గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌!  | Andhra Pradesh as Green Hydrogen Hub | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌! 

Published Sun, Sep 4 2022 4:31 AM | Last Updated on Sun, Sep 4 2022 4:31 AM

Andhra Pradesh as Green Hydrogen Hub - Sakshi

సాక్షి, అమరావతి: గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరించనుంది. తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తెచ్చే ప్రయత్నాల్లో ఏపీ భాగం కానుంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం ఎంపిక చేసిన ఐదు రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఉంది. విశాఖ, నెల్లూరు జిల్లాల్లో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి జరగనుంది.

కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖకు, నీతీ ఆయోగ్‌కు ఇండియా హైడ్రోజన్‌ అలయన్స్‌ (ఐహెచ్‌2ఏ) తాజాగా సమర్పించిన హైడ్రోజన్‌ హబ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ హబ్‌లను రూపొందిస్తారు. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో ఐదు జాతీయ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లు ఏర్పాటు చేసి, వీటిని 25 ప్రాజెక్ట్‌ క్లస్టర్లుగా విభజిస్తారు.

వీటి ద్వారా 2025 నాటికి గ్రీన్‌ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే 150 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్‌ ప్లాంట్ల ఏర్పాటు లక్ష్యంగా ఐహెచ్‌2ఏ నిర్దేశించింది. వీటిని మొదటి తరం జాతీయ గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులుగా పిలుస్తారు. ఈ గ్రీన్‌ హైడ్రోజన్‌ను వివిధ రంగాలకు చెందిన సంస్థలు ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా బళ్లారి–నెల్లూరు (కర్ణాటక–ఆంధ్రప్రదేశ్‌) మధ్య నేషనల్‌ గ్రీన్‌ స్టీల్, కెమికల్స్‌ కారిడార్‌లోని  స్టీల్, కెమికల్‌ ప్లాంట్ల కోసం 30 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్‌ ప్లాంట్‌తో సంవత్సరానికి 5 వేల టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారు. దీనివల్ల పదేళ్లలో వాతావరణంలో 5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గించవచ్చు.

విశాఖపట్నంలో నేషనల్‌ గ్రీన్‌ రిఫైనరీ ట్రాన్స్‌పోర్ట్‌ హబ్‌లో 20 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్‌ ప్లాంట్‌తో సంవత్సరానికి 4 వేల టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారు. ఇది ఒక దశాబ్దంలో 4 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గిస్తుంది. దీని కోసం రాష్ట్ర గ్రీన్‌ హైడ్రోజన్‌ విధానాలను రూపొందించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement