ఆవిరి శక్తితో..ఆకాశ యాత్ర | American Aviation Company innovative experiment | Sakshi
Sakshi News home page

ఆవిరి శక్తితో..ఆకాశ యాత్ర

Published Fri, Aug 16 2024 5:53 AM | Last Updated on Fri, Aug 16 2024 5:53 AM

American Aviation Company innovative experiment

అమెరికా ఏవియేషన్‌ కంపెనీ వినూత్న ప్రయోగం

902 కి.మీ. దూరం విజయవంతంగా ప్రయాణం

నీటి ఆవిరి మినహా ఎలాంటి కాలుష్యం వెదజల్లదు

ఇప్పటికే ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ల తయారీ

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు నుంచి పామ్‌ జుమేరా బీచ్‌కు నడిపే యోచన  

హైడ్రోజన్‌ ఎయిర్‌ ట్యాక్సీలు రెడీ

గంటకు 200 మైళ్ల వేగంతో (322 కి.మీ.) వెళుతుంది..  

హైడ్రోజన్‌ వాడకంతో ఇంధనం నింపుకోవాల్సిన అవసరం లేకుండా మరింత దూరం ప్రయాణించవచ్చు.  

పల్లా రవికిరణ్, ఏపీ సెంట్రల్‌ డెస్క్‌: జేమ్స్‌వాట్‌ ఆవిష్కరించిన ఆవిరి యంత్రం చరిత్ర గతిని మార్చేసింది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక విప్లవానికి దారి తీసింది. అదే ఆవిరి శక్తిని ఇంధనంగా వినియోగించుకుంటూ ఎయిర్‌ ట్యాక్సీలు సిద్ధమవుతున్నాయి. ఉబర్‌.. ఓలా.. రాపిడో తరహాలో ఎయిర్‌ ట్యాక్సీలు ఆకాశయానంతో సందడి చేసే రోజు దగ్గర్లోనే ఉందని ఏవియేషన్‌ సంస్థలు నమ్మకంగా చెబుతున్నాయి. తొలిసారిగా హైడ్రోజన్‌ ఇంధనంతో తయారైన ఎయిర్‌ ట్యాక్సీ కాలిఫోరి్నయా మీదుగా రికార్డు స్థాయిలో 561 మైళ్లు (902 కి.మీ.) విజయవంతంగా ప్రయాణించింది.

ఆరిజోనాలోని ఎర్రరాతి శిలలతో కూడుకున్న విశాలమైన లోయ ప్రాంతం గ్రాండ్‌ కాన్యాన్‌తో పోలిస్తే ఇది రెండు రెట్లు ఎక్కువ. జోబి ఏవియేషన్‌ కంపెనీలో పురుడు పోసుకున్న ఈ ఫ్లైయింగ్‌ కార్‌ పూర్తిగా హైడ్రోజన్‌తో నడుస్తుంది. నీటి ఆవిరి మినహా ఎలాంటి ఉద్గారాలను విడుదల చేయకపోవడం దీని ప్రత్యేకత. ‘‘శాన్‌ ఫ్రాన్సిస్కో నుంచి శాండియాగో, బోస్టన్, బాలి్టమోర్‌ లేదా నాష్‌విల్లే నుంచి న్యూఓర్లాన్స్‌ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రయాణం చేయటాన్ని ఊహించుకోండి.

నీటి ఆవిరి మినహా ఎలాంటి కాలుష్యం వెదజల్లని ఎయిర్‌ ట్యాక్సీలో ప్రయాణించే రోజు చాలా దగ్గర్లోనే ఉంది’’అని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో జో బెన్‌ బెవిర్ట్‌ వెల్లడించారు. అమెరికా సైనిక విభాగం ఈ ఎయిర్‌ ట్యాక్సీ ప్రయోగానికి పాక్షికంగా నిధులు సమకూర్చడం విశేషం.  

ఎంత మంది?  
జోబి ఏవియేషన్‌ తయారు చేసిన ఎయిర్‌ ట్యాక్సీకి ఆరు ప్రొఫెల్లర్లు ఉంటాయి. హెలికాఫ్టర్‌ తరహాలో గాల్లోకి ఎగిరేందుకు, కిందకు దిగేందుకు ఇవి తోడ్పడతాయి. టేకాఫ్‌ తీసుకుని గాల్లోకి ఎగిరిన తరువాత ప్రొఫెల్లర్లు నిట్ట నిలువు నుంచి బల్లపరుపుగా మారతాయి. రెక్కలున్న సంప్రదాయ ఎయిర్‌ క్రాఫ్ట్‌ తరహాలో ఎయిర్‌ ట్యాక్సీ ఆకాశంలో ఎగిరేందుకు ఇవి దోహదం చేస్తాయి. ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు.

ఏమిటి దీని ప్రత్యేకత? 
ఎయిర్‌ ట్యాక్సీ అనేది కొత్త ఆవిష్కరణ కాకపోయినా జోబీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రొఫెల్లర్లకు సమకూర్చిన ఇంధనం మాత్రం కొత్త ప్రయోగమే. 40,000 కి.మీ. తిరిగిన ఎలక్ట్రిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఆధునికీకరించి దీన్ని తయారు చేశారు. పాత ఎయిర్‌క్రాఫ్ట్‌ బ్యాటరీల స్థానంలో 40 కిలోల ద్రవ హైడ్రోజన్‌ సామర్థ్యం కలిగిన ఇంధన సెల్స్‌ను అమర్చారు. ట్యాక్సీకి అవసరమైన విద్యుత్తు, ఉష్ణోగ్రత, నీటి ఆవిరిని ఇవి అందిస్తాయి. టేకాఫ్, ల్యాండింగ్‌ సమయంలో అదనపు శక్తి అందించేందుకు కొన్ని బ్యాటరీలు ఉంటాయి.

బ్యాటరీ ట్యాక్సీల కంటే మెరుగైన సామర్థ్యం 
గతంలో రూపొందించిన బ్యాటరీలతో పనిచేసే ఎయిర్‌ ట్యాక్సీలు ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 100 – 150 మైళ్లు (160 – 240 కి.మీ.) ప్రయాణించాయి. హైడ్రోజన్‌తో నడిచే ఎయిర్‌ ట్యాక్సీలో మాత్రం ఒక నగరం నుంచి మరొక నగరానికి వెళ్లవచ్చని చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా 561 మైళ్లు నడిపి చూశారు. లండన్‌ నుంచి ప్యారిస్, జ్యూరిచ్, ఎడిన్‌బర్గ్‌ ఆగాల్సిన అవసరం లేకుండా వెళ్లవచ్చు. ఎయిర్‌ ట్యాక్సీల నెట్‌వర్క్‌ను అనుసంధానించడం ద్వారా వివిధ నగరాలకు వెళ్లవచ్చని చెబుతున్నారు. హైడ్రోజన్‌ మోడల్‌ ఎయిర్‌ ట్యాక్సీలు కచి్చతంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో ఆయన వెల్లడించలేదు.

పోటాపోటీ..
ఎలక్ట్రిక్‌ మోటార్లు, బ్యాటరీ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ వినియోగంలో వచి్చన ఆధునిక మార్పులు ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ ట్యాక్సీల రంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేశాయి. ఎలక్ట్రిక్‌ క్యాబ్‌లపై విస్తృత పరిశోధనలు నిర్వహించిన ఏవియేషన్‌ స్టార్టప్‌లు జీ ఏరో, కిట్టీ హాక్‌లపై గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ సీఈవో లారీ పేజ్‌ లక్షల డాలర్ల నిధులను వెచి్చంచారు. ఎయిర్‌ స్పేస్‌ ఎక్స్‌ లాంటి పలు కంపెనీలు ఎయిర్‌ ట్యాక్సీలను తెచ్చేందుకు పోటీ పడుతున్నాయి.

తమ ప్రయాణికులకు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సదుపాయం కలి్పస్తామంటూ ఊరిస్తోంది. వైద్య అవసరాల కోసం అత్యవసరంగా తరలించేందుకు కూడా సేవలందిస్తామంటోంది. ఇక క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్‌ కూడా దీనిపై దృష్టి సారించింది. 2018 జనవరిలో నిర్వహించిన ఓ సాంకేతిక సదస్సులో ఉబర్‌ సీఈవో డారా ఖొస్రోవ్‌షాహి ఈమేరకు ఓ ప్రకటన చేశారు. వచ్చే పదేళ్లలో ఇవి సాకారం కానున్నట్లు ­అప్పట్లోనే చెప్పారు.  

దుబాయ్‌లో బీచ్‌ విహారం.. 
తమ ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ ట్యాక్సీ ఫెడరల్‌ ఏవియేషన్‌ అథారిటీ నుంచి 3 – 5 దశల ధ్రువీకరణ పూర్తి చేసుకున్నట్లు జోబీ చెప్పారు. దుబాయ్‌ నుంచి వీటి సేవలు ప్రారంభం కానున్నట్లు గతంలోనే జోబీ ఏవియేషన్‌ కంపెనీ ప్రకటించింది. ఈమేరకు దుబాయ్‌ రోడ్డు రవాణా సంస్థతో కంపెనీ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. వీటి ద్వారా దుబాయ్‌ విమానాశ్రయం నుంచి ప్రముఖ పర్యాటక ప్రాంతం, కృత్రిమ దీవుల సముదాయం పామ్‌ జుమేరా బీచ్‌కు కేవలం పది నిమిషాల్లో చేరుకోవచ్చు.

బ్యాటరీతో నడిచే ఎయిర్‌ ట్యాక్సీ పరీక్షలు విజయవంతం కావడంతో హైడ్రోజన్‌ మోడల్‌ కూడా సత్ఫలితాలనిస్తుందని కంపెనీ గట్టి నమ్మకంతో ఉంది. అయితే ఈ రెండు మోడళ్ల ధరలు ఎంత ఉంటాయనే విషయాన్ని ఇంతవరకు వెల్లడించలేదు. వాణిజ్యపరంగానూ వీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. ఎయిర్‌ ట్యాక్సీల వాడకం 2028 నాటికి సాధారణంగా మారుతుందని, పైలెట్ల అవసరం లేకుండా ఎగిరే ట్యాక్సీలు 2030 నాటికి అందుబాటులోకి వస్తాయని బ్రిటన్‌ భావిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement