
సిటీ గజగజ
పడిపోయిన ఉష్ణోగ్రత
రాగల 48 గంటల్లో మరింత తీవ్రం
నగరంపై చలి పులి పంజా విసురుతోంది. ఒక్క రోజులోనే వాతావరణం మారిపోయింది. ఉత్తర దిశ నుంచి వీస్తున్న శీతల గాలులతో సిటీజనులు గజగజలాడుతున్నారు. శుక్రవారం గరిష్టంగా 33, కనిష్టంగా 17.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాగల 48 గంటల్లో కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలకు పడిపోయే అవకాశాలున్నట్లు బేగంపేటలోని వాతావరణ శాఖ ప్రకటించింది. శీతల గాలులతో పాటు చలి మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
శుక్రవారం తెల్లవారుజాము నుంచి చలిగాలులు పెరగడంతో ఆస్తమా రోగులు, వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్వెట్టర్లు, జర్కిన్లు, మఫ్లర్‌లు, మంకీ క్యాప్‌లకు గిరాకీ పెరిగింది. వీటిని విక్రయించే దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారు జామున, రాత్రి వేళల్లో బయటికి వెళుతున్న వారు వణుకుతున్నారు. - సాక్షి, సిటీబ్యూరో