నగరం నుంచి పుష్కర ప్రయాణం | city people travel to krishna pushkara | Sakshi
Sakshi News home page

నగరం నుంచి పుష్కర ప్రయాణం

Published Fri, Aug 12 2016 11:55 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

నగరం నుంచి పుష్కర ప్రయాణం - Sakshi

నగరం నుంచి పుష్కర ప్రయాణం

సాక్షి, సిటీబ్యూరో: కృష్ణా పుష్కరాలకు సిటీవాసులు భారీగా తరలి వెళ్తున్నారు. వరుస సెలవులతో  శుక్రవారం బస్సులు, రైళ్లు  కిక్కిరిసాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్‌లు, మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్‌ల నుంచి నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. విజయవాడ వైపు వెళ్లే రైళ్లన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. విజయవాడకు వెళ్లే బస్సులు సైతం కిటకిటలాడాయి. ప్రతి రోజు నగరం నుంచి బయలుదేరే 93 రెగ్యులర్‌ బస్సులతో పాటు మరో 130 బస్సులను అదనంగా నడిపారు. మరోవైపు బీచుపల్లి, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ఘాట్‌లకు సైతం  భక్తులు తరలి వెళ్లారు. జంటనగరాల నుంచి ప్రతి రోజు సుమారు 40 రైళ్లు విజయవాడ మీదుగా  రాకపోకలు సాగిస్తాయి.

పుష్కరాల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌ నుంచి విజయవాడ, కాకినాడ, గద్వాల్‌ తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. విజయవాడ మీదుగా వెళ్లే అన్ని రైళ్లలోనూ  శుక్రవారం భారీ రద్దీ కనిపించింది. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో వేలాది మంది ప్రయాణికులు రైళ్ల కోసం పడిగాపులు కాశారు.  రిజర్వుడ్‌ బోగీల్లో బెర్తులు లభించని వాళ్లు జనరల్‌ బోగీల్లో  బయలుదేరారు. దీంతో సాధారణ బోగీలు  సైతం పరిమితికి మించిన ప్రయాణికులతో  నిండిపోయాయి. పుష్కర స్పెషల్‌ రైళ్లకు మల్కాజిగిరి రైల్వేస్టేషన్‌లో సబర్బన్‌ ట్రైన్‌ అండ్‌ బస్‌ ట్రావెలర్స్‌ అసోసియేషన్‌ వారు స్వాగతం పలికారు. అనంతరం భక్తులు సంతోషంగా పుష్కర స్నానాలు ఆచరించి రావాలని కోరుతూ వీడ్కోలు చెప్పారు.

250 ప్రత్యేక బస్సులు ...
రైళ్లతో పాటు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ బస్సులు, సొంత వాహనాల్లోనూ  జనం  తరలి వెళ్లారు. హైదరాబాద్‌ నుంచి  విజయవాడకు  130  ప్రత్యేక బస్సులు  బయలుదేరాయి. శ్రీశైలం,నాగార్జునసాగర్, బీచుపల్లి, వాడపల్లి, తదితర ప్రాంతాలకు మరో  120 బస్సులు ఏర్పాటు చేశారు.  వివిధ ప్రాంతాలకు రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే  1500  ఎక్స్‌ప్రెస్, సూపర్‌లగ్జరీ , ఏసీ బస్సులకు  ఇవి అదనం. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను  అందుబాటులోకి  తెచ్చారు. మరోవైపు  తాము ఆశించిన స్థాయి రద్దీ కనిపించలేదని, విజయవాడ వైపు వెళ్లిన ప్రయాణికుల్లో ఎక్కువ శాతం వరుస సెలవులను దృష్టిలో ఉంచుకొని వెళ్లిన వాళ్లేనని, పుష్కరాల రద్దీ  మొదటి రోజు సాధారణంగానే ఉందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

‘పుష్కర’ యాప్స్‌...
గాజులరామారం: పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం గూగూల్‌ ప్లే స్టోర్‌లో కొన్ని యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్స్‌లో పుష్కర్‌ ఘాట్స్‌కు ఎలా వెళ్లాలో తెలిపే రూట్‌ మ్యాప్స్‌ చక్కగా రూపొందించారు. ఆయా ఘాట్ల వద్ద పార్కింగ్‌ స్థలాల వివరాలు, అత్యవసర సమయాలలో చేయాల్సిన నంబర్లకు ఒన్‌టచ్‌ బటన్‌ల సదుపాయం తదితరాలు వివరంగా ఉన్నాయి.
టీఎస్‌ కృష్ణ పుష్కరాలు 2016

ఈ యాప్‌ను తెలంగాణ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు వారు రూపొందిం చారు. దీన్ని గూగూల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకొవచ్చు. అనంతరం స్క్రీన్‌పై ‘చెక్‌ వాటర్‌ క్వాలిటీ ఆఫ్‌ పుష్కర్‌ ఘాట్స్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. తెలంగాణలో ఉన్న ముఖ్యమైన పుష్కర ఘాట్‌ల లొకేషన్‌లు మ్యాప్‌లో కనిపిస్తాయి. ఇక్కడ మనం ఎక్కడ సెలక్ట్‌ చేస్తే అక్కడ స్క్రీన్‌పై అదేరోజుకు సంబంధించిన వాటర్‌ రిపోర్ట్‌ ప్రత్యక్షమవుతుంది.

ఎంబీఎన్‌ఆర్‌ కృష్ణ పుష్కరాలు 2016
మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉన్న పుష్కర ఘాట్‌ల పూర్తి వివరాలు ఈ యాప్‌లో పొందుపర్చారు. ఘాట్‌ ఆప్షన్స్‌కు వెళ్లి మనకు కావాల్సిన ఘాట్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి. వెంటనే ఘాట్‌ లొకేషన్‌ రూట్, అక్కడ దర్శనీయ స్థలాలు, సౌకర్యాలు, హోటల్స్, వాతావరణం వివరాలు తెలుస్తాయి.  అదేవిదంగా ఈ యాప్‌లో ఎస్‌ఓఎస్‌ ఆప్షన్‌ ఉన్నది. ప్రమాదకర పరిస్థితుల్లో ఇది ఉపయోగపడుతుంది. ఈ ఆప్షన్‌లో పోలీస్, మెడికల్, మహబూబ్‌నగర్‌ కంట్రోల్‌ రూం నంబర్‌ బటన్లు ఉంటాయి. అనౌన్స్‌మెంట్‌ ఆప్షన్‌లో ఘాట్‌ల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తారు.

‘కృష్ణా’ బాటిళ్లకు భలే డిమాండ్‌
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తపాలా శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న ‘కృష్ణా పుష్కర జలం‘ బాటిళ్లకు డిమాండ్‌ పెరిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి నుంచి సైతం అనూహ్య స్పందన లభించింది. మొత్తం మీద పోస్టల్‌ శాఖ నిర్దేశించిన లక్ష్యానికి మించి బాటిల్స్‌ కోసం ఆర్డర్లు బుక్‌ అయ్యాయి. గోదావరి పుష్కరాల్లో ‘గాడ్‌ జల్‌’ పేరిట కోటి రూపాయల మేర ఆదాయాన్ని గడించిన స్ఫూర్తితో కృష్ణా పుష్కర జలాలను కూడా పోస్టల్‌ శాఖ ద్వారా అందిస్తున్నారు. తెలంగాణ, ఏపీ సర్కిల్స్‌లో కలిపి సుమారు మూడున్నర లక్షల బాటిళ్లు విక్రయించేందుకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒక్కో బాటిల్‌ (అర లీటర్‌) ధర రూ.30 గా నిర్ణయించి, దీని కోసం జూలై మొదటి వారం నుంచి ఈ నెల 5 వ తేదీ వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా ఆర్డర్లు స్వీకరించింది.

3.91 లక్షల బాటిల్స్‌కు డిమాండ్‌
పోస్టల్‌ శాఖకు కృష్ణా పుష్కర జలం సరఫరా కోసం లక్ష్యాన్ని మించి 3.91 లక్షలకు పైగా బాటిల్స్‌కు ఆర్డర్లు వచ్చాయి. విజయవాడ రీజియన్‌లో 1.72 లక్షల బాటిల్స్, విశాఖపట్నం రీజియన్‌లో 92 వేల బాటిల్స్, కర్నూల్‌లో 6,300, హైదరాబాద్‌ రీజియన్‌లో 32,786, హైదరాబాద్‌ సిటీలో మూడు వేల బాటిల్స్‌ సరఫరా కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్లు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement