న్యూఢిల్లీ: దశాబ్ద కాలంలో (2030 నాటికి) పునరుత్పాదక వనరుల నుంచి కనీసం 100 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) నిర్దేశించుకుంది. హైడ్రోజన్ కేజీ ధరను 1 డాలర్ కన్నా చౌకగా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ వాతావరణ సదస్సు 2021లో పాల్గొన్న సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు తెలిపారు. పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి చేసే పర్యావరణ హిత హైడ్రోజన్‌ను తిరిగి విద్యుత్‌గా మార్చవచ్చని, దీన్ని కార్లు, ఇళ్లు మొదలైన వాటిల్లో విద్యుత్ అవసరాల కోసం వినియోగించవచ్చని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ఎలక్ట్రోలసిస్ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసేందుకు వ్యయాలు భారీగా ఉంటున్నాయి.
రాబోయే రోజుల్లో ఇవి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. హైడ్రోజన్ నిల్వ, రవాణా కోసం కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. వీటితో పంపిణీ వ్యయాలు భారీగా తగ్గగలవు‘ అని అంబానీ చెప్పారు. ప్రస్తుతం పునరుత్పాదక వనరులతో ఉత్పత్తి చేసే హరిత హైడ్రోజన్ ధర కేజీకి 3–6.54 డాలర్ల మధ్యలో ఉంటోందని వివరించారు. దీన్ని 2 డాలర్ల లోపునకు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తాము మరింత ముందుకెళ్లి రేటును 1 డాలర్ లోపునకు తగ్గించడంపై దృష్టి పెడుతున్నట్లు ముకేశ్ చెప్పారు. ఇందుకోసం 1–1–1 ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలిపారు. 1 దశాబ్దంలో 1 కేజీ హైడ్రోజన్‌ను 1 డాలర్ లోపు ధరకు అందించడం దీని ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment