దినదిన గండం..
సాక్షి,సిటీబ్యూరో: వీరంతా కాబోయే ఇంజినీర్లు. ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు చదివిస్తున్నారు. ఇంటి నుంచి బయలుదేరిన విద్యార్థులు కాలేజీకి చేరుకునేందుకు ఎన్నో కష్టాలు పడుతున్నారు. దినదిన గండం.. నూరేళ్ల ఆయుష్షు.. అన్నట్టు ప్రయాణిస్తున్నారు. నగర శివారు ప్రాంతంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు చాలీచాలని ఆర్టీసీ బస్సులతో నిత్యం నరకం చూస్తున్నారు. భుజాలకు బ్యాగులు వేసుకుని బస్సుల్లో నిలబడి, ఫుట్ బోర్డు ప్రయాణం చేయాల్సి వస్తోంది.
ఇందులో ఎక్కువ శాతం మంది మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలకు చెందినవారే. కళాశాల చైర్మన్ మల్లారెడ్డి ఎంపీ కూడా. అయినప్పటికీ ఈ ప్రాంతంలో సరిపడినన్ని ఆర్టీసీ బస్సులను వేయించలేక పోయారు. కుత్బుల్లాపూర్ సుచిత్ర నుంచి దూలపల్లి, మేడ్చల్, దుండిగల్, మైసమ్మగూడ, కండ్లకోయలోని కళాశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను శనివారం ‘సాక్షి’ కెమెరా బంధించింది.