మళ్లీ నగదు బదిలీ | Re-money laundering | Sakshi
Sakshi News home page

మళ్లీ నగదు బదిలీ

Published Sat, Nov 15 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

మళ్లీ నగదు బదిలీ

మళ్లీ నగదు బదిలీ

 అనంతపురం అర్బన్: నగదు బదిలీ పథకాన్ని శనివారం నుంచి అమలు చేయడానికి అధికారులు మార్గదర్శకాలను రూపొందించారు. ఆధార్ నంబర్‌తో పాటు బ్యాంకు ఖాతా పాసు పుస్తకం జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా జత పరిచి సంబంధిత అధికారులకు అందజేయాలి. ఫారం-1, 3ల్లో కనపరిచిన వాటిని పూర్తి చేసి సంబంధిత గ్యాస్ సరఫరా కార్యాలయాల్లో తప్పనిసరిగా అందజేయాలి. నగదు బదిలీ పథకం అమలులోకి రావడంతో వినియోగదారులకు మళ్లీ దడ పుట్టింది.

గతంలో ఈ పథకంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న గ్యాస్ వినియోగదారులకు కొన్ని నెలలు ఉపశమనం కలిగిస్తోనే ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అమల్లోకి తీసుకురావడంతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం రూ.445 చెల్లిస్తున్న గృహ వినియోగదారులు ఇకనుంచి రూ.1100 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సబ్సిడీ మొత్తం 15 రోజుల తరువాత సంబంధిత వినియోగదారుల ఖాతాలో జమ అవుతోంది. ఇది గుదిబండగా మారుతుందని వినియోగదారులు భావిస్తున్నారు.

అయితే ఆధార్, బ్యాంకు పాసుపుస్తకం జిరాక్స్ అందచేయని వినియోగదారులకు మూడు మాసాల వరకు సబ్సిడీ ధరతోనే గ్యాస్ సరఫరా చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది. జిల్లాలో 6,26,444 గ్యాస్ కనెక్షన్లు ఉండగా ఇందులో 5,99,360 మంది వినియోగదారులు ఆధార్, బ్యాంకు ఖాతా పాసుపుస్తకం జిరాక్స్‌ను ఇదేవరకే అనుసంధానం చేశారు.

 వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకూడదు : ఇదిలా ఉండగా నగదు బదిలీ పథకం వల్ల గ్యాస్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తనీయకూడదని జేసీ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన తన చాంబర్‌లో గ్యాస్ డీలర్లతో సమావేశమయ్యారు. పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఆధార్, బ్యాంక్ ఖాతా అనుసంధానం ప్రక్రియ మూడు నెలల్లో పూర్తిచేయాలన్నారు. పథకంపై వినియోగదారులకు సందేహాలు ఉంటే 18002333555 టోల్ ఫ్రీ నంబర్‌లో సంప్రదించాలన్నారు. సమావేశంలో డీఎస్‌ఓ ఉమామహేశ్వరరావు, ఏడీఎం జయశంకర్, ఏఎస్‌ఓలు సౌభాగ్యలక్ష్మి, శోభారాణి, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement