న్యూఢిల్లీ: యాపిల్ తరువాత బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) అంతర్జాతీయంగా నంబర్ 2 బ్రాండ్ హోదాను సంపాదించుకుంది. ఫ్యూచర్‌బ్రాండ్ ఇండెక్స్ 2020 ఈ విషయాన్ని తెలిపింది. ఫ్యూచర్‌బ్రాండ్ తన 2020 ఇండెక్స్‌ను విడుదల చేసింది. ఈ ఇండెక్స్‌లో శాంసంగ్ మూడవ స్థానంలో నిలవగా, ఎన్‌విడియా, మౌటాయ్, నైకీ, మైక్రోసాఫ్ట్, ఏఎస్‌ఎంఎల్, పేపాల్, నెట్‌ఫ్లిక్స్ తరువాత స్థానాల్లో నిలిచాయి. ఇండెక్స్‌లో కొత్తగా 15 సంస్థలకు చోటు లభించగా ఇందులో ఏఎస్‌ఎంఎల్ హోల్డింగ్స్, పేపాల్, దనాహెర్, సౌదీ ఆరాంకో, అమెరికన్ టవర్ కార్పొరేషన్‌లు ఉన్నాయి. కొత్తగా చేరిన 15 సంస్థల్లో ఏడు ఏకంగా టాప్–20లో నిలవడం గమనార్హం. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 2వ స్థానాన్నే కైవసం చేసుకుంది.
ఒకటవ స్థానానికీ ఎదిగే అవకాశాలు...
ఫ్యూచర్‌బ్రాండ్ అభిప్రాయాలను పరిశీలిస్తే...‘‘అత్యుత్తమ బ్రాండింగ్ విషయంలో 2వ స్థానాన్ని భారత్‌లోకి అత్యంత లాభదాయక కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కించుకుంది. ప్రతిష్ట, నైతిక విలువలు, వృద్ధి, వినూత్న ఉత్పత్తులు, ఉన్నత వినియోగ సేవలు, ప్రత్యేకించి ప్రజలతో సన్నిహిత సంబంధం వంటి అత్యుత్తమ లక్షణాలతో సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. భారతీయులకు అవసరమైన దాదాపు అన్ని సేవలూ ఒకేచోట లభించే సంస్థగా ఎదగడానికి ముకేశ్ అంబానీ చేసిన కృషి రిలయన్స్ విజయానికి ప్రధాన కారణం.
ఆయిల్ నుంచి కమ్యూనికేషన్ల రంగం వరకూ వినియోగదారులకు అవసరమైన అన్ని రంగాల్లో విజయవంతమైన సంస్థగా చైర్మన్ దీనిని నిర్మించారు. ఎనర్జీ, పెట్రోకెమికల్స్, జౌళి, సహజ వనరులు, రిటైల్, టెలికమ్యూనికేషన్ల రంగాల్లో ఆర్‌ఐఎల్ ప్రస్తుతం సేవలు అందిస్తోంది. గూగుల్, ఫేస్‌బుక్‌లు కూడా గ్రూప్ సంస్థలో (జియో ప్లాట్‌ఫామ్స్) ఈక్విటీ వాటాలు తీసుకోవడం ఇక్కడ ప్రస్తావించదగిన అంశం. తదుపరి ఇండెక్స్‌లో రిలయన్స్ నంబర్ 1 స్థానానికి కూడా అవకాశాలు కూడా ఉన్నాయి’’.
మారుతున్న ప్రపంచ పరిస్థితులు...
ఆరు సంవత్సరాల క్రితం మొదటి ఫ్యూచర్‌బ్రాండ్ ఇండెక్స్‌ను విడుదల చేసిన నాటి నుంచీ చూస్తే, ప్రపంచ పరిస్థితులు, ప్రాధాన్యతలు వేగంగా మారిపోయాయని ఫ్యూచర్‌బ్రాండ్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 100 కంపెనీలు అనూహ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని తెలిపింది. గడచిన 12 నెలల్లో ఈ తరహా సవాళ్లు మరింత ఎక్కువైనట్లు విశ్లేషించింది.
‘‘మున్నెన్నడూ ఎరుగని తీవ్ర ఆరోగ్యపరమైన సంక్షోభంలో ప్రస్తుతం ప్రపంచ దేశాల పరిస్థితులు ఉన్నాయి’’ అని కూడా ఫ్యూచర్‌బ్రాండ్ పేర్కొంది. ప్రైస్ వాటర్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) గ్లోబల్ టాప్ 100 కంపెనీల మార్కెట్ క్యాప్, ఆర్థిక పటిష్టత, దేశీయ, అంతర్జాతీయ క్రియాశీలత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఫ్యూచర్‌బ్రాండ్‌ఇండెక్స్ రూపొందించింది. పీడబ్ల్యూసీ 2020 జాబితాలో రిలయన్స్ ర్యాంక్ 91. ప్రస్తుత కంపెనీల క్రియాశీలతతోపాటు వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఆయా కంపెనీల పరిస్థితులపైనా మదింపుచేయడం ఇండెక్స్ ప్రత్యేకత.
Comments
Please login to add a commentAdd a comment