ప్రపంచ బిలియనీర్లలో మళ్లీ చోటు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సాధించారు. 2024 ఏడాదికి ఫోర్బ్స్ టాప్–10 బిలియనీర్లలో 9వ ర్యాంకును పొందారు. 116 బిలియన్ డాలర్ల సంపదతో 66 ఏళ్ల ముకేశ్ టాప్–9గా నిలిచారు. 2023లో ముకేశ్ సంపద 83.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
కాగా.. దేశీయంగా సంపదలో టాప్–2గా నిలుస్తున్న గౌతమ్ అదానీ 84 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో 17వ ర్యాంకును అందుకున్నారు. యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల కారణంగా 2023లో అదానీ సంపద 47.2 బిలియన్ డాలర్లకు క్షీణించిన సంగతి తెలిసిందే. హిండెన్‌బర్గ్ ఆరోపణలను తోసిపుచ్చిన నేపథ్యంలో అదానీ గ్రూప్ తిరిగి బలపడింది. ఇక 2022లో అదానీ 90 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌ను సాధించడం ప్రస్తావించదగ్గ అంశం!
జాబితా ఇలా
ఫోర్బ్స్ 2024 బిలియనీర్ల జాబితాలో 2,781 మంది వ్యక్తులు చోటు సాధించారు. గతేడాది జాబితాతో పోలిస్తే 141 మందికి అదనంగా చోటు లభించింది. 2023తో పోలిస్తే కుబేరుల ఉమ్మడి సంపద 2 లక్షల కోట్ల డాలర్లు పెరిగి 14.2 ట్రిలియన్ డాలర్లను తాకింది. సరికొత్త రికార్డ్ నమోదైన 2021తో పోలిస్తే 1.1 లక్షల కోట్ల డాలర్లు జత కలసింది. ఫ్యాషన్స్, కాస్మెటిక్స్ దిగ్గజం ఎల్‌వీఎంహెచ్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ 233 బిలియన్ డాలర్లతో టాప్ ర్యాంకును, 195 బిలియన్ డాలర్లతో ఎలన్ మస్క్ రెండో ర్యాంకునూ కొల్లగొట్టారు. 177 బిలియన్ డాలర్లతో ఫేస్‌బుక్ జుకర్‌బర్గ్ టాప్–3గా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment