
చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి కేంద్రం తగిన ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, సీఎన్‌జీ వాహనాల ఆవశ్యకతను గురించి వెల్లడించడం వంటివి చేస్తోంది. వాహన తయారీ సంస్థలకు కూడా ఫ్యూయెల్ వాహనాలకు ప్రత్యామ్నాయ వాహనాలను తయారు చేయాలనీ సూచిస్తోంది. రాబోయే రోజుల్లో మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా.. హైడ్రోజన్ ఉత్పత్తిలో కూడా భారత్ అగ్రగామిగా మారుతుందని పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రి 'హర్దీప్ సింగ్ పూరి' అన్నారు.
6వ సౌత్ ఏషియన్ జియోసైన్స్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్‌లో మంత్రి 'హర్దీప్ సింగ్ పూరి' మాట్లాడుతూ.. నేచురల్ గ్యాస్ పైప్‌లైన్‌లలో హైడ్రోజన్ కలపడం, ఎలక్ట్రోలైజర్ బేస్డ్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి బయో-పాత్‌వేలను ప్రోత్సహించడం వంటి ప్రాజెక్టులలో భారత్ అభివృద్ధి చెందుతోందని అన్నారు. భవిష్యత్‌కు ఇంధనంగా భావించే గ్రీన్ హైడ్రోజన్‌కు మనదేశం కేంద్రంగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు.
భారతదేశంలో రోజుకు 5.4 మిలియన్ బ్యారెల్స్ ఇంధన వినియోగం జరుగుతోంది. ఇది 2030నాటికి 7 మిలియన్ బ్యారెళ్లకు చేరుకుంటుందని అంచనా. ప్రతి రోజూ 67 మిలియన్ల మంది ప్రజలు పెట్రోల్ పంపులను సందర్శిస్తున్నట్లు హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఈ సంఖ్య యూకే, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాల జనాభాకు సమానమని ఆయన అన్నారు. రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్‌లో 25 శాతం భారత్ నుంచి వస్తుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment