అలంకారప్రాయంగా ఆ రెండు స్టేషన్లు
సాక్షి, సిటీబ్యూరో: ఆరాంఘర్ చౌరస్తా. ప్రతి రోజు వేలాది మంది రాకపోకలు సాగించే అతిపెద్ద కూడలి. హైదరాబాద్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాలన్నా, మహబూబ్‌నగర్, కర్నూలు, కడప వైపు వెళ్లాలన్నా ఈ కూడలి మీదుగా వెళ్లాల్సిందే. నగరం నుంచి మహబూబ్‌నగర్ వైపు రాయలసీమ వైపు వెళ్లే రైళ్లన్నీ ఆ రైల్వేమార్గంలోనే వెళ్తాయి. కానీ ఆరాంఘర్ చౌరస్తా నుంచి రైలుమార్గంలో వెళ్లాలనుకొనేవాళ్లకు మాత్రం ఆ అవకాశం లేదు. అక్కడికి ఒకటిన్నర, రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శివరాంపల్లి, బుద్వేల్ రైల్వేస్టేషన్లకు వెళ్లాలి. ఊళ్లకు దూరంగా, ప్రజల రాకపోకలకు ఏ మాత్రం సంబంధం లేకుండా విసిరేసినట్లు ఉన్న ఆ రెండు రైల్వే స్టేషన్లు అక్కడ ఉన్నా లేనట్లే.
ప్రతి రోజూ వేలాది మంది నడిచే కూడలిలో రైల్వేస్టేషన్ లేకపోవడంవల్ల నిత్యం ఆ మార్గంలో ఎంఎంటీఎస్, ప్యాసింజర్ రైళ్లు నడిచినా ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. ఆరాంఘర్‌చౌరస్తాలో రైల్వే సదుపాయాలను ఏర్పాటు చేయడం వల్ల వేలాది మందికి ప్రయోజనం కలగడమే కాకుండా ఆ మార్గంలో సబర్బన్ రైల్వే వ్యవస్థ ఎంతో బలోపేతమవుతుంది. రైల్వేకు ఆదాయం కూడా పెరుగుతుంది. దక్షిణమధ్య రైల్వే చొరవ, రాష్ట్రప్రభుత్వ సహకారం ఏకమైతే ఆరాంఘర్ చౌరస్తా అతి పెద్ద ప్రయాణికుల హబ్‌గా మారేందుకు అవకాశం ఉంది.
రెండెకరాల భూమి చాలు...
ఎంఎంటీఎస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు ఆరాంఘర్ చౌరస్తా మీదుగా రాకపోకలు సాగించేందుకు స్టేషన్ నిర్మాణానికి కేవలం 2 ఎకరాల స్థలం చాలు. ప్రస్తుతం అక్కడ ప్రభుత్వ భూమి కూడా అందుబాటులో ఉంది. ఆ భూమిలో కొంత స్టేషన్ కోసం కేటాయించవచ్చు. అందుకు ప్రతిగా నిరుపయోగంగా ఉన్న బుద్వేల్, శివరాంపల్లి స్టేషన్ స్థలాలను ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఆరాంఘర్ చౌరస్తాలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయడం వల్ల దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ప్రధాన స్టేషన్‌లకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, క్యాబ్‌లు, తదితర వాహనాల కంటే తక్కువ చార్జీల్లో రాకపోకలు సాగిస్తారు.
సికింద్రాబాద్ కేంద్రంగా ఇటు బొల్లారం, మేడ్చల్, మనోహరాబాద్ వైపు, అటు ఉందానగర్ వైపు దక్షిణమధ్య రైల్వే సబర్బన్ రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ రెండు మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్లు, డెమో రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. సికింద్రాబాద్ నుంచి ఫలక్‌నుమా వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తుండగా అక్కడి నుంచి ఉందానగర్ డెమో రైళ్లు నడుస్తున్నాయి. ఆరాంఘర్ నుంచి ట్రైన్‌లో మహబూబ్‌నగర్ వెళ్లాలనుకొనే ప్రజలు శివరాంపల్లి రైల్వేస్టేçÙన్‌కు వెళ్లాలి. నగరానికి రావాలంటే బుద్వేల్ స్టేషన్ నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ రెండు స్టేషన్లు ఆరాంఘర్‌కు 1 నుంచి 2 కిలోమీటర్‌ల దూరంలో ఉండడం, రోడ్డు సదుపాయం కూడా లేకపోవడంతో ప్రయాణికులు ఈ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించేందుకు వెనుకడుగువేస్తారు. శంషాబాద్ నుంచి ఆరాంఘర్‌కు వచ్చేవాళ్లు ఈ స్టేషన్‌లలో దిగి నడుచుకుంటూ రావలసిందే. ఏ రకంగా చూసినా పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో శివరాంపల్లి, బుద్వేల్ స్టేషన్లు ప్రయాణికుల ఆదరణకు నోచక అలంకాప్రాయంగానే ఉండిపోయాయి. దీంతో ఆ మార్గంలో నడిచే ఎంఎంటీఎస్,డెమో రైళ్లన్నీ ఖాళీ డబ్బాలతోనే రాకపోకలు సాగిస్తాయి.