Follow on public offer
-
వొడాఫోన్ భారీ ఎఫ్‌పీవో
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న టెలికం సంస్థ వొడాఫోన్–ఐడియా (వీఐ) భారీ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో)కి తెరతీయనుంది. దీని ద్వారా రూ. 18,000 కోట్లు సమీకరించనుంది. ఏప్రిల్ 18–22 మధ్య ఎఫ్‌పీవో ఉండనుంది. ఇందుకోసం షేరు ధర రూ. 10–11 శ్రేణిలో ఉంటుంది. ఇటీవల ప్రమోటరు సంస్థకు ప్రిఫరెన్షియల్ షేర్ల కేటాయింపునకు సంబంధించి నిర్ణయించిన రూ. 14.87 రేటుతో పోలిస్తే ఇది సుమారు 26 శాతం తక్కువ. కనీసం 1,298 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుంది. ఎఫ్‌పీవో ద్వారా సేకరించిన నిధులను 4జీ నెట్వర్క్ విస్తరణ, 5జీ నెట్‌వర్క్‌ల ఏర్పాటుతో పాటు పన్నులు, బాకీలు చెల్లించడానికి వొడాఫోన్ ఐడియా వినియోగించుకోనుంది. 2020లో యస్ బ్యాంక్ రూ. 15,000 కోట్ల ఫాలో ఆన్ తర్వాత ఇదే అతి పెద్ద ఎఫ్‌పీవో కానుంది. బ్రిటన్ టెలికం సంస్థ వొడాఫోన్ గ్రూప్ భారత్‌లో తన వ్యాపారాన్ని ఐడియా సెల్యులార్తో విలీనం చేయడం ద్వారా 2018లో వొడాఫోన్ ఐడియా ఏర్పడింది. ప్రస్తుతం రూ. 2.1 లక్షల కోట్ల రుణభారంతో మనుగడ కోసం సతమతమవుతోంది. శుక్రవారం వొడాఫోన్–ఐడియా షేరు రూ. 12.96 వద్ద క్లోజయ్యింది. జీక్యూజీ, ఎస్బీఐ ఎంఎఫ్ ఆసక్తి.. ఈ ఎఫ్‌పీవోలో దాదాపు 800 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 6,500 కోట్లు) వరకు ఇన్వెస్ట్ చేయాలని జీక్యూజీ పార్ట్నర్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్ఆర్ఐ రాజీవ్ జైన్ సారథ్యంలోని అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్ 500 మిలియన్ డాలర్లు, ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్ 200–300 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
అదానీ గ్రూప్ బిజినెస్‌ల విడదీత
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ బిజినెస్‌ల విడదీతకు ప్రణాళికలు వేసింది. హైడ్రోజన్, ఎయిర్‌పోర్టులు, డేటా సెంటర్లను ప్రత్యేక బిజినెస్‌లుగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ప్రక్రియను 2025లో ప్రారంభించి 2028కల్లా ముగించాలని ఆశిస్తున్నట్లు సీఎఫ్‌వో జుగెశిందర్ సింగ్ తాజాగా తెలియజేశారు. కాగా.. ఇటీవల గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్(ఏఈఎల్) ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ. 20,000 కోట్లను సమీకరించే సన్నాహాల్లో ఉన్న సంగతి తెలిసిందే. తొలుత పోర్టులు, విద్యుత్, సిటీ గ్యాస్ బిజినెస్‌లను ఏఈఎల్ ప్రారంభించి తదుపరి ప్రత్యేక కంపెనీలుగా విడదీసి లిస్ట్ చేసింది. ఈ బాటలోనే ప్రస్తుతం హైడ్రోజన్ తదితర నూతనతరం బిజినెస్‌లపై రానున్న పదేళ్లలో 50 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలని ప్రణాళికలు వేసింది. పెట్టుబడుల జాబితాలో విమానాశ్రయాల నిర్వహణ, మైనింగ్, డేటా సెంటర్లు, రహదారులు, లాజిస్టిక్స్ ఉన్నాయి. అయితే ప్రత్యేక కంపెనీలుగా ఏర్పాటు చేసేందుకు ఆయా బిజినెస్‌లు తగిన స్థాయిలో వృద్ధి చెందవలపి ఉన్నట్లు సింగ్ తెలియజేశారు. వెరసి 2025–2028 మధ్యలో ఇందుకు వీలు చిక్కవచ్చని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. -
24 నుంచి రుచి సోయా ఎఫ్‌పీవో
ముంబై: పతంజలి ఆయుర్వేద్ గ్రూప్‌లో భాగమైన రుచి సోయా ఇండస్ట్రీస్ తాజాగా మార్చ్ 24న ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్‌పీవో)కి రానుంది. దీని ద్వారా సుమారు రూ. 4,300 కోట్లు సమీకరించనుంది. ఎఫ్‌పీవోకి సంబంధించి ధరల శ్రేణిని షేరు ఒక్కింటికి రూ. 615–650గా నిర్ణయించారు. దివాలా ప్రక్రియ కింద చర్యలు ఎదుర్కొన్న తర్వాత తిరిగి లిస్ట్ అవుతున్న తొలి కంపెనీ ఇదే కావడం గమనార్హం. పతంజలికి రుచి సోయాలో ప్రస్తుతం 98.9 శాతం వాటాలు ఉన్నాయి. లోయర్ బ్యాండ్ ప్రకారం 19 శాతం – 18 శాతం వాటాలను ఎఫ్‌పీవో ద్వారా విక్రయించే అవకాశం ఉంది. మరో 6–7 శాతాన్ని 2022 డిసెంబర్‌లోగా విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మార్గదర్శకాల ప్రకారం లిస్టెడ్ కంపెనీలో 25 శాతం పబ్లిక్ వాటా ఉండాలి. ఎస్బీఐ క్యాప్స్, యాక్సిస్ క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సంస్థలు ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి. రుణాల చెల్లింపునకు రూ. 3వేల కోట్లు.. ఎఫ్‌పీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 3,300 కోట్లను రుణాలను తీర్చేందుకు, మిగతా మొత్తాన్ని ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించుకోనున్నట్లు సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబా రాందేవ్ చెప్పారు. రుచి సోయా, పతంజలిని అంతర్జాతీయంగా ఫుడ్ బ్రాండ్స్‌గా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమని ఆయన వివరించారు. బ్రాండెడ్ ఫుడ్, న్యూట్రాస్యూటికల్స్, వంట నూనెలు, హెల్త్..వెల్నెస్ ఉత్పత్తుల కింద గ్రూప్ వ్యాపారాలు మొత్తం నాలుగు విభాగాలుగా ఉంటాయని రాందేవ్ పేర్కొన్నారు. రుచి సోయా కథ ఇదీ.. అతి పెద్ద బ్రాండెడ్ వంట నూనెల సంస్థల్లో రుచి సోయా కూడా ఒకటి. రుచి గోల్డ్ దేశీయంగా అత్యధికంగా అమ్ముడయ్యే పామాయిల్ బ్రాండ్స్‌లో ఒకటి. మహాకోష్, సన్‌రిచ్, రుచి స్టార్, రుచి సన్‌లైట్ వంటి ఇతర బ్రాండ్స్ కూడా కంపెనీకి ఉన్నాయి. ఇక న్యూట్రెలా పేరిట సోయా ఫుడ్స్‌ను కూడా విక్రయిస్తోంది. ఈ విభాగంలో 40 శాతం మార్కెట్ వాటా ఉంది. బ్యాంకులకు దాదాపు రూ. 9,345 కోట్ల మేర రుణాలు రుచి సోయా బాకీ పడటంతో 2017 డిసెంబర్లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కంపెనీపై దివాలా ప్రక్రియ కింద చర్యలు ప్రారంభించింది. 2018 డిసెంబర్లో నిర్వహించిన వేలంలో రుచి సోయాను పతంజలి దక్కించుకుంది. ఇందుకోసం రూ. 4,350 కోట్లు వెచ్చించింది. టేకోవర్ తర్వాత రుచి సోయా .. బిస్కెట్లు, కుకీలు, రస్కులు, నూడుల్స్ మొదలైన ఉత్పత్తులను కూడా విక్రయించడం మొదలుపెట్టింది. -
రూట్ మొబైల్- మజెస్కో జూమ్- ఫాడ్లర్ బోర్లా
రెండు రోజుల క్రితం బంపర్ లిస్టింగ్ సాధించిన రూట్ మొబైల్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. విదేశీ సంస్థలు కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం దీనికి కారణంకాగా.. యూనిఫై వెల్త్ మేనేజ్మెంట్ వాటా కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో మజెస్కో లిమిటెడ్ షేరు సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోపక్క ఆఫర్ ఫర్ సేల్కు మార్కెట్ ధర కంటే భారీ డిస్కౌంట్లో ఫ్లోర్ ధర నిర్ణయించడంతో జీఎంఎం ఫాడ్లర్ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. వివరాలు చూద్దాం.. రూట్ మొబైల్ పబ్లిక్ ఇష్యూ ధర రూ. 350తో పోలిస్తే లిస్టింగ్ రోజు సోమవారం 86 శాతం లాభంతో రూ. 650 వద్ద స్థిరపడిన రూట్ మొబైల్ తాజాగా సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఎన్ఎస్ఈలో తొలుత 18 శాతం దూసుకెళ్లి రూ. 829కు చేరింది. వెరసి మూడు రోజుల్లో 134 శాతం ర్యాలీ చేసింది. ప్రస్తుతం 12.5 శాతం జంప్‌చేసి రూ. 781 వద్ద ట్రేడవుతోంది. లిస్టింగ్ రోజు గోల్డ్‌మన్ శాక్స్, కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ రూ. 210 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో ఈ కౌంటర్ జోరు చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. షేరుకి రూ. 697 ధరలో వీటిని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మజెస్కో లిమిటెడ్ ఎన్ఎస్ఈ బల్క్ డీల్ వివరాల ప్రకారం యూనిఫై వెల్త్ మేనేజ్మెంట్ మంగళవారం మజెస్కో లిమిటెడ్‌లో 2.06 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. షేరుకి రూ. 779 ధరలో వీటిని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తొలుత ఎన్ఎస్ఈలో మజెస్కో షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 817 వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 801 వద్ద ట్రేడవుతోంది. జీఎంఎం ఫాడ్లర్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్ గ్రూప్ సంస్థలు 17.59 శాతం వాటాను విక్రయానికి పెట్టిన నేపథ్యంలో జీఎంఎం ఫాడ్లర్ కౌంటర్లో వరుసగా రెండో రోజు అమ్మకాలు ఊపందుకున్నాయి. కొనుగోలుదారులు కరువుకావడంతో 10 శాతం పతనమైంది. రూ. 4,215 దిగువన ఫ్రీజయ్యింది. ఓఎఫ్‌ఎస్‌కు ఫ్లోర్ ధర రూ. 3,500 కావడంతో మంగళవారం సైతం ఈ షేరు 10 శాతం కుప్పకూలిన విషయం విదితమే. నేటితో ఓఎఫ్ఎస్ ముగియనుంది. కంపెనీ ప్రమోటర్ సంస్థలు ఫాడ్లర్ ఇంక్, మిల్లర్స్ మెషీనరీతోపాటు, ఊర్మి పటేల్ సంయుక్తంగా 2.57 మిలియన్ షేర్లను విక్రయించనున్నారు. అధిక స్పందన లభిస్తే మరో 1.52 మిలియన్ షేర్లను సైతం విక్రయించనున్నాయి. తద్వారా మొత్తం 28 శాతంవరకూ వాటాను విక్రయించనున్నట్లు తెలియజేశాయి. జూన్‌కల్లా కంపెనీలో ప్రమోటర్ల వాటా 75 శాతంగా నమోదైంది. -
ప్రభుత్వ బ్యాంకులకు భారీ నిధులు
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.17,800 కోట్ల మేర నిధులు సమీకరించనున్నాయి. బాండ్ల జారీ, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ తదితర మార్గాల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులు సమీకరించాలని ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు యోచిస్తున్నాయి. టైర్–వన్, టైర్–టూ బాండ్ల ద్వారా రూ.6,350 కోట్లు సమీకరించడానికి శుక్రవారం జరిగిన యూనియన్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ లేదా రైట్స్ ఇస్యూ ద్వారా మరో రూ.4,950 కోట్లు సమీకరించాలని కూడా ఈ బ్యాంక్ యోచిస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ బాసిల్–త్రి అదనపు టైర్–వన్ బాండ్ల ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించనుంది. ఎఫ్‌పీఓ/రైట్స్ ఇష్యూ/క్విప్ ద్వారా రూ.2,000 కోట్లు సమీకరించే విషయం వచ్చే వారం జరిగే డైరెక్టర్ల బోర్డ్ సమావేశంలో పరిశీలనకు రానున్నదని పుణే కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వెల్లడించింది. షేర్ల ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్లు సమీకరించనున్నట్లు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ పేర్కొంది.