విశాఖలో హైడ్రోజన్‌ ఎనర్జీ ప్రాజెక్టు | Hydrogen Energy Project in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో హైడ్రోజన్‌ ఎనర్జీ ప్రాజెక్టు

Published Sun, Dec 19 2021 4:27 AM | Last Updated on Sun, Dec 19 2021 9:43 AM

Hydrogen Energy Project in Visakhapatnam - Sakshi

సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అతి పెద్దదైన, దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టు మన రాష్ట్రంలో ఏర్పాటుకానుంది. విశాఖపట్నంలోని సింహాద్రి పవర్‌ ప్లాంట్‌లో స్టాండలోన్‌ ఫ్యూయల్‌–సెల్‌ ఆధారిత గ్రీన్‌ హైడ్రోజన్‌ మైక్రోగ్రిడ్‌ ప్రాజెక్టును నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌  (ఎన్టీపీసీ) లిమిటెడ్‌ స్థాపించబోతోంది. విద్యుదుత్పత్తికి అవసరమైన చమురులో 85 శాతం, గ్యాస్‌లో 53 శాతం దిగుమతి చేసుకునే మన దేశంలో ఈ హైడ్రోజన్‌ ప్రాజెక్ట్‌ ఓ గేమ్‌చేంజర్‌ కానుందని ఎన్టీపీసీ వర్గాలు చెబుతున్నాయి.

గ్రీన్‌ హైడ్రోజన్‌ కొనుగోలు తప్పనిసరి?
స్వచ్ఛమైన ఇంధనాలను ప్రోత్సహించడానికి.. ఎరువుల కర్మాగారాలు, చమురు శుద్ధి కర్మాగారాలు గ్రీన్‌ హైడ్రోజన్‌ను కొనుగోలు చేయడాన్ని తప్పనిసరి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా పవన, సౌర వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా శక్తినిచ్చే ఎలక్ట్రోలైజర్‌ను ఉపయోగించి నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విభజించడం ద్వారా గ్రీన్‌ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే ప్రాజెక్టును రాష్ట్రంలో ఎన్టీపీసీ ద్వారా స్థాపించనుంది. దేశంలో ఇంధన భద్రతా చర్యల్లో భాగంగా నాలుగు గిగావాట్ల ఎలక్ట్రోలైజర్‌ సామర్థ్యాన్ని సాధించడానికి త్వరలో కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలవనుంది.

సింహాద్రి థర్మల్‌ కేంద్రం సమీపంలో ఉన్న ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టు (నీటిలో తేలియాడే సౌర ఫలకలు) నుండి ఇన్‌పుట్‌ పవర్‌ తీసుకోవడం ద్వారా 240 కిలోవాట్ల సాలిడ్‌ ఆక్సైడ్‌ ఎలక్ట్రోలైజర్‌ ఉపయోగించి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారు. సూర్యరశ్మి సమయంలో ఉత్పత్తి చేసిన ఈ హైడ్రోజన్‌ను అధిక పీడనం వద్ద నిల్వచేస్తారు. 50 కిలోవాట్ల సాలిడ్‌ ఆక్సైడ్‌ ఇంధన కణాన్ని ఉపయోగించి విద్యుదీకరిస్తారు. ఇది సా.5 నుండి ఉ.7 వరకు స్వతంత్రంగా పనిచేస్తుంది. ఇక దేశంలో మరికొన్ని హైడ్రోజన్‌ శక్తి నిల్వ ప్రాజెక్టులను స్థాపించడానికి అవసరమైన అధ్యయనానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది.

లద్దాఖ్‌తో ఒప్పందం
గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టు కోసం కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌తో ఎన్టీపీసీ రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఆర్‌ఈఎల్‌) ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు డీజిల్‌ జనరేటర్లపై ఆధారపడిన లద్దాఖ్, జమ్మూ–కశ్మీర్‌ వంటి దేశంలోని సుదూర ప్రాంతాలను డీకార్బోనైజ్‌ చేయడానికి ఈ ప్రాజెక్టు నమూనా కానుంది. 2070 నాటికి లద్దాఖ్‌ను కార్బన్‌ రహిత భూభాగంగా మార్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే మన రాష్ట్రంలో హైడ్రోజన్‌ ప్రాజెక్టును ఎన్టీపీసీ పైలెట్‌ ప్రాజెక్టుగా స్థాపిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement