అదానీ - హిండెన్‌బర్గ్ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హిండెన్‌బర్గ్ షార్ట్ సెల్లింగ్ నివేదికపై విచారణ జరిపించేందుకు సుప్రీం కోర్టు ఆరుగురు ప్యానెల్ సభ్యులను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ ప్యానల్ సభ్యులు సీల్డ్ కవర్‌లో నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తోంది. మే 12న దీనిపై దేశ అత్యున్నత న్యాయ స్థానం విచారించింది. అయితే నిపుణుల ప్యానెల్ విచారణ నిమిత్తం మరింత గడువు కోరిందా? లేదంటే నివేదికను అందించిందా? అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ దేశీయ స్టాక్ మార్కెట్ చట్టాల్ని ఉల్లంఘించిందో? లేదో? దర్యాప్తు చేయాలని ఈ ఏడాది మార్చి నెలలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను అంచనా వేయడానికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. నిబంధనలను పటిష్టం చేయడానికి, భారతీయ పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంపొందించేందుకు సుప్రీం కోర్టు ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.
సీల్డ్ కవర్‌లో ఏముందో?
తాజాగా, అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణను పూర్తి చేసేందుకు తమకు మరో 6 నెలలు పొడిగించాలని సెబీ సుప్రీంను కోరినట్లు సమాచారం. దీనిపై విపక్షాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఈ తరుణంలో అనూహ్యంగా ఆరుగురు ప్యానెల్ సభ్యులు సుప్రీంకు నివేదిక అందివ్వగా.. ఆ సీల్డ్ కవర్ నివేదికలో ఏముందో అన్న చర్చ వ్యాపార వర్గాల్లో మొదలైంది
విమర్శలు.. ఖండించిన అదానీ గ్రూప్
అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ల నియంత్రణ చర్యల్ని బలోపేతం చేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన నాలుగు వేర్వేరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో సుప్రీం కోర్టు విచారణ జరిపించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తుండగా.. విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఓపీ భట్, జేపీ దేవదత్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, బ్యాకింగ్ దిగ్గజం కేవీ కామత్, సోమశేఖరన్ సుందరేశన్‌ను కమిటీ సభ్యులుగా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment