ఇంకా మూడు రోజులే పుష్కరాలు
సాక్షి,సిటీబ్యూరో: కృష్ణా పుష్కరాలు ఈనెల 23తో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం నగరం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పవిత్ర స్నానాలకు తరలివెళ్లారు. బస్ స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో చాలామంది శనివారం సాయంత్రమే నగరంలో వివిధ ప్రాంతాల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పుష్కర ఘాట్లకు తరలి Ðð ళ్లారు. గుంటూరు, విజయవాడ మీదుగా వెళ్లే రెగ్యులర్ రైళ్లు, పుష్కర ప్రత్యేక రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసాయి.
నేడు వివిధ రూట్లలో స్పెషల్ రైళ్లు..
పుష్కరాల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆదివారం రాత్రి 11.50 గంటలకు సికింద్రాబాద్ నుంచి పుష్కరం స్పెషల్ ట్రైన్ బయలు దేరనుంది. ఇది విజయవాడ సమీపంలోని కృష్ణా కెనాల్ జంక్షన్ వరకు వెళ్తుంది. అలాగే ఉదయం 5.30 గంటలకు ఇంటర్ సిటీ, ఉదయం 5.40కి నాంపల్లి స్టేషన్ నుంచి గుంటూరుకు పుష్కరం స్పెషల్ ట్రైన్ బయలు దేరతాయి.
ఉదయం 6.15 కు సికింద్రాబాద్ నుంచి రాయచూర్ దగ్గర ఉన్న కృష్ణా రైల్వేస్టేషన్‌కు మరో పుష్కరం స్పెషల్ నడుస్తుంది. ఉదయం 11–12 గంటల మధ్య సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి గద్వాల్‌కు డెమూ ప్యాసింజర్ రైళ్లు బయలు దేరనున్నాయి. రెగ్యులర్ జన్మభూమి, ఇంటర్‌సిటీ, తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ఆదివారం రాత్రి 11.30కు సికింద్రాబాద్ నుంచి కాకినాడకు మరో పుష్కరం ట్రైన్ నడుపుతున్నారు.
300కు పైగా ప్రత్యేక బస్సులు..
హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా వెళ్లే 93 రెగ్యులర్ బస్సులతో పాటు శనివారం మరో 50 బస్సులు అదనంగా బయలుదేరాయి. ఇవి కాకుండా నాగార్జునసాగర్, బీచుపల్లి, శ్రీశైలం, వాడపల్లి, తదితర ప్రాంతాలకు 250 బస్సులు నడిపారు. నగరం నుంచి రెగ్యులర్ బస్సులకు కాకుండా పుష్కరాల ప్రారరంభం నుంచి 1065 బస్సులు నడుపుతున్నారు. వీటికి అదనంగా శనివారం 350 బస్సులను పెంచారు. ఆదివారం మరిన్ని ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు అదనపు బస్సులు నడిపేందుకు అర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.