హిండెన్ బర్గ్ వివాదం నుంచి కోలుకున్న ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించే పనిలో పడ్డారు.
ఇందులో భాగంగా గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ప్రస్తుతం తన టాప్ ఎగ్జిక్యూటివ్‌ల కోసం తన బిజినెస్ జెట్ ఫ్లైట్లను రెట్టింపు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి రవాణా సౌకర్యం కోసం ఆరు పిలాటస్ పీసీ-24 విమానాలకు ఆర్డర్ ఇచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
12కి చేరిన బిజినెస్ జెట్లు
ఈ ఆరు పిలాటస్ పీసీ-24 జెట్లను కొనుగోలు చేసిన తర్వాత అదానీ గ్రూప్ మొత్తం బిజినెస్ జెట్ల సంఖ్య 12 అవుతుంది. అదానీతో పాటు కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు వ్యాపార కార్యకలాపాల కోసం చేసే జర్నీ సజావుగా, సమర్థంగా జరిగేలా చూడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రీసేల్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసినందున మొత్తం ఆరు విమానాలకు రూ.300 కోట్లకు పైగా ఖర్చవుతుందని సమాచారం.
సుప్రీం తీర్పుతో కోలుకున్న అదానీ
2023లో జరిగిన నష్టాల నుంచి కోలుకున్న అదానీ గ్రూప్ ప్రస్తుతం తన వ్యాపారాన్ని విస్తరిస్తూ కార్యకలాపాలను పునరుద్ధరిస్తోంది. ఈ నెల ప్రారంభంలో సుప్రీం కోర్టు తన కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు.
80 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి
2023 జనవరిలో అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ గౌతమ్ అదానీ, అతని సంస్థ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడినట్లు ఆరోపించింది. ఈ ఆరోపణల కారణంగా అదానీ తన గ్రూప్ కంపెనీల షేర్లు పడిపోవడంతో సుమారు 80 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు.
అత్యంత ధనవంతుడిగా
అయితే, ఏడాది తర్వాత సుప్రీంకోర్టు హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలపై అదనపు దర్యాప్తు అవసరం లేదని, వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది.దీంతో అదానీ కంపెనీ నష్టాల నుంచి త్వరగా కోలుకొని, తన సంపదను తిరిగి పొంది ముకేశ్ అంబానీని అధిగమించి స్వల్పకాలం పాటు భారతదేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు.
Comments
Please login to add a commentAdd a comment