హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక అదానీ గ్రూప్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా 50 బిలియన్ డాలర్ల హైడ్రోజన్ ప్రాజెక్ట్ కోసం అదానీ గ్రూప్‌తో జత కలిసే నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. హిండెన్‌బర్గ్ నివేదిక విషయమై స్పష్టత వచ్చే వరకు ముందుకెళ్లడం లేదని టోటల్ ఎనర్జీస్ సీఈవో పాట్రిక్ పౌయన్నె తెలిపారు.
2030 నాటికి 10 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో అదానీ గ్రూప్, టోటల్ ఎనర్జీస్ మధ్య చర్చలు జరిగాయి. ఇందుకోసం వచ్చే పదేండ్లలో అదానీ న్యూ ఇండస్ట్రీస్‌లో టోటల్ ఎనర్జీ 5000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. ఒప్పందంలో భాగంగా గతేడాది జూన్‌లో చేసిన ప్రకటన ప్రకారం అదానీ న్యూ ఎనర్జీస్‌లో టోటల్ ఎనర్జీస్ 25 శాతం వాటా తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో హిండెన్‌బర్గ్ నివేదికతో టోటల్ ఎనర్జీస్ వెనక్కి తగ్గింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ నిర్వహిస్తున్న అడిటింగ్ నివేదిక వచ్చే వరకు అదానీ న్యూ ఇండస్ట్రీస్‌తో తమ పార్టనర్‌షిప్ నిలిపేస్తున్నట్లు టోటల్ ఎనర్జీస్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment