డిసెంబరులో ప్రయోగాత్మక పరిశీలనకు రైల్వే ఏర్పాట్లు
హరియాణాలోని జింద్–సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల ప్రయాణం
ప్రపంచంలో హైడ్రోజన్ రైళ్లు నడిపే ఐదో దేశంగా రికార్డు సృష్టించనున్న భారత్
తొలుత హిల్ స్టేషన్లలో.. ఆ తర్వాత సాధారణ రూట్లలో సర్వీసులు
ఒక్కో రైలు కోసం రూ.80 కోట్ల వ్యయం.. 50 రైళ్లను సిద్ధం చేసే దిశగా కసరత్తు
సాక్షి, హైదరాబాద్: అధునాతన సౌకర్యాలతో సరికొత్త రైళ్లను అందుబాటులోకి తెస్తున్న భారత రైల్వే.. త్వరలోనే హైడ్రోజన్‌తో నడిచే రైళ్లను పట్టాలెక్కించబోతోంది. వచ్చే నెలలోనే తొలి రైలును ప్రయోగాత్మకంగా నడిపించనుంది.
జర్మనీ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో.. మన రైల్వే సొంతంగానే ఈ రైళ్లను తయారు చేస్తోంది. ఇప్పటికే అధిక వ్యయం, కాలుష్య కారకమైన డీజిల్ రైళ్లను తొలగించి ఎలక్ట్రిక్ రైళ్ల సంఖ్యను పెంచుతుండగా.. ఇకపై ఏ మాత్రం కాలుష్యం ఉండని హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై పరుగెత్తనున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈ అంశంలో జర్మనీ ముందుంది. ఆ దేశం గణనీయ సంఖ్యలో హైడ్రోజన్ రైళ్లను నడుపుతోంది. దానితోపాటు చైనా, రష్యా సహా ఐదు దేశాలు హైడ్రోజన్ రైళ్లు నడుపుతున్నాయి. వాటి సరసన ప్రపంచంలో ఐదో దేశంగా భారత్ రికార్డు సృష్టించనుంది.
‘హైడ్రోజన్’ రైలు ప్రాజెక్టు విశేషాలివీ..
» నీటి నుంచి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారు. ఆ హైడ్రోజన్‌ను, ఆక్సిజన్‌తో కలిపినప్పుడు రసాయన చర్య జరిగి వెలువడే శక్తి ద్వారా రైలును నడిపిస్తారు. ఇందుకోసం రైలు ఇంజన్లలో హైడ్రోజన్, ఆక్సిజన్ ట్యాంకులను ఏర్పాటు చేస్తారు.
» ఒకసారి ఇంధనాన్ని నింపితే వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని అంచనా.
» హైడ్రోజన్ ఇంజన్లు డీజిల్ ఇంజన్ల కంటే 65 శాతం తక్కువ శబ్ధాన్ని ఉత్పత్తి చేస్తాయి. ప్రస్తుత పరిజ్ఞానం మేరకు గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని.. 54.6 సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.
» ఒక కిలో హైడ్రోజన్ ఇంధనం 4.5 లీటర్ల డీజిల్‌తో సమానంగా శక్తిని అందిస్తుంది. ఓ అంచనా మేరకు ఒక్కో హైడ్రోజన్ రైలు ద్వారా ఏడాదికి రూ.16 లక్షల డీజిల్ ఆదా అవుతుంది.
» ఒక డీజిల్ ఇంజన్ ద్వారా ఏడాదిలో 4,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. హైడ్రోజన్ ఇంజన్‌తో ఆ కాలుష్యానికి అడ్డుకట్ట పడుతుంది. హైడ్రోజన్ ఇంజన్‌లో ఇంధనాన్ని మండించిన తర్వాత వ్యర్థాలుగా నీరు, నీటి ఆవిరి వెలువడతాయి.
» రైల్వే తొలుత 35 హైడ్రోజన్ రైళ్లను రూపొందించాలని భావించినప్పటికీ తాజాగా ఆ సంఖ్యను 50కి పెంచింది.
» ప్రస్తుత పరిజ్ఞానం ప్రకారం ఒక్కో రైలు తయారీకి రూ.80 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేస్తోంది. వీటి తయారీకి రూ.2,800 కోట్లను కేటాయించారు.
» రైల్వే రోజుకు 3 వేల కిలోల హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యంతో ఒక ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. తర్వాత హిల్ స్టేషన్లలో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
మొదట హిల్ స్టేషన్లలో..
హరియాణాలోని జింద్–సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల మార్గంలో తొలి హైడ్రోజన్ రైలును పరీక్షించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెలాఖరులో ఈ ప్రయోగాత్మక పరిశీలన మొదలుకానుంది. పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని ఈ హైడ్రోజన్ రైళ్లను తొలుత ప్రకృతి అందాలతో అలరారే హిల్ స్టేషన్లలోని రూట్లలో నడపాలని రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది.
ఈ మేరకు డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటెయిన్ రైల్వేలను ఎంపిక చేసింది. మరిన్ని హిల్ స్టేషన్లలో ప్రస్తుతం డీజిల్ ఇంజన్లతో నడుపుతున్న రైళ్లను తొలగించి హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టనుంది. తర్వాత దశలవారీగా సాధారణ రూట్లలోనూ నడపనుంది.
భవిష్యత్ ఇంధనం హైడ్రోజనే...
బొగ్గు, చమురు నిల్వలు తరిగిపోతుండటం, అవి కాలుష్య కారకం కావడంతో... ప్రత్యామ్నాయ ఇంధనాలపై ప్రపంచ దేశాలు దృష్టిపెట్టాయి. ఈ క్రమంలో ఎలాంటి కాలుష్యం వెలువడని, తరిగిపోని హైడ్రోజన్‌ను భవిష్యత్తు ఇంధనంగా భావిస్తున్నాయి. వాటితో వాహనాలను నడిపే సాంకేతికతలను కొన్ని దేశాలు అభివృద్ధి చేశాయి.
ఈ క్రమంలోనే మన రైల్వే కూడా వేగంగా ప్రయోగాలు పూర్తి చేసి హైడ్రోజన్ రైళ్లను పట్టాలెక్కించే దిశగా ముందుకు వెళుతోంది. రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టును చేపట్టగా.. డిసెంబర్ చివరిలో ప్రయోగాత్మక పరిశీలన మొదలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment