
ముంబై: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 2.4 శాతం పుంజుకుని రూ. 19,407 కోట్లను తాకింది. ప్రధానంగా రిటైల్ బిజినెస్ క్రమబద్ధీకరణ, టెలికం మార్జిన్లు మెరుగుపడటం ఇందుకు సహకరించాయి.
అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 18,951 కోట్లు ఆర్జించింది. క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో సాధించిన రూ. 18,540 కోట్లతో పోల్చినా లాభంలో వృద్ధి నమోదైంది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 5.5 డివిడెండ్ ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 2.4 లక్షల కోట్ల నుంచి రూ. 2.6 లక్షల కోట్లకు బలపడింది. ఇబిటా 3.6 శాతం వృద్ధితో రూ. 48,737 కోట్లకు చేరింది.
పూర్తి ఏడాదిలో
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఆర్‌ఐఎల్ దాదాపు యథాతథంగా రూ. 69,648 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే రూ. 10 లక్షల కోట్ల నెట్‌వర్త్‌ను సాధించిన తొలి దేశీ కంపెనీగా రికార్డు నెలకొల్పింది. ఈ బాటలో గతేడాది
రూ. 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్(విలువ)ను అందుకున్న తొలి సంస్థగా సైతం నిలిచింది! ప్రయివేట్ ప్లేస్‌మెంట్ పద్ధతిలో మార్పిడిరహిత డిబెంచర్లు తదితర సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 25,000 కోట్లవరకూ సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు ఆర్‌ఐఎల్ వెల్లడించింది. 2025 మార్చి31కల్లా రుణ భారం రూ. 3.24 లక్షల కోట్ల నుంచి రూ. 3.47 లక్షల కోట్లకు పెరిగింది.
విభాగాలవారీగా
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నికర లాభం క్యూ4లో 29 శాతం జంప్‌చేసి రూ. 3,545 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 16 శాతం వృద్ధితో రూ. 88,620 కోట్లయ్యింది. ఈ కాలంలో 238 స్టోర్లను కొత్తగా తెరవడంతో వీటి సంఖ్య 19,340కు చేరింది. అయితే స్టోర్ల క్రమబద్ధీకరణతో నిర్వహణ ప్రాంతం 2 శాతం తగ్గి 7.74 కోట్ల చదరపు అడుగులకు పరిమితమైంది. ఇక ఆయిల్ టు కెమికల్(ఓ2సీ) బిజినెస్ నిర్వహణ లాభం క్యూ4లో 10 శాతం క్షీణించి రూ. 15,080 కోట్లకు చేరింది. ఇంధన రిటైల్(జియో–బీపీ) బిజినెస్‌లో పెట్రోల్ అమ్మకాలు 24%, డీజిల్ విక్రయాలు 25% ఎగశాయి. కేజీ డీ6 క్షేత్రాలలో గ్యాస్ ఉత్పత్తి తగ్గడంతో ఇబిటా 8.6% నీరసించి రూ. 5,123 కోట్లకు పరిమితమైంది. గ్యాస్ ఉత్పత్తి రోజుకి 26.73 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్లకు చేరగా.. చమురు 19,000 బ్యారళ్లుగా నమోదైంది.
జియో జోరు
టెలికం, డిజిటల్ బిజినెస్‌ల జియో ప్లాట్‌ఫామ్స్ నికర లాభం క్యూ4లో 26 శాతం జంప్‌చేసి రూ. 7,022 కోట్లను తాకింది. పూర్తి ఏడాదిలో 22% ఎగసి రూ. 26,120 కోట్లకు చేరింది. జియో వినియోగదారుల సంఖ్య 48.21 కోట్ల(క్యూ3) నుంచి 48.82 కోట్లకు ఎగసింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) రూ. 203.3(క్యూ3) నుంచి రూ. 206.2కు మెరుగుపడింది. క్యూ4 ఆదాయం రూ. 33,986 కోట్లు కాగా.. పూర్తి ఏడాదిలో రూ.1,28,218 కోట్లకు చేరింది. విలీనం తర్వాత జియోహాట్‌స్టార్ ఆదాయం రూ. 10,006 కోట్ల స్థాయిని అధిగమించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న జియోసినిమా, డిస్నీప్లస్‌హాట్‌స్టార్ విలీనంతో జియోహాట్‌స్టార్ ఏర్పాటైంది.
నిలకడగా..
ప్రపంచ బిజినెస్ వాతావరణరీత్యా గతేడాది సమస్యాత్మకంగా నిలిచింది. బలహీన ఆర్థిక పరిస్థితులు, రాజకీయ, భౌగోళిక మార్పుల నేపథ్యంలో నిర్వహణా సంబంధ క్రమశిక్షణ, కస్టమర్ కేంద్రంగా ఆవిష్కరణలు కంపెనీ నిలకడైన పనితీరు చూపేందుకు దోహదపడ్డాయి.
– ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్