
దేశ రాజధాని ఢిల్లీలో గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంత చలి ప్రస్తుత జనవరిలో నమోదైంది. ఈ నెల మొత్తంలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 17.7 డిగ్రీలుగా నమోదుకాగా, కనిష్ట సగటు ఉష్ణోగ్రత 6.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. ఈసారి చలిగాలుల ప్రభావం ఢిల్లీలో గరిష్టంగా ఐదు రోజుల పాటు కనిపించింది.
జనవరి 30 వరకు నమోదైన డేటా ప్రకారం ఢిల్లీలో గత 12 ఏళ్లలో సగటున ఈ నెలలోనే చలి అత్యధికంగా నమోదైందని భారత వాతావరణ శాఖ అధికారి ఆర్కే జెనామణి తెలిపారు. జనవరిలో గరిష్ట ఉష్ణోగ్రత చాలా రోజుల పాటు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యింది. 2012 నుంచి 2024 వరకు ఢిల్లీలో ఇంత తక్కువ సగటు గరిష్ట ఉష్ణోగ్రత ఎన్నడూ నమోదు కాలేదు. అయితే కనిష్ట సగటు ఉష్ణోగ్రత 6.2 డిగ్రీలుగా నమోదయ్యింది. అంతకుముందు జనవరి 2013లో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 6.1 డిగ్రీలుగా నమోదైంది. 2015లో గరిష్ట సగటు ఉష్ణోగ్రత 17.9 డిగ్రీలు కాగా, 2022లో 18 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
మంగళవారం దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాలను పొగమంచు కమ్ముకుంది. కనిష్ట ఉష్ణోగ్రత 11.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉదయం 9 గంటలకు గాలి నాణ్యత సూచిక 364 (చాలా పేలవమైన విభాగంలో) నమోదైంది. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో నేటి ఉదయం పొగమంచు కమ్మేయనుంది. బుధవారం నుండి ఫిబ్రవరి 4 వరకు లడఖ్, జమ్మూ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.