Hydrogen
-
గ్రీన్ హైడ్రోజన్.. గేమ్ చేంజర్!
హైడ్రోజన్ కార్లు.. బస్సులు.. రైళ్లు.. నౌకలు.. పరిశ్రమలు... ఇలా ప్రపంచమంతా ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ నామ జపం చేస్తోంది! పునరుత్పాదక ఇంధన రంగంలో గేమ్ చేంజర్‌గా అభివరి్ణస్తున్న గ్రీన్ హైడ్రోజన్ కోసం భారత్ కూడా వేట మొదలుపెట్టింది. దేశీ కార్పొరేట్ దిగ్గజాలైన రిలయన్స్, అదానీ గ్రూపులతో పాటు అవాడా, హైజెన్కో గ్రీన్ ఎనర్జీస్, థెర్మాక్స్ వంటి సంస్థలు ఈ రంగంలో ఇప్పటికే భారీ ప్రణాళికలతో చకచకా ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ నయా ఇంధనాన్ని వినియోగదారులకు చౌకగా అందించేందుకు ఉత్పాదక వ్యయాన్ని రెండింతలకు పైగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతం దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదక వ్యయం ఒక్కో కేజీకి 4–5 డాలర్లు (దాదాపు రూ.340–430)గా ఉంటోంది. అదే గ్రే హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చు 1–2 డాలర్లు (రూ.85–170) మాత్రమే. గ్రే హైడ్రోజన్ ఉత్పత్తి కాలుష్యకరమైనది కావడంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో కంపెనీలు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదక వ్యయాన్ని గణనీయంగా తగ్గించడంపై దృష్టిపెట్టాయి. సరికొత్త టెక్నాలజీలతో పాటు వినూత్న ఉత్పత్తులు, ఇతరత్రా మార్గాలను ఎంచుకుంటున్నాయి. 2030 నాటికి భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్దేశించుకున్న 50 లక్షల వార్షిక టన్నుల ఉత్పత్తి లక్ష్యం సాకారం కావాలంటే, ఉత్పాదక వ్యయాన్ని తగ్గించడం చాలా కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు. టెక్నాలజీ దన్ను... గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదనలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పాటు అధునాతన ఎనలిటిక్స్‌ను అవాడా గ్రూప్ ఉపయోగిస్తోంది. ‘అత్యాధునిక ఎలక్ట్రోలైజర్ టెక్నాలజీ వల్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం మెరుగుపడి, హైడ్రోజన్ ఉత్పత్తికి తక్కువ విద్యుత్ అవసరమవుతుంది. దీంతో వ్యయం భారీగా దిగొస్తోంది’ అని కంపెనీ చైర్మన్ వినీత్ మిట్టల్ పేర్కొన్నారు. హైజెన్కో సంస్థ అయితే, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), ఏఐతో పాటు మెషీన్ లెరి్నంగ్‌ను ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటోంది. కంపెనీ ఒడిశాలోని గోపాల్‌పూర్‌లో 1.1 మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ అమోనియా ప్రాజెక్టును నెలకొల్పే ప్రణాళికల్లో ఉంది. వెల్స్పన్ న్యూ ఎనర్జీ కూడా గ్రీన్ హైడ్రోజన్‌ను చౌకగా అందించేందుకు సౌర, పవన విద్యుత్‌తో పాటు బ్యాటరీల్లో స్టోర్ చేసిన విద్యుత్‌ను కూడా ఉపయోగిస్తోంది. అంతేకాకుండా పెద్దయెత్తున జల విద్యుత్‌ను కూడా వినియోగించే సన్నాహాల్లో ఉన్నట్లు కంపెనీ సీఈఓ కపిల్ మహేశ్వరి పేర్కొన్నారు. ఇక గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమైన మాడ్యూల్స్ తయారీ, విక్రయం, సరీ్వస్ కోసం థర్మాక్స్ బ్రిటన్‌కు చెందిన సెరెస్తో ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా దాని ఆక్సైడ్ ఎల్రక్టాలిసిస్ టెక్నాలజీని ఉపయోగించుకోనుంది. తక్కువ ఉష్ణోగ్రతతో కూడిన ఎలక్ట్రాలిసిస్ సాంకేతికతతో పోలిస్తే ఇది 25% మెరుగైనదని సంస్థ సీఈఓ ఆశిష్ భండారీ వెల్లడించారు.అంబానీ, అదానీ గిగా ఫ్యాక్టరీలుదేశంలో గ్రీన్ హైడ్రోజన్ సమగ్ర వ్యవస్థ (ఎకో సిస్టమ్) నెలకొల్పేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) 10 బిలియన్ డాలర్లను వెచి్చంచనుంది. 2030 నాటికి కేజీ గ్రీన్ హైడ్రోజన్‌ను ఒక డాలరుకే ఉత్పత్తి చేయాలనేది కంపెనీ లక్ష్యం. 2026 కల్లా తొలి ఎలక్ట్రోలైజర్ గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ తాజా ఏజీఎంలో ప్రకటించారు కూడా. ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచి, కొత్త తరం ఎలక్ట్రోలైజర్ల కోసం పెట్టుబడి వ్యయాలను తగ్గించుకోవడానికి అధునాతన ఎల్రక్టాలిసిస్ ఆధారిత టెక్నాలజీలను కూడా కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో దిగ్గజ సంస్థల్లో ఒకటిగా అదానీ న్యూ ఇండస్ట్రీస్‌ను తీర్చిదిద్దే సన్నాహాల్లో అదానీ గ్రూప్ నిమగ్నమైంది. 2030 నాటికి 10 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి తోడ్పడేలా సమగ్ర ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోంది. తదుపరి పదేళ్లలో ఈ సామర్థ్యాన్ని 30 లక్షల టన్నులకు పెంచాలనేది అదానీ లక్ష్యం. ఈ వ్యవస్థలో గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్, పర్యావరణానుకూల విమాన ఇంధనం వంటి పలు ఉత్పత్తులు ఉంటాయి. గ్రీన్ హైడ్రోజన్: ప్రకృతిలో అపారంగా దొరికే నీటిని పునరుత్పాదక ఇంధనాలైన సౌర, పవన, జల విద్యుత్‌ను ఉపయోగించి హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొడతారు. ఎలక్ట్రోలైజర్లో జరిపే ఈ ప్రక్రియను ఎల్రక్టాలిసిస్గా పేర్కొంటారు. ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ 100 శాతం పర్యావరణానుకూలమైనది కావడంతో దీనికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. దీన్ని నిల్వ చేయడం చాలా సులభం. అంతేకాకుండా, వాహనాల నుండి పరిశ్రమల వరకు అనేక అవసరాల కోసం వాడుకోవచ్చు. గ్రే హైడ్రోజన్: హైడ్రోజన్ ఉత్పత్తిలో ఇది అత్యంత సాధారణ ప్రక్రియ. స్టీమ్ మీథేన్ రిఫారి్మంగ్ (ఎస్ఎంఆర్) అనే ప్రక్రియలో సహజవాయువును ఉపయోగిస్తారు. తయారీలో గణనీయంగా కార్బన ఉద్గారాలను విడుదల చేయడం వల్ల దీనిపై వ్యతిరేకత నెలకొంది. వినియోగంలో మాత్రం 100% పర్యావరణ హితమైనదే. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
కూతపెట్టనున్న..హైడ్రోజన్ రైలు
సాక్షి, హైదరాబాద్: అధునాతన సౌకర్యాలతో సరికొత్త రైళ్లను అందుబాటులోకి తెస్తున్న భారత రైల్వే.. త్వరలోనే హైడ్రోజన్‌తో నడిచే రైళ్లను పట్టాలెక్కించబోతోంది. వచ్చే నెలలోనే తొలి రైలును ప్రయోగాత్మకంగా నడిపించనుంది.జర్మనీ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో.. మన రైల్వే సొంతంగానే ఈ రైళ్లను తయారు చేస్తోంది. ఇప్పటికే అధిక వ్యయం, కాలుష్య కారకమైన డీజిల్ రైళ్లను తొలగించి ఎలక్ట్రిక్ రైళ్ల సంఖ్యను పెంచుతుండగా.. ఇకపై ఏ మాత్రం కాలుష్యం ఉండని హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై పరుగెత్తనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ అంశంలో జర్మనీ ముందుంది. ఆ దేశం గణనీయ సంఖ్యలో హైడ్రోజన్ రైళ్లను నడుపుతోంది. దానితోపాటు చైనా, రష్యా సహా ఐదు దేశాలు హైడ్రోజన్ రైళ్లు నడుపుతున్నాయి. వాటి సరసన ప్రపంచంలో ఐదో దేశంగా భారత్ రికార్డు సృష్టించనుంది.‘హైడ్రోజన్’ రైలు ప్రాజెక్టు విశేషాలివీ..» నీటి నుంచి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారు. ఆ హైడ్రోజన్‌ను, ఆక్సిజన్‌తో కలిపినప్పుడు రసాయన చర్య జరిగి వెలువడే శక్తి ద్వారా రైలును నడిపిస్తారు. ఇందుకోసం రైలు ఇంజన్లలో హైడ్రోజన్, ఆక్సిజన్ ట్యాంకులను ఏర్పాటు చేస్తారు. » ఒకసారి ఇంధనాన్ని నింపితే వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని అంచనా. » హైడ్రోజన్ ఇంజన్లు డీజిల్ ఇంజన్ల కంటే 65 శాతం తక్కువ శబ్ధాన్ని ఉత్పత్తి చేస్తాయి. ప్రస్తుత పరిజ్ఞానం మేరకు గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని.. 54.6 సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. » ఒక కిలో హైడ్రోజన్ ఇంధనం 4.5 లీటర్ల డీజిల్‌తో సమానంగా శక్తిని అందిస్తుంది. ఓ అంచనా మేరకు ఒక్కో హైడ్రోజన్ రైలు ద్వారా ఏడాదికి రూ.16 లక్షల డీజిల్ ఆదా అవుతుంది. » ఒక డీజిల్ ఇంజన్ ద్వారా ఏడాదిలో 4,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. హైడ్రోజన్ ఇంజన్‌తో ఆ కాలుష్యానికి అడ్డుకట్ట పడుతుంది. హైడ్రోజన్ ఇంజన్లో ఇంధనాన్ని మండించిన తర్వాత వ్యర్థాలుగా నీరు, నీటి ఆవిరి వెలువడతాయి. » రైల్వే తొలుత 35 హైడ్రోజన్ రైళ్లను రూపొందించాలని భావించినప్పటికీ తాజాగా ఆ సంఖ్యను 50కి పెంచింది. » ప్రస్తుత పరిజ్ఞానం ప్రకారం ఒక్కో రైలు తయారీకి రూ.80 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేస్తోంది. వీటి తయారీకి రూ.2,800 కోట్లను కేటాయించారు. » రైల్వే రోజుకు 3 వేల కిలోల హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యంతో ఒక ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. తర్వాత హిల్ స్టేషన్లలో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మొదట హిల్ స్టేషన్లలో.. హరియాణాలోని జింద్–సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల మార్గంలో తొలి హైడ్రోజన్ రైలును పరీక్షించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెలాఖరులో ఈ ప్రయోగాత్మక పరిశీలన మొదలుకానుంది. పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని ఈ హైడ్రోజన్ రైళ్లను తొలుత ప్రకృతి అందాలతో అలరారే హిల్ స్టేషన్లలోని రూట్లలో నడపాలని రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటెయిన్ రైల్వేలను ఎంపిక చేసింది. మరిన్ని హిల్ స్టేషన్లలో ప్రస్తుతం డీజిల్ ఇంజన్లతో నడుపుతున్న రైళ్లను తొలగించి హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టనుంది. తర్వాత దశలవారీగా సాధారణ రూట్లలోనూ నడపనుంది. భవిష్యత్ ఇంధనం హైడ్రోజనే... బొగ్గు, చమురు నిల్వలు తరిగిపోతుండటం, అవి కాలుష్య కారకం కావడంతో... ప్రత్యామ్నాయ ఇంధనాలపై ప్రపంచ దేశాలు దృష్టిపెట్టాయి. ఈ క్రమంలో ఎలాంటి కాలుష్యం వెలువడని, తరిగిపోని హైడ్రోజన్‌ను భవిష్యత్తు ఇంధనంగా భావిస్తున్నాయి. వాటితో వాహనాలను నడిపే సాంకేతికతలను కొన్ని దేశాలు అభివృద్ధి చేశాయి. ఈ క్రమంలోనే మన రైల్వే కూడా వేగంగా ప్రయోగాలు పూర్తి చేసి హైడ్రోజన్ రైళ్లను పట్టాలెక్కించే దిశగా ముందుకు వెళుతోంది. రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టును చేపట్టగా.. డిసెంబర్ చివరిలో ప్రయోగాత్మక పరిశీలన మొదలవుతోంది. -
ప్రపంచాన్ని నడిపించే సరికొత్త ఇంధనం
ఈవీలు కలకాలం నిలుస్తాయా? వీటికంటే మెరుగైన, పర్యావరణ హితమైన వాహనాలు వస్తాయా? చాలామందిని వేధించే ప్రశ్నలివి. ఆ ఇంధనం పెట్రోలు, డీజిళ్ల మాదిరి కాలుష్యాన్ని మిగల్చదు. ఈవీ బ్యాటరీల్లో మాదిరిగా లిథియం వంటి ఖరీదైన, అరుదైన ఖనిజాలు అస్సలు వాడదు. ఏమిటా అద్భుత ఇంధనం? అదే హైడ్రోజన్!మీకు తెలుసా? పెట్రోలు, డీజిల్ ఇంజిన్ల ద్వారా సుమారు 80 శాతం శక్తి వృథా అవుతోందని? లీటర్ పెట్రోలు లేదా డీజిల్ పోసి కారు నడిపితే 20–25 శాతం వరకు మాత్రమే ప్రయాణానికి ఉపయోగపడుతుంది. మిగి లిన 75–80 శాతం ఇంజన్లో ఆహుతి కాని ఇంధనం, వేడి పొగ రూపంలో పొగగొట్టం నుంచి బయటకు వెళ్లిపోతుంది.ఇంజిన్‌లో ఇంధనం మండటం వల్ల పుట్టే వేడి, దానిని చల్లార్చే కూలింగ్ వ్యవస్థ రూపంలో వృ«థా అవుతూంటుంది! విద్యుత్తు బ్యాటరీలు కాలుష్య కారక పొగలు కక్కవు కానీ... వీటి బ్యాటరీల తయారీకి మూడంటే మూడు దేశాల్లో ఉన్న లిథియంపై ఆధారపడాలి. పైగా ఇదే లిథియం మన స్మార్ట్ ఫోన్లతోపాటు ఈ కాలపు ఎలక్ట్రానిక్స్ అన్నింటి బ్యాటరీలకూ కావాలి. విద్యుత్తుతో నడిచే వాహనాలు పర్యావరణానికి మేలు చేసేవే అయినప్పటికీ ఛార్జ్ చేసుకునేందుకు ఎక్కువ సమయం పడుతూండటం, పూర్తిస్థాయిలో రీఛార్జింగ్ నెట్ వర్క్ లేకపోవడం వంటివి వీటి విస్తృత వినియోగానికి అడ్డుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పెట్రోలు, డీజిల్, విద్యుత్తుల కంటే మెరుగైన, చౌకైన, సమర్థమైన ఇంధనం కోసం దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. హైడ్రో జన్ లభ్యత భూమండలం మీద అనంతం. ఒక లీటర్ (మంచి) నీటి నుంచి ఎలక్ట్రోసిస్ చర్య ద్వారా 1.2 లీటర్ల హైడ్రోజన్‌ను వేరు చేయవచ్చు. గాలి నుంచి కూడా తీసు కోవచ్చు.ప్రపంచంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ కారు(పెట్రోలు + విద్యుత్తు) ‘ప్రియస్’ను తయారు చేసిన రికార్డు టయోటాదే. అలాగే అందరికంటే ముందు హైడ్రోజన్ ఫ్యుయెల్ సెల్ (అక్కడికక్కడ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే బ్యాటరీ లాంటిది) వాహనం ‘మిరాయి’ కూడా టయోటా సృష్టే. ఈ నేపథ్యంలోనే తాము విద్యుత్తు వాహనాల కంటే హైడ్రోజన్ వాహనాలకే ప్రాధాన్యమిస్తామని టయోటా ఛైర్మన్ అకిడో టయోడా ఇటీవల చేసిన ప్రకటన అందరి దృష్టినీ హైడ్రోజన్ పైకి మళ్లించింది. విద్యుత్తు వాహనాల వల్ల ఉపాధి కోల్పో తారని ఆందోళన చెందుతున్న కోట్లాదిమంది టెక్నీషిషన్లకు హైడ్రోజన్ ఇంధనం ఆ దుఃస్థితి రానివ్వదు.హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్స్ టెక్నాలజీతో ఎన్నో లాభాలున్నాయి. పెట్రోలు, డీజిళ్ల మాదిరిగా హైడ్రోజన్‌ను నిమిషాల వ్యవధిలో నింపుకోవచ్చు. చల్లటి వాతావరణ మైనా, విపరీతమైన వేడి ఉన్నా వాహనం నడపడంలో ఎలాంటి సమస్యలూ ఉండవు. భారీ బ్యాటరీల అవసరం ఉండదు. బ్యాటరీ వాహనాల కంటే చాలా ఎక్కువ మైలేజీ వస్తుంది. ఫలితంగా భారీ ట్రక్కుల్లాంటివి దూర ప్రాంతా లకు నిరాటంకంగా ప్రయాణించవచ్చు. సౌర, పవన వంటి పునరుత్పత్తి ఇంధనాల సాయంతో హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తే పర్యావరణ కాలుష్యమూ గణనీయంగా తగ్గుతుంది. పెరిగిపోతున్న భూతాపాన్ని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశా లన్నీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేందుకు హైడ్రోజన్ పని కొస్తుంది. హైడ్రోజన్ ఇంధనంతో ఇప్పటికే జర్మనీ, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, ఇటలీ, యూకే, కెనడా, జపాన్, దక్షిణ కొరియా చైనా దేశాలు రైళ్లను నడుపుతున్నాయి. కొన్ని దేశాలు ప్రోటో టైపులను రూపొందించి త్వరలో పట్టాలెక్కేంచేందుకు సిద్ధమవుతున్నాయి. రైళ్లకు హైడ్రోజన్ ఇంధనం వాడటం వల్ల ఎలక్ట్రిక్ లైన్లు ఏర్పాటు, నిర్వహణ వ్యయాలు తగ్గుతాయి.ఈ టెక్నాలజీని ఇప్పటికే నాసా అంతరిక్ష ప్రయో గాల్లోనూ విజయవంతంగా పరీక్షించారు. అంటే రోడ్లు, నీటిపై తిరిగే వాహనాలకు మాత్రమే కాకుండా... అంతరిక్ష ప్రయోగాల్లోనూ దీన్ని వాడే అవకాశాలు ఉన్నాయన్న మాట. భవిష్యత్తులో విమానాలు హైడ్రోజన్ ఇంధనంపైనే నడుస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో హైడ్రోజన్ సరుకు రవాణాకు, బ్యాటరీలు వ్యక్తిగత రవాణాకు పరిమిత మవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే... ప్రస్తుతా నికి హైడ్రోజన్ వాహనం ఉత్పత్తి ఖర్చు కొంచెం ఎక్కువే. కానీ... సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పుల కారణంగా 2030 నాటికి ఈ ఖర్చు సగమవుతుందనీ, ఆ వెంటనే విస్తృత వినియోగమూ పెరుగుతుందనీ హైడ్రోజన్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. హైడ్రోజన్ బాటన ప్రపంచం గత ఏడాది ప్రపంచ హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్ అమ్మకాలు 30 శాతం వరకూ పెరిగాయి. ఈ రంగం విలువ 2022 నాటికే రూ. 1.08 లక్షల కోట్లకు చేరుకోగా 2030 నాటికి రూ. 3.32 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. అలాగే కొరియా, జపాన్‌లతో పాటు యూరోపియన్ యూని యన్ కూడా హైడ్రోజన్ వాహనాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. పెట్రోలు బంకుల మాదిరిగానే హైడ్రో జన్ బంకుల్లాంటివి వందల సంఖ్యలో ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశాయి. కొరియాలో 2040 నాటికి 1,200 బంకుల ఏర్పాటుకు ప్రయత్నిస్తూండగా జపాన్ 2030 నాటికే ఎనిమిది లక్షల వాహనాలు, 900 రీఫ్యుయలింగ్ స్టేషన్ల కోసం ఏర్పాట్లు చేస్తోంది. యూరోపియన్ యూని యన్ 2050 నాటికల్లా ఐదు లక్షల హైడ్రోజన్ ట్రక్కులు ఉత్పత్తి చేసే దిశగా అడుగులేస్తోంది. ఆ యా దేశాల ప్రభు త్వాలే కాకుండా... ప్రైవేట్ రంగం కూడా చురుకుగా హైడ్రోజన్ మార్కెట్లోకి ప్రవేశిస్తూండటం గమనార్హం. టయో టాతో పాటు హ్యుండయ్, హోండా, బీఎండబ్ల్యూ, మెర్సి డిస్, ఫోర్డ్ వంటి దిగ్గజ వాహన కంపెనీలు కూడా హైడ్రోజన్ టెక్నాలజీలో పరిశోధనలకు పెద్దపీట వేస్తున్న కారణంగా ఇంకొన్నేళ్లలోనే ఈ ఇంధనం ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తుందని అంచనా. బి.టి. గోవిందరెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
గ్రీన్ హైడ్రోజన్.. కొత్త విజన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్, అనుబంధ ఉత్పత్తుల (డెరివెటివ్స్) పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీ రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించబోతోంది. ఈ మేరకు త్వరలో తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ–2024ను రూపొందించింది. స్వచ్ఛమైన ఇంధనంగా ప్రాచుర్యంలోకి వచ్చిన గ్రీన్ హైడ్రోజన్‌ను రవాణా (హైడ్రోజన్ సెల్ ఆధారిత వాహనాలు)తోపాటు ఎరువులు, రసాయనాల తయారీ, ఇతర కర్మాగారాల్లో ఇంధనంగా ప్రోత్సహించడం ద్వారా ‘నెట్ జీరో’ఉద్గారాల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యంలో భాగంగా..భూతాపాన్ని నియంత్రించేందుకు ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న చర్చ చాలాకాలం నుంచి సాగుతోంది. ఈ క్రమంలో శిలాజ ఇంధనాలకు బదులుగా కాలుష్య రహిత ‘గ్రీన్ హైడ్రోజన్’ను ఇంధనంగా వినియోగించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2022 ఫిబ్రవరిలో ప్రకటించిన నేషనల్ హైడ్రోజన్ మిషన్‌లో 2030 నాటికి దేశంలో ఏటా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ తయారీ, డెరివేటివ్స్ వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రీన్ హైడ్రోజన్ నుంచి ఉత్పత్తి చేసే గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్ ఇంధనాలనే డెరివేటివ్స్‌గా పరిగణిస్తారు.పరికరాలపై 25% పెట్టుబడి రాయితీ!ఎలక్ట్రోలైజర్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు.. ప్రతి మెగావాట్ /1,400 టీపీఏకు గరిష్టంగా రూ.కోటి చొప్పున ఎలక్ట్రోలైజర్ పరికరాలు, ప్లాంట్ వ్యయంలో 25శాతం వరకు రాయితీని అందిస్తారు. కనీసం150 కేటీపీఏ సామర్థ్యముండే హైడ్రోజన్ ప్లాంట్లకే సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇక గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లలో వినియోగించే ఎలక్ట్రోలైజర్ పరికరాల తయారీ ప్రాజెక్టులకూ పెట్టుబడి వ్యయంలో 25శాతం వరకు రాయితీ అందిస్తారు. కనీసం 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన తొలి 5 ప్లాంట్లకే ఇది వర్తిస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా పెట్టుబడి వ్యయంలో 25శాతం రాయితీ అందిస్తారు. తొలి 10 యూనిట్లకు మాత్రమే వర్తిస్తుంది. వీటికి అవసరమైన పరికరాల కొనుగోళ్లపై పూర్తి ఎస్జీఎస్టీని రీయింబర్స్ చేస్తారు.‘ఇంటిగ్రేటెడ్’ ప్రాజెక్టులకూ సబ్సిడీలుఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్ (బయోజనిక్ కార్బన్ సహా) పరిశ్రమల ప్లాంట్, పరికరాల (ఎలక్ట్రోలైజర్ సహా) వ్యయంలో 25శాతం వరకు సబ్సిడీగా ప్రభుత్వం అందిస్తుంది. గ్రీన్ అమోనియా ప్లాంట్ల ప్రతి కేటీపీఏ సామర్థ్యానికి రూ.1.85 కోట్లు, గ్రీన్ మిథనాల్ ప్లాంట్ల ప్రతి కేటీపీఏ సామర్థ్యానికి రూ.2.25 కోట్లను పెట్టుబడి రాయితీగా ఇస్తుంది. గ్రీన్ హైడ్రోజన్, దాని డెరివేటివ్స్ నుంచి విమాన ఇంధనం (ఎస్ఏఎఫ్) తయారు చేసే ప్లాంట్లకూ ఈ రాయితీలు వర్తిస్తాయి.డీసాలినేషన్ ప్లాంట్లకు 20% పెట్టుబడి రాయితీగ్రీన్ హైడ్రోజన్, దాని డెరివేటివ్స్ తయారీ అవసరమైన డీసాలినేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు 20శాతం పెట్టుబడి రాయితీ ఇస్తారు. ప్రతి ఎంఎల్డీ (రోజుకు మిలియన్ లీటర్ల) సామర్థ్యానికిగాను రూ.కోటికి మించకుండా ఈ రాయితీ వర్తిస్తుంది. ఇక గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ల ఏర్పాటుకు కేంద్రం అందించే ఆర్థిక సాయానికి అదనంగా 25శాతం వరకు (రూ.10 కోట్లకు మించకుండా) రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.ఇతర రాయితీ, ప్రోత్సాహకాలివీ..⇒ గ్రీన్ హైడ్రోజన్, అనుబంధ ఉత్పత్తుల ప్రాజెక్టుల స్థలాలకు వ్యవసాయేతర స్థలాలుగా తక్షణమే గుర్తింపు కల్పిస్తారు.⇒ వీటి ఉత్పత్తుల అమ్మకాలపై వసూలు చేసే రాష్ట్ర జీఎస్టీ మొత్తాన్ని ఐదేళ్లపాటు రీయింబర్స్ చేస్తారు.⇒ ప్రాజెక్టులకు ప్రభుత్వమే నీటిసరఫరా సదుపాయాన్ని కల్పిస్తుంది. నీటి చార్జీలపై ఐదేళ్లపాటు 25శాతం రాయితీ ఇస్తారు.⇒ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు కొనుగోలు చేసే పునరుత్పాదక విద్యుత్‌కు సంబంధించిన అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ చార్జీల్లో 50శాతం మేర ఐదేళ్ల పాటు రాయితీ ఇస్తారు. గరిష్టంగా మెగావాట్‌కు రూ.15లక్షల రాయితీ వర్తిస్తుంది.గ్రీన్ హైడ్రోజన్ అంటే..?సౌర, పవన విద్యుత్ వంటి కాలుష్య రహిత, పునరుత్పాదక విద్యుత్‌ను ఉపయోగించి నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొట్టడం ద్వారా.. ఉత్పత్తి చేసే హైడ్రోజన్‌ను ‘గ్రీన్ హైడ్రోజన్’ అంటారు. వాహనాలతోపాటు ఎరువులు, ఉక్కు, సిమెంట్ పరిశ్రమల్లో వాడే కాలుష్య కారక సాంప్రదాయ ఇంధనాలకు బదులుగా.. గ్రీన్ హైడ్రోజన్‌ను వినియోగించాలన్నది లక్ష్యం. తద్వారా కాలుష్యాన్ని తగ్గించడం, భూతాపం పెరగకుండా చూడటం వంటివి సాధ్యమవుతాయి. -
హైడ్రోజన్ ఉత్పత్తిలో అగ్రగామిగా భారత్!.. కేంద్రమంత్రి
చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి కేంద్రం తగిన ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, సీఎన్జీ వాహనాల ఆవశ్యకతను గురించి వెల్లడించడం వంటివి చేస్తోంది. వాహన తయారీ సంస్థలకు కూడా ఫ్యూయెల్ వాహనాలకు ప్రత్యామ్నాయ వాహనాలను తయారు చేయాలనీ సూచిస్తోంది. రాబోయే రోజుల్లో మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా.. హైడ్రోజన్ ఉత్పత్తిలో కూడా భారత్ అగ్రగామిగా మారుతుందని పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రి 'హర్దీప్ సింగ్ పూరి' అన్నారు.6వ సౌత్ ఏషియన్ జియోసైన్స్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్లో మంత్రి 'హర్దీప్ సింగ్ పూరి' మాట్లాడుతూ.. నేచురల్ గ్యాస్ పైప్లైన్లలో హైడ్రోజన్ కలపడం, ఎలక్ట్రోలైజర్ బేస్డ్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి బయో-పాత్‌వేలను ప్రోత్సహించడం వంటి ప్రాజెక్టులలో భారత్ అభివృద్ధి చెందుతోందని అన్నారు. భవిష్యత్‌కు ఇంధనంగా భావించే గ్రీన్ హైడ్రోజన్‌కు మనదేశం కేంద్రంగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు.భారతదేశంలో రోజుకు 5.4 మిలియన్ బ్యారెల్స్ ఇంధన వినియోగం జరుగుతోంది. ఇది 2030నాటికి 7 మిలియన్ బ్యారెళ్లకు చేరుకుంటుందని అంచనా. ప్రతి రోజూ 67 మిలియన్ల మంది ప్రజలు పెట్రోల్ పంపులను సందర్శిస్తున్నట్లు హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఈ సంఖ్య యూకే, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాల జనాభాకు సమానమని ఆయన అన్నారు. రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్‌లో 25 శాతం భారత్ నుంచి వస్తుందని అంచనా. -
దేశంలో కొత్త రకం రైలు.. నీళ్లుంటే చాలు!
దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్-శక్తితో నడిచే రైలు అతి త్వరలోనే పట్టాలెక్కనుంది. వచ్చే డిసెంబర్ నెలలోనే దీన్ని ఆవిష్కరించేందుకు ఇండియన్ రైల్వేస్ సిద్ధమైంది. డీజిల్ లేదా విద్యుత్‌తో పని లేకుండా నడిచే ఈ హైడ్రోజన్-ఆధారిత అద్భుతం 2030 నాటికి "నికర శూన్య కార్బన్ ఉద్గారిణి"గా మారాలన్న లక్ష్యంతో ఉన్న భారతీయ రైల్వేలకు ఒక ప్రధాన మైలురాయి కానుంది.హైడ్రోజన్‌తో నడిచే ఈ రైలు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి నీటిని తన ప్రాథమిక వనరుగా ఉపయోగించుకుంటుంది. ఈ రైలులో హైడ్రోజన్ ఇంధన కణాలు ఆక్సిజన్‌తో రసాయన చర్య ద్వారా హైడ్రోజన్ వాయువును విద్యుత్తుగా మారుస్తాయి. ఈ విద్యుత్తుతో రైలు నడుస్తుంది. ఇందులో ఉప ఉత్పత్తులుగా వెలువడేవి నీరు, ఆవిరి మాత్రమే. అవసరమైన రసాయన ప్రక్రియల కోసం రైలుకు గంటకు సుమారు 40,000 లీటర్ల నీరు అవసరమవుతుంది.సాంప్రదాయ డీజిల్ లేదా ఎలక్ట్రిక్ ఇంజిన్ల మాదిరిగా కాకుండా ఈ వినూత్న రైలు కదలడానికి అవసరమైన విద్యుత్‌ను హైడ్రోజన్ ఇంధన కణాలను ఉపయోగించి ఉత్పత్తి చేసుకుంటుంది. హైడ్రోజన్ ఇంధన ఘటాలు, ఆక్సిజన్‌తో కలిసి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, నీరు మాత్రమే వెలువడుతాయి. అంటే పర్యావరణానికి హానికరమైన ఎటువంటి ఉద్గారాలు ఉండవు. ఈ క్లీన్ ఎనర్జీ విధానం దేశంలో భవిష్యత్ రైళ్లకు ప్రమాణాన్ని ఏర్పరుస్తుందని భావిస్తున్నారు.ట్రయల్ రన్హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పురాతన పర్వత ప్రాంతాల రైల్వేలైన డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే , నీలగిరి మౌంటైన్ రైల్వే, కల్కా-సిమ్లా రైల్వేతో పాటు దేశంలోని సుందరమైన, మారుమూల ప్రాంతాల వంటి అదనపు మార్గాలు కూడా పరిశీలనలో ఉన్నాయి.ఈ రైలు గరిష్టంగా గంటకు 140 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదని, ప్రయాణికులకు వేగవంతమైన , సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. రైలులోని హైడ్రోజన్ ఇంధన ట్యాంక్ ఒకసారి ఇంధనం నింపుకొంటే 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీంతో భవిష్యత్తులో సుదీర్ఘ మార్గాలకు కూడా ఈ రైళ్లు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. ఒక్కో హైడ్రోజన్ రైలు అభివృద్ధికి రూ.80 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. 2025 నాటికి 35 హైడ్రోజన్ రైళ్లు వివిధ మార్గాల్లో నడపాలని భావిస్తున్నారు. -
రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. తెలంగాణలో నీటి లభ్యత, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన స్థలాలకు లోటు లేనందున రాష్ట్రమంతా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయవచ్చన్నారు. దేశంలో గ్రీన్ హైడ్రోజన్‌కు చిరునామాగా తెలంగాణ నిలవాలని ఆకాంక్షించారు. జపాన్ పర్యటనలో భాగంగా రాజధాని టోక్యోకు 100 కి.మీ. దూరంలో ఉన్న యమానాషీ గ్రీన్ హైడ్రోజన్ కంపెనీని ఆయన సందర్శించారు. గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, ఇతర పునరుత్పాదక విద్యుత్ సాంకేతికతలను పరిశీలించి అక్కడి శాస్త్రవేత్తల బృందంతో మాట్లాడారు. సౌర విద్యుత్ వినియోగించి నీటిని ఎలక్రో్టలైజింగ్ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొట్టే యంత్ర విభాగాలను ఈ సంస్థ తయారు చేస్తోంది. ఇలా ఉత్పత్తి చేసిన హైడ్రోజన్‌ను రేసింగ్ కార్లకు ఇంధనంగా, సూపర్ మార్కెట్లలో ఫ్యూయల్ సెల్స్‌గా, ఫ్యాక్టరీల్లో బాయిలర్లకు ఉష్ణాన్ని అందించేందుకు ఇంధనంగా వినియోగిస్తున్నారని నిర్వాహకులు భట్టికి వివరించారు. ఈ ప్రక్రియలో సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తుండటంతో దీన్ని గ్రీన్ హైడ్రోజన్‌గా పేర్కొంటున్నామని వివరించారు. రాష్ట్రంలో ఉత్పత్తి కానున్న గ్రీన్ హైడ్రోజన్‌ను స్థానిక ఎరువుల కర్మాగారాలు, ఆరీ్టసీ, ఇతర పరిశ్రమలకు సరఫరా చేయొచ్చని భట్టి అన్నారు. థర్మల్ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక విద్యుదుత్పత్తిని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో సౌర విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఉమ్మడిగా ప్లాంట్ల ఏర్పాటుకు కలిసిరండి.. కంపెనీ తయారు చేస్తున్న ‘బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం’బ్యాటరీల తయారీ విభాగాన్ని భట్టి విక్రమార్క పరిశీలించారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లు పగటిపూట ఉత్పత్తి చేసే విద్యుత్‌లో మిగులు విద్యుత్‌ను నిల్వ చేయడానికి ఈ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తున్నారు. సింగరేణి ఏర్పాటు చేసిన 245 మెగావాట్ల సామర్థ్యంగల సోలార్ ప్లాంట్లతోపాటు త్వరలో ఏర్పాటు చేయనున్న మరో వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని భట్టి అన్నారు.తెలంగాణలో గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం ప్లాంట్లను ఉమ్మడి భాగస్వామ్యంతో ఏర్పాటు చేసేందుకు తమతో కలిసి రావాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. దీనిపై యమానాషీ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఉన్నత స్థాయిలో చర్చించి నిర్ణయిస్తామన్నారు. ఈ పర్యటనలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ పాల్గొన్నారు. -
హైడ్రోజన్ ఉత్పత్తిలో అగ్రస్థానం!.. నితిన్ గడ్కరీ
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ న్యూఢిల్లీలో 64వ వార్షిక సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. హైడ్రోజన్ ఉత్పత్తి గురించి ప్రస్తావించారు.ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉండగల దేశాల జాబితాలో భారత్ ముందు వరుసలో ఉండాలని గడ్కరీ పేర్కొన్నారు. ఆటోమోటివ్ పరిశ్రమ దేశం మొత్తం జీడీపీకి 6.8 శాతం అని వెల్లడిస్తూ.. తయారీ రంగం దేశాభివృద్ధికి కీలకమని అన్నారు. 2030 నాటికి కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని చెప్పారు.దేశంలో హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని.. ఎలక్ట్రోలైజర్ల ఉత్పత్తిలో భారతదేశాన్ని అగ్రస్థానానికి తీసుకురావడానికి హైడ్రోజన్ ఉత్పత్తిని స్థానికీకరించే సాంకేతికత అవసరమని ఆయన అన్నారు. బయోహైడ్రోజన్ను ఉత్పత్తి చేయడానికి వ్యర్థాలను ఉపయోగించాలనే ప్రతిపాదన గురించి ఆయన మాట్లాడారు.ఇదీ చదవండి: వైకల్యాన్ని జయించి.. బిలియనీర్‌గా నిలిచి: జీవితాన్ని మార్చే స్టోరీభారతదేశం ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. రాబోయే రోజుల్లో ఇది మరింత వృద్ధి చెందుతుంది. కాబట్టి ఫ్యూయెల్ వాహనాలను వీలైనంత వరకు తగ్గించాలని గడ్కరీ సూచించారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఉపయోగపడుతుందని అన్నారు. పెట్రోల్ దిగుమతులను తగ్గించుకోవాలని.. దీనికి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.📍𝑵𝒆𝒘 𝑫𝒆𝒍𝒉𝒊64th SIAM Annual Convention 2024 pic.twitter.com/jZP0723nAa— Nitin Gadkari (@nitin_gadkari) September 10, 2024 -
ఆవిరి శక్తితో..ఆకాశ యాత్ర
పల్లా రవికిరణ్, ఏపీ సెంట్రల్ డెస్క్: జేమ్స్‌వాట్ ఆవిష్కరించిన ఆవిరి యంత్రం చరిత్ర గతిని మార్చేసింది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక విప్లవానికి దారి తీసింది. అదే ఆవిరి శక్తిని ఇంధనంగా వినియోగించుకుంటూ ఎయిర్ ట్యాక్సీలు సిద్ధమవుతున్నాయి. ఉబర్.. ఓలా.. రాపిడో తరహాలో ఎయిర్ ట్యాక్సీలు ఆకాశయానంతో సందడి చేసే రోజు దగ్గర్లోనే ఉందని ఏవియేషన్ సంస్థలు నమ్మకంగా చెబుతున్నాయి. తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో తయారైన ఎయిర్ ట్యాక్సీ కాలిఫోరి్నయా మీదుగా రికార్డు స్థాయిలో 561 మైళ్లు (902 కి.మీ.) విజయవంతంగా ప్రయాణించింది.ఆరిజోనాలోని ఎర్రరాతి శిలలతో కూడుకున్న విశాలమైన లోయ ప్రాంతం గ్రాండ్ కాన్యాన్‌తో పోలిస్తే ఇది రెండు రెట్లు ఎక్కువ. జోబి ఏవియేషన్ కంపెనీలో పురుడు పోసుకున్న ఈ ఫ్లైయింగ్ కార్ పూర్తిగా హైడ్రోజన్‌తో నడుస్తుంది. నీటి ఆవిరి మినహా ఎలాంటి ఉద్గారాలను విడుదల చేయకపోవడం దీని ప్రత్యేకత. ‘‘శాన్ ఫ్రాన్సిస్కో నుంచి శాండియాగో, బోస్టన్, బాలి్టమోర్ లేదా నాష్విల్లే నుంచి న్యూఓర్లాన్స్ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రయాణం చేయటాన్ని ఊహించుకోండి.నీటి ఆవిరి మినహా ఎలాంటి కాలుష్యం వెదజల్లని ఎయిర్ ట్యాక్సీలో ప్రయాణించే రోజు చాలా దగ్గర్లోనే ఉంది’’అని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో జో బెన్ బెవిర్ట్ వెల్లడించారు. అమెరికా సైనిక విభాగం ఈ ఎయిర్ ట్యాక్సీ ప్రయోగానికి పాక్షికంగా నిధులు సమకూర్చడం విశేషం. ఎంత మంది? జోబి ఏవియేషన్ తయారు చేసిన ఎయిర్ ట్యాక్సీకి ఆరు ప్రొఫెల్లర్లు ఉంటాయి. హెలికాఫ్టర్ తరహాలో గాల్లోకి ఎగిరేందుకు, కిందకు దిగేందుకు ఇవి తోడ్పడతాయి. టేకాఫ్ తీసుకుని గాల్లోకి ఎగిరిన తరువాత ప్రొఫెల్లర్లు నిట్ట నిలువు నుంచి బల్లపరుపుగా మారతాయి. రెక్కలున్న సంప్రదాయ ఎయిర్ క్రాఫ్ట్ తరహాలో ఎయిర్ ట్యాక్సీ ఆకాశంలో ఎగిరేందుకు ఇవి దోహదం చేస్తాయి. ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు.ఏమిటి దీని ప్రత్యేకత? ఎయిర్ ట్యాక్సీ అనేది కొత్త ఆవిష్కరణ కాకపోయినా జోబీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రొఫెల్లర్లకు సమకూర్చిన ఇంధనం మాత్రం కొత్త ప్రయోగమే. 40,000 కి.మీ. తిరిగిన ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఆధునికీకరించి దీన్ని తయారు చేశారు. పాత ఎయిర్‌క్రాఫ్ట్ బ్యాటరీల స్థానంలో 40 కిలోల ద్రవ హైడ్రోజన్ సామర్థ్యం కలిగిన ఇంధన సెల్స్‌ను అమర్చారు. ట్యాక్సీకి అవసరమైన విద్యుత్తు, ఉష్ణోగ్రత, నీటి ఆవిరిని ఇవి అందిస్తాయి. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో అదనపు శక్తి అందించేందుకు కొన్ని బ్యాటరీలు ఉంటాయి.బ్యాటరీ ట్యాక్సీల కంటే మెరుగైన సామర్థ్యం గతంలో రూపొందించిన బ్యాటరీలతో పనిచేసే ఎయిర్ ట్యాక్సీలు ఒక్కసారి చార్జింగ్ చేస్తే 100 – 150 మైళ్లు (160 – 240 కి.మీ.) ప్రయాణించాయి. హైడ్రోజన్‌తో నడిచే ఎయిర్ ట్యాక్సీలో మాత్రం ఒక నగరం నుంచి మరొక నగరానికి వెళ్లవచ్చని చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా 561 మైళ్లు నడిపి చూశారు. లండన్ నుంచి ప్యారిస్, జ్యూరిచ్, ఎడిన్బర్గ్ ఆగాల్సిన అవసరం లేకుండా వెళ్లవచ్చు. ఎయిర్ ట్యాక్సీల నెట్‌వర్క్‌ను అనుసంధానించడం ద్వారా వివిధ నగరాలకు వెళ్లవచ్చని చెబుతున్నారు. హైడ్రోజన్ మోడల్ ఎయిర్ ట్యాక్సీలు కచి్చతంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో ఆయన వెల్లడించలేదు.పోటాపోటీ..ఎలక్ట్రిక్ మోటార్లు, బ్యాటరీ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ వినియోగంలో వచి్చన ఆధునిక మార్పులు ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీల రంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేశాయి. ఎలక్ట్రిక్ క్యాబ్‌లపై విస్తృత పరిశోధనలు నిర్వహించిన ఏవియేషన్ స్టార్టప్‌లు జీ ఏరో, కిట్టీ హాక్‌లపై గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవో లారీ పేజ్ లక్షల డాలర్ల నిధులను వెచి్చంచారు. ఎయిర్ స్పేస్ ఎక్స్ లాంటి పలు కంపెనీలు ఎయిర్ ట్యాక్సీలను తెచ్చేందుకు పోటీ పడుతున్నాయి.తమ ప్రయాణికులకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కలి్పస్తామంటూ ఊరిస్తోంది. వైద్య అవసరాల కోసం అత్యవసరంగా తరలించేందుకు కూడా సేవలందిస్తామంటోంది. ఇక క్యాబ్ సేవల సంస్థ ఉబర్ కూడా దీనిపై దృష్టి సారించింది. 2018 జనవరిలో నిర్వహించిన ఓ సాంకేతిక సదస్సులో ఉబర్ సీఈవో డారా ఖొస్రోవ్‌షాహి ఈమేరకు ఓ ప్రకటన చేశారు. వచ్చే పదేళ్లలో ఇవి సాకారం కానున్నట్లు అప్పట్లోనే చెప్పారు. దుబాయ్‌లో బీచ్ విహారం.. తమ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ నుంచి 3 – 5 దశల ధ్రువీకరణ పూర్తి చేసుకున్నట్లు జోబీ చెప్పారు. దుబాయ్ నుంచి వీటి సేవలు ప్రారంభం కానున్నట్లు గతంలోనే జోబీ ఏవియేషన్ కంపెనీ ప్రకటించింది. ఈమేరకు దుబాయ్ రోడ్డు రవాణా సంస్థతో కంపెనీ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. వీటి ద్వారా దుబాయ్ విమానాశ్రయం నుంచి ప్రముఖ పర్యాటక ప్రాంతం, కృత్రిమ దీవుల సముదాయం పామ్ జుమేరా బీచ్‌కు కేవలం పది నిమిషాల్లో చేరుకోవచ్చు.బ్యాటరీతో నడిచే ఎయిర్ ట్యాక్సీ పరీక్షలు విజయవంతం కావడంతో హైడ్రోజన్ మోడల్ కూడా సత్ఫలితాలనిస్తుందని కంపెనీ గట్టి నమ్మకంతో ఉంది. అయితే ఈ రెండు మోడళ్ల ధరలు ఎంత ఉంటాయనే విషయాన్ని ఇంతవరకు వెల్లడించలేదు. వాణిజ్యపరంగానూ వీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. ఎయిర్ ట్యాక్సీల వాడకం 2028 నాటికి సాధారణంగా మారుతుందని, పైలెట్ల అవసరం లేకుండా ఎగిరే ట్యాక్సీలు 2030 నాటికి అందుబాటులోకి వస్తాయని బ్రిటన్ భావిస్తోంది. -
మరమనిషి, తొలి హైడ్రోజన్ ఫ్లైయింగ్ ట్యాక్సీ గురించి మీరెప్పుడైనా విన్నారా?
ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు రకరకాల రోబోలను రకరకాల పనుల కోసం రూపొందించారు. అవన్నీ మనుషుల ఆదేశాలకు అనుగుణంగా యాంత్రికంగా పనిచేసుకుపోయేవే తప్ప వాటికంటూ ప్రత్యేకంగా భావోద్వేగాలేవీ ఉండవు. అవి ఉత్త మరమనుషులు, అంతే! అయితే, చైనా శాస్త్రవేత్తలు ఇటీవల ప్రపంచంలోనే తొలిసారిగా మనసున్న మరమనిషిని రూపొందించారు. ఈ రోబో పేరు ‘పెప్పర్’. మనుషుల మాది1రిగానే ఈ రోబో కూడా ప్రేమ, సంతోషం, బాధ, కోపం వంటి భావోద్వేగాలను వ్యక్తం చేయగలదు.ఎదుటనున్న మనుషుల భావోద్వేగాలను గ్రహించి, అందుకు అనుగుణంగా నడుచుకోగలదు. షాంఘైలోని ఫుడాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ రోబోను రూపొందించారు. పూర్తిగా మనిషంత పరిమాణంలో 5.4 అడుగుల ఎత్తు, 62 కిలోల బరువుతో వారు తయారు చేసిన ఈ రోబో తన భావోద్వేగాలను ముఖంలో పలికించగలదు. షాంఘైలో జూలై 4 నుంచి 6 వరకు జరిగిన ‘వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్–2024’లో ఈ రోబో పనితీరును ప్రదర్శించారు. పెద్దలను స్నేహపూర్వకంగా పలకరించడం, చిన్నపిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకోవడం వంటి చేష్టలతో ఈ మనసున్న మరమనిషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇళ్లల్లో ఒంటరిగా ఉండే వృద్ధుల బాగోగులను చూసుకునేలా, వారి ఆరోగ్య అవసరాలను కనిపెట్టుకుని, వేళకు మందులు అందించడం వంటి సేవలు చేసేలా దీనిని రూపొందించారు.తొలి హైడ్రోజన్ ఫ్లైయింగ్ ట్యాక్సీ..హైడ్రోజన్ ఇంధనంగా ఉపయోగించుకుని ప్రయాణించే తొలి ఫ్లైయింగ్ ట్యాక్సీ ఇది. విమానాలను తయారు చేసే అమెరికన్ కంపెనీ ‘జోబీ ఏవియేషన్స్’ ఇటీవల దీనికి రూపకల్పన చేసింది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఎగిరే కార్లను రూపొందించాయి. ‘జోబీ ఏవియేషన్స్’ ఆరు ప్రొపెల్లర్లతో రూపొందించిన ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీ ఎటువంటి ఉపరితలం పైనుంచి అయినా, ఉన్న చోటు నుంచి నిట్టనిలువుగా పైకి ఎగరగలదు. ఇటీవల కాలిఫోర్నియాలో పరీక్షాత్మకంగా దీని ప్రయాణాన్ని నిర్వహించినప్పుడు, హైడ్రోజన్ ఇంధనంతో ఇది ఏకధాటిగా 902 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, ఇదివరకటి ఫ్లైయింగ్ కార్ల రికార్డులను బద్దలు కొట్టింది.దీని గరిష్ఠ వేగం గంటకు 322 కిలోమీటర్లు. ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీ రూపకల్పన కోసం అమెరికన్ సైన్యం కొంతవరకు నిధులు సమకూర్చినట్లు ‘జోబీ ఏవియేషన్స్’ వ్యవస్థాపకుడు, సీఈవో జోబెన్ బెవిర్ట్ వెల్లడించారు. రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో ప్రయాణికులను ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకుపోయేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోని స్థానిక అవసరాలకు మాత్రమే కాకుండా, దేశాల మధ్య కూడా ఇది ప్రయాణించగలదని, దాదాపు 900 కిలోమీటర్ల వరకు దీనికి ఇంధనం నింపాల్సిన అసరం ఉండదని బెవిర్ట్ చెప్పారు. ప్రస్తుతం ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీ ఉత్పత్తిని 2050 నాటికి వాణిజ్యపరంగా ప్రారంభించనున్నామని వెల్లడించారు. -
మగ్గంలా పనిచేసే రోబో గురించి.. ఎప్పుడైనా విన్నారా!?
ఈ రోబో మగ్గంలా పనిచేస్తుంది. అయితే నూలు దుస్తులు, పట్టు వస్త్రాలు కాదు, ఊలు దుస్తులు నేస్తుంది. ఇది ఊలు దుస్తులను చకచకా నేసి, కోరుకున్న డిజైన్లలో అల్లేస్తుంది. ఈ రోబో మగ్గాన్ని డచ్ డిజైనర్ క్రిస్టీన్ మీండెర్స్మా రూపొందించారు..త్రీడీ ప్రింటర్లు పొరలు పొరలుగా వస్తువులను ముద్రించిన పద్ధతిలోనే ఈ రోబో మగ్గం పొరలు పొరలుగా ఊలు దుస్తులను నేస్తుంది. ఈ రోబో మగ్గానికి ‘ఫ్లాక్స్ వోబో’ అని పేరు పెట్టారు. ఊలు పరిశ్రమలో నేసే ముందు ఊలును నీటితో తడుపుతారు. అయితే, ఈ రోబో మగ్గానికి నేరుగా ఊలు అందిస్తే చాలు, ఏమాత్రం తడపాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి దీనిని నమూనాగా రూపొందించారు. త్వరలోనే పారిశ్రామిక స్థాయిలో దీని ఉత్పత్తిని ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.హైడ్రోజన్ బైక్..పెట్రోల్‌తో నడిచే బైక్‌లకు పోటీగా ఇటీవలి కాలంలో లిథియం అయాన్ బ్యాటరీలతో పనిచేసే ఎలక్ట్రిక్ బైక్‌ల వాడకం పెరిగింది. లిథియం అయాన్ బ్యాటరీలను మించిన సామర్థ్యం కలిగిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో నడిచే బైక్‌లు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన ‘హైడ్రోరైడ్ యూరోప్ ఏజీ’ కంపెనీ రకరకాల మోడల్స్‌లో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది.వీటికి 180 హైడ్రోజన్ సెల్‌తో పాటు, 25 సెంటీమీటర్ల పొడవైన హైడ్రోజన్ కంటెయినర్ ఉంటుంది. కంటెయినర్‌లోని హైడ్రోజన్ 1 మెగాపాస్కల్ పీడనంతో ఉంటుంది. ఈ హైడ్రోజన్ నుంచి ఇందులోని ఫ్యూయల్ సెల్ విద్యుత్తును తయారుచేసుకుంటుంది. ఒక కంటెయినర్‌ను పూర్తిగా నింపి అమర్చుకుంటే, ఈ బైక్‌పై ఏకధాటిగా 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ బైక్‌కు అమర్చుకునే విధంగా హైడ్రో జనరేటర్ కూడా ఉంటుంది.ఒకవేళ మార్గమధ్యంలో కంటెయినర్‌లోని హైడ్రోజన్ ఖాళీ అయిపోతే, ఈ జనరేటర్లో 200 మిల్లీలీటర్ల డిస్టిల్డ్ వాటర్‌ను నింపుకుంటే చాలు. దీని నుంచి ఉత్పత్తయ్యే హైడ్రోజన్ దాదాపు ఐదారు గంటల ప్రయాణానికి తగినంత ఇంధనంగా సరిపోతుంది. అయితే, హైడ్రోరైడ్ యూరోప్ ఏజీ’ కంపెనీ నేరుగా విక్రయానికి పెట్టకుండా.. యూరోప్‌లోని ఎంపిక చేసిన నగరాల్లో కస్టమర్లకు అద్దెకు ఇస్తోంది.ఉభయచర డ్రోన్..ఇప్పటి వరకు గాల్లోకి ఎగిరే డ్రోన్లు మాత్రమే తెలుసు. అయితే, కెనడియన్ కంపెనీ ‘ఏరోమావో’ ఉభయచర డ్రోన్‌ను రూపొందించింది. ఇది గాలిలో ఎగరడమే కాదు, నీటిలోనూ ప్రయాణించగలదు. ఈ డ్రోన్‌ను ‘వీటీ నాట్–వీటీఓఎస్ఎల్’ బ్రాండ్ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ఈ బ్రాండ్ పేరుకు అర్థమేమిటంటే, ‘వెర్టికల్ టేకాఫ్ అండ్ షార్ట్ ల్యాండింగ్’. మ్యాపుల చిత్రణ, మనుషులు చొరబడలేని ప్రదేశాల్లో కూడా సర్వే జరపడం, వ్యవసాయ అవసరాలకు, నిఘా పనులకు ఉపయోగపడేలా దీనిని రూపొందించారు.గాల్లోకి ఎగిరేటప్పుడు దీని గరిష్ఠ వేగం గంటకు 85 కిలోమీటర్లు అయితే, నీటిలో ప్రయాణించేటప్పుడు గంటకు 55 కిలోమీటర్లు. రీచార్జబుల్ బ్యాటరీతో ఇది పనిచేస్తుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసినట్లయితే, గంటన్నర సేపు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. దీని ధర 11,170 డాలర్లు (రూ.9.31 లక్షలు). -
మస్క్ సంచలన నిర్ణయం: 2026 నాటికి..
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ (Elon Musk) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో అగ్రగామిగా ఉన్న టెస్లా రాబోయే రోజుల్లో హైడ్రోజన్ కార్లను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో చైనా కంపెనీ బివైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్) గట్టి పోటీ ఇస్తోంది. ఈ తరుణంలో మస్క్ హైడ్రోజన్ కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ 2026 నాటికి టెస్లా హైడ్రోజన్ కార్లను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.టెస్లా కంపెనీ త్వరలోనే హైడ్రోజన్ కార్ల ప్రాజెక్టు మీద పనిచేయనుంది. హైడ్రోజన్‌తో నడిచే మొదటి కారు 'మోడల్ హెచ్'ను 2026లో ఆవిష్కరించనున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ కార్లను కేవలం అమెరికా మార్కెట్లో మాత్రమే లాంచ్ చేస్తారా?.. ఇతర దేశాల్లో కూడా లాంచ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. -
టెక్ టాక్: ఈ సరికొత్త వాటిని గురించి ఎప్పుడైనా విన్నారా..!
నిత్య జీవితంలో.. టెక్నాలజీ పరంగా నూతన మార్పులు సంభవిస్తున్నాయి. మానవ అన్నీ అవసరాలను తీర్చిదిద్దేలాగా ఈ టెక్నాటజీ వృద్ధి చెందుతుంది. విద్య, వైద్య, ఉద్యోగాలలోనూ దీని అవసరం మరెంతగానో ఉండేలా కాలం మారుతుంది. అందుకు అనుగుణంగానే ఈ సరికొత్త పరికరాలు మీ ముందుకొచ్చాయి. మరి వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇది కట్టుకుంటే నొప్పులు మాయం.. జిమ్‌లో వ్యాయామం చేసేవారికి, మైదానాల్లో ఆటలాడే వారికి ఒక్కోసారి కీళ్లు పట్టేసి నొప్పులు తలెత్తడం మామూలే! ఇళ్లల్లో రోజువారీ పనులు చేసుకునేటప్పుడు కూడా ఒక్కోసారి నొప్పులు తలెత్తుతుంటాయి. ఇలాంటి నొప్పులకు నొప్పినివారణ మాత్రలు వాడటం, పైపూతగా ఆయింట్మెంట్లు పూసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇకపై వాటితో పని లేకుండా, ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరాన్ని నొప్పి ఉన్నచోట పెట్టుకుని, దీనికి ఉన్న బెల్టుతో బిగించి కట్టుకుంటే చాలు, సత్వరమే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అమెరికన్ కంపెనీ ‘థెరాబాడీ’ ఇటీవల ‘రికవరీ థెర్మ్‌క్యూబ్’ పేరిట ఈ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మనం కోరుకున్న విధంగా చల్లదనం లేదా వెచ్చదనాన్ని ఎంచుకోవడానికి స్విచ్‌లు ఉంటాయి. నొప్పి ఉన్న చోట ఈ క్యూబ్‌ను అదిమిపెట్టి బిగించి బెల్ట్ కట్టుకుంటే చాలు, రెండు గంటల్లోనే పూర్తిగా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని ధర 149 డాలర్లు (రూ.12,350) మాత్రమే! హైడ్రోజన్‌తో పరుగులు తీసే కారు.. జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ ‘హోండా’ తాజాగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో నడిచే కారును రూపొందించింది. హోండా మోడల్స్‌లోని ‘సీఆర్–వి’ మోడల్ ఎస్‌యూవీకి అవసరమైన మార్పులు చేసి, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో నడిచేలా ‘సీఆర్వీ: ఈఎఫ్సీఈవీ’ మోడల్‌కు రూపకల్పన చేసింది. ఇందులో ఉపయోగించే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మాడ్యూల్స్ తయారీకి మరో కార్ల తయారీ సంస్థ ‘జనరల్ మోటార్స్’ సహకారం తీసుకుంది. ఇందులో అమర్చిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మాడ్యూల్స్‌లోని 110 వోల్టుల పవర్ ఔట్లెట్ ద్వారా ఇంజిన్‌కు దాదాపు 1500 వాట్ల విద్యుత్తు సరఫరా అవుతుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసుకున్నట్లయితే, ఇది ఏకంగా 435 కిలోమీటర్ల వరకు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. ఈ కారును హోండా మోటార్స్ వచ్చే ఏడాది నాటికి మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. బ్యాటరీతో నడిచే ఈ–విమానం ఇది బ్యాటరీతో నడిచే ఈ–విమానం నమూనా. ఇది అందుబాటులోకి వస్తే, విమానయాన రంగంలో విప్లవాత్మకమైన మార్పు రాగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే రోడ్లపైకి వచ్చిన ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే ఈ విమానం కూడా రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. డచ్ విమానాల తయారీ కంపెనీ ‘ఎలీసియన్’ ఈ బ్యాటరీ విమానం నమూనాకు ఇటీవల రూపకల్పన చేసింది. ‘ఎలీసియన్–ఈ9ఎక్స్’ పేరుతో రూపొందించిన ఈ విమానం 2033 నాటికి అందుబాటులోకి రానున్నట్లు ‘ఎలీసియన్’ కంపెనీ ప్రకటించింది. సాధారణ విమానాల కంటే చాలా తక్కువ బరువుతో రూపొందించిన ఈ విమానం వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో 90 మంది ప్రయాణికులు ప్రయాణించడానికి వీలవుతుంది. ఇవి చదవండి: వీటిని చూశారంటే.. మంత్ర ముగ్ధులు అవక తప్పదు! -
సెల్ఫ్ డ్రైవింగ్ కారు తయారు చేసిన రైతు బిడ్డ, ముచ్చటపడ్డారు కానీ రిజెక్ట్!
మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన రైతు బిడ్డ 'హర్షల్ నక్షనేని' (Harshal Nakshane) హైడ్రోజన్‌తో నడిచే AI కారును రూపొందించి.. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి 'దేవేంద్ర ఫడ్నవిస్' చేత ప్రశంసలందుకున్న విషయం గతంలో తెలుసుకున్నాం. అయితే ఈ కారు అభివృద్ధికి షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3లోని పారిశ్రామిక వేత్తలు పెట్టుబడుల పెట్టడానికి నిరాకరించారు. స్టార్టప్ AI కార్స్‌కు చెందిన హర్షల్ మహదేవ్ నక్షనేని సుమారు 18 నెలలు శ్రమించి భారతదేశపు మొట్ట మొదటి ఏఐ ఆధారిత హైడ్రోజన్ కారు రూపొందించారు. ఈ కారు నిర్మాణానికి ఏకంగా రూ. 60 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ కారుని హర్షల్ షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3లోని పారిశ్రామిక వేత్తలు ముందుకు తీసుకువచ్చారు. ఏఐ కారు రీఫ్యూయలింగ్ సమయం కేవలం ఐదు నిముషాలు మాత్రమే. ఇది 1000 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తుందని హర్షల్ వెల్లడించారు. ఈ ఏఐ కారు పారిశ్రామిక వేత్తలను ఎంతగానో ఆకర్శించింది, అయితే పెట్టుబడి పెట్టడానికి మాత్రం నిరాకరించారు. ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి ఫాస్ట్‌ట్యాగ్‌లు పనిచేయవు! కారణం ఇదే.. హైడ్రోజన్ శక్తితో నడిచే వాహనాలకు మార్కెట్ తక్కువగా ఉండటమే కాకుండా.. ఇలాంటి వాటికి సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం కారణంగా పెట్టుబడి పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపలేదు. అయితే ఈ కారు వారు స్వయంగా డ్రైవ్ చేసి 'హర్షల్' పనితీరుని ప్రశంసించారు. -
అక్కడ మొదటి హైడ్రోజన్ రైలు.. త్వరలోనే ట్రయల్స్
ప్రత్యామ్నాయ ఇంధనాలకు ఇటీవల ప్రధాన్యత పెరుగుతోంది. కాలూష్య రహిత పర్యావరణం దిశగా ప్రపంచ దేశాలు పయనిస్తున్నాయి. ఇందులో భాగంగా హైడ్రోజన్ ఇంధనం వెలుగులోకి వచ్చింది. ఈ ఇంధనంతో నడిచే వాహనాలను పలు దేశాలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా సౌదీ అరేబియా త్వరలోనే హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును ప్రారంభించనుంది. ఈమేరకు ఆ దేశ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో మొదటి హైడ్రోజన్ రైలును పరీక్షించడాన్ని తమ దేశం ప్రారంభిస్తుందని రియాద్‌లో జరిగిన UN MENA క్లైమేట్ వీక్ కార్యక్రమంలో వెల్లడించారు. (ఇండియన్ ఫుడ్‌కు భారీ డిమాండ్.. భారత్‌ను వేడుకుంటున్న దేశాలు) హైడ్రోజన్ రైలు అనేది విద్యుత్తును ఉత్పత్తి చేసే ఒక ప్రత్యేకమైన రైలు. హైడ్రోజన్ ఇంధన కణాలను ఉపయోగించి దాని ప్రొపల్షన్ సిస్టమ్‌కు శక్తినిస్తుంది. సంప్రదాయ డీజిల్‌తో నడిచే రైళ్ల కంటే పర్యావరణపరంగా మేలైనవి. ఇవి పర్యావరణానికి హాని కలిగించే ఎటువంటి ఉద్గారాలను విడుదల చేయవు. మొట్టమొదటి హైడ్రోజన్ రైలు "కోరాడియా ఐలింట్" అనేది హైడ్రోజన్ శక్తితో ప్రత్యేకంగా నడిచే ప్రపంచంలో మొట్టమొదటి ప్యాసింజర్ రైలు. ఫ్రెంచ్ బహుళజాతి రైలు రవాణా సంస్థ Alstom దీనిని తయారు చేసింది. 2016లో దీని పరిచయం రైలు ఆధారిత హైడ్రోజన్ ఇంధన సెల్ సాంకేతికత అభివృద్ధిలో ఒక కీలక మలుపు. ఈ రైలు ఒక ట్యాంక్ హైడ్రోజన్‌కు సుమారు 1,000 కిలోమీటర్లు నడుస్తోంది. ఇది మొదట 2018 సెప్టెంబర్‌లో జర్మనీలోని లోయర్ సాక్సోనీలో కమర్షియల్‌గా ప్రారంభమైంది. భారత్‌లోనూ.. భారత్ సైతం హైడ్రోజన్‌తో నడిచే రైళ్లను అభివృద్ధి చేస్తోందని, ఇవి 2023 డిసెంబర్ నాటికి సిద్ధమవుతాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలో తెలిపారు. హర్యానాలోని జింద్-సోనీపట్ మార్గంలో వీటిని నడపనున్నారు. -
సోలార్‌పవర్‌తో ‘హైడ్రోజన్’
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/గోదావరిఖని: ఇప్పటికే సోలార్ విద్యుత్ రంగంలోకి అడుగిడిన ‘సింగరేణి’ మరో భారీ పర్యావరణహిత కార్యక్ర మానికి శ్రీకారం చుడు తోంది. సంస్థ నిర్వహణలో ఉన్న హైడ్రోజన్ ప్లాంట్‌ను గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌గా మార్చేందుకు సిద్ధమైంది. దీనిపై పరిశీలించి నివేదిక ఇవ్వాలని సింగరేణి సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) ఎన్.శ్రీధర్ సంస్థకు చెందిన విద్యుత్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో తాజాగా జరిగిన ఈ సమావేశంలో దీనిపై చర్చించారు. హైడ్రోజన్ అవసరం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వాడే జనరేటర్లలోని వేడిని తగ్గించేందుకు శీతలీకరణ ధాతువుగా హైడ్రోజన్‌ను వినియోగిస్తున్నారు. ఇందుకు ప్లాంట్ ఆవరణలోనే ఒక హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తారు. మంచిర్యాల జిల్లాలోని జైపూర్ వద్ద 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఉంది. ఈ ప్లాంట్‌లో ఉన్న హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏటా దాదాపు 10 వేల క్యూబిక్ మీటర్ల హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ సాధారణంగా థర్మల్ విద్యుత్ వినియోగించి ఎలక్ట్రాలసిస్ రసాయనిక పద్ధతిలో హైడ్రోజన్ వాయువు ఉత్పత్తి చేస్తారు. అయితే థర్మల్ విద్యుత్‌కు బదులు సోలార్ విద్యుత్ వినియోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఇలా ఉత్పత్తి చేసే హైడ్రోజన్‌ను ‘గ్రీన్ హైడ్రోజన్’గా పేర్కొంటారు. సింగరేణి పవర్ ప్లాంట్‌లో హైడ్రోజన్ ఉత్పత్తి కోసం 100 కిలోవాట్ థర్మల్ విద్యుత్‌ను వినియోగిస్తుండగా, రాబోయే రోజుల్లో థర్మల్ బదులుగా సోలార్ విద్యుత్ ఉపయోగిస్తారు. జైపూర్‌లోనే... జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రాంగణంలోనే ప్రస్తుతం 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం, ఐదు మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు ఉన్నాయి. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ నేరుగా హైడ్రోజన్ ప్లాంట్‌కు అనుసంధానం చేస్తారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రామగుండం రీజియన్‌లోనే మరో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు సాధ్యాసా«ధ్యాలను పరిశీలించాలని చైర్మన్ సూచించారు. సోలార్ పవర్ ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి మొదలైతే దేశంలోనే గ్రీన్ హైడ్రోజన్ వినియోగిస్తున్న తొలి థర్మల్ విద్యుత్ కేంద్రంగా సింగరేణి నిలుస్తుంది. జియోపై దృష్టి వేడినీటి ఊట ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా సింగరేణి ప్రయోగాత్మకంగా జియో థర్మల్ ప్రాజెక్ట్ చేపట్టింది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద మూడేళ్ల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. దీంతో పాటు సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్లోనే మిథనాల్ ప్రాజెక్ట్‌పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలని సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో సింగరేణిలోని సోలార్ ప్లాంట్ల ద్వారా 170 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశామని, తద్వారా ట్రాన్సోకు చెల్లించే విద్యుత్ బిల్లులో రూ.108 కోట్లు ఆదా చేసుకోగలి గామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డైరెక్టర్ డి.సత్యనారా యణరావు, సీటీసీ సంజయ్‌కుమార్ సూర్, చీఫ్ ఓఅండ్ఎం జే.ఎన్.సింగ్, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జనరల్ మేనేజర్ చినబసివి రెడ్డి, జనరల్ మేనేజర్(సోలార్) జానకీరాం, చీఫ్ ఆఫ్ పవర్ ఎన్వీకేవీ.రాజు, జీఎం సూర్య నారాయణ, ఏజీఎంలు కేఎస్ఎన్.ప్రసాద్, సుధాకర్ పాల్గొన్నారు -
తుక్కు కేంద్రాలను కూడా ప్రారంభించండి
న్యూఢిల్లీ: ఆటోమొబైల్స్ డీలర్లు.. వాహనాల తుక్కు కేంద్రాలను కూడా ప్రారంభించాలని కేంద్ర రహదారులు, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలు, బయోఫ్యుయల్ వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, అలాగే హరిత హైడ్రోజన్ ఉత్పత్తిలో భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కూడా కృషి చేస్తోందని మంత్రి వివరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఉందని అయిదో ఆటో రిటైల్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి తెలిపారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఎదగడంలో ఆటో డీలర్లు కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు. ప్యాసింజర్ వాహనాల తయారీలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్న భారత్.. వాణిజ్య వాహనాల తయారీలో ఆరో స్థానంలో ఉందన్నారు. దేశాన్ని టాప్ ఆటోమొబైల్ హబ్‌గా తీర్చిదిద్దడం తన కల అని ఆయన చెప్పారు. -
గ్రీన్ హైడ్రోజన్‌కు అదానీ జేవీ
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా జపాన్ దిగ్గజం కోవా గ్రూప్‌తో చేతులు కలిపింది. సమాన వాటా(50:50)తో భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేసింది. తద్వారా జపాన్, తైవాన్, హవాయ్ మార్కెట్లలో గ్రీన్ హైడ్రోజన్ విక్రయాలను చేపట్టనుంది. రానున్న దశాబ్ద కాలంలో దేశీయంగా సమీకృత గ్రీన్ హైడ్రోజన్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే 50 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికలు ప్రకటించింది. దీనిలో భాగంగా తొలి దశలో మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి తెరతీయనుంది. తదుపరి దశలో సామర్థ్యాన్ని 3 మిలియన్ టన్నులకు పెంచనుంది. ఈ బాటలో తాజాగా సింగపూర్ అనుబంధ సంస్థ ద్వారా కోవా హోల్డింగ్స్ ఏషియా పీటీఈతో జేవీని నెలకొలి్పంది. వెరసి గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్, వీటి డెరివేటివ్ అమ్మకాలు, మార్కెటింగ్ చేపట్టనుంది. శుద్ధ ఇంధన తయారీకి హైడ్రోజన్ ఉపయోగపడనుంది. ప్రధానంగా రిఫైనింగ్, కెమికల్ రంగాలలో వినియోగిస్తారు. అదానీ ఇప్పటికే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కంపెనీగా ఆవిర్భవించింది. గుజరాత్, ముంద్రా సెజ్‌లోని సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యాలను వార్షికంగా 10 గిగావాట్లకు పెంచుకునే ప్రణాళికల్లో ఉంది. ఇక్కడ మెటలర్జికల్ గ్రేడ్(ఎంజీ) సిలికాన్, పాలీసిలికాన్, ఇన్గాట్స్, వేఫర్స్, సెల్స్ తదితరాలను రూపొందించేందుకు వీలుంది. వీటిని సౌర ఇంధనం ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టే ప్రక్రియలో వినియోగిస్తారు. -
‘గ్రీన్’ ప్రాజెక్టులకు రెడ్ కార్పెట్
సాక్షి, అమరావతి: వాతావరణ కాలుష్య రహిత, నాణ్యమైన విద్యుత్తు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న చర్యలతో రాష్ట్రం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం (హబ్)గా అవతరిస్తోంది. తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా, పెరుగుతున్న వాతావరణ కాలుష్యానికి విరుగుడుగా స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తేవడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో ఏపీ భాగం అవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం గతేడాది కేంద్రం ఎంపిక చేసిన ఐదు రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఉంది. దీనికి అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ 2023ని రాష్ట్రం రూపొందించింది. తాజాగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) తయారు చేసిన నివేదిక శ్వేత పత్రాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. అందులోని వివరాలను ‘ఎన్ఆర్ఈడీసీఏపీ’ వీసీ, ఎండీ ఎస్.రమణారెడ్డి ‘సాక్షి’ ప్రతినిధికి వెల్లడించారు. సమగ్రంగా శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం సౌర, పవన విద్యుత్ వంటి స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహిస్తోంది. హైబ్రిడ్ వ్యవస్థగా చెబుతున్న పంప్డ్ హైడ్రో స్టోరేజి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతోంది. ప్రస్తుతం రాష్ట్రానికి 9 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి స్థాపిత సామర్థ్యం ఉంది. అనేక ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో సౌర, పవన, పంప్డ్ హైడ్రో సిస్టం ప్రాజెక్టులు 24 గంటలూ విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. కొత్త టెక్నాలజీల ఆవిర్భావం, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ వంటి వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుంటోంది. తద్వారా రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ రంగంలో 10 బిలియన్ డాలర్ల నుంచి 15 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులకు అవకాశాలున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు మౌలిక సదుపాయాలు ఉన్నాయి. రాష్ట్ర అవసరాలతోపాటు ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను ఎగుమతి చేయడానికి అవసరమైన గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్రం అనుకూలంగా ఉంది. రాష్ట్రంలో ఏటా 400 కిలో టన్నుల దేశీయ హైడ్రోజన్ డిమాండ్ ఉంది. దేశ పారిశ్రామిక హైడ్రోజన్ డిమాండ్‌లో ఇది దాదాపు 8 శాతం. ప్రతి ఏటా పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ 2023 ప్రకారం 2030 నాటికి కనీసం 500 కిలో టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది.దీని సాయంతో శిలాజ ఇంధన వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని(డీకార్బనైజ్) భావిస్తోంది. ఇందుకోసం యాక్సిలరేటింగ్ స్మార్ట్ పవర్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ ఇండియా (ఆస్పైర్) ప్రోగ్రామ్ కింద ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ సాయంతో ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ హైడ్రోజన్ ఇన్వెస్ట్మెంట్ అవకాశాల నివేదిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం వ్యాపారాలకు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం, పర్యావరణ వ్యవస్థలపై ‘వైట్‌పేపర్’లో వివరించారు. ఇది పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర సంసిద్ధంగా ఉందని శ్వేతపత్రంలో పొందుపరిచారు. కేంద్రం ఎంచుకున్న ఐదు రాష్ట్రాల్లో ఏపీ ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో ఐదు జాతీయ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. వీటిని 25 గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ క్లస్టర్లుగా విభజించి, వివిధ రంగాలకు ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించింది. మొదటి తరం జాతీయ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులుగా పిలుస్తున్న వీటిలో పన్నెండు రసాయనాలు, రిఫైనరీ, ఉక్కు పరిశ్రమలలోని పారిశ్రామిక డీ–కార్బనైజేషన్ ప్రాజెక్టులు కాగా మూడు భారీ రవాణా ప్రాజెక్టులు, మరో మూడు సిటీ గ్యాస్ డ్రిస్టిబ్యూషన్ (సీజీడీ) ప్రాజెక్టుల్లో హైడ్రోజన్–బ్లెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. మిగిలిన ఏడు ప్రాజెక్టులు మునిసిపాలిటీల్లో వ్యర్థాల నుండి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసేవి. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో వీటి ద్వారా 2025 నాటికి 150 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యానికి గ్రీన్ హైడ్రోజన్ పాలసీతో ఏపీ జీవం పోసింది. -
కొత్త రకం బస్సు.. దేశంలో తొలిసారి
దేశంలో ఇప్పటి వరకూ ఎన్నో రకాల బస్సులను చూశాం. డీజిల్ నడిచే బస్సులతోపాటు ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ బస్సులు కూడా పెరుగుతున్నాయి. అయితే దేశంలో తొలిసారిగా కొత్త రకం బస్సు పరుగులు తీయనుంది. అదే హైడ్రోజన్ ఇంధనంతో నడిచే బస్సు. అత్యంత ఎత్తైన హిమాలయాల్లోని లేహ్ రోడ్లపై తిరగనుంది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్‌ను ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) చేపట్టింది. కార్బన్-న్యూట్రల్ లడఖ్‌ను సాధించే దిశగా ఎన్టీపీసీ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్, సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. లేహ్ ఇంట్రాసిటీ రూట్లలో ఆపరేషన్ కోసం ఐదు ఫ్యూయల్ సెల్ బస్సులను అందజేస్తున్నట్లు కంపెనీ ప్రకటన తెలిపింది. మూడు నెలలపాటు ఉండే ఫీల్డ్ ట్రయల్స్, రోడ్వర్తీనెస్ టెస్ట్‌లు, ఇతర చట్టబద్ధమైన ప్రక్రియల్లో భాగంగా మొదటి హైడ్రోజన్ బస్సు ఆగస్టు 17న లేహ్‌కు చేరుకుంది. దేశంలో హైడ్రోజన్ ఇంధన బస్సులను వినియోగించడం ఇదే మొదటిసారి. 11,562 అడుగుల ఎత్తులో గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా 1.7 మెగావాట్ల ప్రత్యేక సోలార్ ప్లాంట్‌ను ఎన్టీపీసీ ఏర్పాటు చేసింది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో ప్రతికూల వాతావరణానికి సరిపోరిపోయేలా ఈ బస్సులను రూపొందించారు. 2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించి గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీలో అగ్రగామిగా నిలవాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బస్సుల సరఫరాకు సంబంధించిన కాంట్రాక్ట్‌ను 2020 ఏప్రిల్‌లో దక్కించుకున్న అశోక్ లేలాండ్ సంస్థ.. ఒక్కొక్కటి రూ. 2.5 కోట్లకు అందజేసింది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఈ బస్సుల్లో ఛార్జీలు సాధారణ డీజిల్ బస్సుల్లో ఛార్జీల మాదిరిగానే ఉంటాయి. దీనివల్ల వాటిల్లే నష్టాన్ని ఎన్టీపీసీనే భరించనుంది. -
రాష్ట్రంలో స్వచ్ఛ ఇం‘ధనం’
సాక్షి, అమరావతి: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూలమైన రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. స్వచ్ఛ ఇంధనం ఉత్పత్తికి అవసరమైన అన్ని వనరులు ఉండటం, ఇందుకోసం రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పాలసీని తేవడంతో కీలకమైన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు రాష్ట్రానికి రానున్నాయి. వీటి ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాష్ట్రాభివృద్ధికి మరింతగా చేయూతనిస్తాయి. ప్రకృతి పరిరక్షణకు ప్రపంచ దేశాలు చేసుకున్న ఒప్పందంలో భాగంగా మన దేశంలో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కొత్త పథకాలు, పాలసీలు తెస్తున్నాయి. వాటి ద్వారా ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలో 4.5 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర పభుత్వం టెండర్లు పిలిచింది. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఏపీ సహా 10 రాష్ట్రాలు అనుకూలమని తేలి్చంది. దీంతో త్వరలోనే రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ‘సైట్’తో ప్రోత్సాహకాలు ఏటా 125 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనంతో పాటు 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సాధించాలనే లక్ష్యంతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ని కేంద్రం తీసుకువచ్చింది. ఇందులో భాగంగా, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ఆర్థిక తోడ్పాటునందించడానికి స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ (సైట్) పథకాన్ని గత నెలాఖరులో ప్రవేశపెట్టింది. ఉత్పత్తిదారులకు ఆ ర్థికంగా చేయూతనందించేందుకు రూ.19,744 కోట్లు కేటాయించింది. 2029–30 వరకు ఈ పథకం అమలులో ఉంటుంది. తొలి ఏడాది రూ.4,440 కోట్లు, రెండో ఏడాది రూ.3,700 కోట్లు, మూడో ఏడాది రూ.2,960 కోట్లు, నాలుగో ఏడాది రూ.2,220 కోట్లు, ఐదో ఏడాది రూ.1,480 కోట్లు చొప్పున ఆరి్ధక ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఏపీ సొంత పాలసీ రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తిని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక పాలసీని రూపొందించింది. ఈ ఏడాది కేంద్రం పాలసీని తేవడానికి ఒక రోజు ముందే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్ డిమాండ్ ఏడాదికి దాదాపు 0.34 మిలియన్ టన్నులు (ఎంటీ) ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో సంవత్సరానికి 0.5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్, 2 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక మిలియన్ టన్ను గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయగలిగితే 12 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేసింది. ఈ పాలసీ ఐదేళ్లపాటు లేదా కొత్త పాలసీ జారీ అయ్యే వరకు అమలులో ఉంటుంది. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్‌ని ఉపయోగించడం ద్వారా నీటి నుంచి గ్రీన్ హైడ్రోజన్ లేదా గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయాలనుకునే డెవలపర్లు ఈ పాలసీ పరిధిలోకి వస్తారు. ఈ పాలసీ అమలుకు న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వ విధానం, ప్రోత్సాహకాలతో రాష్ట్రానికి తప్పకుండా ప్రాజెక్టులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు ♦ ప్రాజెక్టు ప్రారంభించిన తేదీ నుంచి ఐదేళ్లపాటు గ్రీన్ హైడ్రోజన్ అమ్మకంపై డెవలపర్లకు స్టేట్ జీఎస్టీలో 100 శాతం తిరిగి చెల్లింపు ♦గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తికి ఉపయోగించే పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుకు వాణిజ్య ఆపరేషన్ తేదీ నుంచి ఐదేళ్ల పాటు విద్యుత్ సుంకంపై 100 శాతం మినహాయింపు ♦ ఇంట్రాస్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీల్లో 25 శాతం రీయింబర్స్మెంట్ ♦ క్రాస్–సబ్సిడీ సర్‌చార్జి ఐదేళ్లు వెనక్కు ♦ ప్రాజెక్టుకు భూమిని ప్రభుత్వమే నోడల్ ఏజెన్సీ ద్వారా నామ మాత్రపు ధరకు లీజుగా కేటాయింపు ♦ భూ వినియోగ మార్పిడి ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు -
హరిత హైడ్రోజన్ వినియోగ విధానాలపై కసరత్తు
న్యూఢిల్లీ: దేశీయంగా హరిత హైడ్రోజన్ వినియోగానికి సంబంధించి విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ కార్యదర్శి భూపిందర్ సింగ్ భల్లా తెలిపారు. పరిశ్రమ తగు స్థాయిలో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా డిమాండ్‌ను మదింపు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా భల్లా ఈ విషయాలు పేర్కొన్నారు. 2030 నాటికి ప్రతిపాదిత హరిత హైడ్రోజన్ ఉత్పత్తిలో 70 శాతం భాగం ఎగుమతుల కోసం ఉద్దేశించినదై ఉంటుందని ఆయన తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి సంబంధించి భారత్‌ను ప్రపంచ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ఏడాది జనవరిలో కేంద్రం రూ. 19,744 కోట్లతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రణాళికను ఆమోదించింది. మరోవైపు, హరిత హైడ్రోజన్ వినియోగానికి మారే క్రమంలో సిబ్బందికి శిక్షణ కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తోందని భల్లా పేర్కొన్నారు. -
హైడ్రోజన్‌తో స్వావలంబన దిశగా..
సాక్షి, హైదరాబాద్: ఇంధన రంగంలో మన దేశం స్వావలంబన సాధించేందుకు హైడ్రోజన్ ఉపయోగపడుతుందని, ఈ దిశగా పరిశోధనలూ వేగంగా సాగుతున్నాయని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) హైడ్రోజన్ విభాగం జనరల్ మేనేజర్ డీఎంఆర్ పాండా వెల్లడించారు. జాతీయ సైన్స్ దినోత్సవాల్లో భాగంగా మంగళవారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో డీఎంఆర్ పాండా ‘గ్రీన్ హైడ్రోజన్ ఎమర్జింగ్ ట్రెండ్స్’’అన్న అంశంపై కీలకోపన్యాసం చేశారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పర్యావరణ అనుకూలమైన విధానాల్లో హైడ్రోజన్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా లేహ్, ఢిల్లీల్లో హైడ్రోజన్ బస్సులు ఇప్పటికే నడుస్తుండగా, సౌర విద్యుత్ సాయంతో హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వలకు కూడా పైలెట్ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామని చెప్పారు. గత పదేళ్లలో హైడ్రోజన్ ధర పదిరెట్లు తగ్గింది.. దేశంలో సౌర, పవన విద్యుదుత్పత్తులకు అపార అవకాశాలున్నాయని, ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్‌తో వేర్వేరు పద్ధతులను ఉపయోగించుకుని హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా దేశం పెట్రో ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుందని పాండా వివరించారు. అలాగే కర్బన ఉద్గారాల తగ్గింపూ సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చులు ఎక్కువైనప్పటికీ, ఐఐసీటీ, ఇతర విద్యా, పరిశోధన సంస్థల సహకారంతో దాన్ని తగ్గించి విస్తృత వినియోగంలోకి తేవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో హైడ్రోజన్ ధర పదిరెట్లు తగ్గిందని గుర్తు చేశారు. ఎలక్ట్రలైజర్లు, ఒత్తిడిని తట్టుకోగల సిలిండర్లు, హైడ్రోజన్‌ను చిన్న చిన్న సిలిండర్లలోకి పంపేందుకు అవసరమైన కంప్రెషర్ల విషయంలో దేశం ఇప్పటికీ విదేశాలపైనే ఆధారపడుతోందని, ఫలితంగా ఈ ఇంధనాన్ని అందరికీ అందుబాటులోకి తేవడంలో ఆలస్యం జరుగుతోందని చెప్పారు. ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస రెడ్డి, డాక్టర్ సమీర్ దవే, డాక్టర్ నెట్టెం వి.చౌదరి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఎన్టీపీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ దేశంలో హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగంపై జరుగుతున్న ప్రయత్నాలను క్లుప్తంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో హైడ్రోజన్ హబ్ దేశంలో హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగాలను పెంచే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో హైడ్రోజన్ హబ్ ఒకదాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎన్టీపీసీ జనరల్ మేనేజర్ (హైడ్రోజన్ విభాగం) డీఎంఆర్ పాండా తెలిపారు. విశాఖపట్నంలోని ఎన్టీపీసీ కేంద్రానికి దగ్గరగా ఈ హబ్ ఏర్పాటు కానుందని ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. మొత్తం 1200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే హైడ్రోజన్ హబ్‌లో హైడ్రోజన్ ఉత్పత్తితోపాటు దానికి సంబంధించిన టెక్నాలజీలు, రవాణా వ్యవస్థలపై విస్తృతమైన పరిశోధనలు జరగనున్నాయని, సౌర శక్తి కోసం పెద్ద ఎత్తున సోలార్ ప్యానెల్స్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ హబ్ ఏర్పాటుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, అన్నీ సవ్యంగా సాగితే ఇంకో వారం రోజుల్లో ఎన్టీపీసీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య దీనిపై ఒక అవగాహన ఒప్పందం కూడా జరగనుందని వివరించారు. రానున్న పదేళ్లలో ఈ హబ్ ఏర్పాటుకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు పాండా తెలిపారు. ‘వన్ వీక్.. వన్ ల్యాబ్’ ఈ నెల ఏడు నుంచి! కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) పరిశోధనశాలల కార్యకలాపాలను ప్రజలకు వివరించేందుకు ఉద్దేశించిన ‘వన్ వీక్.. వన్ ల్యాబ్’కార్యక్రమం ఈ నెల ఏడవ తేదీ నుంచి ప్రారంభం కానుందని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆరు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఐఐసీటీలో జరుగుతున్న పరిశోధనలు, అభివృద్ధి చేసిన ఉత్పత్తులను ప్రదర్శించనున్నామని చెప్పారు. పరిశోధకులు, ఉపాధ్యాయులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజిస్టులు, స్టార్టప్‌లు, సాధారణ ప్రజలు ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని సూచించారు. -
హైడ్రోజన్‌తో నడిచే బస్.. త్వరలో భారత్ రోడ్ల పైకి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు (ఎంఈఐఎల్) చెందిన ఎలక్ట్రిక్ వాహన రంగ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ హైడ్రోజన్‌తో నడిచే బస్‌ను తయారు చేసింది. రిలయన్స్ భాగస్వామ్యంతో ఈ వాహనాన్ని రూపొందించినట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ఏడాదిలోగా వాణిజ్యపరంగా వీటి ఉత్పత్తి ప్రారంభించాలని ఒలెక్ట్రా లక్ష్యంగా చేసుకుంది. పూర్తి ఇంధన సామర్థ్యంతో 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించడం బస్ ప్రత్యేకత. బస్ పైభాగంలో టైప్–4 హైడ్రోజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు. 12 మీటర్ల పొడవు ఉన్న ఈ బస్సులో డ్రైవర్ సీటు కాకుండా ప్రయాణికులకోసం 32–49 సీట్లు ఏర్పాటు చేయవచ్చు. హైడ్రోజన్ నింపడానికి 15 నిమిషాలు పడుతుంది. (ఇదీ చదవండి: సింథటిక్ వజ్రాల ల్యాబ్.. ఎక్కడో తెలుసా?) -
హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్ : అదానీ - టోటల్ ఎనర్జీ హైడ్రోజన్ ప్రాజెక్టుపై నీలినీడలు
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక అదానీ గ్రూప్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా 50 బిలియన్ డాలర్ల హైడ్రోజన్ ప్రాజెక్ట్ కోసం అదానీ గ్రూప్‌తో జత కలిసే నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. హిండెన్‌బర్గ్ నివేదిక విషయమై స్పష్టత వచ్చే వరకు ముందుకెళ్లడం లేదని టోటల్ ఎనర్జీస్ సీఈవో పాట్రిక్ పౌయన్నె తెలిపారు. 2030 నాటికి 10 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో అదానీ గ్రూప్, టోటల్ ఎనర్జీస్ మధ్య చర్చలు జరిగాయి. ఇందుకోసం వచ్చే పదేండ్లలో అదానీ న్యూ ఇండస్ట్రీస్‌లో టోటల్ ఎనర్జీ 5000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. ఒప్పందంలో భాగంగా గతేడాది జూన్‌లో చేసిన ప్రకటన ప్రకారం అదానీ న్యూ ఎనర్జీస్‌లో టోటల్ ఎనర్జీస్ 25 శాతం వాటా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో హిండెన్‌బర్గ్ నివేదికతో టోటల్ ఎనర్జీస్ వెనక్కి తగ్గింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ నిర్వహిస్తున్న అడిటింగ్ నివేదిక వచ్చే వరకు అదానీ న్యూ ఇండస్ట్రీస్‌తో తమ పార్టనర్షిప్ నిలిపేస్తున్నట్లు టోటల్ ఎనర్జీస్ తెలిపింది.