
మెరుగైన క్రౌడ్ మేనేజ్‌మెంట్ దిశగా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో దేశవ్యాప్తంగా 60 కీలక రైల్వే స్టేషన్లలో కన్‌ఫర్మ్ టికెట్లు ఉన్న ప్రయాణికులను మాత్రమే ప్లాట్‌ఫామ్ మీదకు అనుమతించనుంది. రద్దీని నియంత్రించడానికి, సురక్షితమైన ప్రయాణ పరిస్థితులను నిర్ధారించడానికి ఈ స్టేషన్లలో శాశ్వత ప్రయాణికుల హోల్డింగ్ ప్రాంతాలు ఉంటాయి.
రద్దీ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రాకపోకల క్రమబద్ధీకరణపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అధికారులతో విస్తృతంగా చర్చించి రద్దీగా ఉండే ప్రయాణ సమయాల్లో ఎంపిక చేసిన స్టేషన్లలో అమలు చేసిన విజయవంతమైన రద్దీ నియంత్రణ చర్యలను సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్నవారు అక్కడే..
ఇందులో భాగంగా ఈ 60 స్టేషన్లలో వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులను స్టేషన్ ఆవరణ వెలుపల నిర్దేశిత వెయిటింగ్ ప్రాంతాలకు పంపనున్నారు. ఇటీవలి మహాకుంభమేళా సందర్భంగా ప్రయాణికుల భారీ రద్దీని నిర్వహించడానికి ప్రయాగ్‌రాజ్‌తోపాటు సమీప తొమ్మిది స్టేషన్లలో
బాహ్య వెయిటింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. ఇవి సత్ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో ఎక్కువ రద్దీ ఉండే మరిన్ని స్టేషన్లలో శాశ్వత వెయిటింగ్ ఏరియాలను అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
‘వార్ రూమ్’ల ఏర్పాటు
ఇప్పటికే న్యూఢిల్లీ, ఆనంద్ విహార్, వారణాసి, అయోధ్య, పాట్నా వంటి స్టేషన్లలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ స్టేషన్లలో అనధికారిక ప్రవేశాన్ని నివారించడానికి నియంత్రిత యాక్సెస్ గేట్లను ఏర్పాటు చేశారు.
సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం స్టేషన్లు, పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నిఘాను పెంచాలని రైల్వే శాఖ యోచిస్తోంది. వీటితోపాటు ప్రధాన స్టేషన్లలో రద్దీ మరీ ఎక్కువగా ఉన్న సమయాల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకుని చర్చించుకునేందుకు ‘వార్ రూమ్’లను సైతం ఏర్పాటు కానున్నాయి.
కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడానికి, ప్రయాణికుల భారీ రద్దీని నిర్వహించే స్టేషన్లలో వాకీ-టాకీలు, అధునాతన అనౌన్స్‌మెంట్ వ్యవస్థలు, మెరుగైన కాలింగ్ వ్యవస్థలతో సహా కొత్త డిజిటల్ పరికరాలు ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో సులభంగా గుర్తించేందుకు వీలుగా సిబ్బందికి రీడిజైన్ చేసిన ఐడీ కార్డులు, కొత్త యూనిఫామ్ అందించనున్నారు. అలాగే అన్ని ప్రధాన స్టేషన్లలో సీనియర్ అధికారులను స్టేషన్ డైరెక్టర్లుగా నియమించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వీటితోపాటు స్టేషన్ కెపాసిటీ ఆధారంగా టికెట్ల అమ్మకాలను నియంత్రించడం, మరింత సమర్థవంతమైన క్రౌడ్ మేనేజ్‌మెంట్ కోసం అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకోవడానికి అధికారులకు మరిన్ని అధికారాలు కల్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment