ఈ రోబో మగ్గంలా పనిచేస్తుంది. అయితే నూలు దుస్తులు, పట్టు వస్త్రాలు కాదు, ఊలు దుస్తులు నేస్తుంది. ఇది ఊలు దుస్తులను చకచకా నేసి, కోరుకున్న డిజైన్లలో అల్లేస్తుంది. ఈ రోబో మగ్గాన్ని డచ్ డిజైనర్ క్రిస్టీన్ మీండెర్‌స్మా రూపొందించారు..
త్రీడీ ప్రింటర్లు పొరలు పొరలుగా వస్తువులను ముద్రించిన పద్ధతిలోనే ఈ రోబో మగ్గం పొరలు పొరలుగా ఊలు దుస్తులను నేస్తుంది. ఈ రోబో మగ్గానికి ‘ఫ్లాక్స్ వోబో’ అని పేరు పెట్టారు. ఊలు పరిశ్రమలో నేసే ముందు ఊలును నీటితో తడుపుతారు. అయితే, ఈ రోబో మగ్గానికి నేరుగా ఊలు అందిస్తే చాలు, ఏమాత్రం తడపాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి దీనిని నమూనాగా రూపొందించారు. త్వరలోనే పారిశ్రామిక స్థాయిలో దీని ఉత్పత్తిని ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
హైడ్రోజన్ బైక్..
పెట్రోల్‌తో నడిచే బైక్‌లకు పోటీగా ఇటీవలి కాలంలో లిథియం అయాన్ బ్యాటరీలతో పనిచేసే ఎలక్ట్రిక్ బైక్‌ల వాడకం పెరిగింది. లిథియం అయాన్ బ్యాటరీలను మించిన సామర్థ్యం కలిగిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో నడిచే బైక్‌లు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన ‘హైడ్రోరైడ్ యూరోప్ ఏజీ’ కంపెనీ రకరకాల మోడల్స్‌లో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బైక్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసింది.
వీటికి 180 హైడ్రోజన్ సెల్‌తో పాటు, 25 సెంటీమీటర్ల పొడవైన హైడ్రోజన్ కంటెయినర్ ఉంటుంది. కంటెయినర్‌లోని హైడ్రోజన్ 1 మెగాపాస్కల్ పీడనంతో ఉంటుంది. ఈ హైడ్రోజన్ నుంచి ఇందులోని ఫ్యూయల్ సెల్ విద్యుత్తును తయారుచేసుకుంటుంది. ఒక కంటెయినర్‌ను పూర్తిగా నింపి అమర్చుకుంటే, ఈ బైక్‌పై ఏకధాటిగా 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ బైక్‌కు అమర్చుకునే విధంగా హైడ్రో జనరేటర్ కూడా ఉంటుంది.
ఒకవేళ మార్గమధ్యంలో కంటెయినర్‌లోని హైడ్రోజన్ ఖాళీ అయిపోతే, ఈ జనరేటర్‌లో 200 మిల్లీలీటర్ల డిస్టిల్డ్ వాటర్‌ను నింపుకుంటే చాలు. దీని నుంచి ఉత్పత్తయ్యే హైడ్రోజన్ దాదాపు ఐదారు గంటల ప్రయాణానికి తగినంత ఇంధనంగా సరిపోతుంది. అయితే, హైడ్రోరైడ్ యూరోప్ ఏజీ’ కంపెనీ నేరుగా విక్రయానికి పెట్టకుండా.. యూరోప్‌లోని ఎంపిక చేసిన నగరాల్లో కస్టమర్లకు అద్దెకు ఇస్తోంది.
ఉభయచర డ్రోన్..
ఇప్పటి వరకు గాల్లోకి ఎగిరే డ్రోన్లు మాత్రమే తెలుసు. అయితే, కెనడియన్ కంపెనీ ‘ఏరోమావో’ ఉభయచర డ్రోన్‌ను రూపొందించింది. ఇది గాలిలో ఎగరడమే కాదు, నీటిలోనూ ప్రయాణించగలదు. ఈ డ్రోన్‌ను ‘వీటీ నాట్–వీటీఓఎస్‌ఎల్’ బ్రాండ్ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ఈ బ్రాండ్ పేరుకు అర్థమేమిటంటే, ‘వెర్టికల్ టేకాఫ్ అండ్ షార్ట్ ల్యాండింగ్’. మ్యాపుల చిత్రణ, మనుషులు చొరబడలేని ప్రదేశాల్లో కూడా సర్వే జరపడం, వ్యవసాయ అవసరాలకు, నిఘా పనులకు ఉపయోగపడేలా దీనిని రూపొందించారు.
గాల్లోకి ఎగిరేటప్పుడు దీని గరిష్ఠ వేగం గంటకు 85 కిలోమీటర్లు అయితే, నీటిలో ప్రయాణించేటప్పుడు గంటకు 55 కిలోమీటర్లు. రీచార్జబుల్ బ్యాటరీతో ఇది పనిచేస్తుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసినట్లయితే, గంటన్నర సేపు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. దీని ధర 11,170 డాలర్లు (రూ.9.31 లక్షలు).
Comments
Please login to add a commentAdd a comment