైన కుక్కలు కూడా పడకూడదురా దేవుడా!’ అనిపించేంత కష్టాల పాలైంది. చివరికి ఓ మనిషి పుణ్యంతో ‘బతుకు జీవుడా!’ అని తల దక్కించుకుంది. ఆదివారం తుని మండలం హంసవరం శివారు జిల్లేడుపాడులో ఎస్సీ కాలనీవాసులు వంటావార్పు చేసుకుని కూలి పనులకు వెళ్లిపోయారు. ఆ సమయంలో సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో చొరబడ్డ ఓ పిల్లి పాల కోసం వెతుకులాడుతూ..ఓ చెంబులో తల దూర్చింది. చెంబులో తల ఇరుక్కుపోవడంతో ‘మియాం.. మియాం..’ అంటూ ఎంత గింజుకున్నా నొప్పి తప్ప విముక్తి లభించలేదు. కాసేపటికి అటుగా వెళుతున్న అప్పారావు అనే వ్యక్తి దాన్ని గమనించాడు. ‘అయ్యో! పాపం.. పిల్లి!’ అనుకుని జాలిపడ్డాడు. చెంబు పట్టుకుని పైకి లేపి, ఒడుపుగా లాగడంతో పిల్లి తలతో సహా చెంబు నుంచి జారిపడి, ఉరుక్కుంటూ పోయింది. -
కష్టాలు వింటే కంటనీరొస్తుంది
నెల్లూరు జిల్లా: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల కష్టాలు వింటుంటే కంటనీరు వస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మనుబోలు మండలం ధాన్యం కేంద్రంను కాకాణి శుక్రవారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జిల్లా మంత్రి సోమిరెడ్డి వల్లనే రైతులకు గిట్టుబాటు ధరలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లర్ల దగ్గర మంత్రి సోమిరెడ్డి ముడుపులు తీసుకుని రైతులకు కన్నీళ్ళు పెట్టిస్తోన్నాడని ధ్వజమెత్తారు. రైతులు 6 లక్షల టన్నుల బీపీటీ ధాన్యం అమ్మేసిన తర్వాత మంత్రి సోమిరెడ్డి ధాన్యం ధర పెంపు అంటూ ప్రకటన చేయటం సిగ్గుచేటన్నారు. జిల్లా యంత్రాంగం సోమిరెడ్డి మాటలు విని మిల్లర్లపై చర్యలకు వెనుకాడిందని వ్యాఖ్యానించారు. రైతులను బాధించే సోమిరెడ్డిని, రైతు బాంధవుడంటారా అని ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో సోమిరెడ్డి వైఫల్యం చెందాడని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ప్రకటించిన ధర కూడా రాకపోవడానికి సోమిరెడ్డి అవినీతే కారణమని ఆరోపించారు. సోమిరెడ్డి ప్రకటనలు చూస్తుంటే,దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మొరిగినట్టుందని ఎద్దేవా చేశారు. మిల్లర్లు రైతులను దోచుకుంటుంటే అధికార యంత్రాంగం, చోద్యం చూస్తుందని విమర్శించారు. -
మధ్యలో ఎక్కడినుంచి వచ్చింది?
ఒక ఊళ్లో ఒకాయన ఉండేవాడు. ఆయనకు విపరీతమైన కోపం. ప్రతిదానికీ ఇంట్లోవాళ్ల మీదా, బయటివాళ్ల మీదా అరిచేవాడు. ఈ కోపగొండి స్వభావం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. దాన్ని తగ్గించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు ఒక స్నేహితుడి సలహా మీద, ఒక ఊళ్లో ఒక గురువును సంప్రదించడానికి వెళ్లాడు. గురువు శాంతంగా కూర్చునివున్నాడు. చేతులు జోడించి నమస్కరించి, ‘గురూజీ, నన్ను నేను నియంత్రించుకోలేనంత కోపం వస్తుంటుంది నాకు. అది తగ్గడానికి ఏమైనా పరిష్కారం సూచించండి’ అని అడిగాడు. గురువు ఎంతో మృదువుగా, ‘నీ సమస్య విచిత్రంగా ఉన్నదే! ఏదీ, నన్నో సారి చూడనీ’ అన్నాడు. అతడికి అర్థం కాలేదు. అయోమయంగా ముఖం పెట్టి, ‘అంటే నేను దాన్ని ఇప్పుడు మీకు చూపలేను’ అని చెప్పాడు. ‘మరి నాకు ఎప్పుడు చూపగలుగుతావు?’ అడిగాడు గురువు అంతే మెత్తగా. ఆయన ముఖంలో ఏ వ్యంగ్యమూ లేదు. ‘అంటే... అది నాకు అనూహ్యంగా వస్తుంది’ అన్నాడతను. ‘ఊహూ. అట్లా అయితే అది నీ అసలైన స్వభావం కాదన్నమాట’ వివరించే ధోరణిలో చెప్పాడు గురువు. ‘అది నీ అసలైన స్వభావమే అయితే నాకు ఎప్పుడంటే అప్పుడు చూపగలిగేవాడివి. ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడు అది నీ దగ్గర లేదు. దీని గురించి ఆలోచించు’. -
దప్పిక తీరే దారేది..!
బజార్హత్నూర్(బోథ్): ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. జిల్లాలో భూగర్భ జలమట్టం అడుగంటిపోతోంది. గుక్కెడు నీటి కోసం జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. పశువులు, మూగజీవాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. వాగులు, కుంటలు ఎండిపోవడంతో దాహార్తి తీరక అల్లాడిపోవాల్సి వస్తోంది. పశువుల దప్పిక తీర్చేందుకు ప్రభుత్వం గ్రామాల్లో నీటితొట్టిల నిర్మాణానికి గతంలో నిధులు మంజూరు చేసింది. నిర్మాణ బాధ్యతను స్థానిక ప్రజాప్రతినిధులకు అప్పగించింది. గుత్తేదారులు, సదరు నేతలు ఇష్టానుసారంగా నీటితొట్టిలు నిర్మించి వదిలేశారు. ఉపాధి హామీ అధికారుల పర్యవేక్షణ లోపించడం, సరైన ప్రణాళికలు లేక నీటి సౌకర్యం లేని చోట నిర్మాణాలు చేపట్టారు. దీంతో అవి మూగజీవాల దాహార్తి తీర్చడం లేదు. 576 నీటితొట్టిల నిర్మాణానికి నిర్ణయం.. జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లోని గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 576 నీటితొట్టిలు నిర్మించాలని నిర్ణయించారు. గతంలో ఒక్కో నీటితొట్టి నిర్మాణానికి రూ.18వేల చొప్పున ప్రభుత్వం రూ.1.36 కోట్లు మంజూరు చేసింది. నాసిరకంగా నిర్మించడం, నీటి సదుపాయం కల్పించకపోవడంతో చాలా గ్రామాల్లో వృథాగా మారాయి. జిల్లా మొత్తంలో ఇప్పటివరకు దాదాపు 320 నీటితొట్టిలు మాత్రమే నిర్మించినట్లు తెలుస్తోంది. మరో 56 నిర్మాణంలో ఉండగా, మిగతా 200 నీటితొట్టిల నిర్మాణం ఇంకా మొదలే కాలేదు. పశుసంవర్థక శాఖ లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మొత్తం 5.45లక్షల వరకు ఉన్నాయి. వీటికి వేసవిలో నీటి సదుపాయం కల్పించాలంటే గ్రామాల్లోని నీటితొట్టిలను వినియోగంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉంది. అవసరం లేని చోట నిర్మించడం, నీటి సదుపాయం లేని ప్రాంతాల్లో నిర్మించినవి నిరుపయోగంగా మారడం వల్ల పశువుల దాహార్తి తీరడం లేదని జిల్లా రైతులు వాపోతున్నారు. పంచాయతీల ఆధ్వర్యంలో కొనసాగే బోర్ల నుంచి తొట్టిలకు నీరు సరఫరా చేయాల్సి ఉండగా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో మేతకు వెళ్లిన పశువులు దాహార్తి తీర్చుకోవడానికి తొట్టి వద్దకు వచ్చిన నీళ్లు లేక అల్లాడిపోతున్నాయి. వేసవి దృష్ట్యా అవసరం ఉన్న చోట మూగజీవాలకు నూతనంగా నీటితొట్టెల నిర్మాణం చేపట్టేలా దృష్టి సారించాలని గత నెల 11న కలెక్టర్ డి.దివ్యదేవరాజన్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అధికారులను ఆదేశింంచారు. ఉపాధి మామీ పథకం ద్వారా గతంలో 576 నీటితొట్టిలకు నిధులు మంజూరైనా అందులో నిర్మించకుండా ఉన్న 200 నీటితొట్టిల నిర్మాణానికి ప్రస్తుతం ఒక్కో నీటితొట్టికి రూ.24 వేలు పెంచి మళ్లీ నిధులు మంజూరు చేశారు. అయినా ఉపాధి హామీ అధికారులు వాటి నిర్మాణాలపై దృష్టి సారించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మూగజీవాలపై నిర్లక్ష్యం.. వేసవి నేపథ్యంలో నిరుపయోగంగా ఉన్న నీటితొట్టిలను వినియోగంలోకి తేవాలి. పశుసంవర్థకశాఖ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖ అధికారుల ఎవరికి వారు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నీటితొట్టికి బోరు ఏర్పాటుతోపాటు విద్యుత్తు కనెక్షన్ కల్పించడంలో దృష్టి సారించడం లేదు. నోరులేని మూగజీవాలపై గ్రామ ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి మొదటి వారంలోనే ఎండల తీవ్రతను తట్టుకోలేక ప్రజలు బెంబేలెత్తుతుంటే రానున్న రెండు నెలల్లో ఈ తీవ్రత మరింత పెరిగి మూగజీవాలకు ముప్పు తిప్పలు తప్పవని వాపోతున్నారు. ఉపయోగంలోకి తేవాలి వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా వాగులు, చెలిమెలు, కుంటలు ఎండిపోతున్నాయి. మేతకు వెళ్లిన పశువులకు దాహార్తి తీర్చడం కష్టంగా మారింది. అక్కడక్కడ బురుద నీళ్లు తాగుతున్నాయి. గ్రామాల్లో నిర్మించిన నీటితొట్టిలు మరమ్మతు చేసి ఉపయోగంలోకి తేవాలి. వేసవిలో నీళ్లు దొరకక పశువులు చనిపోయే ప్రమాదం ఉంది. – సంగెపు బొర్రన్న, రైతు స్వరాజ్ వేదిక జిల్లా అధ్యక్షుడు దాహార్తి తీర్చడంపై దృష్టి సారించాం జిల్లాలో 18 మండలాల్లో గతంలో నిర్మించిన నీటితొట్టిలను వినియోగంలోకి తెస్తాం. నిరుపయోగంగా ఉన్న నీటితొట్టిలను మరమ్మతులు చేయించడమే కాకుండా అవసరం ఉన్న గ్రామాల్లో నూతనంగా నిర్మించడానికి నిధులు మంజూరు చేస్తాం. ఇప్పటికే పంచాయతీల వారీగా నీటితొట్టిల వివరాలను సేకరిస్తున్నాం. వేసవిలో మూగజీవాలకు తాగునీటి సమస్య కలగకుండా ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు చేపడతాం. – రాజేశ్వర్ రాథోడ్, డీఆర్డీఏ పీడీ -
కువైట్‌లో రాష్ట్రవాసుల కష్టాలు తీర్చండి
సాక్షి, హైదరాబాద్: కువైట్‌లో తెలంగాణవాసులు 50వేల మందికి పైగా ఇబ్బందులు పడుతున్నారని, ఆ దేశ అంబాసిడర్ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్‌కుమార్ చెప్పారు. సొంత దేశానికి వచ్చేందుకు, ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వారిని భారత్‌కు రప్పించాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. కువైట్‌కు ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని పంపించాలని, ప్రభుత్వ ఖర్చులతోనే బాధితులను రాష్ట్రానికి తీసుకురావాలని కోరారు. కువైట్ నుంచి వచ్చినవారికి ప్రభుత్వం ఉపాధి, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇతర దేశాల్లో ఉన్న ప్రవాసుల గురించి తమ మేనిఫెస్టోలో పెద్ద పెద్ద మాటలు చెప్పిన సీఎం కేసీఆర్ ఆ హామీలను విస్మరించారని విమర్శించారు. మంత్రుల గల్ఫ్ పర్యటనలన్నీ జల్సాలకు, బతుకమ్మ సంబరాలకే పరిమితమవుతున్నాయని ఆరోపించారు. ఎన్నారై పాలసీ రూపొందించడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో గల్ఫ్ బాధితుల సంక్షేమ చట్టాన్ని రూపొందించాలని, రూ.వెయ్యి కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలన్నారు. గల్ఫ్ బాధితులకు సాయం అందించేందుకు టీపీసీసీ నుంచి ఓ బృందం గల్ఫ్ వెళ్లనుందని, వారి బాధితుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. -
ఏప్రిల్ 1న సీపీఐ 2వ రాష్ట్ర మహాసభలు-చాడ వెంకటరెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీపీఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ 2వ మహాసభలను వచ్చే ఏడాది ఏప్రిల్ 1న హైదరాబాద్‌లో నిర్వహించను న్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లో మహాసభలను నిర్వహిస్తున్నామని, ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభలను విజయవంతం చేయా లని ఆయన పార్టీ నాయకులు, శ్రేణులకు పిలుపు ఇచ్చారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. దేశంలో సంఘ్ పరివార్ అరాచకాలు ఎక్కువ అయ్యాయని, పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కేంద్ర ప్రభుత్వ బాటలోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తుందని విమ ర్శించారు. 56 రోజులపాటు పోరుబాట చేపట్టామని, ఈ కార్యక్రమంలో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. తెలంగాణలో ఉద్యమ పార్టీగా సాగుదామని చాడ పిలుపునిచ్చారు. కాగా, రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. అవి ప్రభుత్వ హత్యలే!: డీవైఎఫ్ఐ సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాలు రావడం లేదని నిరుద్యోగులు చేసుకుంటున్న ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) పేర్కొంది. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదనే ఓయూలో మురళి, నిర్మల్ పట్టణంలో భూమేశ్ ఆత్మహత్యలకు పాల్పడ్డారని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.విప్లవ్‌కుమార్, ఎ.విజయ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఓయూ విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జీని ఖండిస్తున్నామని, దీనికి నిరసనగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు.