‘కల్పతరువు’ పేరుతో ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని వర్చువల్‌గా ప్రారంభిస్తున్న దృశ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్), సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) సంయుక్తంగా నాలుగోతరం ఇండస్టీ–4 టెక్నాలజీ అభివృద్ధికి ‘కల్పతరువు’ పేరుతో విశాఖపట్నంలో ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీవోఈ) కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. అనేక పారిశ్రామిక సంస్థలకు.. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల ఆటోమేషన్‌కు ‘కల్పతరువు’ అన్ని విధాలా ఉపయోగపడనుంది.
మంగళవారం ఆర్‌ఐఎన్‌ఎల్ ప్రధాన కార్యాలయం నుంచి వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ సీఎండీ అతుల్ భట్, ఢిల్లీ నుంచి ఎస్‌టీపీఐ డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్ కలిసి కల్పతరువు ఓపెన్ ఛాలెంజ్ ప్రోగ్రాం – 1 (ఓసీపీ–1)ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా అతుల్ భట్ మాట్లాడుతూ ఆర్‌ఐఎన్‌ఎల్‌కు చెందిన ఆరు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ ఛాలెంజ్‌ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సమస్యలకు పరిష్కారం అందించే స్టార్టప్‌లు అంతర్జాతీయంగా ఉక్కు పరిశ్రమ ఎదుర్కొంటున్న కీలక సమస్యలకు పరిష్కారాన్ని కూడా అందించే అవకాశం లభిస్తుందన్నారు.
విశాఖపట్నంలో ఉన్న ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్‌టీపీసీ, బీహెచ్‌ఈఎల్–హెచ్‌వీపీవీ, హెచ్‌ఎస్‌ఎల్, హెచ్‌పీసీఎల్, వీపీటీ, బీఏఆర్‌సీ వంటి సంస్థలు ఈ సీవోఈని వినియోగించుకోవాలని కోరారు. ఈ సీవోఈతో రాష్ట్రంలో స్టార్టప్‌లు పెరుగుతాయని, పారిశ్రామిక కార్యక్రమాలు వేగం పుంజుకుంటాయని తెలిపారు.
అరవింద్ కుమార్ మాట్లాడుతూ ఎస్‌టీపీఐకి దేశవ్యాప్తంగా 20 సీవోఈలు ఉండగా కల్పతరువు 21వదని, కాని ఇది అన్ని సీవోఈలకు తల్లిగా అవతరించనుందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, ఎనలటిక్స్ వంటి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించుకొని స్మార్ట్ ఆటోమేషన్‌ను పెంచుకోవచ్చని చెప్పారు. ఆర్‌ఐఎన్‌ఎల్ లానే ఇతర పీఎస్‌యూలు కూడా వారి సమస్యల పరిష్కారానికి కల్పతరువును వినియోగించుకోవాలని కోరారు.
ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కల్పతరువు రాకతో 2025 నాటికి రాష్ట్ర తయారీ రంగంలో 25 శాతం వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఓసీపీ–1 కార్యక్రమంలో పాల్గొనే స్టార్టప్‌లు అక్టోబర్ 19 వరకు www.kalpataru.stpi.in అనే వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని ఎస్‌టీపీఐ విశాఖ అడిషనల్ డైరెక్టర్ సురేష్ బాతా తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థలకు చెందిన 1,032 మంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment