న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ బిజినెస్‌ల విడదీతకు ప్రణాళికలు వేసింది. హైడ్రోజన్, ఎయిర్‌పోర్టులు, డేటా సెంటర్లను ప్రత్యేక బిజినెస్‌లుగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ప్రక్రియను 2025లో ప్రారంభించి 2028కల్లా ముగించాలని ఆశిస్తున్నట్లు సీఎఫ్‌వో జుగెశిందర్ సింగ్ తాజాగా తెలియజేశారు. కాగా.. ఇటీవల గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్(ఏఈఎల్) ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ. 20,000 కోట్లను సమీకరించే సన్నాహాల్లో ఉన్న సంగతి తెలిసిందే.
తొలుత పోర్టులు, విద్యుత్, సిటీ గ్యాస్ బిజినెస్‌లను ఏఈఎల్ ప్రారంభించి తదుపరి ప్రత్యేక కంపెనీలుగా విడదీసి లిస్ట్ చేసింది. ఈ బాటలోనే ప్రస్తుతం హైడ్రోజన్ తదితర నూతనతరం బిజినెస్‌లపై రానున్న పదేళ్లలో 50 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలని ప్రణాళికలు వేసింది. పెట్టుబడుల జాబితాలో విమానాశ్రయాల నిర్వహణ, మైనింగ్, డేటా సెంటర్లు, రహదారులు, లాజిస్టిక్స్ ఉన్నాయి. అయితే ప్రత్యేక కంపెనీలుగా ఏర్పాటు చేసేందుకు ఆయా బిజినెస్‌లు తగిన స్థాయిలో వృద్ధి చెందవలపి ఉన్నట్లు సింగ్ తెలియజేశారు. వెరసి 2025–2028 మధ్యలో ఇందుకు వీలు చిక్కవచ్చని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment