ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
గ్రీన్ హైడ్రోజన్‌కు చిరునామాగా తెలంగాణ నిలవాలని ఆకాంక్ష
జపాన్ రాజధాని టోక్యోలో పర్యటన.. యమానాషీ గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ సందర్శన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. తెలంగాణలో నీటి లభ్యత, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన స్థలాలకు లోటు లేనందున రాష్ట్రమంతా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయవచ్చన్నారు. దేశంలో గ్రీన్ హైడ్రోజన్‌కు చిరునామాగా తెలంగాణ నిలవాలని ఆకాంక్షించారు. జపాన్ పర్యటనలో భాగంగా రాజధాని టోక్యోకు 100 కి.మీ. దూరంలో ఉన్న యమానాషీ గ్రీన్ హైడ్రోజన్ కంపెనీని ఆయన సందర్శించారు.
గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, ఇతర పునరుత్పాదక విద్యుత్ సాంకేతికతలను పరిశీలించి అక్కడి శాస్త్రవేత్తల బృందంతో మాట్లాడారు. సౌర విద్యుత్ వినియోగించి నీటిని ఎలక్రో్టలైజింగ్ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొట్టే యంత్ర విభాగాలను ఈ సంస్థ తయారు చేస్తోంది. ఇలా ఉత్పత్తి చేసిన హైడ్రోజన్‌ను రేసింగ్ కార్లకు ఇంధనంగా, సూపర్ మార్కెట్లలో ఫ్యూయల్ సెల్స్‌గా, ఫ్యాక్టరీల్లో బాయిలర్లకు ఉష్ణాన్ని అందించేందుకు ఇంధనంగా వినియోగిస్తున్నారని నిర్వాహకులు భట్టికి వివరించారు.
ఈ ప్రక్రియలో సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తుండటంతో దీన్ని గ్రీన్ హైడ్రోజన్‌గా పేర్కొంటున్నామని వివరించారు. రాష్ట్రంలో ఉత్పత్తి కానున్న గ్రీన్ హైడ్రోజన్‌ను స్థానిక ఎరువుల కర్మాగారాలు, ఆరీ్టసీ, ఇతర పరిశ్రమలకు సరఫరా చేయొచ్చని భట్టి అన్నారు. థర్మల్ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక విద్యుదుత్పత్తిని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో సౌర విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
ఉమ్మడిగా ప్లాంట్ల ఏర్పాటుకు కలిసిరండి..
కంపెనీ తయారు చేస్తున్న ‘బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం’బ్యాటరీల తయారీ విభాగాన్ని భట్టి విక్రమార్క పరిశీలించారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లు పగటిపూట ఉత్పత్తి చేసే విద్యుత్‌లో మిగులు విద్యుత్‌ను నిల్వ చేయడానికి ఈ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తున్నారు. సింగరేణి ఏర్పాటు చేసిన 245 మెగావాట్ల సామర్థ్యంగల సోలార్ ప్లాంట్లతోపాటు త్వరలో ఏర్పాటు చేయనున్న మరో వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని భట్టి అన్నారు.
తెలంగాణలో గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం ప్లాంట్లను ఉమ్మడి భాగస్వామ్యంతో ఏర్పాటు చేసేందుకు తమతో కలిసి రావాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. దీనిపై యమానాషీ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఉన్నత స్థాయిలో చర్చించి నిర్ణయిస్తామన్నారు. ఈ పర్యటనలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment