దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్-శక్తితో నడిచే రైలు అతి త్వరలోనే పట్టాలెక్కనుంది. వచ్చే డిసెంబర్ నెలలోనే దీన్ని ఆవిష్కరించేందుకు ఇండియన్ రైల్వేస్ సిద్ధమైంది. డీజిల్ లేదా విద్యుత్‌తో పని లేకుండా నడిచే ఈ హైడ్రోజన్-ఆధారిత అద్భుతం 2030 నాటికి "నికర శూన్య కార్బన్ ఉద్గారిణి"గా మారాలన్న లక్ష్యంతో ఉన్న భారతీయ రైల్వేలకు ఒక ప్రధాన మైలురాయి కానుంది.
హైడ్రోజన్‌తో నడిచే ఈ రైలు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి నీటిని తన ప్రాథమిక వనరుగా ఉపయోగించుకుంటుంది. ఈ రైలులో హైడ్రోజన్ ఇంధన కణాలు ఆక్సిజన్‌తో రసాయన చర్య ద్వారా హైడ్రోజన్ వాయువును విద్యుత్తుగా మారుస్తాయి. ఈ విద్యుత్తుతో రైలు నడుస్తుంది. ఇందులో ఉప ఉత్పత్తులుగా వెలువడేవి నీరు, ఆవిరి మాత్రమే. అవసరమైన రసాయన ప్రక్రియల కోసం రైలుకు గంటకు సుమారు 40,000 లీటర్ల నీరు అవసరమవుతుంది.
సాంప్రదాయ డీజిల్ లేదా ఎలక్ట్రిక్ ఇంజిన్‌ల మాదిరిగా కాకుండా ఈ వినూత్న రైలు కదలడానికి అవసరమైన విద్యుత్‌ను హైడ్రోజన్ ఇంధన కణాలను ఉపయోగించి ఉత్పత్తి చేసుకుంటుంది. హైడ్రోజన్ ఇంధన ఘటాలు, ఆక్సిజన్‌తో కలిసి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, నీరు మాత్రమే వెలువడుతాయి. అంటే పర్యావరణానికి హానికరమైన ఎటువంటి ఉద్గారాలు ఉండవు. ఈ క్లీన్ ఎనర్జీ విధానం దేశంలో భవిష్యత్ రైళ్లకు ప్రమాణాన్ని ఏర్పరుస్తుందని భావిస్తున్నారు.
ట్రయల్ రన్
హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పురాతన పర్వత ప్రాంతాల రైల్వేలైన డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే , నీలగిరి మౌంటైన్ రైల్వే, కల్కా-సిమ్లా రైల్వేతో పాటు దేశంలోని సుందరమైన, మారుమూల ప్రాంతాల వంటి అదనపు మార్గాలు కూడా పరిశీలనలో ఉన్నాయి.
ఈ రైలు గరిష్టంగా గంటకు 140 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదని, ప్రయాణికులకు వేగవంతమైన , సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. రైలులోని హైడ్రోజన్ ఇంధన ట్యాంక్ ఒకసారి ఇంధనం నింపుకొంటే 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీంతో భవిష్యత్తులో సుదీర్ఘ మార్గాలకు కూడా ఈ రైళ్లు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. ఒక్కో హైడ్రోజన్ రైలు అభివృద్ధికి రూ.80 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. 2025 నాటికి 35 హైడ్రోజన్ రైళ్లు వివిధ మార్గాల్లో నడపాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment